Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: గుజరాత్‌లో పాలన, ప్రజాభిప్రాయం

ఎమ్బీయస్‍: గుజరాత్‌లో పాలన, ప్రజాభిప్రాయం

గుజరాత్‌లో 27 సం.లుగా పాలిస్తూ వచ్చిన పార్టీ మళ్లీ గెలిచింది కాబట్టి అన్ని విధాలా గుజరాత్ పరిస్థితి బాగుందని అనుకోవడానికి లేదు. అలా అయితే స్వాతంత్ర్యం వచ్చిన యిరవై ఏళ్ల దాకా కాంగ్రెసుకు ఎదురే లేదు. అంతమాత్రాన కాంగ్రెసు అద్భుతంగా పాలించేసిందని మనం ఒప్పుకుంటామా? ఎన్నికలలో గెలవడానికి అనేక కారణాలుంటాయి. అందువలన సీట్ల సంఖ్యను పక్కన పెట్టి, పాలన ఎలా సాగిందో, ఎలా సాగిందని ప్రజలు అనుకుంటున్నారో అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.

గుజరాత్‌ని రెండు రకాలుగా చూడవచ్చు - ఆర్థికాభివృద్ధి పరంగా అగ్రస్థానం, మానవాభివృద్ధి ద్వారా వెనకబడినతనం. ఉత్పత్తి రంగంలో గుజరాత్‌ అగ్రగామి. గుజరాత్‌లో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కార్పోరేట్ రంగానికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కార్మిక చట్టాల గురించి, పర్యావరణ నియమాల గురించి, ఎడ్మినిస్ట్రేటివ్ రూల్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. షిప్ బ్రేకింగ్‌ పరిశ్రమలో కాలుష్యం ఎక్కువగా ఉంటుందని చాలా దేశాలు, రాష్ట్రాలు ఒప్పుకోవు. కానీ గుజరాత్‌లోని అలంగ్ ప్రపంచంలోనే అతి పెద్ద షిప్ బ్రేకింగ్ యార్డ్. అలాగే జెత్‌పూర్‌ వస్త్రపరిశ్రమ కారణంగా అక్కడి జలాలన్నీ రంగు మారిపోయి ఉంటాయి. ప్రభుత్వం అడ్డు చెప్పదు.

2018 గణాంకాల ప్రకారం అపాయకరమైన వ్యర్థాల తయారీలో గుజరాత్ అన్ని రాష్ట్రాల కంటె అధమంగా ఉంది. 28టిలో దానిది 28వ స్థానం. వెయ్యి మంది జనాభాకి 50.12 మెట్రిక్ టన్నుల వ్యర్థం తయారవుతోంది. 2018-19లో వెయ్యిమందికి తయారవుతున్న ప్లాస్టిక్ వ్యర్థం 5.3 మెట్రిక్ టన్నులు. 30 రాష్ట్రాలలో దాని స్థానం 27. 2018-19లో శిలాజ ఇంధన వ్యయంలో 30 రాష్ట్రాలలో 28వ స్థానం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ అమలు చేసే రాష్ట్రాలలో 30టిలో గుజరాత్ స్థానం 24.

అందువలన పారిశ్రామికవేత్తలు గుజరాత్ వైపు పరుగులు తీస్తారు. మోదీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తూ, త్వరగా నిర్ణయాలు తీసుకోవడంతో మరిన్ని పరిశ్రమలు వచ్చాయి. మోదీ ప్రధాని అయ్యాక కూడా గుజరాత్ వైపే పరిశ్రమలను పంపుతూండడంతో యింకాయింకా వచ్చాయి. దాంతో 2020-21లో పెర్ కాపిటా ఎన్‌ఎస్‌డిపి (నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్) విలువ 2.12.821. 27 రాష్ట్రాలలో దానిది 6 వ స్థానం. 1993-94లో కూడా దానిది ఆరో స్థానమే. 2018-19లో ఉత్పత్తి రంగంలో దాని స్థానం 30లో 4. రాష్ట్రంలోని వర్క్‌ఫోర్స్‌లో 21% మంది ఉత్పత్తి రంగంలోనే ఉన్నారు.  ఈ విషయంలో దాని స్థానం 30లో 2.

స్త్రీ, శిశు సంక్షేమ, ఆరోగ్యం వంటి సోషల్ యిండికేటర్లలో గుజరాత్ వెనకబడి ఉంది. స్కూలుకి వెళ్లిన బాలికల శాతం విషయంలో 2015-16లో 28 రాష్ట్రాలలో దాని స్థానం 15 అయితే నాలుగేళ్ల తర్వాత 2019-20లో అది 30లో 19వ స్థానానికి దిగజారింది. శిశుమరణాల్లో దాని స్థానం 30లో 19. ప్రతీ వెయ్యి మంది శిశువుల్లో 31 మంది మరణిస్తున్నారు. ఎత్తు తక్కువున్న పిల్లల విషయంలో దానిది 30లో 26. ఎత్తుకు సరిపడా బరువులేని పిల్లల విషయంలో 30లో 29. వయసుకి తగ్గ బరువు లేని పిల్లల విషయంలో కూడా 30లో 29. శానిటేషన్ విషయంలో 30లో 18. 2015-16లో పోలిస్తే యీ స్థానాలు మారలేదు. అంటే రాష్ట్రప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టటం లేదన్నమాట. అందువలన హ్యూమన్ డెవలప్‌మెంట్ యిండెక్స్ (ఎచ్‌డిఐ)లో దానిది 2019లో 30లో 16వ స్థానం. 1990లో 30లో 17! 29 ఏళ్ల తర్వాత కూడా యించుమించు యథాతథ స్థితే నన్నమాట.

ఇవన్నీ నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్  ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నేషనల్ ఫ్యామిలి హెల్త్ సర్వే వంటి ప్రభుత్వ సంస్థలు చెప్పిన అంకెలే. వాటి ప్రకారమే పేదరిక నిర్మూలన విషయంలో గుజరాత్‌ది 16వ స్థానం, ఆకలి సూచీలో 18వ స్థానం, నాణ్యమైన విద్య విషయంలో 17వ స్థానం, స్వచ్ఛమైన యింధనం విషయంలో 19వ స్థానం. కోవిడ్ వచ్చినపుడు గుజరాత్ ఆరోగ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అందరికీ తెలిసి వచ్చింది. ‘నేను యీ గుజరాత్‌ను నిర్మించాను’ అని మోదీ గొప్పగా చెప్పుకున్నారు. అందుచేత ఒక పార్శ్వం మాత్రం చూసి నిర్ణయించకుండా సర్వతోముఖాభివృద్ధి జరిగిందా లేదా అని తరచి చూడాలి. గత పదేళ్లగా అసెంబ్లీలో కాగ్ నివేదికలను ఎందుకు ప్రవేశపెట్టటం లేదో కూడా ఆలోచించాలి.

ఇలాటి పాలనపై గుజరాత్ ప్రజల మనోగతం ఏమిటి అని పోలింగుకి ఒక నెల ముందు లోకనీతి-సిఎస్‌డిఎస్ (సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) కలిసి సర్వే చేశారు. మిమ్మల్ని ఎక్కువగా కలవరపరుస్తున్న అంశమేది? అని అడిగితే 51% మంది అధిక ధరలు అని చెప్పారు. 2017లో యీ అంశం గురించి 15% మందే మాట్లాడారు. నిరుద్యోగం అని గతంలో 11% మంది చెప్తే యీసారి 15% మంది చెప్పారు. ప్రభుత్వ పనితీరు అని యీసారి కొత్తగా 6% మంది చెప్పారు. దారిద్ర్యం అని 6% మంది, యితర కారణాలు అని 22% మంది చెప్పారు. ప్రభుత్వ పనితీరుతో సంతృప్తి చెందామని 22% మంది, ఓ మాదిరి సంతృప్తి అని 42% మంది, ఓ మాదిరి అసంతృప్తి అని 14%, పూర్తిగా అసంతృప్తి అని 19% చెప్పారు. పూర్తి సంతృప్తి అని చెప్పినవారిలో ధనికులు 36%, మధ్యతరగతివారు 28%, దిగువ మధ్యతరగతి 28%, పేదలు 15% ఉన్నారు. పూర్తి అసంతృప్తి అని చెప్పినవారిలో ధనికులు 7%, మధ్యతరగతివారు 13%, దిగువ మధ్యతరగతి 13%, పేదలు 31% ఉన్నారు.

అభివృద్ధి అంతా ధనికులకే పోతోంది అని 52% మంది అభిప్రాయపడ్డారు. వీరిలో ధనికులు 40% మంది ఉంటే పేదలు 58% మంది ఉన్నారు. గతంలోలా గుజరాత్ అభివృద్ధి చెందటం లేదు అని 51% మంది ఫీలయ్యారు. వర్గాల పరంగా చూస్తే రైతుల్లో 51% మంది ప్రభుత్వం తమ ప్రయోజనాలను కాపాడింది అని అభిప్రాయపడితే 34% మంది కాపాడలేదు అన్నారు. వ్యాపారస్తుల్లో యీ శాతాలు 53-30, యువతలో 49-40, మహిళల్లో 56-34 ఉన్నాయి. మా కుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడింది అని అగ్రవర్ణస్తుల్లో 62% మంది ఫీలైతే 24% మంది కాపాడలేదు అన్నారు. పటేళ్లలో యీ శాతాలు 48-32, ఒబిసి క్షత్రియుల్లో 56-30, కోలీల్లో 44-32, యితర ఒబిసిల్లో 45-35, దళితుల్లో 40-45, ఆదివాసీల్లో 32-41, ముస్లిముల్లో 25-49 ఉన్నాయి. జర్నలిస్టులు అడిగితే పాడి పరిశ్రమపై ఆధారపడిన అత్యధికులు లాభాలు తగ్గి అవస్థ పడుతున్నామన్నారు. సంపన్నులైన సూరత్ వస్త్రవ్యాపారుల నుంచి, నిరుపేద పొగాకు రైతుల వరకు అందరూ రెండు, మూడేళ్లగా చితికి పోయామనే చెప్పారు.

సంక్షేమ పథకాల గురించి గుజరాతీ ఓటరు అభిప్రాయం ఏమిటి అని సర్వే అడిగింది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు అవి చేటు అని చెప్పినవారిలో 68% మంది బిజెపికి, 15% మంది ఆప్‌కు, 8% మంది కాంగ్రెసుకు ఓటేశారు. సామాన్యపౌరుడికి కొంతైనా యివ్వాల్సిందే అన్నవారిలో 42% మంది బిజెపికి, 26% మంది ఆప్‌కు, 26% మందికి కాంగ్రెసుకు ఓటేశారు. సామాన్యుడికి కొంతైనా యివ్వాల్సిందే అని చెప్పినవారిలో చదువురానివారు 39% మంది ఉంటే డిగ్రీ ఆ పై చదివినవారు 53% మంది ఉన్నారు. గ్రామీణులు 39% మంది ఉంటే నగరవాసులు 55% మంది ఉన్నారు.

సంక్షేమ పథకాలు మీకు చేరాయా అని అడిగినప్పుడు ఉచిత రేషన్ అందిందని చెప్పినవారు 64%, కిసాన్ సమ్మాన్ నిధి అందిందన్నవారు 49%, పిడిఎస్ కింద సబ్సిడీ రేషన్ అందిందన్నవారు 27%, ఉచిత లేదా చౌక వైద్యం అందిందన్నవారు 21%, చౌక విద్యుత్తు లేదా నీరు అందిందన్నవారు 13%... యిలా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో జమ, నరేగా, ఇల్లు కట్టుకునేందుకు సాయం, కుమార్తె వివాహానికి సాయం, ఎరువుల కొనుగోలుకు సాయం, సైకిలు కొనడానికి సాయం, లాప్‌టాప్ కొనుగోలుకు సాయం యిలాటివి అందాయని అన్నవారు 5-11% మంది ఉన్నారు. కొన్ని రకాల సాయం విషయంలో యిది 2% కూడా ఉంది. పథకాల వలన ప్రయోజనం పొందివారిలో ఎక్కువమంది గ్రామీణులు, వెనకబడిన వర్గాల వారు. అవినీతి గురించి అడిగితే గతంలో కంటె అవినీతి పెరిగిందని 53% మంది చెప్పారు. వీరిలో 43% మంది బిజెపి ఓటర్లే. గతంలో కంటె తగ్గిందని చెప్పిన 22% మందిలో 75% మంది బిజెపి వారు. గతంలో లాగానే ఉంది అన్న 18% మందిలో 57% మంది బిజెపి వారు.

ఫలితాలు వచ్చాక లోకనీతి-సిఎస్‌డిఎస్ చేసిన సర్వే బిజెపి విజయం గురించి కొన్ని అంశాలు వివరించింది. గత ఎన్నికల కంటె బిజెపి ఓట్లు 3% మాత్రమే పెరిగినా సీట్ల సంఖ్య చాలా పెరిగింది. దానికి ఒక కారణం ప్రతిపక్షాల ఓట్లు చీలడం. ఆ ప్రభావం కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. బిజెపి ఓటర్లలో 70% మంది తాము పార్టీని చూసే ఓటేశామని అన్నారు. కాంగ్రెసు, ఆప్ అభిమానులలో  పార్టీపై ఫోకస్ పెట్టినవారు 60% మందే. వాళ్లు అభ్యర్థి గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఓటేయాలో లేదో ఆలోచించామన్నారు. దీనికి తోడు ఎవరికి ఓటేయాలో ఆఖరి నిమిషంలో తేల్చుకున్నవారిలో కూడా బిజెపికే ఓటేసినవారే ఎక్కువమంది ఉన్నారు. వయసు రీత్యా ఓటర్లను మూడు గ్రూపులుగా (35కి లోపు, 55కి లోపు, ఆ పైన) విడగొడితే బిజెపి సమర్థకులు మొదటి రెండు గ్రూపుల్లో ఎక్కువమంది ఉన్నారు. కాంగ్రెసు, ఆప్ సమర్థకులు మూడు గ్రూపుల్లో సమానంగా ఉన్నారు. ధనాధికుల్లో, విద్యాధికుల్లో, నగరవాసుల్లో ఎక్కువమంది బిజెపికి ఓటేశారు.

అగ్రవర్ణాల్లో, పటేళ్లలో, ఒబిసిలలో, దళితుల్లో, ఆదివాసీల్లో  బిజెపికి 2017తో పోలిస్తే ఎక్కువ ఓట్లు పడ్డాయి. కానీ 2017లో ముస్లిముల్లో 27% మంది బిజెపికి ఓటేయగా, యీసారి 14% మంది మాత్రమే ఓటేశారు. ముస్లిముల్లో 64% మంది కాంగ్రెసుకు, 10% మంది ఆప్‌కు వేశారు. బాధితలైన ముస్లిం వివాహితలు బిజెపికి ఓటేశారని కొన్ని కథనాలు వచ్చాయి. బాధిత వివాహితలు మాత్రమే కాదు, వారి తలిదండ్రులు, సోదరసోదరీమణులు కూడా ఓటేసి వుంటారు. ఎందుకంటే మూడుసార్లు తలాక్ అని ఎస్సెమ్మెస్ పంపించేసి, భార్యను వదిల్చేసుకున్న అల్లుడి ఆటకట్టయినందుకు వాళ్లందరూ సంతోషించి ఉంటారు. ముస్లిములంటే ఛాందస ముల్లాలు మాత్రమే అని నమ్ముతూ, వారు చెప్పినట్లు ఆడుతూ వచ్చిన తక్కిన పార్టీలన్నిటికీ యిదొక గుణపాఠం కావాలి.

గుజరాత్‌లో నియమనిబంధనలు పెద్దగా పాటించరని, దానిపై ప్రజలు పెద్దగా చింతించరని వ్యాసం మొదట్లో నేను రాసినదానికి ఉదాహరణ సిరమిక్ టైల్స్ తయారీకి పేరు బడిన మోర్బీలో అక్టోబరు 30న సస్పెన్షన్ బ్రిజ్ కూలి 141 మంది ప్రాణాలు కోల్పోయిన (వారిలో 55% మంది పిల్లలు) దుర్ఘటన. ఈ 143 ఏళ్ల బ్రిజ్ పునరుద్ధరణ, 15 ఏళ్ల మేన్‌టెనెన్స్ పని కాంట్రాక్టును 2022 మార్చిలో అజంతా గడియారాలు తయారుచేసే రూ.800 కోట్ల విలువైన ఒరేవా (2008-18 మధ్య ఆ కంపెనీ మేన్‌టెనెన్స్ చూసింది. 2022లో మళ్లీ యిచ్చారు. తమది కనస్ట్రక్షన్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అని కంపెనీ తన వెబ్‌సైట్‌లో కూడా రాసుకోలేదు) తీసుకుని దేవప్రకాశ్ సొల్యూషన్స్ అనే మరో కంపెనీకి సబ్ కాంట్రాక్టుకి యిచ్చింది. రిపేరు పని 8-12 నెలలు పడుతుందని అంచనా వేశారు. చివరకు 7 నెలలకే ప్రారంభించేశారు.

చెక్కతో చేసిన బ్రిజ్ డెక్‌ను మార్చి అల్యూమినియం డెక్ పెట్టడంతో దానిపై అదనంగా బరువు పడిందని పోలీసులు గమనించారు. కోర్టులో పోలీసులు చెప్పినదాని ప్రకారం సస్పెన్షన్ కేబుల్స్ తుప్పుపట్టి ఉన్నాయి. వాటిని మార్చకుండా పైన పెయింటు పులిమేశారట. బ్రిజ్‌ కెపాసిటీ 150 అయితే దాదాపు 650 మందికి టిక్కెట్లిచ్చారని వినికిడి. బ్రిజ్ పైకి ఎంతమంది ఎక్కారు అనేది తెలియాలంటే టిక్కెట్ల మీద సీరియల్ నంబరుండాలి. కానీ టిక్కెట్టుపై ఒరేవా లోగో, రూ.17 అని ఉంది తప్ప క్రమసంఖ్య లేదు. అందువలన వంతెన ఎక్కేవారిని నియంత్రించే వ్యవస్థ లేదని తెలుస్తోంది. బ్రిజ్ పైకి ఎక్కువమంది ఎక్కడంతో రెండు మెయిన్ కేబుల్స్‌లో ఒకటి తెగి, ఫైనల్‌గా డెక్ విరిగిందట. ఇంకా యితర కారణాలుండవచ్చు.

మోర్పీ మునిసిపాలిటీ నుంచి సేఫ్టీ ఆడిట్ జరగకుండానే బ్రిజ్‌ను తెరిచేశారు. ఒరేవా గ్రూపుకి మేన్‌టేనెన్స్, రిపేరు కాంట్రాక్టు యిచ్చినపుడు అలాటి ఆడిట్ జరిగితీరాలన్న షరతు మునిసిపాలిటీ విధించలేదు. ఒరేవా గ్రూపు చైర్మన్ జయసుఖ్ పటేల్ వంతెన ప్రారంభించిన నాలుగు రోజుల పాటు దాని మీద జనసంచారం సాగింది. ఆ నాలుగు రోజుల్లో ఆడిట్ జరగాలని మునిసిపాలిటీ ఎందుకు పట్టుబట్టలేదో తెలియదు.

ఘటన జరిగాక అరెస్టయిన ఎనిమిది మందిలో ఒరేవా గ్రూపుకై పని చేస్తున్న యిద్దరు మేనేజర్లు (సబ్ కాంట్రాక్టరు చేసిన దాన్ని పర్యవేక్షించవలసిన బాధ్యత వారిదట. అయితే వారికి ఆ పనిలో ఏ అనుభవమూ లేదని మోర్బీ కోర్టు అంది) యిద్దరు టికెట్ క్లర్కులతో పాటు రిపేరింగు బాధ్యత తీసుకున్న యిద్దరు సబ్ కాంట్రాక్టర్లు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఒరేవాలో జయసుఖ్‌కు సన్నిహితుడైన ఒకతన్ని నవంబరు 2న కోర్టులో ప్రవేశపెట్టినపుడు అతను యీ ఘటనను భగవంతుని చర్య (యాక్ట్ ఆఫ్ గాడ్)గా వర్ణించాడు. ఒరేవాతో ఒప్పందంపై సంతకాలు పెట్టిన మునిసిపాలిటీ అధికారుల్లో ఎవర్నీ అరెస్టు చేయలేదు. ఒరేవా గ్రూపు యజమాని పేరు కానీ, టాప్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న వారి పేర్లు కానీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. కేసు పెట్టిన సెక్షన్లు కూడా నిర్లక్ష్యానికి సంబంధించినవే.

నిందితులు బెయిలు కోసం మోర్బీ సెషన్స్ కోర్టును ఆశ్రయిస్తే, అది యివ్వనంది. వాళ్లు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ప్రభుత్వం నుంచి వివరణ కోరి తదుపరి విచారణ జనవరి 2కి వేసింది. ఇదీ కేసు నడుస్తున్న తీరు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రిగా చేసి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పరషోత్తమ్ రూపాలా జయసుఖ్‌కు సన్నిహితుడు, బంధువు. విచారణ కమిటీలో ఉన్న ఐదుగురూ ప్రభుత్వాధికారులే. సాటి ఉద్యోగులకు వ్యతిరేకంగా రిపోర్టు యివ్వకపోవచ్చన్న అనుమానాలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూస్తే పెద్ద తలకాయల ప్రమేయం ఏ మేరకు ఉందో మనకు అర్థమౌతుంది.

మోర్బీ ఎమ్మెల్యే బిజెపి పార్టీవాడు. మోర్బీ మునిసిపాలిటీ బిజెపి చేతిలో ఉంది. అందువలన ప్రజాగ్రహం ఓ మేరకైనా అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తుందనుకుంటే అలా జరగలేదు. అతను ఈ దుర్ఘటన జరిగినపుడు నదిలోకి దూకి కొందరి ప్రాణాలను కాపాడాడు. ఆ వీడియోనే వైరల్ చేసి, ప్రచారానికి ఉపయోగించుకోవడంతో ప్రజలు దాన్ని మెచ్చారు. 2017 ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థి స్వల్ప మెజారిటీతో గెలిచిన అతను ఈసారి 62వేల మెజారిటీతో గెలిచాడు. అంతేకాదు, మోర్బీ జిల్లాలోని మూడు సీట్లూ బిజెపియే గెలుచుకుంది. ప్రమాదానికి బాధ్యత ఎవరిది అని లోకనీతి సర్వే అడిగితే మునిసిపాలిటీది అని 32% మంది, రాష్ట్రప్రభుత్వానిది అని 27% మంది, కేంద్రానిది అని 11% మంది చెప్పగా ప్రజలదే అని 23% మంది చెప్పారు!

గుజరాత్ గురించి మరిన్ని విశేషాలతో మరొక వ్యాసం రాస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?