Advertisement


Home > Articles - Kapilamuni
చర్చ, వ్యాఖ్యల వీరులారా.. మీకందరికీ ఇది విజ్ఞప్తి

యాకూబ్‌ మెమన్‌ను ఉరి తీయడం అనే పర్వం పూర్తయింది. అయితే ఇప్పుడు ఉరిశిక్ష గురించి... మెమన్‌ ను ఉరితీయడం గురించి.. అతనికి క్షమాభిక్ష లభించకపోవడం గురించి.. న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు రావడం గురించి.... న్యాయప్రక్రియపై అనుమానాలు రేకెత్తడం గురించి... రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వకపోవడం గురించి.. ఇలా అనేకానేక అనుబంధ అంశాలు తెరమీదికి వస్తున్నాయి. ఇలాంటి అంశాల మీద చర్చోపచర్చలు నిర్వహించడానికి ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా టీవీ ఛానెళ్లు ఉన్నాయి. తాము ప్రముఖులు లేదా మేధావులు అనే ట్యాగ్‌లైన్‌ తగిలించుకున్న వాళ్లంతా విచ్చలవిడిగా ఈ చర్చా కార్యక్రమాల్లో కూర్చుని తమ తమ అభిప్రాయాలు చెప్పేస్తుంటారు. అలాగే ప్రతిసామాన్యుడూ తన అభిప్రాయాన్ని యావత్తు ప్రపంచం ముందు పెట్టడానికి ఇంటర్నెట్‌ ఉంది. దాన్ని అడ్డుకోగలిగిన శక్తి కూడా లేదు. ఇన్ని నేపథ్యాల మధ్య పైన చెప్పుకున్న అంశాల మీద విచ్చలవిడిగా.. వివిధ అభిప్రాయాలు వెల్లువెత్తిపోవడం సహజం. 

అయితే ఇలాంటి చర్చల్లో పాల్గొనే వాళ్లు, ఎఫ్‌బి ట్విటర్‌ లలో తమ అభిప్రాయాలు రాసేవాళ్లు దయచేసి ఈ విషయం గమనించండి. 

ఇవాళ ఉదయం (మెమన్‌ను ఉరిని ధ్రువీకరించిన 45 నిమిషాల తర్వాత..) ఒక తెలుగు టీవీ ఛానెల్‌లో చర్చ ఇలా జరిగింది. ఒక సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పేలుళ్లు జరిగాయి.. సూత్రధారిగా మెమన్‌ దొరికాడు.. జైల్లో పెట్టారు.. సుప్రీంలో పిటిషన్లు నడిచాయి.. ఇదంతా బాగానే ఉంది కానీ.. రాష్ట్రపతి క్షమాభిక్ష వద్ద ఆయనకు అభ్యంతరాలు వచ్చాయి. ''క్షమాభిక్ష కోసం మెమన్‌ రాష్ట్రపతి కి విన్నవించుకుంటే.. ఆయన దానిని హోంశాఖ అభిప్రాయం కోసం వారికి పంపారు. కేబినెట్‌ భేటీ అయి దాన్ని తిరస్కరించాలని నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రపతి వద్దకెళ్లి హోంమంత్రి చెప్పారు. నిర్ణయాలు సహజంగా రాజకీయ నిర్ణయాలుగానే ఉంటాయి. కేంద్రంలో ఉన్నది భాజపా ప్రభుత్వం గనుక.. వారి మైలేజీ కోసం కచ్చితంగా తిరస్కరిస్తారు. అదే విషయాన్ని రాష్ట్రపతికి చెప్పారు.'' అంటూ చాలా మెత్తగా విశ్లేషించిన సదరు వామపక్ష నేత! తర్వాత మాట్లాడుతూ ''అయితే రాష్ట్రపతి విచక్షణ ఏమైంది? రాజకీయాల్లో అంతటి సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి. విచక్షణ, రాజకీయ పరిణతి, జీవితానుభవం ఉన్న వ్యక్తి తనంతగా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు. ఎందుకు క్షమభిక్ష పెట్టలేకపోయారు.. ప్రణబ్‌ ముఖర్జీ గారు చేసి ఉండచ్చు కదా'' అంటూ ఏకంగా రాష్ట్రపతి మీదికే అస్త్రసంధానం చేసేశారు. రాజ్యాంగం ప్రకారం.. హోంశాఖ అభిప్రాయం అడగకుండా, రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వవచ్చునా అని అడిగితే.. ఆ సంగతి ఆయనకు తెలియదు. ఆయనకు రాష్ట్రపతి విధులు, పరిమితులు గురించి అవగాహన, జ్ఞానం లేకుండానే.. ప్రణబ దాదా మీద నిందలు మాత్రమే వేసేశారు. 

అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటుంది. ఇలాంటి నిందల్ని వ్యక్తుల మీద వేయడం ద్వారా ఆయన ఏం సాధించారు. ఇప్పుడు మెమన్‌కు అనుకూలంగా క్షమాభిక్ష రావాలని కోరుకున్న వాళ్లంతా.. రాష్ట్రపతి ప్రణబ్‌ను విలన్‌లాగా చూడాలని, ప్రణబ్‌ మీద కక్ష పెంచుకోవాలని సదరు లెఫ్ట్‌ నేత అనుకుంటున్నారా? కోరుకుంటున్నారా? అలా ఉండకపోవచ్చు. ఆయన తనదైనా యాంగిల్‌లో కొత్తగా విశ్లేషించదలచుకున్నారు. కానీ చింతించాల్సిన విషయం ఏంటంటే.. ఆయన వ్యాఖ్యల ఫలితం.. ఒక వ్యక్తిమీద.. ఒక వర్గం ప్రజల్లో ద్వేషబీజాలను నాటడమే. ఇది జాతికి ఆయన ద్వారా జరిగిన ద్రోహం. 

చర్చలు, వ్యాఖ్యల్లో అభిప్రాయాలు చెప్పేప్పుడు బాధ్యతగల వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తమ అభిప్రాయాల పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలి. ప్రారబ్ధం ఏంటంటే.. ద్విసభ్య బెంచ్‌ విచారించిన తర్వాత.. ఏ జడ్జి ఉరిని సమర్థించాడో.. ఏ జడ్జి క్షమాభిక్షను సమర్థించాడో పేర్లతో సహా చాలా విపులంగా వార్తల్లో వచ్చింది. ఎంత ప్రమాదకరమైన పోకడ ఇది. ఇప్పుడు ఉరి పడిన తర్వాత.. ఆనాడు ఉరిని సమర్థించిన జడ్జి వల్లనే ఈ ఘోరం జరిగిందని ఎవరైనా ఉన్మాదమూర్ఖులు అనుకుంటే పరిస్థితి ఏంటి? అందుకే ఇలాంటి సందర్భాల్లో వ్యక్తులను బాధ్యుల్ని చేసే వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దండి. బాధ్యతగా మాట్లాడండి. 

సోషల్‌ సైట్‌ ల్లో కూడా వ్యాఖ్యలు చేసే వారు.. జాగ్రత్తలు పాటించాలి. ఉరిమీద అభిప్రాయాలు చెప్పవచ్చు. కానీ ఆ అభిప్రాయాలు.. సున్నితమైన ఇలాంటి విషయాల్లో మరొకరిని ఏ రకంగానూ రెచ్చగొట్టేలా ఉండకుండా చూసుకోండి. 

'ఉరి'ని వ్యతిరేకించేవారున్నారు.. 

అసలు దేశంలో ఉరిశిక్షనే వ్యతిరేకించేవారున్నారు. ఒక మనిషిని ఆవేశంలో చంపడమే నేరం అయినప్పుడు.. సుదీర్ఘమైన విచారణ తర్వాత చంపడం కూడా నేరమే అవుతుంది కదా! ఇది ఇంకా ఆర్గనైజ్‌డ్‌ క్రైం లాగా అవుతుంది కదా.. అని వీరు అడ్డగోలుగా వాదిస్తారు. న్యాయవ్యవస్థలోనే లోపం ఉందన్నది వీరి అభిప్రాయం. అయితే ఇక్కడ మన విజ్ఞప్తి ఏంటంటే.. మొత్తం న్యాయవ్యవస్థే మారాలని కోరుకుంటున్న వారు ఎవరైనా ఉంటే.. వారికి అభినందనలు. నిజంగానే సాటి మనిషి ప్రాణాలను హరించడం మానవత్వం కాదు. చట్టాల్లో అలాంటి శిక్ష ఉండరాదు. దానికి మానవతా వాదులందరూ అంగీకరించాలని కోరుకుందాం. 

కానీ ఆ అంశాన్ని చర్చకు తీసుకురావాల్సింది.. మెమన్‌ లాంటి వారికి ఉరిశిక్ష పడినప్పుడు మాత్రమే అనుకుంటే అది చాలా తప్పు. వ్యవస్థను ఒక్కో కేసును బట్టి మార్చాలని అనుకోకూడదు. ఈ ఉరికి సంబంధించిన కొన్ని రోజులూ మౌనంగా ఉండండి. మీకు నిజంగా ఉరిశిక్ష ఉండకూదనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే.. ఇప్పుడు ఇక పోరాడండి.. వ్యవస్థను మార్చడానికి, చట్టాన్ని మార్చడానికి పోరాడండి.. దాని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉరిశిక్ష పడినప్పుడు.. సరిగ్గా అది అమలు కాబోతున్న సమయం వచ్చినప్పుడు.. మానవతా వాదులం, మానవహక్కుల పరిరక్షకులం అని పేరు పెట్టుకున్న వాళ్లంతా.. ఉరిశిక్ష సెక్షన్‌ను రద్దు చేయాలని కోరడం సమంజసం, సందర్భోచితం కాదు. ఈ పర్వం పూర్తయిపోయిన తర్వాత.. ఇక ఆ సెక్షన్‌ రద్దు కోసం ఎంత పోరాటం చేసినా.. అందులో కేవలం వ్యవస్థలో మార్పును లక్ష్యించడమే ఉంటుంది. 

కాబట్టి, చర్చాకార్యక్రమాల్లో పాల్గొనేస్థాయి పెద్దలందరూ, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితర వాటిలో కామెంట్లు పెట్టే యువతరం ప్రతినిధులు అందరూ.. తమ మాటలకు చాలా విలువ ఉంటుందని.. మరికొందరిని అవి ప్రభావితం చేస్తాయని.. తాము ఊహించని దుష్ఫలితాల్ని కూడా తేగలవని స్పృహ కలిగి ఉంటే.. తదనుగుణంగా జాగ్రత్తలు వహిస్తే మంచి జరుగుతుంది. 

- సురేష్‌

suresh@greatandhra.com