cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

రాయలసీమ పై సవతి ప్రేమ

రాయలసీమ పై సవతి ప్రేమ

విడిపోయి తెలంగాణ ఏం బావుకుందో తెలియదు..కానీ దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో ప్రగతి హడావుడి అమాంతం పెరిగింది. అయితే అదే సమయంలో రాయలసీమలో నిరాశ నిస్మృహలు అలుముకున్నాయి. ఇప్పడు రాయలసీమ గురించి ఏ గొంతు వినిపించడం లేదు..ఏ నాయకుడు నినదించడం లేదు..డబ్బులు వున్న నాయకులు సీమాంధ్రకు పోయి ఎక్కడ అంతకు అంతా సంపాదించుకునే అవకాశం వుందా అని చూస్తున్నారు. దందాలు చేసే నాయకులు, అధికారం అండంతో ఎక్కడ తమ సాగబడి సాగుతుందో అని అన్వేషించే పనిలో వున్నారు. ప్రజలు ఇక తమ బతుకులు ఇంతే అని అర్థమైపోయి, మౌనమే జీవితమై బతుకు బండి నడిపేస్తున్నారు.

 వివక్ష మాట్లాడుకుంటే అర్ధమయ్యేది కాదు..సవతి ప్రేమ అనుభవిస్తేనే తెలిసేది..పక్కవాడు పెరుగుతుంటే ఏడవడం వేరు..వాడు ఎదిగేందుకు ఇస్తున్న చేయూత మనకు లభించడం లేదే అని కుమిలిపోవడం వేరు..విభజించేయగా ఆంధ్రలో మిగిలిన మూడు ముక్కల్లో ఒక ముక్క రాయలసీమ. కడప, కర్నూలు,  అనంతపురం, చిత్తూరు. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆదిగా, రాయలసీమ ప్రజలు కక్కలేక, మింగలేక బాధపడుతున్నారు. 

తెల్లవారి లేచింది మొదలు పత్రికల నిండా విశాఖలో మెట్రో..చెన్నై విశాఖ కారిడార్, విజయవాడలో ఎయిమ్స్, గుంటూరులో రాజధాని..అక్కడ భూమి ధరలు ఇంత పెరిగాయి..ఇక్కడ రియల్ ఎస్టేట్ ఈ రేంజ్‌లో వుంది. ఇవే వార్తలు. రాయలసీమకు చేయకపోవడమేటి? తిరుపతికి మెట్రో..అనంతపురం, కర్నూలులో విద్యాసంస్థలు..ఇంకా..ఇంకా..అంతే... సీమలో వర్షపాతం తక్కువే కానీ హామీల వర్షపాతానికి లోటులేదు. ఆ వర్షపాతం సాకు చూపించి, ఇప్పుడు సీమకు వచ్చిన లోటేముంది..అని రాజకీయ నాయకులు గమ్మున వుంటున్నారు. 

Click Here For Great Andhra E-Paper

మళ్లీ ఎన్నికలు వచ్చిన నాడే ఈ గొంతుకలు అన్నీ సీమగీతాలు వినిపిస్తాయి. రాయలనాడు రతనాలు అమ్మారో లేదో కానీ, ఇప్పుడు మాత్రం రాయలసీమ ప్రజలకు రాళ్ల సీమ మిగిలింది. తిరుపతి మా సీమలో వుంది అనుకోవడం ఎంత గర్వంగా వుంటుందో...తిరుపతిని ఉద్దరించి మొత్తం సీమను ఉద్దరించామని చెప్పడం కూడా అంతే వింతగా వుంటుంది. 

రాజకీయం,అధికారం, డబ్బు వెరసి నాయకులను సీమపై ప్రేమను పక్కన పెట్టేలా చేసాయి. కలిసి వున్నా, విడిపోయినా, ఏ ప్రభుత్వం వచ్చినా సీమ బతుకింతే అనుకోవడం ప్రజల వంతయింది. ఇదేమీ సమస్యను భూతద్దంలో చూపించడం కాదు. సీమ వాసులను పలకరిస్తే వినిపించిన పలుకులు. వారు ఇఫ్పుడేమీ బాధపడడం లేదు. వారికి అర్థమైపోయింది. ఇప్పుడు తమకు జరిగేది ఏమీ లేదని. తాము నమ్ముకున్న, తాము ఇన్నాళ్లు ఎక్కడిక్కడ నెత్తిన పెట్టుకున్న నాయకులు ఏ పార్టీ వారైనా సరే తమకు ఒరగబెట్టేది ఏమీ లేదని. అందుకే తమ బతుకులు తాము బతికేయడం అలవాటు చేసుకున్నారు.

ఎయిమ్స్‌తో ఆరంభం

కొత్త ప్రభుత్వం వస్తూనే కర్నూలుకు వస్తుందనుకున్న ఎయిమ్స్‌ను కృష్ణాజిల్లాకు మారిపోయింది. కేంద్ర సర్వీసులకు సంబంధించిన విద్యాసంస్థ మాత్రం సీమకు వస్తుందన్నారు. అదే గొప్ప వరమన్నట్లు. పాతిక, యాభై మంది ఓ భవనంలో చదువుకోసం దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి, వెళ్తే సీమకు ఒరిగేదేమిటో వారికే తెలియాలి. అదే ఎయిమ్స్ అయితే నిత్యం వేలాది రోగులు వారి అవసరాల కోసం వెలిసే వ్యాపారాలు, ఎంత హడావుడి, ఎంతమందికి ఉపాధి, ఎంతమందికి బతుకు. సరే, సంస్థల సంగతి పక్కనపెడితే, మూడు ప్రాంతాలు వున్నపుడు మూడు రాజధానలు ఎలాగూ సాధ్యం కాదు. కోరిక అయితే ప్రతి ఒక్కరికీ వుంటంది. కానీ అవకాశం అందరికీ వుండదు. భౌగోళిక స్వరూప్యం రీత్యా కృష్ణ, గుంటూరుకు అది అనుకూలమైంది. దాంతో రాజధానికి రెండు వందల కిలోమీటర్ల రేడియస్‌లో ప్రగతి అన్నది అవలీలగా సాధ్యమవుతుంది. ప్రగతి అంటే ఆకాశాన్నింటే భవంతులు కాదు..ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం.

Click Here For Great Andhra E-Paper

రాయలసీమ వాసుల జీవనప్రమాణాలు పెరిగే అవకాశం ఒక్క తిరుపతిలో మాత్రమే వుంది ఇప్పటికి. ఎందుకంటే రాయలసీమ మొత్తం మీద ఎక్కువ ఫ్లోటింగ్ పాపులేషన్ అక్కడేవుంది కాబట్టి. సహజంగా దుకాణాలు వ్యాపారాలు వస్తాయి. వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తూ మిగిలిన ప్రగతి కూడా అక్కడే కేంద్రీకృతమైంది. డైరీలు, పరిశ్రమలు, సెజ్‌లు, అన్నీఅక్కడే వున్నాయి. ఇటు అనంతపురం, కడప, కర్నూలులో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. చెన్నయ్‌కు దగ్గర కావడంతో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతం అన్నది అట్రాక్షన్‌గా మారింది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏదైనా రాయలసీమ కోటా అంటే అది తిరుపతికే అన్నట్లు వ్యవహరిస్తోంది. మరి మిగిలిన మూడు జిల్లాల పరిస్థితి ఏమిటి?

మాటల కోటలు

బాలకృష్ణ, పరిటాల సునీత, చంద్రబాబు ఈ ముగ్గురు కర్నూలు, అనంతపురం జిల్లాల గురించి ప్రగతి గురించి బోలెడు చెబుతున్నారు. అవి నెరవేరుతాయంటేనే నమ్మకం కలగడం లేదు. అనంతపురంలో ఐటి హబ్ ఎలా సాధ్యం. ఇలా చిన్నచిన్న సెంటర్లలో ఐటి కుదురుకోవడం అన్నది అంత సులువు కాదు. బెంగుళూరుకు దగ్గరలో వుండి మళ్లీ అనంతపురంలో ఎవరు ఆఫీసులు పెడతారు? చెప్పడానికి అపెరల్ పార్క్‌లు లాంటివి బోలెడు చెబుతున్నారు. కానీ జరిగేది ఏమీ కనిపించడం లేదు.

ఇలాంటి సమయంలో అటు కోస్తా ఆంధ్రలో చూస్తుంటే రోజుకో రకమైన వార్తలు వినిపిస్తున్నాయి. పదిలక్షలు విలువచేయని భూములు కోట్లు పలికేస్తున్నాయి. జనానికి చేతినిండా డబ్బు వస్తుందంటున్నారు. రైతులు ఏసి గదుల్లో కూర్చుని సంపాదించుకోవచ్చని చంద్రబాబే చెబుతున్నారు. మరి ఆ మాట విన్న సీమ రైతుకు ఏమనిపిస్తుంది..అయ్యో అనిపించదా? బాధనిపించదా? అటువంటి అవకాశం తనకు ఎప్పుడు వస్తుందా అని అనిపించదా..అలా అనిపించడం తప్పు అవుతుందా?

నాయకులకు పెట్టుబడే కీలకం

రాయలసీమ నాయకులకు ఫ్యాక్షన్ ద్వారానో, దందాల ద్వారానో డబ్బు సంపాదించడం, దాన్ని అవకాశం వున్న చోట పెట్టుబడి పెట్టడం. ఇదే కార్యక్రమం. గతంలో తీసుకెళ్లి హైదరాబాద్‌లో పెట్టారు. ఇప్పుడు విశాఖ, గుంటూరు ప్రాంతాల్లో పెడుతున్నారు. వీరికి తాము పెట్టుబడి పెట్టిన ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందితే అంత ఆనందం. పైకి సీమపై అరకొర ప్రకటనలు, మొరమొచ్చు కన్నీళ్లు. గతంలో ఆ మాత్రమైనా వుండేవి. ఇప్పుడు అదీ లేదు. సీమకు చెందిన ఓ మంత్రి కొత్త రాజధాని ప్రాంతంలో భారీగా భూములు కొన్నట్లు ఆ ప్రాంతంలో చెప్పుకుంటున్నారు. అలాగే మరో మంత్రి బంధువు కూడా అక్కడే భూములు కొన్నారని వినికిడి. ఆ మధ్య పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చిన ఓ సీమ నాయకుడు విశాఖలో భూములు కొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా తమ తమ వ్యాపారాలు పెట్టుబడులు సజావుగా సాగిపోతుంటే, ఇక సీమ సమస్యలు ఎందుకు వినిపిస్తారు? కాంగ్రెస్ హయాంలో మాదిరిగా సీమ సింహాలు, పులులు గొంతెత్తితే, చంద్రబాబు ఊరుకునే రకం కాదు. అందుకే గమ్మున వుండాల్సిందే.

తిరుపతి నుంచి దృష్టి మరల్చండి

సీమ అంటే తిరుపతి ఒక్కటే కాదు కడప, కర్నూలు, అనంతపురం మూడు జిల్లాలు ఇంకా వున్నాయి. అక్కడి జనం బతుకు తెరువు పెరగడానికి ఏం చేయాలి? ఏ ఫ్యాక్టరీలు రావాలి. అవి ఆలోచించాలి. సోలార్ పవర్‌కు రాయలసీమే అనుకూలం. సిమెంట్ ఫ్యాక్టరీలు. అన్నింటికి మించి ఆ మూడు జిల్లాల స్వరూపాన్ని మార్చేయగల అవకాశం ఒక్క స్టీల్ ప్లాంట్ కే వుంది. చంద్రబాబు కూడా మొన్నటికి మొన్న కడప వెళ్లినపుడు ఎప్పటిలాగే మాట్లాడుతూ, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాం అన్నారు. జిల్లాకో ఎయిర్ పోర్టు వాగ్దానం మాదిరిగా కాకుండా, సిన్సియర్ వాగ్దానం అయితే సంతోషించి, చేతులెత్తి మొక్కాల్సిందే. అయితే స్టీల్ ప్లాంట్ అన్నది అంత చిన్న విషయం కాదు. అది నెరివేరితే ఆనందమే.

Click Here For Great Andhra E-Paper

అయితే ఇది వచ్చేదాకా కూర్చుంటే పని జరగదు. అంతకన్నాముందు పర్యాటకంపై దృష్టి పెట్టాలి. అహోబిలం, మహానంది, యాగంటి, గండికోట, హార్స్ లీ హిల్స్ తదితర ప్రాంతాలను బాగా ప్రచారం చేయాలి.దాని వల్ల ఫ్లోటింగ్ పెరుగుతుంది. జనాలకు కాస్త నాలుగు డబ్బులు వస్తాయి. అభివృద్ధి కూడా ఎప్పుడో చేయడం కాదు. అక్కడ రాజధాని నిర్మాణానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో, ఇక్కడా అదే విధమైన హుషారు కనబర్చాలి. అప్పుడే సీమ జనాలు తమకు ఓ ప్రభుత్వం ఉందని ఫీలవుతారు. లేదా సవితి పాలనలో వున్నామన్న అసంతృప్తి పేంచుకుంటారు.

 చాణక్య

writerchanakya@gmail.com

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!