Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - MBS

ఎమ్బీయస్: జిఎస్టీ చెప్పే మిస్టరీ కథ

ఎమ్బీయస్: జిఎస్టీ చెప్పే మిస్టరీ కథ

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2022 ఏప్రిల్ నెలలో వచ్చిన జిఎస్టీ కలక్షన్స్‌ యివి అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మే1న విడుదల చేసిన ఒక ప్రెస్ రిలీజు చూస్తే రాష్ట్రాల స్థితిగతుల గురించి కొంత అవగాహన వచ్చింది. అదే సమయంలో కొన్ని సందేహాలూ మెదిలాయి. ముందుగా అంకెలు - ఏప్రిల్ 2022లో గ్రాస్ జిఎస్టీ రివెన్యూ రూ.1.67,540 కోట్లు. దానిలో సిజిఎస్టీ రూ.33,159 కోట్లు, స్టేట్‌జిఎస్టీ రూ.41,793 కోట్లు. ఐజిఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) రూ.81,939 కోట్లు. (దీనిలో వస్తువుల దిగుమతిపై వసూలు చేసినది రూ.36,705 కోట్ల) సెస్ రూ.10,649 (దీనిలో దిగుమతులపై వసూలు చేసినది రూ. 857 కోట్లు). 2022 మార్చిలో వసూలైన రూ. 1,42,095 కోట్ల కంటె యిది రూ.25 వేల కోట్లు ఎక్కువ.

దేశంలో అన్ని రాష్ట్రాలు, యుటిల కంటె అత్యధికంగా జిఎస్టీ వసూలవుతున్న రాష్ట్రం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న మహారాష్ట్ర, 2021 మార్చి 31 నాటికి 27.5 వేల కోట్లు. అతి తక్కువ వసూలవుతున్నది లక్షద్వీప్ 3 కోట్లు! మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా వసూలవుతున్నది సర్వీసెస్ సెక్టార్‌లో ఎంతో ముందంజ వేసిన కర్ణాటక 11.8 వేల కోట్లు! ఆ తర్వాతి స్థానం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన గుజరాత్ 11.3 వేల కోట్లు. పరిశ్రమలు, సేవలు రెండూ ఉన్న తమిళనాడు 9.7 వేల కోట్లతో 4వ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలు కలిసి వుండి వుంటే రూ.9 వేల కోట్లతో 5వ స్థానంలో ఉండేది. కానీ విడిపోయాం కాబట్టి వెనకపడి పోయాం. ఇలా తొలి 4, 5 స్థానాలు దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలవే. 24 కోట్ల జనాభా ఉండి, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన రాష్ట్రం కదాని దిల్లీ పాలకులు నెత్తిన పెట్టుకునే ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చినది 8.5 వేల కోట్లు మాత్రమే. దానిపై ఖర్చవుతున్నదానితో పోలిస్తే యిది ఎన్నో వంతో లెక్క వేయాలి.

చిన్న రాష్ట్రమైన ఎంతో అభివృద్ధి చెందిన హరియాణా 8.2వేల కోట్లతో 6 వస్థానంలో ఉంది. ఎంతో చిన్న అర్ధరాష్ట్రమైనా, పరిశ్రమలు పెద్దగా లేకపోయినా, సేవారంగం వలన కాబోలు దిల్లీ 5.9 వేల కోట్లతో 7వ స్థానంలో ఉంది. ఎంతో పెద్ద రాష్ట్రమైనా, ఒకప్పుడు పారిశ్రామికంగా ప్రముఖస్థానంలో ఉండి, ఆందోళనల కారణంగా వెనకపడిపోయిన బెంగాల్ 5.6వేల కోట్లతో 8వ స్థానంలో ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా, రెండు రాష్ట్రాల వనరులన్నీ ఒకే చోట పెట్టడం చేత సర్వతోముఖాభివృద్ధి చెందిన హైదరాబాదు ఉన్న కారణంగా తెలంగాణ 5 వేల కోట్లతో 9వ స్థానంలో ఉంది. కొన్ని పరామితుల్లో వెనకపడినదిగా పేరుబడినా, కొన్నేళ్లగా స్థిరమైన అభివృద్ధి సాధిస్తూన్న ఒడిశా 4.9 వేల కోట్లతో 10వ స్థానంలో ఉంది.

ఈ 10 రాష్ట్రాలలో 4 బిజెపి పాలిత రాష్ట్రాలు కాగా, 6 ప్రతిపక్షాల పాలనలో నడుస్తున్నవి. గత సంవత్సరంతో పోలిస్తే యివి ఏ మేరకు అభివృద్ధి సాధించాయి అనేది కూడా గమనిస్తే మనకు పరిపాలనా సామర్థ్యం పట్ల ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే కట్టే ఆదాయపు పన్ను బట్టి ఒక వ్యక్తి ఆర్థికస్థితి గురించి ఒక ఐడియా వచ్చినట్లే అలాగే జిఎస్టీ అంకెల బట్టి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, సేవారంగం, వాణిజ్య కార్యకలాపాల గురించి ఒక ఐడియా వస్తుంది. అది ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్థికపుష్టి ఉన్న రాష్ట్రమన్నమాట. ఏడాదిలో ఏ మేరకు పెరిగిందో తెలుసుకుంటే, రాష్ట్రప్రభుత్వం పరిశ్రమలను, వ్యాపారాన్ని, సేవారంగాన్ని ఎలా ప్రోత్సహించిందో తెలుస్తుంది. బిజెపి పాలిత రాష్ట్రాలైన కర్ణాటక (19%), గుజరాత్ (17%), హరియాణా (23%), ఉత్తర ప్రదేశ్ (16%)లలో సగటున 18.8% అభివృద్ధి ఉంది. ప్రతిపక్షపాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర (25%), తమిళనాడు (10%), దిల్లీ (16%), బెంగాల్ (8%), తెలంగాణ (16%), ఒడిశా (28%)లలో సగటున 17% అభివృద్ధి ఉంది.

అభివృద్ధి రేటు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 20% కంటె ఎక్కువ అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల గురించి చెప్తాను. అరుణాచల ప్రదేశ్ 90% (గత ఏడాది 103 కోట్లు, ఈ యేడాది 196 కోట్లు), అండమాన్ నికోబార్ 44% (31-47), ఉత్తరాఖండ్ 33% (1422-1887), నాగాలాండ్ 32% (52-68), దాద్రా నాగర్ హవేలీ 30% (292-381), ఒడిశా 28% (2849-4910), మహారాష్ట్ర 25% (22013-27495), హరియాణా 23% (6658-8197), ఆంధ్ర 22% (3345-4067), చండీగఢ్ 22% (203-249), పుదుచ్చేరి 21% (169-206).

ఇక్కడ మరో విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చిన్న స్థాయిలో ఉన్నవాటిలో ఎదుగుదల అంకెలు గొప్పగా కనబడతాయి. ఒక స్కూల్లో యిద్దరు విద్యార్థులుంటే వచ్చే ఏడాది వారి సంఖ్య నాలుగైతే 200% అభివృద్ధి కనబడుతుంది. అదే వెయ్యిమంది విద్యార్థులున్న స్కూలులో 200 మంది కొత్తగా వచ్చి చేరితే 20% అభివృద్ధి మాత్రమే కనబడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ఉదాహరణలను దీనితో పోల్చవచ్చు. వెయ్యి కోట్ల రూ.ల లోపు రాష్ట్రాలను, యుటిలను పక్కన పెట్టి మనం లెక్కవేసి చూస్తే ఉత్తరాఖండ్ 33%, ఒడిశా 28%, మహారాష్ట్ర 25%, హరియాణా 23%, ఆంధ్ర 22%.. మొత్తం 5 మాత్రం కనబడతాయి. వీటిలో రెండు బిజెపి పాలితాలు, మూడు ప్రతిపక్ష పాలితాలు.

ఈ అంకెలు చూస్తూంటే మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి కంటికి కనబడుతుంది. ఆంధ్ర పరిస్థితి మరీ అంత అధ్వాన్నంగా లేదు. జిఎస్టీ వసూళ్లలో మొత్తం 39టిలో దాని స్థానం 13. ఆంధ్రజ్యోతి చదివినా, ఎబిఎన్, టివి5 చూసినా ఆంధ్ర అన్ని విధాలా సర్వనాశనమై పోతోందన్న ఫీలింగు కలుగుతుంది. కొత్త పరిశ్రమలు రావు, పాతవి తరలి వెళ్లిపోతున్నాయి, వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు, చేతిపనివారు, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఎవరి వ్యవహారాలు వాళ్లు చేసుకోవడానికి వీల్లేకుండా వైసిపి గూండాలు వీరవిహారం చేస్తున్నారు అని ప్రతీ సాయంత్రం మూడు గంటల పాటు, ఒకే ప్యానెల్‌ను పెట్టుకుని వాయించేస్తూ ఉంటారు. ప్రపంచపటంలో ఆంధ్ర తప్ప మరో ప్రాంతమే లేనట్లు, దాని గురించి అనునిత్యం దూషణపర్వం నిర్వహిస్తూంటారు. ఈ పనిని ‘‘ఈనాడు’’ కాస్త సుతారంగా నిర్వహిస్తుంది. తాము చెప్పదలచినది టిడిపి నాయకులు అన్నట్లో, విశ్లేషకులు వ్యాఖ్యానించినట్లో కలరింగు యిస్తుంది. ఒక్కోసారి ఎడిటోరియల్‌ కూడా రాసేసి డైరక్టుగా విమర్శిస్తుంది.

ఈ ఎల్లో మీడియా హడావుడి చూస్తూంటే జగన్ ఆంధ్రను తగలేస్తున్న తీరు ఎంత ఘోరంగా ఉందంటే చంద్రబాబు వంటి ఉద్దండుడు మళ్లీ సిఎం అయినా (అయితీరతానని ఆయన మొన్న కూడా ప్రజలకు హామీని, అధికారులకు హెచ్చరికను జారీ చేశారు) పరిస్థితి చక్కదిద్దలేడేమోనన్న భయం వేస్తుంది. ఆంధ్ర ప్రజలపై జాలి వేస్తుంది, జగన్‌ను అఖండ మెజారిటీతో గెలిపించినందుకు ఆ మాత్రం శాస్తి జరగాల్సిందే అని శాపనార్థాలు పెట్టేవాళ్లను తప్పిస్తే, మామూలువాళ్లకు వాళ్లపై బెంగ కలుగుతుంది. కానీ యీ అంకెలు చూస్తే ఆంధ్రలో యాక్టివిటీ ఏ మాత్రం తక్కువ స్థాయిలో లేదని అర్థమౌతుంది. దానికి ఒక పెద్ద నగరమైనా లేదు, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతమది. మొత్తం 13 జిల్లాల్లో (జిల్లాలు చీల్చేందుకు ముందున్న లెక్క) సగం కంటె ఎక్కువగా 7 జిల్లాలు అన్ని విధాలా వెనకబడినవని కేంద్రమే ఒప్పుకున్న రాష్ట్రమది. మరి అలాటి రాష్ట్రంలో జిఎస్టీ కలక్షన్లు యీ మేరకు ఉన్నాయంటే పరిశ్రమలు, వాణిజ్యవ్యాపారాలు, సేవారంగమూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నట్లే కదా!

ఈ మాట అనుకుంటూండగానే కెటియార్ కితం వారం రియల్ ఎస్టేటు వ్యాపారస్తుల క్రెడాయ్ సమావేశంలో ఆంధ్ర గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. ‘ఆంధ్రకు వెళ్లివచ్చిన మిత్రులు చెప్పారు, అక్కడ కరంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు తుక్కుతుక్కు అయిపోయి ఉన్నాయి, హైదరాబాదుకి తిరిగి వచ్చాకనే ప్రాణం కుదుటపడింది అన్నారు. అలా పక్క రాష్ట్రానికి వెళ్లి వస్తేనే హైదరాబాదు ఎంతటి స్వర్గధామమో తెలుస్తుంది’ అని వాక్రుచ్చారు కెటియార్. ఇది వినగానే వైసిపి మంత్రులు అతనిపై విరుచుకుపడ్డారు. లేకపోతే జగన్ వాళ్లను విరుచుకుని తింటాడు.

ఆంధ్రలో ప్రస్తుతం విద్యుత్ కొరత నడుస్తోందన్నది వేసవిలో ఎండ ఉంటుందన్నంత వాస్తవం. పైన చెప్పిన ఛానెల్స్ చూసినా, పేపర్లు చదివినా ఆంధ్ర ఒక్కదానిలోనే విద్యుత్ కొరత ఉన్నట్లు అనిపించడం ఖాయం. దేశంలో బొగ్గు కొరత వచ్చిపడిందన్నది బొగ్గు రంగు నలుపన్నంత నిజం. సంగతి తెలుసుకుంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు దానికి కారణం అని అర్థమౌతుంది. కేంద్రం పర్యావరణాన్ని కాపాడడానికి అంటూ బొగ్గు ఆధారిత విద్యుత్ వాడకాన్ని తగ్గించడానికి చూస్తోంది కానీ తగిన ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోలేదు. బొగ్గుపై వేసే క్లీన్ ఎనర్జీ సెస్‌ను టన్నుకు రూ.50 ఉంటే 2017లో దాన్ని 8 రెట్లకు, అంటే రూ.400కు పెంచారు. దీనివలన తెలంగాణా రాష్ట్రం వేల కోట్ల నష్టపోతోందని కెసియార్ యీ ఫిబ్రవరిలో గళమెత్తారు.

అంతేకాదు, ‘చౌక విద్యుత్ యిస్తున్నామంటూ ప్రధాని చెప్తూంటారు. కానీ వాస్తవానికి జరుగుతున్నదేమిటంటే ఖరీదైన సోలార్ పవర్‌ను కొనమని రాష్ట్రాలను ఒత్తిడి చేస్తున్నారు. థర్మల్ ప్రాజెక్టులకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తగ్గించడానికై వీటిని కొని తీరాలట. ఆ పవర్ ఉత్పత్తి చేసే కంపెనీలు బిజెపికి విరాళాలిచ్చే కంపెనీలు.’ అని కూడా ఆరోపించారు.  చంద్రబాబు హయాంలో కేంద్రంలోని బిజెపి అలాగే ఆంధ్ర ప్రభుత్వం చేత హెచ్చు ధరకు కొనిపించింది. అది కూడా పాతికేళ్లకు అగ్రిమెంట్లు రాయించింది. జగన్ వచ్చీ రాగానే ‘రోజురోజుకి టెక్నాలజీ మారిపోతూ, నానాటికి చౌక ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తున్న యీ రోజుల్లో 25 ఏళ్ల ఎగ్రిమెంట్లు రాసుకోవడంలో మతలబు ఉంది’ అని వాదించి వాటిని రద్దు చేయించబోతే కేంద్రం ఒప్పుకోలేదు, అడ్డుపడింది. అంత ఖరీదు పెట్టలేక ఆంధ్ర సౌరవిద్యుత్తును అవసరమైనంత కొంటోందో లేదో తెలియదు.

బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లను నిర్లక్ష్యం చేయడంతో, బొగ్గు సేకరణ తగ్గిపోయింది. దాంతో హఠాత్తుగా బొగ్గు కొరత దేశాన్ని ముంచెత్తింది. దేశంలో 173 థర్మల్ పవర్ ప్లాంట్లుంటే ఏప్రిల్ 18నాటికి మొత్తం 101 థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు 25% కంటె తక్కువకు పడిపోయాయి. ఇలా అయితే వాటిని క్రిటికల్ స్థాయికి చేరాయని అంటారు. వాటిలో సగం ప్లాంట్లలో నిలువలు 10% కంటె తక్కువగా ఉన్నాయి. అంటే క్రిటికలాతి క్రిటకిల్ అన్నమాట. దీని కారణంగా విద్యుత్ ఉత్పాదన తగ్గిపోయి, అవి విద్యుత్ సప్లయి చేసే అనేక రాష్ట్రాలలో కరంటు కొరత ఏర్పడింది. వాటిలో ఆంధ్ర, ఝార్‌ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బిహార్, గోవా, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. సప్లయి తక్కువ కావడంతో, వేసవి కాబట్టి డిమాండు పెరగడంతో ఆ రాష్ట్రాలు కోతలు విధించడం ప్రారంభించాయి. దేశం మొత్తంలో ఔటేజి (విద్యుత్ కోత) 6000 మెగావాట్లకు పై బడి ఏప్రిల్ 18 లోపున 6 రోజుల పాటు ఉంది.

ఆంధ్ర పరిస్థితి ఏమిటంటే సప్లయి షార్టేజి ఏప్రిల్ 6న, 12న 11% ఉంది. అంటే డిమాండు (కావలసినది) కంటె 11% తక్కువ లభ్యమైందన్నమాట. ఏప్రిల్ 7, 13, 17, 18న 10% ఉంది. ఏప్రిల్ 14,15,16లలో 9% ఉంది. ఝార్‌ఖండ్ మరీ యిబ్బంది పడుతోంది. ఏప్రిల్ 17న ఏకంగా 17% షార్టేజి, 12న 14%, 7న 11, 1న, 5న 10%. రాష్ట్రాటన్నిటిలో వ(ర)స్ట్ ఎఫెక్టెడ్ మాత్రం ఆంధ్రే. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు సగటు తీసుకుంటే 7.4% కోతలున్నాయి. ఝార్‌ఖండ్‌లో 6.7%, ఉత్తరాఖండ్‌లో 3.7%, మధ్యప్రదేశ్‌లో 2.1%. ఇక్కడ ఆ యా రాష్ట్ర ప్రజల జీవనవిధానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆంధ్ర ప్రజలు యిళ్లల్లో విలాస వస్తువులు ఎక్కువ పెట్టుకోవడం, షాపుల ముందు దీపాలంకరణలు కారణంగా డిమాండు, దాన్ని బట్టి కొరత పెరగవచ్చు. అదే ఝార్‌ఖండ్ అయితే ఎసిలు, ఫ్రిజ్‌లు ఉన్న యిళ్లు తక్కువ వుండవచ్చు. ఏప్రిల్ 18 తర్వాతి గణాంకాలు నా దగ్గర లేవు. కానీ యిచ్చిన అంకెల వలన మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది.

బొగ్గు సరఫరా మేనేజ్ చేయడంలో కేంద్ర మంత్రిత్వశాఖ వైఫల్యం కారణంగా దేశమంతా విద్యుత్ కొరతతో అల్లాడుతోందన్నది నిజమే అయినా, ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలలో పక్క రాష్ట్రాల నుంచి కొనైనా విద్యుత్ సప్లయికి అంతరాయం లేకుండా చూస్తున్నారు. ఆంధ్రలో అంతరాయానికి అంతరాయం లేకుండా చూస్తున్నారు! ఎందుకలా అంటే ఇంత డిమాండు ఉంటుందని ఊహించలేకపోయాం అంటున్నారు అధికారులు. గత నెలలో తిరుమలలో కూడా యిలాగే భక్తులు నానా అవస్థా పడ్డారు. ఏర్పాట్లు యిలా అఘోరించాయేం అని అడిగితే ‘ఇంత రద్దీని ఊహించలేదు’ అన్నారు తితిదే అధికారులు, పాలకమండలి. ఇదెక్కడి సమాధానం? మీరు ఉన్నదెందుకు? ఇలాటివి ఊహించి ముందస్తుగా ప్లాను చేయడానికేగా!

ఇది అధికారగణం వైఫల్యం అని అనుకుని ఊరుకోవడానికి లేదు. దానికి అధిపతి ఎవరో వాళ్లను తప్పు పట్టాలి. అధిపతి అంటే ముఖ్యమంత్రే. ఆయనకు ఎంతమంది సలహాదారులున్నారు? వారిలో ఎవరాయనకు చచ్చు సలహాలు యిస్తున్నారు అనేది ప్రజలకు పట్టని విషయం. ‘ద బక్ స్టాప్స్ హియర్’ అన్నట్లుగా పాలనలో తప్పొప్పులకు ముఖ్యమంత్రే జవాబుదారీ. పాలన బాగుంటే అతన్ని తిరిగి గెలిపిస్తారు, లేకపోతే ఛీత్కరించి యింటికి పంపిస్తారు. బాగుంటే నా ఘనత, లేకపోతే అధికారుల తప్పు అనడం ఒప్పదు. నిర్వహణ చేతకాలేదు, భవిష్యత్తులో యిలాటివి జరగకుండా చూసుకుంటాను అని బహిరంగంగా ఒప్పుకోవడం సవ్యమైన పని. ముఖ్యమంత్రి అలా ఒప్పుకున్నంత మాత్రాన ఎవరి యింట్లోనైనా బల్బు వెలుగుతుందా? వాడి జీవితంలో చీకటి పారిపోతుందా? అని మనం తార్కికంగా ప్రశ్నించవచ్చు. కానీ వచ్చే ఏడాదైనా వెలుతురు ఉంటుంది కదాని ఊరడిల్లుతాడు సామాన్యుడు.

అన్నిటికీ విద్యుతే ఆధారం. మోటారు తిరగకపోతే నీళ్లు రావు, నిర్మాణ కార్యక్రమాలకూ విఘాతం కలుగుతుంది. అందువలన నీళ్లు, రోడ్లు కూడా బాగోపోవడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ విలేకరి ఎవరైనా వ్యాఖ్యానిస్తే బాగానే ఉంటుంది. కానీ కెటియార్ అనడం వైసిపి వాళ్లనే కాదు, తటస్థులందరినీ బాధిస్తుంది. కామధేనువు లాటి హైదరాబాదును చేజిక్కించుకుని, ఆంధ్రులను రిక్తహస్తాలతో తన్ని తరిమేసి, పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కులను రాజకీయ తంత్రంతో ఆంధ్రులకు లేకుండా చేసి, యిప్పుడిలా ఎద్దేవా చేయడం ఒళ్లు మండిస్తుంది. టిడిపి, కాంగ్రెసుల పాలనలో ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల ఆదాయాన్ని హైదరాబాదుకి తరలించి, అక్కడ వందలాది సంస్థలను పెడితే, యిప్పుడీ తెరాస వచ్చి చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమించినట్లు ఆక్రమించి, ప్రతి సంస్థకు ‘ఎపి’ తీసేసి ‘టిఎస్’ పెట్టి అంతా తమ ప్రజ్ఞగా చెప్పుకుంటూంటే చూడడానికి దుస్సహంగా ఉంది.

ఆర్టీసీ మొదలుకుని అనేక సంస్థల విషయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినా ఆదాయంతో హెడాఫీసు హైదరాబాదులో ఉంది కదాని అక్కడ పెద్ద కార్యాలయాలు కడితే వాటిలో ఆంధ్రజిల్లాల వాటాకు రావలసినవి కూడా యివ్వకుండా తొక్కిపెట్టి నాటకాలాడుతున్నది యీ తెరాసే. తెలుగు అకాడమీలో ఆంధ్రకు రావలసిన వాటా రూ.62 కోట్ల వాటా కూడా యివ్వకుండా ఎనిమిదేళ్లగా తాత్సారం చేస్తూ ఉంటే గత వారమే కోర్టు గట్టిగా చివాట్లేసి, వడ్డీతో సహా తిరిగి యిమ్మనమంది. ఇలా ఆంధ్రను ఓ పక్క కేంద్రం, మరో పక్క తెలంగాణ యివ్వవలసినవి యివ్వకుండా ఏడిపిస్తూ ఉంటే అక్కడ ఏ సౌకర్యాలుంటాయి? ఇవ్వకపోగా వేళాకోళాలొకటా? విద్యుత్ కొరత గురించి ఎకసెక్కాలాడుతున్నారు కానీ బయట నుంచి కొనకుండా మీరు ఉత్పత్తి చేసి చూపించి, చూడు మా తడాఖా అని వుంటే బాగుండేది.

హైదరాబాదులో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో బెదురుతున్న రియల్ ఎస్టేటు వాళ్లు ఆంధ్రకు ఎక్కడ వెళతారో అన్న భయంతో కాబోలు కెటియార్ ఆంధ్రనే దిగజార్చారు. కానీ ఆంధ్ర పరిస్థితి నిజంగా అంత ఘోరంగా ఉందా? అక్కడ ఏమీ జరగటమే లేదా? జిఎస్టీ అంకెలు చూస్తే అలా అనిపించటం లేదా? పోనీ హైదరాబాదును లాగేసుకున్న తెలంగాణతో పోల్చి చూస్తే ఎలా వుందో కరక్టు ఐడియా వస్తుంది. తెలంగాణ జిఎస్టీ ఎక్కువ వుండడానికి ఇక్కడ ఒక పాయింటు ఒకటి చెప్పాలి. హాస్పటల్స్ అన్నీ హైదరాబాదులోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల వాళ్లే కాదు, ఒడిశా, ఎంపీ వంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాదుకి వచ్చి వైద్యం చేయించుకుంటారు. వాటికి మామూలుగా వచ్చే ఆదాయం ఒకటే కాదు, కరోనా టైములో డబ్బు చేసుకున్న విపరీతంగా వ్యాపారం ఏదైనా ఉందా అంటే హాస్పిటల్ వ్యాపారమే.

తెలంగాణలో ఏప్రిల్ 2021లో రూ. 4262 కోట్లు కాగా ఏప్రిల్ 2022లో రూ.4955 కోట్లు. అంటే 16% వృద్ధి. మరి ఆంధ్రలో చూడబోతే 3345-4067 22% వృద్ధి. అలా ఎలా జరిగింది? తెలంగాణలో పరిశ్రమలు కురుస్తున్నాయి. ఐటీ మరీమరీ పుంజుకుంటోంది. కెటియార్ రోజూ పేపర్లలో కనబడుతున్నారు, టీవీల్లో కనబడి పెట్టుబడులకు డెస్టినేషన్ తెలంగాణాయే అంటున్నారు. పెద్దపెద్ద ప్రాజెక్టులు తలపెడుతున్నారు. రియల్ ఎస్టేటు చూస్తే ఆంబోతులా రంకెలు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. పల్లెటూళ్లలో సైతం భూమి ధరలు భగ్గుమంటున్నాయి. మీడియాలో పొగడ్తలే తప్ప విమర్శలు కనబడవు. ఇక్కడింత అట్టహాసం జరుగుతూండగా మరి దిక్కూ దివాణం లేకుండా పడి ఉన్న ఆంధ్రతో పోలిస్తే ఎలా ఉండాలి. నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉండాలి. ఉందా?

ఆంధ్ర జిఎస్టీ వసూళ్లు ఏప్రిల్ 2022లో 4067 కోట్లు కాగా, తెలంగాణాది దానికి 122% అంటే 4955 మాత్రమే! అంటే అర్థమేమిటి? తెలంగాణలో పన్ను వసూళ్లు సరిగ్గా చేయటం లేదా? వసూళ్లు సరిగ్గా కావటం లేదంటే ప్రభుత్వ అసమర్థతైనా అయివుండాలి, అవినీతైనా అయి వుండాలి. అది కాకపోతే బ్లాక్ మనీ సర్క్యులేషన్ అంత తీవ్రంగా ఉందా? అలా అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండిటికి అసమర్థత, అవినీతి ఉందనాలి. అబ్బే, అలాటిదేమీ లేదు, అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటే అప్పుడు ఆంధ్ర సైలంటు కిల్లర్ అని ఒప్పుకోవాలి. కళ్లు చెదిరే, పోజులు కొట్టుకునే పరిశ్రమలు ఏవీ లేకపోయినా చిన్నా, చితకా, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలు, కష్టించి పనిచేసి సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వారి వ్యవహారాలు అన్నీ సవ్యంగా సాగుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయని అనుకోవాలి. ఆంధ్రను ఎద్దేవా చేసిన కెటియార్ యీ గణాంకాల కేసి దృష్టి సారించి, కాస్త తమాయించుకుంటే బాగుంటుంది. ఆ సందర్భంగా ఆయనకు కుందేలు, తాబేలు కథ గుర్తుకువస్తే అది మన తప్పు కాదు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?