Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సిబిఐ - పెంపుడు చిలకల తిరుగుబాటు

ఎమ్బీయస్‌: సిబిఐ - పెంపుడు చిలకల తిరుగుబాటు

సిబిఐ అంటే పంజరంలో పక్షి అని సుప్రీం కోర్టు 2013 లోనే వ్యాఖ్యానించింది. అంటే ప్రభుత్వం పెంచుకుంటున్న చిలుకలాగానే దాని పలుకులే వల్లిస్తూంటుంది. వాళ్లు ఎవర్ని మంచివాళ్లనమంటే వాళ్లనే అంటుంది, ఎవర్ని చెడ్డవాళ్లనమంటే వాళ్లనే అంటుంది. ఈ ప్రభుత్వమూ సిబిఐను అలాగే చూసింది, చేసింది. అయితే యీసారి ట్విస్టేమిటంటే డైరక్టరు అనే పెంపుడు చిలుకకు పోటీగా మరో చిన్న చిలుకను కూడా అదే పంజరంలో పెట్టి దాన్ని దీని నెత్తిమీద రుద్దబోయింది. దాంతో పెద్దది తిరగబడింది. దానికి అండగా ఉన్న చిలుకలూ తిరగబడ్డాయి. అన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోలాహలం చేస్తున్నాయి. ఇప్పటివరకు అజిత్‌ దోవల్‌ను, కేంద్రమంత్రిని, ప్రధాని కార్యాలయాన్ని రచ్చ కీడ్చాయి. ఇక తర్వాతి వంతు ఎవరిదో చూడాలి.

అ-ఆల వివాదానికి వస్తే, సిబిఐ స్పెషల్‌ డైరక్టరుగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాలంటే ఎంత డైరక్టరుకైనా పై అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని ఉండాల్సింది. కానీ అనుమతి అడిగితే యివ్వరని అలోక్‌కి తెలుసు. ఎందుకంటే సివిసి అక్టోబరు 15నే అతనికి ఓ ఉత్తరం రాసింది - ముందస్తు అనుమతి లేనిదే సిబిఐ అధికారులెవరిపైనా చర్య తీసుకోవద్దని దాని సారాంశం. అందుకే తెగించాడు. ఆస్థానాను అరెస్టు చేయమని ఉత్తర్వు జారీ చేశాడు. ఆ ఉత్తర్వు వెలువరించగానే అజిత్‌ దోవల్‌ ఫోన్‌ చేసి వద్దని వారించాడని మనీశ్‌ సిన్హా అంటున్నాడు. తనను అరెస్టు చేయడం ఖాయమని ముందే ఉప్పందిపోవడంతో, తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించాలంటూ అక్టోబరు 23న ఆస్థానా దిల్లీ హైకోర్టుకు వెళ్లాడు. ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయకపోయినా, అస్థానా అరెస్టు కాకుండా కోర్టు స్టే యిచ్చింది, పొడిగిస్తూ పోయింది. ఇప్పటిదాకా అతను అరెస్టు కాలేదు.

ఇక జాప్యం చేయలేమనుకున్న ప్రభుత్వం వేగంగా కదిలింది. అక్టోబరు 23 రాత్రే సివిసిని సమావేశం కమ్మంది. సివి కమిషనర్‌ కెవి చౌదరి విదేశీ పర్యటన రద్దు చేసుకుని హాజరయ్యారు. సివిసి అలోక్‌ను తప్పు పట్టింది. ఏ విషయంలో? ఆస్థానా ఆగస్టు 24న అలోక్‌పై యిచ్చిన ఫిర్యాదుపై వివరణ కోరుతూ తాము ఉత్తరం రాసినా, దానికి సంబంధించిన పత్రాలన్నీ నెల్లాళ్ల లోపున అందచేయమని మూడు నోటీసులు యిచ్చినా అలోక్‌ పట్టించుకోలేదు కాబట్టి అలోక్‌పై చర్య తీసుకోవాలంది. తమ నోటీసులకు జవాబు యివ్వకపోవడం ద్వారా తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని సివిసి, దానితో  కేంద్రం కూడా అభిప్రాయపడ్డాయి. ఈ లాజిక్‌ అర్థం చేసుకోవడం కాస్త కష్టమే! అంతేకాదు, ఆస్థానాతో అతని వైరం వలన సిబిఐలో పని వాతావరణం భ్రష్టు పట్టిందని, ఆస్థానాకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలను, ఫైళ్లను అందించటం లేదని కేంద్రం తప్పు పట్టింది. అందువలన అతన్నీ, ఆస్థానాని బలవంతపు సెలవులో పంపించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

అప్పటికప్పుడు పిఎంఓ నేతృత్వంలోని నియామకాల కమిటీ పరిశీలించి సివిసి ప్రతిపాదనకు ఓకే చెప్పింది. సిబిఐలో నెం.3 గా ఉన్నా, వీళ్ల గొడవల్లో తటస్థంగా ఉన్న 1986 బ్యాచ్‌ ఐపిఎస్‌ మన్నెం నాగేశ్వరరావుకి తాత్కాలిక డైరక్టరుగా బాధ్యతలు అప్పగించింది. అర్ధరాత్రి (తెల్లవారితే 24 అనగా) 1 గం.కి అజిత్‌ దోవల్‌ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయించాడు. 2 గం.లకు నాగేశ్వరరావు సిబిఐ హెడాఫీసులో ప్రవేశించి, చుట్టూ పోలీసులు మోహరింపచేశాడు. మర్నాడు పొద్దున్న అ-ఆ లు తమ ఆఫీసుల్లోకి రాకుండా 10, 11 అంతస్తుల్లోని వాళ్ల ఆఫీసులను సీజ్‌ చేశాడు. సోదాలు చేయించాడు. వారికి సన్నిహితులైన అధికారులను బదిలీ చేసేశాడు. అ-ఆల డ్రైవర్లను కూడా ఉపసంహరించాడు.

నిజానికి ఆస్థానాపై సివిసికి, కేంద్రానికి ఏ ఫిర్యాదూ లేదు. మరి అలాటప్పుడు అతన్ని ఎందుకు పంపించాలి? అతని పట్ల పక్షపాతం చూపించలేదని నిరూపించుకోవడానికా? అలోక్‌ ఒక్కణ్నీ పంపేస్తే ఆస్థానాను కాపాడుతున్నట్లు తెలిసిపోతుందనా? ఆస్థానాను బలవంతపు సెలవులో పంపుతూనే అతనిపై ఉన్న ఆరోపణల గురించి విచారణ జరుపుతున్న అలోక్‌ బ్యాచ్‌ అధికారులందరినీ దేశం నలుమూలలకు విసిరేశారు. కొత్త డైరక్టరు (అబ్బే, అదేం లేదు, ఊరికే బాధ్యతలు చూడమన్నామంతే అని ప్రభుత్వం మాట మార్చింది) అర్జంటుగా యీ బదిలీలు ఎందుకు చేపట్టాడో దానికి సరైన వివరణ లేదు. అందువలన ఈ బదిలీలు వివాదాస్పదమయ్యాయి.

ఆస్థానాపై కేసులో దర్యాప్తు చేస్తున్న ఎకె బస్సీను 'ప్రజా ప్రయోజనం' దృష్ట్యా అండమాన్‌లోని పోర్టు బ్లెయిర్‌కు బదిలీ చేశారు. బస్సీపైన ఉన్న పర్యవేక్షక అధికారి, అదనపు ఎస్పీ ఎస్‌ఎస్‌ గుర్మ్‌ను జబల్‌పూర్‌కు, ఆయన పైన పర్యవేక్షకుడైన డిఐజీ ఎంకె సిన్హాను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు. జాయింట్‌ డైరక్టరు (పాలసీ) పదవి నుంచి ఎకె శర్మను తప్పించి డిఐజీ అమిత్‌ కుమార్‌కు యీ పోస్టును అదనపు బాధ్యతల కింద అప్పగించారు. ఎకె శర్మను రాజీవ్‌ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న (చేయడానికి యింకా ఏముందో మరి, ఎంతైనా అది అప్రధానమైన పోస్టే) విభాగానికి వేశారు. ఇలా ఆస్థానాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ ఏరేశారు. ఆస్థానా బృందంలో ఉన్న జాయింట్‌ డైరక్టరు ఎ సాయిమనోహర్‌ను చండీగఢ్‌కు బదిలీ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వగైరా పర్యవేక్షించే విభాగంలోని అనీశ్‌ ప్రసాద్‌ను తప్పించి, దాన్ని డిఐజీ కెజి చౌరాసియాకు అప్పగించారు.

ఈ ఆఖరి బదిలీలో మర్మం ఏమిటంటే - సోమేశ్‌ ప్రసాద్‌ను తాను ఎన్నడూ కలవలేదని ఆస్థానా వాదిస్తున్నాడు. అయితే కాల్‌ రికార్డులు పరిశీలిస్తే డిసెంబరు 16 న కలిశాడని సాక్ష్యం లభించిందట. ఆస్థానా ఆగస్టు 24న కాబినెట్‌ సెక్రటరీ పికె సిన్హాకు రాసిన లేఖలో అలోక్‌ వర్మ తనను పని చేసుకోనివ్వటం లేదని, తన ప్రైవసీని హరిస్తున్నాడనీ, తన కాల్‌ రికార్డులు, తన కుటుంబసభ్యుల కాల్‌ రికార్డులపై సిబిఐ ద్వారా నిఘా పెట్టించాడనీ ఫిర్యాదు చేశాడు. అంటే కాల్‌ రికార్డుల్లో ఏదో మర్మం ఉందన్నమాట. పైగా మనీశ్‌ సిన్హా తన ఆరోపణలో గుజరాత్‌కు చెందిన కేంద్రమంత్రి హరిభాయ్‌ చౌదరి, ఖురేషీని సిబిఐ దర్యాప్తు నుంచి తప్పించేందుకు అహ్మదాబాద్‌కు చెందిన విపుల్‌ ద్వారా జూన్‌లో కోట్ల రూ.లు పుచ్చుకున్నారని, యీ మేరకు కాంగ్రెసుకు చెందిన మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డి, సతీశ్‌ల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను సిబిఐ రికార్డు చేసిందని చెప్పాడు. ఇవన్నీ రూపుమాపాలంటే ఫోన్‌ ట్యాపింగ్‌ అధికారిపై కూడా వేటు వెయ్యాలి, వేశారు.

సిబిఐ స్ట్రక్చర్‌ గురించి కాస్త సమాచారం. సిబిఐ కార్యకలాపాలను ప్రధాని కార్యాలయం (పిఎంఓ)తో బాటు సెంట్రల్‌ విజిలెన్సు కమిషన్‌ (సివిసి) కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. సిబిఐలో మూడు ప్రధాన విభాగాలు, ఎకనమిక్‌ అఫెన్సెస్‌ డివిజన్‌, ఏంటీ కరప్షన్‌ డివిజన్‌, స్పెషల్‌ క్రైమ్‌ డివిజన్‌. ఈ మూడిటికి తొమ్మిదేసి యూనిట్లు దిల్లీలో ఉన్నాయి. మొదటి దానికి సంబంధించిన 4 వింగ్స్‌ ముంబయి, కలకత్తా, చెన్నయ్‌, రాంచీలలో ఉన్నాయి. రెండవ డివిజన్‌కు చెందిన 32 శాఖలు దేశమంతా ఉన్నాయి. మూడోదానికి చెందిన 6 శాఖలు లఖనవ్‌, చండీగఢ్‌, పట్నా, కలకత్తా, తిరువనంతపురం, చెన్నయ్‌లలో ఉన్నాయి. ఇవి కాక సిబిఐకు అనేక యితర డివిజన్లున్నాయి - బ్యాంక్‌ సెక్యూరిటీ అండ్‌ ఫ్రాడ్‌ సెల్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, ఇంటర్నల్‌ విజిలెన్సు సెల్‌, టెక్నికల్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ కో ఆర్డినేషన్‌ యూనిట్‌.. యిలా. మొత్తం 7 వేలకు పైగా పని చేస్తారు. అందువలన బదిలీలు చేయడానికి చాలా వెసులుబాట్లున్నాయి.

ఈ సీరీస్‌లో చాలా పేర్లు రావడం చేత కలిగే గందరగోళం లేకుండా ఉండడానికి ఎవరెవరి పక్షమో మళ్లీ చెపుతాను. సిబిఐలో నెం. 1 గా వున్న అలోక్‌ వర్మ పక్షాన నిలిచిన వారు - సిబిఐలో నెం.4 ఎకె శర్మ, ఈడీ చీఫ్‌ కర్నాల్‌ సింగ్‌, ఈడీ  జాయింట్‌ డైరక్టరు రాజేశ్వర్‌ సింగ్‌, యింకో రాజకీయ వేత్త. సిబిఐలో నెం.2గా ఉన్న ఆస్థానా పక్షాన నిలిచినవారు - 'రా' లోని సామంత్‌ గోయెల్‌, ప్రధాని కార్యాలయంలో ఉన్న యిద్దరు ఉన్నతాధికారులు (గుజరాత్‌ క్యాడర్‌లో పని చేసి రిటైరైన ఐఏఎస్‌ పికె మిశ్రా, బెంగాల్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ భాస్కర్‌ ఖల్బే, రెవెన్యూ సెక్రటరీ హస్‌ముఖ్‌ ఆధియా, సివిసిగా ఉన్న కెవి చౌదరి.  అలోక్‌ నియామకానికి కారకుడు అజిత్‌ దోవల్‌ ఐనా, ఆస్థానాతో గొడవ వచ్చాక అతను ఆస్థానాకు గాడ్‌ఫాదర్స్‌గా వ్యవహరిస్తున్న వారి పక్షమే వహించాడు.

తనను బలవంతంగా సెలవులో పంపడాన్ని సవాలు చేస్తూ అలోక్‌ సుప్రీం కోర్టుకి వెళ్లాడు. తనను బదిలీ చేసే, లేదా తొలగించే అధికారం కమిటీకే ఉందనీ, ప్రభుత్వం కమిటీని విస్మరింప జాలదనీ అన్నాడు. ప్రభుత్వం సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తిలో జోక్యం చేసుకోవడం పొరపాటంటూ 'ఆస్థానా నా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కల్పిత సాక్ష్యాలను సృష్టించాడు' అని వాదించాడు. అయితే కోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే యివ్వలేదు. అతనిపై ఆస్థానా చేసిన ఆరోపణను రెండు వారాల్లోగా విచారణ చేయమని సివిసిని ఆదేశించింది. అయితే సివిసి తీరుపై దానికీ అనుమానం వచ్చిందేమో, మీరు స్వతంత్రంగా కాకుండా మాజీ సుప్రీం కోర్టు జస్టిస్‌ ఎకె పట్నాయక్‌ పర్యవేక్షణలో చేయాలంది. దీనితో బాటు సిబిఐ చేసిన దర్యాప్తుల బదిలీ, అధికారుల బదిలీ సహా అన్ని నిర్ణయాలను సీల్టు కవర్‌లో తమకు దాఖలు చేయమంది. సివిసికి కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తిస్తూనే ఇది ప్రత్యేక సందర్భం కాబట్టి మేం యీసారికి యిలా ఆదేశిస్తున్నాం అంది.

అలోక్‌ను తీసేయడానికి అడావుడిగా అర్ధరాత్రి సమావేశమైనా అలోక్‌పై ఆరోపణలపై నిజానిజాలు తేల్చమంటే 'పరిశీలిస్తున్నాం, చూస్తున్నాం' అంటూ రోజుల కొద్దీ కాళ్లీడ్చింది. కనీసం అలోక్‌ను పిలిచి ప్రశ్నించనైనా లేదు. బదిలీలపై కూడా కోర్టు ఎందుకు జోక్యం చేసుకుందంటే, అండమాన్‌కు బదిలీ అయిన బస్సీ కోర్టుకి ఎక్కాడు. అతనితో పాటు ఎస్‌ఎస్‌ గుర్మ్‌ కూడా. దిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేస్తూ 'ఆస్థానా తన వాదనకు అనుకూలంగా ఉండే డాక్యుమెంట్లు మాత్రమే కోర్టుకి సమర్పిస్తున్నాడు. అసలైనవి సమర్పిస్తే తప్ప నిజాలు బయటకు రావు. సిబిఐ అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.' అన్నాడు. చివరకు అలోక్‌పై ఆరోపణలు సంబంధించిన రిపోర్టు సివిసి నవంబరు 12న కోర్టుకు సీల్డ్‌ కవర్లో సమర్పించింది. అది చేసిన ఆలస్యంపై కోర్టు మండిపడింది.

చివరకు రిపోర్టు చేతికి వచ్చాక చూస్తే దానిలో అనిల్‌కు వ్యతిరేకంగా కచ్చితమైన ఆధారమేదీ ఉన్నట్లు లేదు. నవంబరు 16న కోర్టు దానిపై వ్యాఖ్యానిస్తూ 'అనిల్‌పై వచ్చిన ఆరోపణల్లో సివిసి ఫైండింగ్స్‌ (నిర్ధారణలు)లో కొన్ని కాంప్లిమెంటరీ (అనుకూలం)గా ఉన్నాయి, కొన్ని అన్‌కాంప్లిమెంటరీ (అననుకూలం)గా ఉన్నాయి, కొన్ని సగంసగం ఉన్నాయి, ఇంకొన్ని వాటిపై దర్యాప్తు చేయాల్సి వుంది' అంది. దాని తాత్పర్యం ఆస్థానా చేసిన ఆరోపణల్లో కొన్నిటికి మాత్రమే ఆధారాలుండే అవకాశముందని అనుకోవాలి. సివిసి దానిపై నిర్ధారణకు వచ్చినట్లు కూడా తోచటం లేదు. అయినా బలవంతపు సెలవులో పంపి అలోక్‌కు శిక్ష వేసేశారు. ఈ రిపోర్టుతో ఏం చేయాలో కోర్టుకి తోచలేదు. దీని కాపీని అలోక్‌కు యిచ్చి, నీ సమాధానం సీల్డ్‌ కవర్లో నవంబరు 19 కల్లా ఇయ్యి అని చెప్పింది. అతను అలాగే యిచ్చాడు కానీ ఓ పొరపాటు చేశాడు. జనాలకు తన మీద సింపతీ పెరగడానికి కాబోలు దాన్ని 'ద వైర్‌' అనే వెబ్‌సైట్‌కు లీక్‌ చేశాడు. చేశానని అతను చెప్పటం లేదు కాబట్టి యిది మనం ఊహించుకోవాలంతే. ఆ వెబ్‌సైట్‌ 'తాము ప్రచురించినది అలోక్‌ సీల్డ్‌ కవర్లో యిచ్చినది కాదు' అని వివరణ యిచ్చింది.

ఏది ఏమైనా కోర్టు యీ లీకు మీద భగ్గుమంది. సరిగ్గా అదే రోజున మనీశ్‌ సిన్హా కూడా ఆస్థానా క్యాంప్‌ మీద ఆరోపణలు గుప్పిస్తూ, కోర్టు కెక్కి, అదే రోజున మీడియాకు తన వాదన రిలీజ్‌ చేశాడు. కోర్టు అతని మీదా మండిపడింది. కేసు విచారించను పొమ్మంది. తర్వాత చల్లబడి, విచారణకు కూర్చుని అలోక్‌ సీల్డ్‌ కవర్లో కోర్టుకి యిచ్చిన సమాధానం ఎలా లీకయ్యింది? అని అడిగింది. మీరు వెబ్‌సైట్‌ వాళ్లనే పిలిచి అడగాలి అని సూచించాడు అలోక్‌ తరఫు లాయరు. సరేలే, యిప్పుడు వెళ్లండి, నవంబరు 29న మళ్లీ చేపడతాం అంది కోర్టు. డిసెంబరు 14 నుంచి కోర్టుకి శీతాకాలం సెలవులు. అందువలన కేసు ఎలా నడుస్తుందో తెలియదు. నియామక కమిటీని సంప్రదించకుండా ఏకపక్షంగా సిబిఐ డైరక్టరును తొలగించే హక్కు సివిసికి ఉందా లేదా అనేదానిపై కూడా కోర్టు తేల్చి చెప్పవలసి వుంది.

ఇంతకీ 'వైర్‌'లో లీకయిన అలోక్‌ కథనంలో ఏముంది? ఐఆర్‌సిటిసి స్కాములో లాలూపై కేసు పెట్టడానికి అలోక్‌ అనుమతి యివ్వలేదని ఆస్థానా ఆరోపించాడు. దానికి అలోక్‌ సమాధానం ఏమిటంటే - నిజానికి యీ వ్యవహారంపై 2013-14లోనే సిబిఐకి ఫిర్యాదు వచ్చింది. కానీ దానిలో విషయం లేదనుకుని మూసేశారు. ఆస్థానా వచ్చాక బిహార్‌కు చెందిన సుశీల్‌ మోదీ ఆస్థానాతో తరచుగా సంప్రదింపులు జరిపి కేసును మళ్లీ చేపట్టేట్టు చేశాడు. ఆస్థానా అలోక్‌ వద్దకు వచ్చి రెగ్యులర్‌ కేసుగా బుక్‌ చేస్తానంటే, 'అలా కాదు, ఆధారాలు బలహీనంగా ఉన్నాయి, ప్రాథమిక విచారణ జరిపి ఆ తర్వాత చేయండి' అని అలోక్‌ ఆస్థానాకు చెప్పాడు. రాజకీయ కోణంతో సుశీల్‌ మోదీ, ప్రధాని కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి పట్టుబట్టి ఆస్థానా చేత కేసు నడిచేట్లు చేశారు.

ఇంతకీ ఆ కేసేమిటంటే 2006లో పట్నాలో రైల్వేకు చెందిన ఒక మూడెకరాల స్థలంలో ఒక షాపింగ్‌ మాల్‌ కట్టడానికి రైల్వే శాఖ ఒక ప్రయివేటు సంస్థకు అనుమతి యిచ్చింది. రైల్వే మంత్రిగా ఉన్న లాలూ  ఆ అనుమతి యిచ్చినందుకు గాను ఆ కంపెనీ దగ్గర్నుంచి ఒక విలువైన భూమిని లంచంగా తీసుకున్నాడు. డైరక్టుగా కాకుండా తన పార్టీ ఎమ్మెల్యే ఒకతని పేర చౌకగా కొనిపించి, కొన్నాళ్లకు అతని దగ్గర్నుంచి తన భార్యకు, కొడుక్కి అమ్మించుకున్నాడు. ఈ కేసులో లాలూతో బాటు, అతని భార్య రబ్డీ దేవిని, కొడుకు తేజస్వి యాదవ్‌ను నిందితులుగా చేర్చారు. 'అప్పటికి నాకు 16 ఏళ్లు, మీసం కూడా మొలవలేదు. నాకేం తెలుసని యిరికించారు?' అని తేజస్వి అడిగాడు. చేస్తేగీస్తే అవినీతి వాళ్ల నాన్న చేశాడు. లంచం పుచ్చుకుని కొడుకు పేర ఆస్తి పెట్టాడు. కావాలంటే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవచ్చు కానీ కొడుకు లంచం అడిగాడా? పుచ్చుకున్నాడా?

ఆ మాట జడ్జి గారి క్కూడా అనిపించిందేమో, బెయిల్‌ అడగ్గానే నిమిషాల్లో యిచ్చేశాడు. కేసు యిప్పటిదాకా తేలలేదు కానీ అప్పుడు రాజకీయంగా బాగా పనికి వచ్చింది. సిబిఐ 2017 జులైలో కేసు మోపిన వెంటనే బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌, తన ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్విని రాజీనామా చేయమన్నాడు. అతను చేయననడంతో ఆర్‌జెడితో బంధాలు తెంపుకుని బిజెపితో చేతులు కలిపి, ప్రభుత్వం ఏర్పాటు చేసి, సుశీల్‌ మోదీని ఉపముఖ్యమంత్రి చేశాడు. దాని కోసమే సుశీల్‌ సిబిఐలోని ఆస్థానాతో మంతనాలాడి కేసు పెట్టించాడని అలోక్‌కు అనుమానం. ఆ కేసు విచారణకు వచ్చినపుడు, అ-ఆలలో ఎవరి వాదన కరక్టో తేలుతుంది.

కోర్టు తరహా చూస్తే అలోక్‌పై ఆరోపణలలోని నిజానిజాలు యిప్పట్లో తేల్చేట్లా లేదు. అక్టోబరు 24 నుంచి సిబిఐను తన చేతుల్లోకి తీసుకున్నా, సివిసి యిప్పటిదాకా సరైన ఆధారాలు సేకరించ లేకపోయింది. ఫిబ్రవరి 1 దాటిన తర్వాత అతను నిర్దోషి అని తేలినా ప్రయోజనం లేదు. డైరక్టరు పదవి ఎలాగూ దక్కదు. ఇదంతా చూస్తే ఆస్థానాను యిరికించాడన్న కసితోనే ప్రభుత్వం వ్యవహరించిందని కొందరి ఆరోపణ. అది కాదు, రఫేల్‌ కేసు విషయంలో ప్రభుత్వాన్ని యిబ్బంది పెట్టబోయాడు కాబట్టి యీ శిక్ష అని కొందరంటున్నారు. రఫేల్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని కాంగ్రెసు ఎప్పణ్నుంచో మొత్తుకుంటోంది. వాళ్లని ఎవరూ పట్టించుకోరు. కానీ నిజాయితీపరులుగా పేరు బడిన అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా (వీళ్లిద్దరూ గత బిజెపి ప్రభుత్వంలో మంత్రులు), ప్రశాంత్‌ భూషణ్‌తో కలిసి రఫేల్‌ వ్యవహారంలో దర్యాప్తు చేయమని సిబిఐను కోరడంతో దానికి ప్రాధాన్యత వచ్చింది.

నరేంద్ర మోదీ, అప్పటి రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్‌లపై అవినీతి నిరోధ చట్టం కింద, దసో కంపెనీ మీద, దాని సిఇఓ మీద, అనిల్‌ అంబానీ మీద కూడా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయమని కోరారు. ఆ విషయంలో వారి విజ్ఞప్తిని అక్టోబరు 4న సిబిఐ హెడ్‌క్వార్టర్స్‌లో అలోక్‌ స్వీకరించాడని ప్రభుత్వానికి కోపమట. ఆ డాక్యుమెంట్లను డిఫెన్సు శాఖకు పంపి మీ స్పందన ఏమిటని అడిగాడట. అప్పణ్నుంచి అతను ప్రభుత్వానికి శత్రువై పోయాడు. అందుకే యిదంతా జరుగుతోందని అంటున్నారు. రఫేల్‌ మాట ఎత్తితే మోదీ ప్రభుత్వం ఎఱ్ఱగుడ్డ చూసిన ఆంబోతులా ఎందుకు అయిపోతోంది అనేది తెలుసుకోవాలంటే రఫేల్‌ స్కామ్‌పై మరో సీరీస్‌ రాయాలి.

ఇంతకీ యీ సిబిఐ రచ్చ చంద్రబాబుగారి రాజకీయ అవసరాలకు పనికి వచ్చింది. రాష్ట్రంలో జరిగిన నేరాలను విచారించేందుకు సిబిఐకు ఆగస్టులో యిచ్చిన సాధారణ అనుమతిని మూణ్నెళ్లల్లో ఉపసంహరించారు. సిబిఐ ఏర్పడినపుడు దిల్లీ పరిధిలో ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి, యితర రాష్ట్రాలలో దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్రాల సమ్మతి ఉండాలి. అది బ్లాంకెట్‌గా, అన్నిటికీ వర్తించేట్లా యివ్వవచ్చు, లేదా కేసును బట్టి, విడివిడిగా యివ్వవచ్చు. సిబిఐ కేంద్రం పెంపుడు కుక్కగా మారిందనే భయంతో అనేక రాష్ట్రప్రభుత్వాలు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. ప్రస్తుతానికి 10 రాష్ట్రాలు (వాటిల్లో గుజరాత్‌ లేదు) మాత్రమే సాధారణ సమ్మతి నిచ్చాయి. తాజా పరిణామాలతో ఆంధ్ర, బెంగాల్‌ కూడా ఉపసంహరించుకున్నాయి.

మూణ్నెళ్ల క్రితం దాకా లేని అభ్యంతరం యిప్పుడే ఎందుకు వచ్చింది? అంటే సిబిఐ వ్యవస్థ కుళ్లిపోయిందని తాము యిప్పుడే గ్రహించామని బాబు జవాబు. ఇది పెద్ద జోక్‌. మనలాటి సాధారణ ప్రజలకు విషయాలు స్పష్టంగా తెలియవు కానీ నాయకులకు తెలియవా? అయినా బాబు అనేకసార్లు - ఫోక్స్‌వ్యాగన్‌ స్కామ్‌, పరిటాల రవి హత్య, ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ వంటి వాటిల్లో - సిబిఐ విచారణకు డిమాండ్‌ చేశారు. కొన్నిసార్లు అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ సరేనన్నారు కూడా. ఇప్పటికీ అనేకమంది నాయకులు 'కావాలంటే సిబిఐ చేత విచారణ జరిపించుకోండి' అని ఛాలెంజ్‌లు విసురుతూనే ఉంటారు. అంటే సామర్థ్యానికి, నిష్పక్షపాతానికి సిబిఐ యింకా చిరునామాగా ఉన్నట్లే లెక్కగా! లేదనుకున్నా, దానికి ప్రత్యామ్నాయం ఏది? జగన్‌పై కేసులు నడిచినంత కాలం సిబిఐ జాయింటు డైరక్టరును సాక్షాత్తూ అవతారపురుషుడిగా కీర్తించినది ఆయన వర్గాలే కదా! ఇప్పుడు హఠాత్తుగా భ్రష్టు పట్టిపోయిందనడం వింత కాదా!

కాంగ్రెసు సారథ్యంలో ప్రతిపక్షాలను ఐక్యం చేసే పనిలో మునిగినప్పుడే మోదీ తన ఆర్థికమూలాలపై దెబ్బ కొడతాడని బాబు గ్రహించి ఉండాలి. బాబు సన్నిహితులపై, నిధులు సేకరించి పెట్టేవారిపై రకరకాల దాడులు జరగడంలో ఆశ్చర్యం లేదు. బాబు హయాంలో స్కాములకూ లోటు లేదంటూ రాష్ట్ర బిజెపి వారు సిబిఐ విచారణ కోరడం ఖాయం. వీటిని ఎదుర్కోవడం బాబుకు పెద్ద సవాలు. అందువలన ఐటీ దాడులు జరగగానే, అది తెలుగువారి ఆత్మగౌరవంపై దాడి, అమరావతి బ్రాండ్‌ యిమేజిపై దాడి అంటూ ఐటీ ఉద్యోగులకు పోలీసుల భద్రత ఉపసంహరించారు. ఐటీ దాడులు రాజకీయ దురుద్దేశంతో జరిగాయని యిప్పటిదాకా టిడిపి నిరూపించ గలిగిందా? సిబిఐలో జరిగినట్లు ఐటీలో నెంబరు 1, 2 కొట్టుకుని రోడ్డు మీద పడలేదు కదా. ఐటీపై ఆ చర్యకు అర్థమేమిటి? సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌పై నలుగురు జడ్జిలు బహిరంగంగా విరుచుకుపడ్డారు. మరి బాబు కోర్టుకి వెళ్లడం మానేస్తారా? 'కావాలంటే ఎవరి చేతనైనా విచారణ జరుపుకోండి' అని సవాలు విసిరే బదులు, సిబిఐ పట్ల యిలా వ్యవహరించి తనను తానే బోనులో ఎక్కించుకున్నారు బాబు.

నిజానికి సిబిఐ విచారణ జరపకుండా యీ కొత్త జీవో ఆపలేదు. కావాలనుకుంటే సిబిఐ, కోర్టుకి వెళ్లి అనుమతి తెచ్చుకోవచ్చు. మరి బాబు ఏం సాధించినట్లు? సిబిఐ ఒక్కదాని పట్లే కాదు, అనేక విషయాల్లో బాబు దృక్పథం మార్చుకుంటున్నారు. బిజెపి గొప్పదన్నారు, మోదీ అంతర్జాతీయ ఖ్యాతి పొందారన్నారు, ప్రత్యేక హోదా అజాగళస్తనమన్నారు, కాంగ్రెసు చెత్తన్నర చెత్త అన్నారు, రాహుల్‌ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదన్నారు, సింగపూరు కంపెనీలు, కాదుకాదు జపాన్‌ కంపెనీలు, మళ్లీ కాదుకాదు సింగపూరు.. గొప్పవన్నారు. మళ్లీ యివన్నీ కాదన్నారు. ఆయన నంది అంటే నంది అని, పంది అంటే పంది అని కీర్తించే వందిమాగధులు ఉన్నంతకాలం చెల్లిపోతోందని ఆయన అనుకుంటారు. ఈ విన్యాసాలు చూసి విస్తుపోయే ప్రజలుంటారని ఆయన కెవరైనా చెప్తారో లేదో, చెప్పినా ఆయన నమ్ముతారో లేక తన ప్రచారశిల్పంపై నమ్మకంతో కొట్టిపడేస్తారో తెలియదు.

ఇక సానా సతీశ్‌ ప్రస్తావన వచ్చినపుడు అతన్ని ఏదో ఒక పార్టీకి అంటగడదామని కొందరు చూస్తున్నారు. అలాటి వాళ్లు ఏ ప్రభుత్వమున్నా అధికారుల సాయంతో ఆపరేట్‌ చేసుకుంటూ పోతారు. అన్ని పార్టీల్లోనూ వాళ్లకి సన్నిహితులుంటారు, ధనబంధం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా పనిచేస్తుంది. అతని గురించి ''వీక్‌'' పత్రిక కొన్ని వివరాలిచ్చింది. 46 ఏళ్ల సతీశ్‌ కాకినాడ విద్యుత్‌ శాఖలో అసిస్టెంటు యింజనీరుగా పని చేసినపుడు సస్పెండ్‌ అయ్యాడట. ఎవరో రాజకీయ నాయకులతో పలుకుబడితో మళ్లీ డ్యూటీలో చేరాడట. 2005లో లీవు పెట్టి హైదరాబాదు చేరాడు. క్రికెట్‌ ఆటగాడిగా అతనికి పరిచయాలు బాగా ఏర్పడ్డాయి. శ్రీనగర్‌ కాలనీలో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని, విఐపిలకు పార్టీలు యిచ్చేవాడు.

2007లో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలలో వి.చాముండేశ్వరీ నాథ్‌ జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసినప్పుడు అతని ఎన్నికకు బాగా కష్టపడ్డాడు. రాజమండ్రికి చెందిన చాముండేశ్వరీ నాథ్‌కు లాబీయిస్టుగా చాలా పేరుంది. అందరికీ సన్నిహితుడే. మనీశ్‌ సిన్హా అఫిడవిట్‌లో అతని పేరు కూడా కనబడుతోంది. 2007లో సతీశ్‌ మొదటి రియల్‌ ఎస్టేటు ప్రాజెక్టు హయత్‌ నగర్‌లోని బాచారం గ్రామంలో మొదలైంది. వివాదంలో ఉన్న 400 ఎకరాల భూమిని కొందరు వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల సాయంతో కొని, దాన్ని వెంచర్‌గా మార్చి మంచి లాభాలు గడించడంతో అతని దశ తిరిగింది. యమాహా నుంచి ఔడీ ఎ4కి మారిపోయాడు.

ఫిల్మ్‌నగర్‌లో ఓ యిల్లు అద్దెకు తీసుకుని, దాన్ని గెస్ట్‌ హౌస్‌గా మార్చి సినిమాస్టార్లు, వ్యాపారస్తులు, మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లతో సహా అందరికీ అడ్డాగా మార్చాడు. ఆ పరిచయాలతో అతను దిల్లీవైపు దృష్టి సారించాడు. హిందీ, ఇంగ్లీషు పెద్దగా రాకపోయినా డబ్బు ధారాళంగా ఖర్చు పెడతాడని, త్వరగా పని చేసి పెడతాడనీ పేరు రావడంతో అక్కడా దూసుకెళ్లాడు. అనేక బిజినెస్‌ వెంచర్లలో భాగస్వామి అయ్యాడు. ఇదే సమయంలో కొందరితో కలిసి దుబాయిలో వ్యాపారం పెట్టి నష్టాలు రుచి చూశాడు కూడా. అతను వ్యాపారాల్లో గడించిన దానికంటె దళారీగా (మర్యాద కోసం లయజన్‌ వర్క్‌ అని చెప్పుకుంటారు) ఆర్జించినదే ఎక్కువ. అన్ని పార్టీల నాయకులతోనూ భుజాలు రాసుకుని తిరిగాడు.

వారిలో కొందరు అతనికి భాగస్వాములు కూడా. ఒక తెలుగు దేశం ఎంపీతో కలిసి దుబాయిలో వ్యాపారమూ చేశాడు, కాంగ్రెసు ప్రభుత్వంలో జరిగిన వాన్‌పిక్‌ కుంభకోణంలోనూ యిరుక్కున్నాడు. సిబిఐ ఆ కేసు యింకా విచారిస్తూనే ఉంది. ప్రస్తుతం అతని ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదని, అప్పుల్లో మునిగాడనీ అంటున్నారు. ఇప్పుడు సిబిఐ వివాదంలో వెలుగులోకి వచ్చేశాడు. తన ప్రాణానికి అపాయం ఉందని కోర్టుకి చెప్పుకున్నాడు.

1) ఎమ్బీయస్‌: సిబిఐ - ఆస్థానా ఆ స్థానానికి వచ్చిన వైనం

2) ఎమ్బీయస్‌: సిబిఐ - అ-ఆల రగడ

3) ఎమ్బీయస్‌: సిబిఐ - సానా సతీశ్‌ అనే తీగ లాగితే...

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?