cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అగ్రవర్ణాలకూ రిజర్వేషన్‌

ఎమ్బీయస్‌: అగ్రవర్ణాలకూ రిజర్వేషన్‌

అన్ని మతాల లోని అగ్రవర్ణాల పేదలకు ఎకనమికల్లీ బ్యాక్‌వర్డ్‌ సెక్షన్‌ అనే పేర 10% రిజర్వేషన్‌ అనే ఒక్క ప్రకటనతో మోదీ రాజకీయ పార్టీల లెక్కలను అతలాకుతలం చేసేశాడు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు యిది కచ్చితంగా రాజకీయ ప్రేరితమే. ఆ మాటకొస్తే ఏ పథకం, ఏ ప్రణాళిక రాజకీయ ప్రేరితం కాదు? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? 'ఈ మధ్య బిజెపికి పరపతి తగ్గుతోంది కాబట్టి, కనీసం అగ్రవర్ణాల వారినైనా నిలుపుకుందామని యిప్పుడీ ప్రకటన చేశారు' - అవును. 'ఏ పార్టీని చూసినా ఎంతసేపు బిసిలు, ఎస్సీలు అంటారు తప్ప మా గోడు పట్టించుకునేవారు ఎవరూ లేరు అని నిస్పృహ చెందుతున్న అగ్రవర్ణాలు ఓటు వేయడానికి వెళ్లటం లేదు. లేదా నోటాకు వేసేస్తున్నారు. ఆ నోటా ఓట్లు రాజస్థాన్‌లో బిజెపి కొంప ముంచాయి. తటస్థ ఓటర్లను ఆకర్షించడానికే యీ ఎత్తు ఎత్తారు' - ఔనౌను. 'కాంగ్రెసు చచ్చుపడి ఉన్నపుడు అగ్రవర్ణాలు బిజెపివైపు మరలారు, యిప్పుడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెసు మళ్లీ ఎదుగుతూండడం చేత వాళ్లు బిజెపి భుజాల మీదుగా కాంగ్రెసు వైపు చూడవచ్చు. అలాటిది జరగకుండా బిజెపి యిప్పుడిది తెచ్చింది' - ఔనౌనౌను. ఇలా ప్రతిపక్షాలు చెప్పేవాటినన్నిటికి ఒప్పుకుంటూనే మనం ఒక ప్రశ్న అడగవచ్చు - 'ఇంతకీ మీరు దీన్ని సమర్థిస్తారా? లేదా?' అని.

వెంటనే వాళ్లు 'నిర్ణయం మంచిదో కాదో క్షుణ్ణంగా పరిశీలించి కాని చెప్పలేం. మేం బిజెపి చిత్తశుద్ధిని శంకిస్తున్నాం. ఇప్పుడిలా ఆఖరి నిమిషంలో ప్రవేశపెట్టడం దేనికి? ఈ టైమింగు తప్పు. అనేక రాష్ట్రాల నుంచి  అనేక కులాల రిజర్వేషన్లపై ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. తెలంగాణ నుంచి ముస్లిము రిజర్వేషన్‌, ఆంధ్ర నుంచి కాపు రిజర్వేషన్‌ డిమాండ్లపై ఏ నిర్ణయం తీసుకోకుండా నానబెట్టి, యిప్పుడు హఠాత్తుగా యిలా మెరుపుదాడి చేస్తే ఎలా? దీన్ని మేం ఖండిస్తున్నాం. ఇలా ఆఖరి నిమిషంలో చేస్తే అమలు కాకపోవచ్చు కూడా.' అంటున్నారు. మన రాష్ట్ర విభజన బిల్లు కూడా ఆఖరి నిమిషంలో, లోకసభ ఆఖరి రోజున గందరగోళ పరిస్థితుల్లో చేశారు. అమలు కాలేదా? 

దీని మీద చర్చ జరగాలి, అన్ని పార్టీలతో కలిసి కూర్చుని వారి సలహాలు తీసుకోవాలి అని అనడం కరక్టుగానే తోస్తుంది కానీ నిజంగా జరపవలసిన అవసరం ఉందా అని కూడా అనిపిస్తుంది. 30 ఏళ్ల క్రితమే యిది ప్రారంభమైంది. 1991లో పివి యివ్వబోయారు కూడా కానీ సుప్రీం కోర్టు కొట్టేసింది. అదే కోర్టు 50% రిజర్వేషన్‌ సీలింగు కూడా పెట్టింది. దాన్ని ఉల్లంఘించిన, దొడ్డిదారులు వెతికిన అనేక ప్రభుత్వాలు యీ విషయంలో మాత్రం ఆ తీర్పుకి కట్టుబడి కూర్చున్నారు. 'అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు, వారి కోసం రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తున్నాం' అని ప్రతి పార్టీ అంటూనే ఉంటుంది, పార్టీ మానిఫెస్టోలో రాస్తూనే ఉంటుంది. కానీ అమలు చేయదు - ఎందుకంటే వాళ్లు ఓటు బ్యాంకుగా మారి గంపగుత్తగా ఓటేస్తారన్న నమ్మకం లేదు కాబట్టి! దానికి బదులు ప్రతి కులానికి ఓ కార్పోరేషన్‌ పెట్టి దానిలోని పేదలకు ధనసహాయం చేస్తాం అంటారు. ఓ పట్టాన కార్పోరేషన్‌ పెట్టరు, పెట్టినా నిధులివ్వరు, ఇచ్చినా వాళ్ల పార్టీ కార్యకర్తలకే సాయం చెయ్యమంటారు, ఆ కార్పోరేషన్‌ చైర్మన్‌ తను చెప్పినట్లు ఆడకపోతే నిధులు ఆపేస్తారు, అతన్ని తీసేస్తారు. ఇలా అగ్రవర్ణాల పేర ఆటలాడడం పార్టీల హక్కుగా మారింది. ఇప్పుడు మోదీ దాన్ని సీరియస్‌గా టేకప్‌ చేయడంతో గొంతులో వెలక్కాయ అడ్డుపడింది. మింగలేరు, కక్కలేరు, ఔననలేరు, కాదనలేరు.

బిసి నాయకులలో కూడా గందరగోళం ఉంది - దీన్ని కొంతమంది స్వాగతిస్తున్నారు, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. నిజానికి బిసిలు ఆనందించాలి. ఉదాహరణకి ఆంధ్రలో కాపుల్ని బిసిలుగా గుర్తిస్తే వాళ్లు బిసి కోటాలో వాటాకు వస్తారు. కాపుల్ని బిసిల్లో చేర్చి మొత్తం కోటాను 5% పెంచినా కాపుల జనాభాతో పోలిస్తే యీ 5% ఏ మూలకూ చాలదు. అగ్రవర్ణాలకూ రిజర్వేషన్‌ పెట్టేస్తే 'మమ్మల్ని బిసిలుగా గుర్తించండి' అని అడిగే అగ్రకులాలు ఆగుతాయి. బిసిల మజ్జిగ మరీ పల్చన కాకుండా ఉంటుంది. అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? అని చాలామంది అడుగుతున్నారు. బిసిల కోటా పెంచమని అడిగినప్పుడు, చాలా కులాలు కొత్తకొత్తగా బిసిల్లో చేర్చమని అడుగుతున్నపుడు కూడా యిదే ప్రశ్న రావాలిగా! ఆ ఉత్తుత్తి ఉద్యోగాల్లోనే వీళ్లకీ 10% వాటా యిస్తే కడుపునొప్పి దేనికి?

కొందరు బిసి నాయకులు ఆర్థికపరమైన రిజర్వేషన్లకు అభ్యంతరం తెలుపుతున్నారు. 'రిజర్వేషన్‌ ఫిలాసఫీకి మూలకారణం పేదరికం కాదు, సామాజిక వెనుకబాటుతనం, కావాలంటే పేదల బతుకులు బాగు చేయడానికి వేరే పథకాలు పెట్టండి కానీ రిజర్వేషన్ల జోలికి రాకండి' అంటున్నారు. సామాజిక వెనుకబాటుతనం ఒక్కటే కొలబద్ద అని ఎవరు చెప్పారు అంటే 'ఆంబేడ్కర్‌, ఆయన మాట వేదవాక్కు' అంటున్నారు. మరి ఆయన రిజర్వేషన్లు పది సంవత్సరాలు చాలన్నాడు. దశాబ్దాలుగా తీసుకుంటూనే ఉండమని చెప్పలేదు. ఆ 'వేదవాక్కు' పాటిస్తున్నారా? అబ్బే! ఎన్నాళ్లయినా కొనసాగిస్తూనే పోవాలంటారు. అందువలన ఆంబేడ్కర్‌ను దీనిలోకి తీసుకురావలసిన పని లేదు. మనమే ఆలోచించుకోవచ్చు.

రిజర్వేషన్లకు సామాజిక వెనుకబాటుతనానికి లింకు ఉందనుకుంటే, మరి యీ వెనుకబాటు తనం ఎప్పుడు పోతుంది? ఆర్థిక పరిస్థితులు కనుక కొలబద్దగా తీసుకుంటే దాన్ని కొలవడం సులభం. నీ ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్నో, శాలరీ స్లిప్పో చూస్తే నీవెంత భాగ్యవంతుడివో తెలుస్తుంది. మరి సామాజికంగా నీ స్థాయి ఎలాటిది అన్నది ఎలా కొలుస్తాం? నీకు రోజుకి ఎందరు దణ్ణాలు పెడుతున్నారనేది లెక్కలోకి తీసుకోవాలా? నీకో డబ్బో, పదవో, ఉద్యోగమో వుంటే, దాని వలన తనకు లబ్ధి కలుగుతుందనుకుంటే అవతలివాడు నమస్కారం పెడతాడు. లేకపోతే నువ్వు గవర్నరువైనా పట్టించుకోడు, పలకరించినా తప్పించుకుని పోతాడు. వెంటనే 'నాకు సామాజిక గౌరవం లేదు, నాతో బాటు మొత్తం మా కులానికి లేదు, అందువలన మాకు రిజర్వేషన్‌ సౌకర్యం కొనసాగించాలి, లేదా కొత్తగా కల్పించాలి' అంటూ ఆందోళనకు దిగుతావా? సరే, రిజర్వేషన్‌ కల్పించారు, నీకో ఉద్యోగం వచ్చింది, దానితో నీ కులమంతా సామాజికంగా ఎదిగిపోయిందా?

నిజానికి సామాజిక గౌరవమనేది వ్యక్తిగతం. కులం మొత్తానికి ఆపాదించడం కుదరదు. ఓ బ్రాహ్మల కుర్రాడు ఆఫీసులో బాయ్‌గా పని చేస్తూ ఉంటే 'ఒరేయ్‌' అని పిలవకుండా, నమస్కారాలెడతావా? ఓ షెడ్యూల్‌ కులాల వ్యక్తి కలక్టరైతే 'సార్‌, సార్‌' అంటూ దణ్ణాలు పెట్టవా? ఒక ధనవంతుడైన బిసి వ్యక్తి దగ్గరకు ఉద్యోగం గురించి వెళితే వంగి వంగి వినయంగా మాట్లాడవా? ఏ కులంలో పుట్టినా మర్యాద పొందేవాడు పొందుతూనే వుంటాడు, పొందే అర్హత లేనివాడు పొందలేడు. ఆ మర్యాద కూడా కొందరి దగ్గరే లభిస్తుంది. ఒక పెద్ద ప్రొఫెసరుకి తన విద్యార్థుల నుండి గౌరవం లభిస్తుంది కానీ కూరగాయలమ్మేవాడి దగ్గర లభించదు. బేరమాడితే చాలు, నువ్వు ఎంత అగ్రవర్ణస్తుడివైనా, ఎంత పండితుడివైనా 'పోవయ్యా, కొన్నావులే మహా' అనేస్తాడు వాడు. 

హరిజన నాయకుడిగా ఎదిగిన జగ్‌జీవన్‌ రామ్‌ గార్ని షెడ్యూల్‌ కులాల రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగాలి అంటే అగ్రవర్ణాల అహంకారం దిగేంతవరకు.. అన్నాడు. 'ఒక బ్రాహ్మణ వంటవాడు తను హరిజన కలక్టరు కంటె గొప్పవాణ్నని అనుకుంటాడు. ఆ భావం పోయేంతవరకు యీ రిజర్వేషన్లు తప్పవు' అన్నాడు. నన్నడిగితే ఆ భావం ఎన్నటికీ పోదు. బ్రాహ్మడనే కాదు, ఏ కులంవాడికైనా సరే, తమ కులం యితర కులాల కంటె గొప్పదనే ఫీలింగు  సహజంగా ఉంటుంది. అది అవతలివాళ్లకు అర్థం కాదు. శూద్రుల్లో ఎక్కువతక్కువ లేమిటి అని ద్విజులు ఆశ్చర్యపడతారు. వ్యవసాయం వృత్తిగా ఉన్న కులాల మధ్య అంతరాలెందుకు? ఆచారాలు, అలవాట్లు అన్నీ ఒకటే కదా అనుకుంటారు. కానీ కమ్మ, కాపు, రెడ్డి ఎవరికి వారే, యితరుల కంటె మా కులం గొప్పదనుకుంటారు. మళ్లీ వాటిల్లో ఉపకులాలుంటాయి. ఎవరికి వారే గొప్ప, తక్కిన శాఖల వాళ్లను పెళ్లి చేసుకుంటానంటే కుటుంబసభ్యులు వారిస్తారు. 

హరిజనులందరూ ఒకేలా అవస్థలు పడుతున్నవారు, వాళ్లలో తేడాలేముంటాయి అనుకుంటారు తక్కినవారు. కానీ మాదిగ లంటే మాలలకు చిన్నచూపు, మాదిగలకు మరొకరంటే చిన్నచూపు.. యిలా తేడాలుంటాయి. వాళ్లల్లో వాళ్లకు ఘర్షణలు జరుగుతూంటాయి. దీనికి కారణం - నేను పుట్టిన కులం, శాఖ, కుటుంబం గొప్పది అని ప్రతీవాడు అనుకోవడమే! తక్కినవాళ్లు తమ కంటె తక్కువ అనుకోకుండా యిలా అనుకుని ఊరుకోవడమే మంచిది. ఎందుకంటే అప్పుడు 'నా కులం వెనకబడినది, నాకు సామాజిక గౌరవం లేదు, ఎదుట పడినప్పుడు నవ్వుతూ మాట్లాడినా నా వీపు వెనకాల నన్ను అందరూ ఛీత్కరిస్తున్నారు' అనే ఆత్మన్యూనతా భావానికి లోను కారు. 

మనలో మన మాటగా చెప్పుకోవాలంటే యీ న్యూనతాభావం ఎవడికీ ఉండదు. అందరూ 'వాడంతటి వాడు వాడు, నా అంతటి వాడు నేడు' అని బుడుగు భాషలో అనుకుంటారు. కానీ రిజర్వేషన్ల వద్దకు వచ్చేసరికి పైకి మాత్రం 'మాకు గౌరవం లేదు, సమాజంలో జనాలందరూ మమ్మల్ని తీసిపారేస్తారు, మమ్మల్ని ఎద్దేవా చేస్తారు' అని చెప్పుకుంటారు. కాపులనండి, పటేళ్లనండి, జాట్లనండి - వీరెవరినైనా కులపరంగా హేళన చేస్తూ మాట్లాడండి, ఊరుకుంటారా? పళ్లు రాలగొడతారు. కొట్టగల స్థాయిలో ఉన్నారు వాళ్లు. 'మేం కమ్మల కంటె తక్కువ' అని కాపులు ఒప్పుకుంటారా? కానీ రిజర్వేషన్లు అడిగేటప్పుడు మాత్రం మేం సామాజికంగా వెనకబడినవాళ్లం, గౌరవం లేనివాళ్లం అని చెప్పుకుంటున్నారు. అదీ తమాషా! వీళ్లనే కాదు, యిప్పటికే బిసి హోదా పొందుతున్న ఏ కులం వారితో నైనా యిదే పేచీ. పోనీ దశాబ్దాలుగా రిజర్వేషన్‌ సౌకర్యం పొందావు కదా, నీ సామాజిక హోదా అంగుళమైనా పెరిగిందా, నీకు ఆ సౌకర్యం తీసేయవచ్చంటావా? అని అడిగి చూడండి. 'అబ్బే ఎక్కడండీ, యింకా హీనమై పోయింది, ఇంకో 5% పెంచితే తప్ప లాభం లేదండి' అని వాపోతారు.

అంటే అర్థమేమిటి? రిజర్వేషన్ల వలన సామాజిక గౌరవం రాదన్నమాట. మరి ఆ కాడికి రిజర్వేషన్‌ ఎందుకు? రిజర్వేషన్‌కు, సామాజిక స్థాయికి లింకు లేదన్నమాట. మరి దేన్ని చూపి ఆ సౌకర్యం అడుగుతున్నావ్‌ అని అడిగే రాజకీయ నాయకుడు లేడు. 50% క్యాప్‌ను అధిగమించి బిసిల రిజర్వేషన్‌ పెంచుతాం, పెంచుతాం అనేవారే! దాంతో 'మాది వెనకడిన కులం', 'మాది యింకా వెనకబడిన కులం', 'మాది మరీ మరీ వెనకబడిన కులం', 'మాది అందరూ ఛీత్కరించుకునే కులం' అని పోటీ పడి చెప్పుకుంటున్నారు. ఆత్మగౌరవం అనే మాట దగ్గరకు రానీయటం లేదు. ఈ అగ్రవర్ణ రిజర్వేషన్‌ బిల్లు పాసయితే యీ జాడ్యం తగ్గుతుందని నా ఆశ. పుట్టిన కులాన్ని, ప్రాంతాన్ని ఆదరించకపోతే మానె, ఆమోదించడం నేర్చుకోవాలి. దాన్ని న్యూనతగా భావించి, హీనంగా మాట్లాడే ధోరణి పోవాలి. 

రిజర్వేషన్లకు, ఆర్థిక దుస్థితికి లింకు లేదని ఒవైసీయే కాదు, కొందరు బిసి నాయకులూ వాదిస్తున్నారు. రిజర్వేషన్లు అడిగే కులాల నాయకుల ప్రకటనలు గమనించండి. వాళ్లు 'మాది పేరుకి అగ్రకులమే కానీ, మాలో ఎంతోమంది కూటికి కష్టపడుతున్నారు, నిరుద్యోగంతో బాధపడుతున్నారు. పొట్టకూటి కోసం నీచమైన వృత్తులు కూడా చేపడుతున్నారు, వ్యసాయం గిట్టుబాటు కాక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు' అని చెప్పుకుంటారు. అంటే తమలో ఉన్న పేదవారిని చూపించే కదా రిజర్వేషన్లు అడుగుతున్నారు? కాలేజీల్లో కోటా యిస్తే బాగా చదువుకుని ఆర్థికంగా బాగుపడతారు, కోటాలో ఉద్యోగాలిస్తే డబ్బు సంపాదించుకుని స్థాయి పెంచుకుంటారు అనేగా వాళ్ల వాదన? దీని అర్థమేమిటి? డబ్బుతోనే సమస్య పరిష్కారమౌతుందనే వాళ్లూ చెపుతున్నారు. మరి రిజర్వేషన్లకు, ఆర్థికస్థితికి సంబంధం లేదని వీళ్లెలా అంటారు? 

కులాల పరంగా వచ్చే రిజర్వేషన్‌లలో, ఓపెన్‌ కోటాలో వెర్టికల్‌ డివిజన్‌తో ఆగకుండా ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ కోటా, మహిళల కోటా, స్పోర్ట్‌స్‌మెన్‌ కోటా, దివ్యాంగుల కోటా... ఇలా హారిజాంటల్‌ కోటా కూడా ఉంటుంది. ఆ రిజర్వేషన్‌కు సామాజిక వెనుకబాటుతనానికి సంబంధం లేదు కదా! తెలంగాణ ప్రభుత్వం ముస్లిములకు రిజర్వేషన్‌ అంటోంది. వాళ్లందరూ - నవాబుల దగ్గర్నుంచి - సామాజికంగా వెనుకబడిన వారనా? అలాగే ఆర్థికంగా వెనుకబడినవారి కోటా కూడా వచ్చి చేరుతుంది. తప్పేముంది? 

ప్రస్తుతం కులపరంగా ఉన్న రిజర్వేషన్లు చూద్దాం - కేంద్రం పరంగా 9% జనాభా ఉన్న ఎస్‌టిలకు 7.5%, 20% జనాభా ఉన్న ఎస్సీలకు 15%, ఒబిసిలకు 27%. మొత్తం 49.5%. సుప్రీం కోర్టు 50% మించకూడదని చెప్పింది. ఇప్పుడీ 10% యివ్వడంతో 59.5% దాటుతుంది. రాజ్యాంగ సవరణ చేసి ఆ అవరోధాన్ని దాటుదామని చూస్తున్నారు. ఇవన్నీ పోగా జనరల్‌కి 40.5% మిగులుతాయి. రాష్ట్ర సర్వీసుల్లో రిజర్వేషన్లు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. బిసి నాయకులు ప్రతి రాష్ట్రంలో ఉద్యమించేస్తూ ఉంటారు. పార్టీ తనకు టిక్కెట్టు యివ్వకపోతే యావన్మంది బిసిలకు అన్యాయం జరిగిందంటారు. తనకిస్తే న్యాయం జరిగిపోతుందట. ఆ తర్వాత మంత్రి పదవి యివ్వకపోయినా, బిసి కార్డు వాడతారు. హరిజనులు, మైనారిటీలు కూడా యిదే తంతు. ఈ బిసిలు సంఖ్యాపరంగా వారి కంటె ఎక్కువ కాబట్టి మరీ యాగీ చేసేవారు ఎక్కువై పోతున్నారు. 

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల గురించి పెద్దగా ఎవరూ మాట్లాడరు, వాళ్లూ పెంచమని అడగరు కానీ గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా బలపడిన బిసిలు మాత్రం రిజర్వేషన్ల గురించి తెగ యాగీ చేస్తూంటారు. బిసి ఓటు బ్యాంకు కోసం విపి సింగ్‌, మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాడు. అప్పణ్నుంచి యీ రిజర్వేషన్ల గోల ఎక్కువై పోయింది. అసలు కులపరంగా జనాభా గణన చేయందే రిజర్వేషన్లు ఎంత ఉండాలో ఎలా నిర్ణయించగలరు? కేంద్ర ప్రభుత్వాలు కావాలని ఆ కులగణన చేయటం లేదు. ఇక ఎవరి కాకి లెక్కలు వారివే! మొత్తం జనాభాలో 50% మంది బిసిలే, అయినా 27% మాత్రమే యిస్తున్నారు, యిది అన్యాయం అంటారు బిసి నాయకులు. మండల్‌ అయితే 52% అన్నాట్ట. మండల్‌ కమిషన్‌ ఎంత అస్తవ్యస్తంగా రిపోర్టు తయారుచేసిందో అప్పట్లో కథనాలు వచ్చాయి. తెలుగు బ్రాహ్మణుల్లో వైదీకులనే శాఖ వారు కూడా మండల్‌ ప్రకారం బిసిలేట! 

2011 లెక్కల ప్రకారం జనాభాలో 80% (కరక్టుగా చెప్పాలంటే 79.8%) మంది హిందువులు, 14% (కరక్టుగా చెప్పాలంటే 14.2%) ముస్లిములు, తక్కిన 6%లో క్రైస్తవులు, శిఖ్కులు, బౌద్ధులు, జైనులు, యితరులు వున్నారు). మరి బిసిలు చెప్పే 50% హిందువుల్లోనా? మొత్తం జనాభాలోనా? హిందువుల్లోనే అయితే మొత్తం జనాభాలో 40% మాత్రమే అవుతుంది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ 2007లో సర్వే చేసి బిసి 41% ఉన్నారంది. ఇది దేశం మొత్తం మీద లెక్కేస్తే వచ్చే అంకె. రాష్ట్రాల్లో అయితే వేరేవేరేగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలలో ఎస్టీలు ఎక్కువ కాబట్టి 80% వాళ్లకే రిజర్వ్‌ చేశారు. ఝార్ఖండ్‌లోనూ ఎస్టీలు ఎక్కువ కాబట్టి అక్కడ 27% రిజర్వేషన్‌, ఎస్సీలకు 11%, బిసిలకు 22%. బిసిలకు పోరాట శక్తి పెరిగింది కాబట్టి వివిధ రాష్ట్రాలలో వారి రిజర్వేషన్ల వాటా చూద్దాం. కర్ణాటకలో 32%, కేరళలో 40%, యుపిలో 27%, బిహార్‌లో 34%, మధ్యప్రదేశ్‌లో 14%, రాజస్థాన్‌లో 26%, ఆంధ్రప్రదేశ్‌లో 29%, బెంగాల్‌లో 7%! 

రిజర్వేషన్లు యిచ్చినా ఆ ఫలాలను కొన్ని బిసి కులాలే దక్కించుకుని, రాజకీయంగా బలపడడంతో వారిని దెబ్బ తీయడానికి, బిసిల్లో మోస్ట్‌ బాక్‌వర్డ్‌, స్పెషల్‌ బాక్‌వర్డ్‌ అంటూ విడగొట్టి వాళ్లకి సబ్‌ కోటాలిచ్చారు. హరియాణాలో బిసి-ఎలకు 16%, బిసి-బిలకు 11%, బిసి-స్పేషల్‌కు 10% యిచ్చారు. తమిళనాడులో అయితే బిసిలకు 20%, ఎంబిసిలకు 30%.. యిలా! ఇలా చేసి చేసి చివరకు 50% కోటా దాటేశాయి కొన్ని రాష్ట్రాలు. తమిళనాడులో 69%, ఝార్‌ఖండ్‌లో 60%, మహారాష్ట్రలో మరాఠాలకు యిచ్చిన 16% కలిపి 68%కు చేరాయి. అదేమిటంటే మా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులున్నాయంటారు. అంటే వాళ్ల సమాజం చిన్న కులాల పట్ల వివక్షత పాటించే అనాగరికమైనదని ఒప్పుకున్నట్లేనా? ఇప్పుడు కేంద్రం ఆలోచిస్తున్న 10% ఆర్థిక వెనుకబాటుతనం రిజర్వేషన్‌ను హరియాణా యిప్పటికే అమలు చేసి రిజర్వేషన్లను మొత్తం 70%కి చేర్చింది. ఈ బిల్లు తెచ్చేముందు హరియాణా ప్రయోగ ఫలితాలను వెల్లడించి వుంటే బాగుండేది.

అంత శాస్త్రీయంగా చేసే ఓపిక ఎవరికీ లేదు. మోదీకి డ్రామా అంటే యిష్టం. సినిమావాళ్లు ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కోసం తాపత్రయ పడినట్లు, ఆయనా ఊహించిన షాక్‌లు యివ్వడానికి యిష్టపడతాడు. దీనికి ముందే ప్రిపరేషన్‌ జరిగినా బయటకు పొక్కలేదు చూడండి. కొందరంటున్నట్లు రఫేల్‌ వివాదం నుంచి దృష్టి మరలించడానికి కావచ్చు, లేదా సిబిఐ అలోక్‌ వర్మ కేసులో సుప్రీం తీర్పు గురించి ఉప్పంది కావచ్చు. అందరూ దీని గురించే చర్చ జరుపుతున్నారు. దీన్ని వ్యతిరేకించలేని స్థితికి ప్రతిపక్షాలను నెట్టాడు మోదీ. ఎంతసేపూ పేదలు, పేదరైతులు, పేద కార్మికులు అని మాట్లాడే పార్టీలు పేద అగ్రవర్ణస్తులు కోసం నిలుస్తామని చెప్పుకోవడానికి దడుస్తాయి. అలా అని కులం గురించి ప్రస్తావించరా అంటే అది లేదు. బిసి, ఎస్సీ, మైనారిటీల జపం చేస్తూనే ఉంటారు. అగ్రవర్ణస్తులు మాత్రం వీళ్ల దృష్టిలో మనుషులు కారు. ఎందుకంటే వాళ్లు గంపగుత్తగా ఓట్లేయరు. వాళ్లల్లో వాళ్లే కలహించుకుంటూ ఉంటారు, వారికో నాయకుడంటూ ఉండరు, ఎవరి పిలక వారిదే. ఎవడూ యింకోడి మాట వినడు. అందువలన వాళ్లని పట్టించుకోనక్కరలేదు, యిదీ వాళ్ల లాజిక్‌. 

ఇన్నాళ్లూ యిలా నడిచింది. ఇప్పుడు మోదీ వాళ్లను పట్టించుకుంటున్నానంటే, కాదనలేరు. గతంలో బిసి రిజర్వేషన్‌ క్రెడిట్‌ విపి సింగ్‌ కొట్టేసినట్లు యీ అగ్రవర్ణాల కోటా క్రెడిట్‌ మొత్తం మోదీకి పోతుందన్న ఉక్రోషం ఆపుకోలేరు. అందువలన సన్నాయినొక్కులు నొక్కుతారు. చూడాలి ఏమవుతుందో. టిడిపి చూడబోతే మా కాపు రిజర్వేషన్‌ ప్రతిపాదన పక్కన పెట్టేశారనే మాట్లాడుతోంది తప్ప అసలు విషయంపై స్పందన చెప్పటం లేదు.   కాపు రిజర్వేషన్‌ల గురించి కమిషన్‌ వేయడంలో ఆలస్యం చేయమని, ఆ నివేదికను పట్టించుకోవద్దని, కాపు కార్పోరేషన్‌ ఓ పట్టాన పెట్టవద్దని, దానికి నిధులు యివ్వవద్దనీ మోదీ చెప్పాడా? యుపిలో తమ కూటమిని దెబ్బ తీయడానికి మోదీ బిసిలను ఉపకులాలుగా విడదీస్తాడని, దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఎస్పీ, బియస్పీలు ఆలోచిస్తూ ఉన్నాయి కానీ అగ్రవర్ణాలను కన్సాలిడేట్‌ను చేస్తాడని ఊహించలేదు. మాయావతి గతంలో దీన్ని మానిఫెస్టోలో పెట్టింది కాబట్టి స్వాగతించక తప్పలేదు. 

ఇక దీనిపై నా వ్యక్తిగత అభిప్రాయానికి వస్తే, రిజర్వేషన్లు అంటూ పెడితే వాటి దుర్వినియోగం తప్పదు. హరిజనుల పేర ఆ సౌకర్యం పొందేవారిలో దొంగ సర్టిఫికెట్లతో పొందినవారి సంఖ్య గణనీయంగా ఉందని వార్తలు వస్తూ ఉంటాయి. వేముల రోహిత్‌ విషయమే చూడండి, ఇంటర్‌ వరకు బిసి, డిగ్రీకి వచ్చేసరికి ఎస్సీ. ఆ సర్టిఫికెట్టు ఎలా సంపాదించాడు? లోపభూయిష్టమైన వ్యవస్థలో ఏదైనా సాధ్యమే. నా చిన్నప్పుడే విన్నాను - ఓ రెడ్డి తన కులం సర్టిఫికెట్టులో 'కొండ' అని చేర్పించుకుని, ఎస్టీ కోటాలో మెడిసిన్‌ సీటు సంపాదించాడని. అలాగే బిసిల కోటా కూడా దుర్వినియోగం అవుతూనే ఉంటుంది. ఇక ఆర్థికపరమైన సర్టిఫికెట్టు విషయంలో ఎంతైనా గోల్‌మాల్‌ చేయవచ్చు. ప్రభుత్వోద్యోగుల విషయంలో తప్ప, యిన్‌కమ్‌టాక్స్‌ చెల్లించేవారి విషయంలో తప్ప తక్కిన వారి విషయంలో వచ్చే ఆదాయాన్ని తక్కువగా వేసి చూపవచ్చు. రైతుల, వ్యాపారస్తుల ఆదాయాన్ని నిర్ధారించడం చాలా కష్టం. ఓ ఏడాది రావచ్చు, మరో ఏడాది పోవచ్చు. ఇన్ని యిబ్బందులు ఉన్నా కనీసం 25% మందైనా నిజమైన పేదలు ప్రయోజనం పొందుతారని ఆశించాలంతే!

ఈ బోగస్‌ రిజర్వేషన్లే కాదు, అసలైన రిజర్వేషన్ల మీద కూడా అగ్రవర్ణాల వారికి ఓ రకమైన మంట ఉంది. తమకు అడ్డు రానంతవరకు ఎస్సీ, బిసిలపై సానుభూతి వుంటుంది. కానీ ఎప్పుడైతే తన కంటె తక్కువ టాలెంట్‌ ఉన్నవాడు కాలేజీ సీటో, ఉద్యోగమో కులం పేరుతో ఎగరేసుకుని పోయాడో అప్పణ్నుంచి కడుపుమంట ప్రారంభమౌతుంది. ఇక ప్రమోషన్ల విషయంలో ఆ కోటా కారణంగా జూనియర్‌ వచ్చి నెత్తి మీద కూర్చుంటే పెరుగుతుంది. ఎస్సీల విషయంలో చాలా శతాబ్దాల పాటు అన్యాయం జరిగిందన్న సానుభూతైనా ఉంది. బిసిలకు ఏం తక్కువ వచ్చిందని, రిజర్వేషన్లు? అనే భావం సాధారణ అగ్రవర్ణాలలో ఉంది. ఎస్సీలలో కూడా ఏ చెప్పులు కుట్టేవాడి కొడుకో లబ్ధి పొందాడంటే సరేలే అనుకుని ఊరుకుంటారు కానీ, ఐయేఎస్‌ ఆఫీసరు కొడుకు కూడా యీ కోటాలో లబ్ధి పొందితే మనసు చివుక్కుమంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ వేధింపు చట్టం ఎన్నో సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది.  తమను అదుపు చేయబోయిన వాళ్లపై ఎస్సీ ఉద్యోగులు ఉత్తుత్తి కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూసి సుప్రీం కోర్టు దాన్ని కాస్త సరిదిద్దబోతే ఎన్డీఏలోని ఎస్సీ నాయకుడు బిజెపిని బ్లాక్‌మెయిల్‌ చేయడం చూసిన అగ్రవర్ణాలకు మరీ మండింది. ఇప్పుడు తమలో పేదలకు లబ్ధి పొందుతున్నారంటే ఆ కోపం కాస్త చల్లారవచ్చు. అది సామాజిక సామరస్యానికి దోహదపడుతుంది. 

పేదరికానికి ప్రభుత్వం యిచ్చిన నిర్వచనం గమ్మత్తుగా ఉంది. ఏడాదికి 8 లక్షల రూ.ల ఆదాయం తక్కువేమీ కాదు. ఈ ఆదాయంతో నగరంలో ఒకలా బతికితే, పట్టణంలో అంతకంటె మెరుగ్గా, పల్లెలో అయితే యింకా మెరుగ్గా బతకవచ్చు. అలాగే అయిదెకరాల భూమి అంటే ఎన్ని పంటలు పండేది? ఏ పంట పండేది? వెయ్యి చ.అ.ల యిల్లు నగరంలో అయితే ఓ స్థాయి, పట్టణంలో, పల్లెలో అయితే మరో స్థాయి. బిసిలకు 8 లక్షలు క్రీమీ లేయరు పరిమితిగా పెట్టారు కాబట్టి, వీళ్లకూ అదే పెట్టారు. నిజానికి దారిద్య్రరేఖ ఎంత ఉంది? 2017లో రోజుకి 32 రూ.ల ఆదాయం వచ్చేవాడు పేద అన్నారు. అంటే ఏడాదికి రూ.11,680. నలుగురు సభ్యులున్న కుటుంబంలో నలుగురూ సంపాదిస్తే ఏడాదికి  46,720, పోనీ 50 వేలు వస్తుంది. 50 వేలు వచ్చేవాళ్లు పేదవాళ్లయితే 8 లక్షల వార్షికాదాయం అంటే వాళ్ల కంటె 16 రెట్లు మెరుగ్గా ఉన్నారన్నమాట. నిజమైన పేదలు అంటే ఆ 50 వేల రేఖకు దగ్గర్లో వుండాలి తప్ప దానికి ఎంతో ఎత్తున ఉండకూడదు. ఉంటే వాళ్లకు సహజంగా పలుకుబడి ఉండి, వాళ్లే ఆ బెనిఫిట్స్‌ కొట్టేస్తారు.

ఈ పరిమితిని బాగా తగ్గించి, అచ్చమైన పేదలకు ఫలాలు అందేట్లా చేస్తే మంచిదే. కానీ యిదే పరిమితి తమకూ పెడతారేమోనని ధనిక బిసిలు ఆందోళన చెంది, ఆందోళనలు చేపట్టవచ్చు. చూదాం, ఏమవుతుందో, అంతిమంగా కోర్టు ఏమంటుందో!
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)