Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: జగన్నాథ రథచక్రాలకూ బ్రేకులున్నాయి

ఎమ్బీయస్‍: జగన్నాథ రథచక్రాలకూ బ్రేకులున్నాయి

‘ప్రస్తుతం దేశంలో బిజెపి తిరుగు లేకుండా ఉంది, అప్రతిహతంగా ముందుకు సాగుతోంది, బిజెపి జగన్నాథ రథ చక్రాల కింద ప్రతిపక్షాలు నలిగి పచ్చడవుతున్నాయి. ఫలితాల గురించి అంచనాలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించడం శుద్ధ దండగ, ఎన్నికలు ప్రకటించగానే, బిజెపి కిరీటంలో మరో తురాయి అని అనేసుకుని ఊరుకోవడం మంచిది’ అని అందరూ అనుకుంటున్న యీ సమయంలో మూడు ఫలితాలు ఒకేసారి వచ్చాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ కార్పోరేషన్! రెండిటిలో బిజెపి ఓడిపోయింది. ఒకదానిలో ఘనాతిఘన విజయాన్ని సాధించింది.

లెక్కకు మూడు అని చెప్పినా, మూడిటినీ ఒకే గాట కట్టలేం. చిన్న రాష్ట్రమైన హిమాచల్ ఓటర్లు 56 లక్షల మంది. రాష్ట్రమంత పెద్దదైన దిల్లీ కార్పేషన్ ఓటర్లు 145 లక్షల మంది. మరి గుజరాత్ ఓటర్లు 490 లక్షల మంది. కాంగ్రెసు గెలిచిన హిమాచల్ ఫలితానికి కనిష్ఠ ప్రభావం, ఆప్ గెలిచిన దిల్లీ ఫలితానిది మధ్యస్త ప్రభావం, బిజెపి గెలిచిన గుజరాత్ ఎన్నిక ఫలితానిది గరిష్ట ప్రభావం. అయినా బ్రేకులున్నాయి అని ఎందుకన్నానంటే మూడిటిలోనూ యిప్పటిదాకా అధికారంలో ఉన్న బిజెపి రెండిటిలో పోగొట్టుకుంది, ఒక్కటే నిలుపుకోగలిగింది. స్థానిక అభ్యర్థి ఎవరున్నా మోదీని చూసే ఓట్లేస్తారనే వాదన గుజరాత్‌లో మాత్రమే పని చేసింది. డబుల్ ఇంజన్ సర్కారు నినాదం హిమాచల్‌లో పనికి రాలేదు.

హిమాచల్, దిల్లీల గురించి తర్వాత చెప్పుకోవచ్చు కానీ, గుజరాత్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి ఉందని సర్వేలు చెప్పాయి. కొన్ని రంగాల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నా, మరి కొన్ని సూచికల్లో బాగా లేదని గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చవలసి వచ్చింది. సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చవలసి వచ్చింది. అయినా గుజరాత్ చరిత్రలో కనీవినీ ఎరుగనంత స్థాయిలో 182కి 156 సీట్లు అంటే 86% సీట్లు గెలిచింది బిజెపి. అన్ని వర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో జండా ఎగరేసింది. కొత్తగా వచ్చిన ఆప్, పాత శత్రువైన కాంగ్రెసు ఓట్లను చీలుస్తుంది కాబట్టి ఎలాగూ గతంలో కంటె ఎక్కువ సీట్లతో గెలుస్తాం కదాని ఉదాసీనంగా ఉండకుండా యుద్ధావేశంతో పోరాడింది. 150 కంటె ఎక్కువ గెలుస్తాం అని నినాదమిచ్చి మరో 6 సీట్లు అదనంగా గెలిచి తడాఖా చూపించింది. దీనికి గాను అది అవలంబించిన రణనీతి, రాజకీయ చాకచక్యం ఏమిటి? ప్రతిపక్షాలు ఎక్కడ దెబ్బ తిన్నాయి అనేది తెలుసుకోవడమే ఆసక్తిదాయకం. ఈ సందర్భంగానే గుజరాత్‌లో పాలన ఎలా సాగుతోంది, ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనేది తెలుసుకోవడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది.

ముందుగా ఫలితాల గురించి చెప్పుకోవాలంటే ప్రచారం తీవ్రస్థాయిలో చేసినా గుజరాత్‌లో పోలింగు శాతం గతంలో కంటె 4% తక్కువగా 64% మాత్రమే ఉంది. తటస్థులలోని బిజెపి వ్యతిరేకులు బిజెపి ఎలాగూ గెలుస్తుంది కదాని ఓటేసి ఉండరు. దానితో 182 స్థానాల్లో బిజెపి 156 (86%) గెలిచి 52.5% ఓట్లు తెచ్చుకుంది. ఇది గతంలో కంటె 3.4% ఎక్కువ. కాంగ్రెసుకు 27.3% ఓట్లు, 17 (11%) సీట్లు, వచ్చాయి. ఆప్‌కు 5 సీట్లు (3%) మాత్రమే తెచ్చుకున్నా 12.9% ఓట్లు తెచ్చుకుంది. బిజెపికి ఓట్ల శాతం కంటె సీట్ల శాతం ఎక్కువగా ఉండడానికి, ప్రతిపక్ష ఓట్ల చీలికే కారణం. ఇతరులకు 7.3% ఓట్లు 4 సీట్లు వచ్చాయి. గతంలో గుజరాత్‌లో రికార్డు కాంగ్రెసు ముఖ్యమంత్రి మాధవ్ సింహ్ సోలంకి సాధించిన 149 సీట్లు. ఇప్పుడు బిజెపి దాన్ని అధిగమించింది. 2017లో 99 సీట్లు, 49% ఓట్లు తెచ్చుకున్న బిజెపి యీసారి 57 సీట్లు (58%), 3.5% ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంది.

దిల్లీలో 15 ఏళ్ల పాలన తర్వాత బిజెపి అధికారం పోగొట్టుకుంది. హిమాచల్‌లో ఐదేళ్ల తర్వాత పోగొట్టుకుంది. కానీ గుజరాత్‌లో 1995 నుంచి గెలుస్తూ, 7వ సారి అధికారంలోకి వచ్చింది. ఇది బెంగాల్‌లో లెఫ్ట్ కూటమి (1977-2011) సాధించిన విజయం లాటిదే! అంతేకాదు, 2002 నుంచి ప్రతీ టెర్మ్‌కి తక్కువ సీట్లు తెచ్చుకుంటూ వచ్చిన బిజెపి హఠాత్తుగా ట్రెండ్ రివర్స్ చేసి, అత్యధిక సీట్లు సంపాదించింది. 50 స్థానాల్లో బిజెపి విన్నింగ్ మార్జిన్ 30% కంటె ఎక్కువుంది! వంతెన కూలిపోయిన మోర్బీలో బిజెపి గెలిచింది. సహాయమంత్రి కీర్తి వాఘేలా ఓడినా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 1.92 లక్షల మెజారిటీతో గెలిచాడు.

ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న 17 సీట్లలో 12టిలో (గతంలో 6 వచ్చాయి) బిజెపి గెలిచింది, తక్కినవి కాంగ్రెసు గెలిచింది. జనాభాలో ముస్లిములు 14% మంది కంటె ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు, తక్కువ ఉన్న నియోజకవర్గాలు అని రెండు కేటగిరీలు విడగొట్టి చూశారు. ఎక్కువ ఉన్న వాటిల్లో బిజెపికి గతంలో కంటె 4.5% ఎక్కువగా 50.9% ఓట్లు వచ్చాయి. కాంగ్రెసుకు 14.5% తగ్గి 27.8% వచ్చాయి. ఆప్‌కు 13.6% వచ్చాయి. 14% కంటె తక్కువున్న నియోజకవర్గాల్లో బిజెపికి గతంలో కంటె 3.3% ఎక్కువగా 52.7%, కాంగ్రెసుకు 14.5% తగ్గి 27.5%, ఆప్‌కు 12.8% వచ్చాయి. బిజెపి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలపకపోయినా యిది ఎలా సాధ్యమైందంటే, ముస్లిం ఓట్లు ఆప్,  కాంగ్రెసుల మధ్య చీలిపోయాయి. మజ్లిస్ 13 చోట్ల పోటీ చేసి 0.3% ఓట్లు తెచ్చుకుంది. ఒక్క సీటూ గెలవలేదు. సమాజ్‌వాదీ పార్టీకి కూడా 0.3% యే వచ్చినా ఒక సీటు గెలిచింది.

రిజర్వ్‌డ్ నియోజకవర్గాల విషయానికి వస్తే ఎస్సీ వాటిల్లో బిజెపి ఓటు వాటా జనరల్ సీట్ల కంటె 0.8  తక్కువగా 53.1% ఉంది. ఇది గతంలో కంటె 4.4% ఎక్కువ. కాంగ్రెసుకు జనరల్ కంటె 2.2% ఎక్కువగా 30% ఉంది. ఇది గతంలో కంటె 11.1% తక్కువ. ఆప్‌కు జనరల్ కంటె 2.2% ఎక్కువగా 13.3% వచ్చింది. ఎస్టీ నియోజకవర్గాల్లో బిజెపికి 45.1%,  కాంగ్రెసుకు 24.9%, ఆప్‌కు 22% ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు గతంలో కంటె 17% పోగొట్టుకోగా, బిజెపి 0.1% ఎక్కువ తెచ్చుకుంది. గిరిజన నియోజకవర్గాలు 27 ఉండగా వీటిలో 23 సీట్లలో బిజెపి గెలిచింది. ఒకప్పుడు యివి కాంగ్రెసుకు కంచుకోటలు. బిజెపికి నగరప్రాంతాల్లోనే ఎక్కువ పట్టు ఉందని యీ ఎన్నికలు మరోసారి గుర్తు చేశాయి. అర్బన్‌లో 64%, సెమీ అర్బన్‌లో 61.5%, సెమీ రూరల్‌లో 53%, రూరల్‌లో 47% ఓట్లు తెచ్చుకోగలిగింది. ఇవే ప్రాంతాల్లో కాంగ్రెసు 22%, 20%, 30.7%, 29.3% తెచ్చుకోగా, ఆప్ 9.7%, 13%, 10.7%, 14.6% తెచ్చుకుంది.

పంజాబ్‌లో కాంగ్రెసు ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతున్నా అధిష్టానం మేలుకోలేదు. కానీ బిజెపి గుజరాత్‌లో దిద్దుబాటు చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతూ వచ్చింది. 2012-17 టెర్మ్‌లో మోదీ వారసురాలిగా 2014లో వచ్చిన ఆనందీ పటేల్‌ను 2016 ఆగస్టులో తీసేసి విజయ్ రూపాణీని తీసుకుని వచ్చారు. 2017 ఎన్నికలు అతని సారథ్యంలో నెగ్గినా 2021 డిసెంబరులో అతన్ని తీసేశారు. అతనితో బాటు మొత్తం కాబినెట్‌ను మార్చేశారు. అతనికి, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌కు, మరో ముఖ్య నాయకుడు సౌరభ్ పటేల్‌కు టిక్కెట్లు యివ్వలేదు. ఎమ్మెల్యేలు అన్‌పాప్యులర్ అయ్యారని తెలుసుకుని 41 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లివ్వలేదు. అంటే 23% మంది పని తీరు బాగా లేదని పార్టీయే ఒప్పుకున్నట్లయింది. అయినా జంకలేదు. 2020 జులైలో రాష్ట్ర అధ్యక్షుణ్ని మార్చి సిఆర్ పాటిల్‌ను నియమించింది. పటేల్ ఉద్యమ నేత హార్దిక్‌ను, బిసిల నేత అల్పేశ్ ఠాకూర్‌ను కాంగ్రెసు నుంచి ఫిరాయింపు చేసుకుంది.

టిక్కెట్లు దొరకని అసంతృప్తుల పట్ల కఠినంగానే వ్యవహరించింది. హిమాచల్‌లో ఆ పని చేయలేక దెబ్బ తింది. మోదీ 31 ర్యాలీలు, రెండు భారీ రోడ్ షోలు నిర్వహించారు. ఓటేసిన సందర్భాన్ని కూడా మినీ ర్యాలీగా మార్చుకున్నారు. దాదాపు కోటిమంది ఓటర్లను కలిశారు. గుజరాతీ ఆత్మగౌరవ నినాదాన్ని రెచ్చగొట్టారు. ఖర్గే తనను రావణుడితో పోలిస్తే అది గుజరాత్‌ను అవమానించినట్లే అంటూ సెంటిమెంటు రగిల్చారు. ఇక ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టారో అంతే లేదు. 3556 చోట్ల మ్యాజిక్ షోలు, 3700 ప్రాంతాల్లో వీధి నాటకాలు, 1400 ప్రాంతాల్లో వికాస్ కా గర్బా ప్రదర్శనలు, యూత్ విత్ నమో పేరుతో 1400 చోట్ల సంగీత ప్రదర్శనలు, 1700 ఫ్లాష్ మాబ్‌లు, 150 స్మార్ట్ రథాలు,.. యిన్ని ఉపయోగించారు.

జనాభాలో 13% ఉండి, రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయగల పటేళ్లు 2017లో బిజెపిని దెబ్బ కొట్టారు. వాళ్ల ఉద్యమాన్ని చల్లార్చడానికి అగ్రవర్ణ పేదలకు ప్రకటించిన 10% పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఉద్యమ నాయకుడు హార్దిక్‌ను తమ పార్టీలో చేర్చేసుకున్నారు. గతంలో అతనిపై చేసిన ఆరోపణలన్నీ ఏమయ్యాయో తెలియదు. ఏమైతేనేం, ఈసారి పటేళ్ల ఓట్లన్నీ పడ్డాయి. కాంగ్రెసు నుంచి ఫిరాయించిన వారిలో చాలామందికి టిక్కెట్లిచ్చారు. బిజెపి అభ్యర్థులలో 10% మంది కాంగ్రెసు నుంచి వచ్చినవారే. వీరిలో 79% మంది గెలిచారు. దీనితో పాటు జిఎస్టీపై వ్యాపారుల ఆగ్రహాన్ని చల్లార్చారు.

ప్రాంతాల వారీగా చూస్తే బిజెపికి దక్షిణ గుజరాత్‌లో 56%, మధ్య గుజరాత్‌లో 53%, ఉత్తర గుజరాత్‌లో 52.9%, సౌరాష్ట్రలో 49.2% ఓట్లు పడ్డాయి. కాంగ్రెసుకు దక్షిణ గుజరాత్‌లో 21%, మధ్య గుజరాత్‌లో 27%, ఉత్తర గుజరాత్‌లో 32.6%, సౌరాష్ట్రలో 26.6% ఓట్లు పడ్డాయి. ఆప్‌కు దక్షిణ గుజరాత్‌లో 17.5%, మధ్య గుజరాత్‌లో 9.9%, ఉత్తర గుజరాత్‌లో 7.4%, సౌరాష్ట్రలో 17.8% ఓట్లు పడ్డాయి. 50% కంటె ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాలు బిజెపికి 102 ఉంటే, కాంగ్రెసుకు 2, ఆప్‌కు 1 ఉన్నాయి. బిజెపి గతంలో ఉన్న 91 స్థానాలు నిలుపుకుని, కాంగ్రెసు నుంచి 63, యితరుల నుంచి 2 గెలుచుకుంది. కాంగ్రెసు 10 నిలుపుకుని, బిజెపి నుంచి 5, యితరుల నుంచి 2 గెలుచుకుంది.

ఐదేళ్ల క్రితం 77 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెసు ఏకంగా 60 సీట్లు (78%) పోగొట్టుకుని అతి తక్కువ సీట్లు తెచ్చుకోవడంలో చరిత్ర సృష్టించింది. కాంగ్రెసు భాగస్వామిగా ఎన్సీపీ 2 సీట్లలో పోటీ చేసి రెండిటిలో ఓడిపోయింది. రాహుల్, ప్రియాంకా ప్రచారానికి రాని చోట్ల కాంగ్రెసు పరువు దక్కుతుందనే లాజిక్ యిక్కడ పనిచేయలేదు. రాహుల్ ఒక్కరోజు వచ్చి రెండు సభల్లో పాల్గొని వెళ్లిపోయాడు. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెసుకు కనీసం 50 సీట్లు, 35% ఓట్లు వస్తూ ఉండేవి. అయితే ఆప్ ధర్మమాని యీ సారి 17 సీట్లు, 27% ఓట్లు (గతంలో కంటె 14.5% తక్కువ) తెచ్చుకుంది. 33 జిల్లాల్లో 15 జిల్లాల్లో కాంగ్రెసుకు ఒక్క సీటూ రాలేదు. సూరత్, వడోదరా, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావనగర్, గాంధీనగర్‌ నగరాల్లో ఒక్క సీటూ తెచ్చుకోలేదు. ఈ సారి కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

గతంలో గుజరాత్ వ్యవహారాలను అహ్మద్ పటేలే చూసేవాడు. అతని మరణంతో ఆ లోటు తెలిసింది. ఈసారి గుజరాత్ ఇన్‌చార్జిగా పెట్టిన అశోక్ గెహ్లోత్‌ను కాంగ్రెసు అధ్యక్షుడు చేయబోవడం, ఆయన తిరస్కరించి, రాజీనామా డ్రామా ఆడించి, చివరకు రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగకపోవడం... యీ హడావుడిలో మూడు వారాల పాటు యిటుకేసి చూడనే లేదు. దళిత నేత, గతంలో స్వతంత్రుడిగా గెలిచిన జిగ్నేశ్ మేవాణీ యీసారి కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచాడు. అతన్ని ముందుకు తీసుకుని వస్తారేమో చూడాలి.

ఆప్ విషయానికి వస్తే వాళ్ల ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ, రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా యిద్దరూ ఓడిపోయారు. బిజెపి, కాంగ్రెసు రెండూ ఆప్‌ను తొక్కేశాయి. గుజరాతీ మీడియా ఆప్‌ను బహిష్కరించింది. వాళ్ల వాదనను వినిపించ నీయలేదు. కాంగ్రెస్ ఓట్ల శాతం 41 నుంచి 27కు పడిపోయింది. ఆప్‌కు వచ్చినది 13%. అంటే ఆప్ కాంగ్రెసు ఓట్లనే చీల్చిందని స్పష్టంగా తెలుస్తోంది. గిరిజన నియోజకవర్గాల్లో ఆప్ కాంగ్రెసు ఓటును చీల్చడం స్పష్టంగా కనబడింది. అది కొంత ఆశ్చర్యకరమే. ఎందుకంటే ఆప్‌లో గిరిజన నాయకుడంటూ ఎవరూ లేరు. పైగా ఆప్‌కు నగరవాసులైన మధ్యతరగతి ప్రజల పార్టీగానే పేరుంది. ఆప్ పటేళ్లను, బిసిలను తన నాయకులిగా పెట్టుకుంది కానీ వాళ్లందరూ ఓడిపోయారు. ఆప్ యిస్తానన్న ఉచిత విద్యుత్ వగైరా హామీలు గిరిజనులను ఆకర్షించి ఉంటాయి. ఆప్ గెలిచిన 5టిలో నాలుగు సీట్లు గ్రామీణ సౌరాష్ట్ర ప్రాంతంలోనే గెలిచింది. అది బిజెపి, కాంగ్రెసుల నుండి రెండేసి సీట్లు, యితరుల నుంచి 1 గెలిచింది.

గతంలో కాంగ్రెసుకు 77 సీట్లు వస్తే యీసారి ఆప్, కాంగ్రెసులకు కలిపి 22 వచ్చాయి. ముక్కోణపు పోటీ వలన బిజెపి లాభపడిందన్నది యిది నిరూపిస్తోంది. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెసు, ఆప్ ఓట్లు కలిపినా బిజెపి కంటె తక్కువ వచ్చినా, సౌరాష్ట్ర ప్రాంతంలో 18 స్థానాల్లో కాంగ్రెసు, ఆప్ ఓట్ల శాతం కలిపితే బిజెపి కంటె ఎక్కువుంది. కానీ బిజెపికి సౌరాష్ట్రలో 40 సీట్లు వచ్చాయి. 2017లో యిక్కడ 28 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెసు యీసారి 3టితో సరిపెట్టుకుంది. ఒకవేళ కాంగ్రెసు, ఆప్ కలిసి పోటీ చేసి, యిప్పుడు తెచ్చుకున్నన్ని ఓట్లే తెచ్చుకుని ఉంటే ఆ కూటమికి 64 సీట్లు, బిజెపికి 114 సీట్లు వచ్చేవని లెక్కలు వేసి తేల్చారు. గుజరాత్‌లో ఓడినా ఆప్‌కు జాతీయ పార్టీ హోదా దక్కింది. ఎందుకంటే నియమాల ప్రకారం కనీసం నాలుగు రాష్ట్రాలలో 6% కంటె ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలి. దిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్‌లలో ఆ మేరకు ఓట్లు తెచ్చుకోవడంతో ఆప్ జాతీయ పార్టీ అయిపోయింది.

ఆప్ అతి తెలివికి పోయి నష్టపోయిందనిపిస్తుంది. తక్కిన చోట్ల హిందూత్వ విధానాన్ని అవలంబించకపోయినా, గుజరాత్ మొదటి నుంచి హిందూత్వను ఆదరించే రాష్ట్రం కావడంతో యిక్కడ ఆప్ బిజెపికి ఒక మెట్టు తక్కువగా సాఫ్ట్ హిందూత్వను నమ్ముకుంది. బిజెపి విపరీత విధానాలను విమర్శించలేదు. తాము నెగ్గితే అయోధ్య తీర్థయాత్రకు డబ్బులిస్తామని కూడా చెప్పింది. బిల్కిస్ బానో కేసు నిందితులను గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడిచి పెట్టేస్తే సభ్యసమాజం నిరసించినా ఆప్ నోరు విప్పలేదు. పైగా బిజెపికి కూడా రాని ఆలోచన, కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణపతుల ఫోటోలు వేయడాన్ని ప్రతిపాదించారు. అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందట!! ఇవన్నీ చూసి మైనారిటీలు, సెక్యులర్ వాదులు ఆప్‌ను నమ్మలేదు. కాంగ్రెసుకే ఓటేశారు, లేదా ఓటింగుకి వెళ్లడం మానేశారు.

ఆప్ చేసిన సంక్షేమ జపం గుజరాత్‌లో ఫలించలేదు. సాధారణ గుజరాతీ ఉచితాలకై ఆశపడడు. తరతరాలుగా వ్యాపారదృక్పథం నరనరాలా జీర్ణించుకుపోవడంతో వాళ్లకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎక్కువ. ఒక బ్యాంకు ఉద్యోగిగా చెప్తున్నాను. గుజరాత్ గ్రామాల్లో ఋణాల వసూలు సులభం. అనావృష్టిలో ఋణం తీర్చలేకపోయినా, వర్షాలు పడి పంట పండితే రైతులు వాళ్లంతట వాళ్లే వచ్చి అప్పు తీర్చేస్తారు. తక్కిన రాష్ట్రాలలో డబ్బు రాగానే యింట్లో ఫంక్షన్లు, పండగలు చేసేసి, బ్యాంకు ఋణం వెనకపెడతారు. గుజరాతీలందరూ నిజాయితీపరులని నేను సర్టిఫికెట్టు యివ్వటం లేదు. బ్యాంకులను మోసం చేసే వాళ్లలో గుజరాతీలు అగ్రస్థానంలో ఉన్నారు. కానీ వాళ్లు చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర హర్షద్ మెహతా ఫ్రాడ్‌లో చిక్కుకుని బ్యాంక్ మూతపడే స్థితికి వచ్చింది. మా బేస్ సౌరాష్ట్ర కాకపోతే అంత పనీ జరిగేదే! కానీ సాధారణ గుజరాతీకి ఉన్న ఆర్థిక క్రమశిక్షణ కారణంగానే మా బ్యాంకు నిలబడింది.

చెప్పవచ్చేదేమిటంటే కేజ్రీవాల్ గుజరాతీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేక అది ఉచితం, యిది ఉచితం అంటూ చెప్పాడు. దానికి బదులు యీ పన్ను ఎత్తివేస్తా, ఆ పన్ను ఎత్తి వేస్తా, అధికారగణం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేట్లు చేస్తా అని ఉంటే కొంతైనా ఆదరించేవారేమో! గుజరాత్‌లో అవినీతి పెరిగిపోయిందని ప్రజలందరూ చెప్తున్నా, అవినీతి నిరోధక ఉద్యమకారుడిగా వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్ అవినీతి గురించి అస్సలు మాట్లాడలేదు. పైగా సిద్ధాంతాలతో సంబంధం లేకుండా గెలుస్తాడనుకున్న అభ్యర్థులందరికీ సీట్లిచ్చేశారు. ఇతర పార్టీల్లో టిక్కెట్లు దొరక్క తమ దగ్గరకు వచ్చినవారికి కూడా యిచ్చేస్తున్నారు. ఇలా ఫక్తు రాజకీయ పార్టీగా ఆప్ తయారైంది. దిల్లీ మునిసిపల్ కార్పోరేషన్‌లో అన్ని సీట్లు గెలిచినా యిద్దరు కాంగ్రెసు కౌన్సిలర్లను చేర్చుకోవడంతో తను కాంగ్రెసు, బిజెపిల కంటె భిన్నం కాదని ఆప్ నిరూపించుకుంది. ఇప్పుడు ఆప్ తరఫున గుజరాత్‌లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరదామని అనుకుంటున్నారట. దీనితోనైనా ఆప్‌కు బుద్ధి రావాలి. గుజరాత్ పాలన గురించి వచ్చే వ్యాసంలో గణాంకాలు యిస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?