cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సిబిఐ - సానా సతీశ్‌ అనే తీగ లాగితే...

ఎమ్బీయస్‌: సిబిఐ - సానా సతీశ్‌ అనే తీగ లాగితే...

నిజానికి సానా సతీశ్‌ అనే వ్యక్తి సిబిఐ అధికారులకు లంచాలు సంపాదించి పెట్టే ఓ చిన్న సబ్‌-ఏజంటు అనుకోవచ్చు. ఆ ఒక్క తీగ పట్టుకుని లాగితే సిబిఐ డొంక కదిలింది. సరిగ్గా చెప్పాలంటే కొందరికి సంబంధించిన చిన్న డొంక మాత్రమే కదిలింది. ఇలాటి ఎన్ని డొంకలున్నాయో మనం వూహించుకోవాలంతే. ఆ డొంకల తీగలన్నీ దొరికి, వాటిని లాగగలిగితే సిబిఐ విశ్వరూపం బయటపడుతుంది. అది చూసి ఆశ్చర్యం కంటె అసహ్యమే ఎక్కువగా కలిగే ప్రమాదం ఉంది. ఆ వికృతరూపంతో బాటు తక్కిన సంస్థల వికారాలు కూడా తెలిసి వస్తాయి. 

సానా సతీశ్‌ ఆస్థానాకు వ్యతిరేకంగా అక్టోబరు 4న సతీశ్‌ మేజిస్ట్రేటు ఎదుట యిచ్చిన వాంగ్మూలం ప్రకారమైతే - సిబిఐ-ఖురేషీ కేసులోంచి బయటపడేయడానికి అతనికి దొరికిన దళారులు మనోజ్‌ ప్రసాద్‌, సోమేశ్‌ ప్రసాద్‌ అనే యిన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు! 'రా'కు డైరక్టరుగా చేసి 2000లో రిటైరైన దేవేశ్వర్‌ ప్రసాద్‌ కుమారులు. దేవేశ్వర్‌ తన రిటైర్‌మెంట్‌ తర్వాత కూడా రా-కు పరోక్షంగా సలహాదారు హోదాలో పని చేశారు. రా స్పెషల్‌ డైరక్టరు శమంత్‌ కుమార్‌ గోయల్‌ (అతని పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చోటు చేసుకుంది) ద్వారా యీ ప్రసాద్‌ సోదరులు ఆస్థానాకు పరిచయమై అతని తరఫున లంచాలు సేకరించడానికి ఒప్పుకున్నారు. వీళ్లు దుబాయిలో సతీశ్‌ను కలుసుకున్నారు. రూ.5 కోట్లు యిస్తే ఆస్థానా ద్వారా అతని కేసును సెటిల్‌ చేస్తామని, ఎడ్వాన్సుగా రూ.3 కోట్లు యివ్వాలని చెప్పారు. ఫోన్‌లో ఎవరో వ్యక్తి తను ఆస్థానానని చెప్పుకుని ఆ మేరకు హామీ యిచ్చాడు. 

సరేనని సతీశ్‌ మనోజ్‌కు వెంటనే కోటి రూ.లు యిచ్చాడు. తర్వాత అతని బంధువు సునీల్‌ మిత్తల్‌కు దిల్లీలో రూ.1.95 కోట్లు యిచ్చాడు. అయినా 2018 ఫిబ్రవరిలో సిబిఐ నుంచి మళ్లీ నోటీసులు వచ్చాయి. లంచం యిచ్చినా మళ్లీ నోటీసులు ఎందుకు వచ్చాయని సతీశ్‌ మనోజ్‌ను నిలదీశాడు. పూర్తిగా యివ్వలేదు కదా, తక్కినది కూడా యిచ్చేస్తే ఆగిపోతాయని మనోజ్‌ చెప్పడంతో అక్టోబరు 9న తక్కిన 2.05 కోట్లు యిచ్చేస్తానని సతీశ్‌ చెప్పాడు. సిబిఐ విచారణకు వెళ్లకుండా అనారోగ్యం సాకు చెపుతూ ఈమెయిలు యిచ్చాడు. ఆ తర్వాత సిబిఐ నుంచి నోటీసులు ఆగిపోయాయి. హమ్మయ్య అనుకుని సతీశ్‌ అక్టోబరు 10న మనోజ్‌కు రూ. 25 లక్షలు యిచ్చాడు. తక్కినది ఇంకో వారంలో యిస్తానన్నాడు. ఇంతలో డబ్బు తీసుకోవడానికి అక్టోబరు 16న మనోజ్‌ దుబాయి నుంచి దిల్లీ వస్తే అలోక్‌ తాలూకు అధికారులు అరెస్టు చేశారు. దాంతో చెల్లింపులు ఆగిపోయాయి.'

ఇది వాస్తవమో కాదో ప్రస్తుతానికి తెలియదు కానీ, యిదే సతీశ్‌ కేసుని ఆస్థానా తనకు అనుకూలంగా వాడుకుందామని చూశాడు. సతీశ్‌ ఖురేషీ కేసులో తనను తప్పించమంటూ అలోక్‌కు రూ.2 కోట్లు లంచం యిచ్చాడని, అందుచేత జులైలో తాము సతీశ్‌ను అరెస్టు చేయబోగా అలోక్‌ అభ్యంతర పెట్టాడని ఆరోపణ చేస్తూ కేబినెట్‌ సెక్రటరీకి, సివిసికి ఆగస్టు 24న 21 పేజీల ఫిర్యాదు చేశాడు. 'సతీశ్‌ను మూడుసార్లు విచారించాం. ఫిబ్రవరి 20 న అతన్ని సిబిఐ ఆఫీసుకి రప్పించి, విచారించ బోతూ ఉండగా అలోక్‌ ఫోన్‌ చేసి, సతీశ్‌ను ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పాడు. అయినా సతీశ్‌ను విచారణకు గురి చేశాను. మర్నాడు ఖురేషీ, సుఖేశ్‌ గుప్తా (సహనిందితుడు) ఎదుట ప్రశ్నించాలని అనుకున్నాం. అయితే సతీశ్‌ మళ్లీ రాలేదు. అలోక్‌ ద్వారా మేనేజ్‌ చేసుకున్నాడు.' అని ఆరోపించాడు ఆస్థానా. అతని వెర్షన్‌లో మనోజ్‌ ప్రసాద్‌లు గట్రా ఉన్నట్లు తెలియరాలేదు. మరి దేని ఆధారంగా లంచం యిచ్చినట్లు చెప్పాడో ఆ వివరాలు బయటకు రాలేదు. ఆస్థానా, అలోక్‌పై చేసిన 15 ఆరోపణలలో యిది ఒకటి. తక్కిన వాటి గురించి మాట్లాడుకునే ముందు అలోక్‌, ఆస్థానాల్లో ఎవరికి సతీశ్‌ లంచం యిచ్చాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సిబిఐలో డిఐజిగా మనీశ్‌ సిన్హా అనే ఆంధ్రా క్యాడర్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి ఉన్నాడు. ఆస్థానాను కాపాడడానికి ప్రభుత్వం అక్టోబరు 24న ఎడాపెడా బదిలీ చేసిన అధికారుల్లో యితనొకడు. అంటే యితను అలోక్‌ పక్షాన నిలిచిన అధికారి అని అర్థమై పోతుంది. తనను నాగపూర్‌ బదిలీ చేయడం అన్యాయం అంటూ అతను నవంబరు మూడో వారంలో సుప్రీం కోర్టు తలుపు తట్టాడు. ఓ పక్క కోర్టుకి వెళుతూ మరో పక్క తన పిటిషన్‌ను మీడియాకు విడుదల చేయడంతో సుప్రీం కోర్టు అతనిపై కారాలు, మిరియాలు నూరుతోంది. అతను చెప్పిన విషయాలు కూడా జోడిస్తే చిత్రంలో స్పష్టత వస్తుంది. 

మనోజ్‌ ప్రసాద్‌ అరెస్టు కాగానే అతన్ని విచారించింది మనీశే. అతను చెప్పిన దాని ప్రకారం - మనోజ్‌ తలబిరుసుగా ఉన్నాడు. దోవల్‌, 'రా' మాజీ జాయింటు సెక్రటరీ తనకు బాగా తెలుసంటూ, దోవల్‌కు సామంత్‌ గోయల్‌, తన సోదరుడు సోమేశ్‌ ఓ విషయంలో సహాయపడ్డారని, తాము పిలిస్తే వాళ్లు పలుకుతారనీ వీళ్లని బెదరగొట్టబోయాడు. మనోజ్‌ను అరెస్టు చేయగానే  సోమేశ్‌-సామంత్‌ల మధ్య, సామంత్‌-ఆస్థానాల మధ్య ఎడాపెడా ఫోన్లు నడిచాయని, తర్వాత కేబినెట్‌ సెక్రటేరియట్‌ కార్యాలయం  తనకు ఫోన్‌ చేయించి, అరెస్టు గురించి కనుక్కుందని కూడా మనీశ్‌ అన్నాడు.

సానా సతీశ్‌ తక్కువ్వాడు కాదని మనీశ్‌ అంటాడు. హైదరాబాదులోని దిల్లీ పబ్లిక్‌ స్కూలు యజమాని గోరంట్ల రమేశ్‌కు ఒక స్థలం అమ్మకంలో అతను ఏజంటుగా పనిచేశాడు. దానిలో వచ్చిన డబ్బునే ఖురేషీకి చెల్లించాడు. ఈ విషయం తెలియగానే సిబిఐ గోరంట్లను ప్రశ్నించింది.  సివిసిగా ఉన్న కెవి చౌదరికి గోరంట్ల బంధువు. సిబిఐ పిలిచాక గోరంట్ల, సానా సతీశ్‌ కలిసి చౌదరి యింటికి వెళ్లి ఆయనకు విషయాలు వివరించారట. ఇవన్నీ సతీశ్‌ మనీశ్‌కు చెప్పాడట. ఇదయ్యాక చౌదరి, ఆస్థానాను తన యింటికి పిలిచి  నీపై కేసు పెడుతున్నారని చెప్పారట. 'నాకు వ్యతిరేకంగా ఎలాటి ఆధారాలూ లేవు' అని ఆస్థానా చెప్పాడట. ఆ మాటకొస్తే దోవలే ఆస్థానాకు ఫోన్‌ చేసి, అలోక్‌ నీపై కేసు పెడుతున్నాడు అని ముందుగానే హెచ్చరించాడట. 

సతీశ్‌ కంపెనీ కార్యాలయాల్లో ఒకటి ఆంధ్ర ఐఏఎస్‌ అధికారిణి రేఖారాణి భవంతిలో ఉంది. అలా ఆమెతో పరిచయం. ఆమె ద్వారా కేంద్ర న్యాయశాఖామంత్రి కార్యదర్శి సురేశ్‌ చంద్రతో లింకు పెట్టుకున్నాడు. సతీశ్‌ తరఫున చాముండేశ్వరీ నాథ్‌ సురేశ్‌ చంద్రను లండన్‌లో కలిసి విషయాలు వివరించాడని, దరిమిలా సురేశ్‌ చంద్ర రేఖారాణి ద్వారా సతీశ్‌కు ధైర్యమిప్పించాడనీ, మనీశ్‌ సిన్హా అంటున్నాడు. 

ఈ కేసు సంగతి అలా ఉంచితే, ఆస్థానా అలోక్‌పై చేసిన తక్కిన 14 కేసుల్లో కొన్ని అవినీతికి చెందినవి కాగా, కొన్ని అవినీతిపరులైన సిబిఐ అధికారులను వెనకేసుకొచ్చాడనీ, మరి కొన్ని బిజెపి వ్యతిరేక నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు కొన్ని. 'ఐఆర్‌సిటిసి కేసులో లాలూ యింట్లో సోదాలు జరపకుండా నిలిపివేయమని ఆదేశించాడు, ఓ రైల్వే ఉన్నతాధికారి పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకుండా అడ్డుపడ్డాడు, అసలు కేసు పెట్టడానికే యిష్టపడలేదు, బొగ్గు కుంభకోణంలో నిందితులపై లుకౌట్‌ నోటీసు జారీ చేయకుండా దేశం విడిచి పరారీకి ఆస్కారం యిచ్చాడు, అక్రమ భూసేకరణ కేసును మూసేయించాడు, 2016లో బంగారం స్మగ్లర్లతో లాలూచీ పడి దిల్లీ కమిషనర్‌గా ఉన్నపుడు కేసును నీరుగార్చాడు, అవినీతి మచ్చపడిన యిద్దరు అధికారులను సిబిఐలోకి తీసుకున్నాడు, ఈడీ అధికారులపై వచ్చిన కేసుల్లో జోక్యం చేసుకున్నాడు, రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈడీ అధికారి ఒకణ్ని అలోక్‌, శర్మ కలిసి రక్షించారు...' లాటివన్నీ ఉన్నాయి. 

ఇది రాయడంతో ఆగకుండా ఆరు కేసుల్లో విచారణను వర్మ, ఎకె శర్మ చేతుల్లోంచి తప్పించి యితరుల చేతికి అప్పగించాలని సెప్టెంబరు నెలంతా నోటిమాటగా, లిఖిత పూర్వకంగా కనీసం సివిసిని కోరాడు. సివిసి అతని అరోపణలకు విలువ నిచ్చి సెప్టెంబరు 25న సివిసి ఆస్థానా చేస్తున్న ఆరోపణలపై అక్టోబరు 3 లోగా వివరణ యివ్వాలని అలోక్‌ను ఆదేశించింది. ఇవన్నీ చూసి ప్రధాని కార్యాలయం తాము ఏదో ఒకటి చేయకపోతే సిబిఐ డైరక్టరూ, స్పెషల్‌ డైరక్టరూ కొట్టుకుని వీధిన పడేట్లున్నారని భయపడింది. ఆస్థానాకు ఏదైనా డిప్లొమాటిక్‌ పోస్టింగు యిచ్చి లండన్‌ పంపేసి,  గొడవ చల్లారుద్దామనుకుంది. ఫిబ్రవరి 1 నాటికి అలోక్‌ ఎలాగూ రిటైరైపోతాడు. ఆస్థానాను తిరిగి తెచ్చేయవచ్చు. ఈలోగా అతనిపై కేసులూ అవీ కొట్టేయిస్తే, డైరక్టరుగానే తెచ్చేయవచ్చు. లేదా తాత్కాలిక డైరక్టరు అనవచ్చు అనుకుంది. 

అయితే ఆస్థానా ఉండబట్టలేక పోయాడు. సతీశ్‌ కేసులో అలోక్‌ను యిరికించేందుకు చూశాడు. సతీశ్‌-అలోక్‌ బంధంపై తాము చేసిన ఆరోపణలకు సాక్ష్యంగా సతీశ్‌ సెప్టెంబరు 26 న సిబిఐ, న్యూదిల్లీ ఆఫీసులో ఆస్థానా వద్ద డిఎస్పీగా పని చేసే దేవేంద్ర కుమార్‌ ఎదుట యిచ్చిన వాంగ్మూలం అంటూ ఒకటి చూపించారు, దానిలో ఖురేషీని మనీ లాండరింగు కేసులోంచి బయటపడేయడానికి అలోక్‌ వర్మకు రూ. 2 కోట్ల ముడుపులు తాను చెల్లించానని సతీశ్‌ చెప్పినట్లుంది. 

ఇది అలోక్‌ను మండించింది. తన కింద పనిచేసే సిబిఐ దర్యాప్తు బృందాలను ఆ వాంగ్మూలాన్ని పరిశీలించమన్నాడు. ఆరోజు సతీశ్‌ హైదరాబాదులో ఉన్నాడనీ, దిల్లీలో లేడనీ తేలింది. ఆ బృందం సతీశ్‌ను దిల్లీ రప్పించి, అప్రూవర్‌గా మార్చి, అక్టోబరు 4న మేజిస్ట్రేటు ఎదుట వాంగ్మూలం యిప్పించింది. దాని ఆధారంగా అక్టోబరు 15న సిబిఐ ఆస్థానాపై లంచాల కేసు పెట్టింది, మర్నాడు దుబాయి నుంచి దిల్లీ వచ్చిన మనోజ్‌ను అరెస్టు చేయించింది. దాంతో అక్టోబరు 19న ఆస్థానా సివిసికి లేఖ రాసి, అలోకే లంచాలు పుచ్చుకున్నాడని, ఆ నేరాన్ని తనపై తోసేస్తున్నాడనీ ఆరోపించాడు. వెంటనే అలోక్‌ ఆ కేసును ఆస్థానా నుంచి తప్పించి తన చేతిలోకి తీసుకున్నాడు. 

మర్నాడే అలోక్‌ తరఫు బృందం సతీశ్‌ పేర నకిలీ వాంగ్మూలం సృష్టించాడంటూ దేవేంద్ర కుమార్‌ ఇంటిపై దాడులు చేసింది, దానికి ముందు అతని ఫోన్‌ కాల్స్‌ను, అతని సహచరుల ఫోన్‌ కాల్స్‌ను రికార్డు చేసింది. రికార్డులు తారుమారు చేశాడన్న అభియోగంతో 22న అతనిపై కేసు పెట్టింది. దేవేంద్ర యింట్లో సోదాలు చేస్తూండగా దోవల్‌ అలోక్‌కు ఫోన్‌ చేసి సోదాలు ఆపేయమని చెప్పాడనీ, దాంతో విధిలేక అలోక్‌ తనకు చెప్పి సోదాలు ఆపించాడని మనీశ్‌ సిన్హా యిప్పుడు చెప్తున్నాడు. దాంతో దేవేంద్రకు సంబంధించిన మొబైల్‌ ఫోన్లు, యితర ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకోలేకపోయామని వాపోయాడు. 'నాకే కాదు, బస్సీకి కూడా యీ అనుభవం ఎదురైంది. అనేకమంది పబ్లిక్‌ సర్వెంట్ల యిళ్లలో తనిఖీలు చేస్తానంటే అలోక్‌ అనుమతి యివ్వలేదు, ఎందుకంటే అజిత్‌ దోవల్‌ వద్దంటున్నాడు' అని అంటాడు మనీశ్‌.

అప్రూవర్‌గా మారిపోయిన సతీశ్‌ వాంగ్మూలం ఆధారంగా సిబిఐ బృందం ఆస్థానాపై కూడా కేసు పెట్టింది. అదే ఎఫ్‌ఐఆర్‌లో 'రా' అధికారి సామంత్‌ గోయెల్‌ పేరు కూడా చేర్చారు. మనోజ్‌ ప్రసాద్‌ తనకు వ్యతిరేకంగా ఉన్న రాజేశ్వర్‌ సింగ్‌ అనే ఈడీి ఉన్నతాధికారిపై 'రా' ద్వారా దొంగ కేసు పెట్టించారని కూడా అభియోగం మోపారు. 

సిబిఐలో యీ ఘర్షణ సాగుతూండగా ఆస్థానాకు అనుకూలంగా ఉన్న ఈడీ స్టెర్లింగ్‌ బయోటెక్‌పై, సందేశరా సోదరులపై చార్జిషీటు ఫైల్‌ చేసింది. రూ.8 వేల కోట్ల మనీ లాండరింగ్‌ చేశారనీ, 174 షెల్‌ కంపెనీలు నిర్వహించారనీ దానిలో ఉంది. ఇది నిశ్చయింగా ఆస్థానాను యిరకాటంలో పెట్టే ప్రయత్నమే. 

వీటన్నిటి ఆధారంగా ఆస్థానాను అరెస్టు చేయమని అలోక్‌ ఆదేశాలిచ్చాడు. ఇది ఒక అసాధారణ చర్య, దాని పర్యవసానాల గురించి తదుపరి వ్యాసంలో.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2018) 
mbsprasad@gmail.com

1) ఎమ్బీయస్‌: సిబిఐ - ఆస్థానా ఆ స్థానానికి వచ్చిన వైనం

2) ఎమ్బీయస్‌: సిబిఐ - అ-ఆల రగడ

4) ఎమ్బీయస్‌: సిబిఐ - పెంపుడు చిలకల తిరుగుబాటు