Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - Kapilamuni

‘‘మూల విరాట్టు ముష్టెత్తుకుంటూ ఉండగా...’’

‘‘మూల విరాట్టు ముష్టెత్తుకుంటూ ఉండగా...’’

‘‘మూలవిరాట్టు ముష్టెత్తుకుంటూ ఉండగా.. ఉత్సవ విగ్రహాలు వచ్చి మహా నైవేద్యం కావాలన్నాయట’’ అని వెనకటికి ఓ సామెత! తామేదో రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నాం అని బిల్డప్ ఇచ్చుకోవడానికి, భారతీయ జనతా పార్టీలో మైలేజీ మొత్తం కోస్తాంధ్ర నాయకులే కొట్టేస్తున్నారనే దుగ్ధ కొద్దీ.. ఓ సమావేశం పెట్టుకున్న రాయలసీమ భాజపా నాయకులు... ఇంతకూ ఏం తీర్మానించారయ్యా అంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రెండో రాజధాని కూడా కావాలంట! చంద్రబాబునాయుడు ప్రభుత్వం తక్షణం దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయాలంట.

రాయలసీమలో రెండో రాజధానిని నిర్మించి.. ఆ కోటా ఓ సచివాలయం, అసెంబ్లీ, ముఖ్యమంత్రికి, గవర్నరుకు నివాస భవనాలు అక్కడ నిర్మించి.. ప్రతి ఆరునెలలకూ ఓసారి అసెంబ్లీని సీమలోనే నిర్వహించాలంట. ఈ సీమ బీజేపీ నాయకుల బుర్రను ఏ పురుగు తొలుస్తున్నదో గానీ.. ప్రజలు నవ్విపోతారనే వెరపు కూడా లేకుండా ఇలాంటి తీర్మానాన్ని చేశారు.

ఏపీకి సంబంధించి ఒక రాజధాని అనే దానికే ఇప్పటిదాకా కేంద్రం నుంచి రావాల్సిన పైసలు రావడం లేదు. చెప్పడానికి మాత్రం మోడీ చాలా ఘనంగా ‘మీకు ఢిల్లీ కంటె గొప్ప రాజధాని నగరాన్ని నిర్మించి ఇస్తా’ అని అప్పట్లో ఆశ పెట్టారు. తీరా చంద్రబాబునాయుడు కోర్ కేపిటిల్ వరకు నూరు శాతం ఖర్చును కేంద్రమే భరించాలి గనుక.. సుదీర్ఘ కసరత్తు అనంతరం డిజైన్లు ఫైనలైజ్ చేసి.. దాదాపు 48వేల కోట్ల రూపాయల అంచనాలు తయారుచేస్తే.. ‘‘అక్కడేమైనా మయసభ కట్టబోతున్నారా’’ అంటూ భాజపా సిగ్గుమాలిన విమర్శలు చేస్తోంది.

ఇప్పటికిచ్చిన 2500 కోట్లు చాలా ఎక్కువ అని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఆ మధ్య ఏర్పడిన మరో రాష్ట్రానికి రాజధానికోసం కేవలం 2000కోట్లు మాత్రమే ఇస్తే నయా రాయపూర్ చక్కగా కట్టుకున్నారంటూ కొందరు శకునాలు పలుకుతున్నారు.

ఇక్కడేమో అమరావతిలో.. ఒక్క ఇటుక కూడా పేర్చి కట్టిన పాపం.. కనిపించడం లేదు. అమరావతి కూడా సిద్ధం అయిపోతోంది.. ఇదిగో.. అదిగో . . అంటూ ప్రజలను ఎలా మాయచేయాలో తెలియక.. చంద్రబాబు, ఆయన మంత్రివర్గంలోని నారాయణ వంటి మంత్రులూ మాటలు వెతుక్కుంటున్నారు. 1500కోట్లు తగలేసినా.. లీకేజీలతో జడిపిస్తున్న తాత్కాలిక సచివాలయంలో పరిపాలన నడుస్తోంది.

ఈ తొలిరాజధానికే ఇన్ని కష్టాలు కనిపిస్తుండగా.. తగుదునమ్మా అంటూ.. రాయలసీమ భాజపా నాయకులు తెరమీదికి వచ్చి.. మాకోసం మా సీమలో రెండో రాజధాని పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేస్తాం.. అందరూ కలిసి ఆ మేరకు చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చేస్తాం.. కనీసం ఆ రెండో రాజధాని కోసమైనా మీ పార్టీ ప్రధాని దగ్గరకు వెళ్లి ఓ లక్ష కోట్లు నిర్మాణానికి నిధిగా తీసుకురాగల దమ్ము ఆ నాయకులకు ఉందో లేదో తెలియదు.

తీరా సీమలో ఇంకో రాజధాని కడతాం.. దానికి నిధులు కావాలని అడిగితే.. మొదటి రాజధానికి చెంబుడు నీళ్లు, మట్టి ఇచ్చా.. ఈ రెండో రాజధాని చిన్నదే కదా.. దీనికి చెమ్చాతో ఇచ్చినా సరిపోతుందని.. చెమ్చాతో విదిలిస్తాడో ఏంటో ఖర్మ!!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?