Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: తొందర పడితే చిందరవందర

ఎమ్బీయస్‍: తొందర పడితే చిందరవందర

దేనికైనా యివ్వాల్సిన టైమివ్వాలని, తొందర పడితే చిందరవందర అవుతుందని పురాణగాథలు సైతం చెప్తాయి. కశ్యపుడి భార్య వినత తన సవతికి సంతానం కలిగినా, తనకు కలగలేదని చింతించి, భర్త తనకిచ్చిన గుడ్డును పగలకొట్టింది. దానిలోంచి సగం దేహంతో బయటకు వచ్చిన అనూరుడు, తొందరపడి నన్ను వికృతరూపుణ్ని చేశావు కాబట్టి, నీ సవతికి బానిస అవుతావు అని తల్లికి శాపం యిచ్చి సూర్యుడికి రథసారథిగా వెళ్లిపోయాడు. గాంధారి కూడా ప్రసవం దాకా ఆగకుండా తొందరపడడంతో గర్భం శతశకలాలు అయింది. కథ తెలియదు కానీ ‘సుందరానికి తొందరెక్కువ’ అని సినిమా వచ్చింది. హీరోయిన్ ఓరియెంటెడ్‌గా వచ్చి ఉంటే ఏ పేరు పెట్టాలో తెలుగు ప్రజలకు వెంటనే స్ఫురించేలా డా. సునీత ప్రవర్తించి, సుప్రీం కోర్టు చికాకు పడేటంత తొందర ప్రదర్శించి, వ్యవహారం పాడు చేసుకున్నా రనిపిస్తోంది.

జూన్ 13న సుప్రీం కోర్టు జజ్‌లు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమానుల్లా ‘ఈ కేసులో తొందర పడాల్సినదేమీ లేదు, జులై దాకా వాయిదా వేస్తాం’ అన్నారు. అబ్బే యీలోగా కొంపలంటుకుపోతాయి, అవినాశ్‌ అరెస్టు చేసి, బెయిల్ యివ్వకుండా లోపల పెట్టాలని మీరు అర్జంటుగా చెప్పకపోతే కుదరదు అని సునీత అభ్యంతరం చెప్పారు. సరే జూన్ 19న చెప్తాం లెండి అన్నారు న్యాయమూర్తి. 19 వచ్చింది. ఏం చేశారు? సునీత లేవనెత్తిన అంశాలపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ అవినాశ్‌కు, సిబిఐకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ చీఫ్ జస్టిస్ సమక్షంలో జులై 3న అన్నారు. కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించాలో లేదో చీఫ్ జస్టిసే చెప్తారన్నారు. జులై 3 దాకా అవినాశ్ అరెస్టు కాడన్నమాట. బయట ఉంటే సాక్షులను బెదిరిస్తాడని సునీత చేసిన వాదనను కోర్టు నమ్మలేదన్నమాట. ఆవిడేదో అంటోంది, దానికి మీ సమాధానం ఏమిటి? అని అడగడం జస్ట్ రొటీన్ మేటరే. కుటుంబ వ్యవహారాల్లో మనం కూడా చేసే పనే అది. సునీత ఆరోపణలకు కోర్టు పెద్ద వెయిటేజ్ యివ్వలేదని బోధపడుతోంది. మరి తొందర పడి వెకేషన్ బెంచ్‌కి వెళ్లి సునీత సాధించినదేముంది?  

సిబిఐ జూన్ 30లోగా తన చార్జిషీటు దాఖలు చేయాలని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. ఇప్పటిదాకా తను సేకరించిన సమాచారం కోర్టును సంతృప్తి పరచే స్థాయిలో లేదని గ్రహించిన సిబిఐ అదనపు సాక్ష్యాల కోసం, అదనపు సమాచారం కోసం అష్టకష్టాలు పడుతోంది. తను చాలా లూజ్ ఎండ్స్ వదిలేసిందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మే 31న ఎత్తి చూపాక, విచారణ సమయంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తి యింకెన్ని అడుగుతారో అని దడ పుట్టి ఉంటుంది. అందువలన కేసును పటిష్టంగా నిర్మించాలని తంటాలు పడుతోందనుకోవచ్చు. ఇప్పుడీ సుప్రీం కోర్టు నోటీసుకు సమాధానమొకటి యివ్వాలి. సునీతమ్మకు సిబిఐ కష్టాలేమీ పట్టినట్లు లేదు. ఎంతసేపూ అవినాశ్‌ను అరెస్టు చేసి లోపల కూర్చోబెట్టి చిప్పకూడు తినిపించరేం అని అల్లల్లాడిపోతోంది.

‘ఇన్నాళ్లూ సాక్షిగా ఉన్నవాణ్ని యిప్పుడు నిందితుల లిస్టులో చేర్చి ఎ8 నెంబరిచ్చాం. అరెస్టు చేశాం, హైకోర్టు యిచ్చిన ముందస్తు బెయిలు ప్రొవిజన్ ప్రకారం పూచీకత్తు తీసుకుని వెంటనే విడుదల చేశాం. ప్రతీ శనివారం రోజంతా రప్పించడానికి మాకు కోర్టు అనుమతి యిచ్చింది. ఆయన వస్తున్నాడు కూడా. ఇంకేం కావాలి?’ అని వాళ్లన్నారు. ‘ఆ ముందస్తు బెయిల్ వ్యవహారమేమిటో దాని సంగతి తేల్చేద్దాం. సుప్రీం కోర్టుకి వెళ్లి దాన్ని రద్దు చేయిస్తా. మీరు మళ్లీ అరెస్టు చేసి లోపల పెట్టి కస్టడీలో యింటరాగేట్ చేయండి.’ అంటూ ఆవిడ సుప్రీం కోర్టు మెట్లెక్కి తలుపు తట్టారు. సిబిఐకి అంత ఉత్సాహం లేదు. అవినాశ్‌ను యిప్పుడు కస్టడీలోకి తీసుకున్నా కొత్తగా పోగుపడే సమాచారం ఏమీ లేదని వాళ్ల అభిప్రాయం. అందువలన వాళ్లు సుప్రీం కోర్టుకి యీవిడతో బాటు కదిలి రాలేదు.

ఆవిడ ఒక్కత్తే చరచరా వెళ్లిపోయింది. సుప్రీం కోర్టుకి జులై 3 దాకా వేసవి సెలవులు. అత్యవసరమైన కేసులు విచారించడానికై వెకేషన్‌లో ఏర్పాటు చేసిన బెంచ్ దగ్గరకు వెళ్లి అవినాశ్‌ను అరెస్టు చేసి లోపల కూర్చోబెట్టరేం? అంది. 2020 మార్చి 11నుంచి సిబిఐ కేసు విచారిస్తోంది. సిబిఐ అధికారులపై తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ అవినాశ్ దర్యాప్తును అడ్డుకుంటున్నాడంది. తెలంగాణ హైకోర్టు విషయం సరిగ్గా అర్థం చేసుకోలేక అతనికి ముందస్తు బెయిలు యిచ్చింది. తక్షణం దాన్ని కాన్సిల్ చేయండి. లేకపోతే అతను సాక్షులను భయభ్రాంతులను చేసేయగలడు అంది. నా అంత తొందర సిబిఐకు లేదేం? వాళ్లను కూడా వచ్చి కాన్సిల్ చేయమని అడగమని చెప్పండి అంది. సీనియర్ లాయర్లు వెకేషన్ బెంచ్ ముందు వాదించకూడదు. జూనియర్ (అడ్వొకేట్ ఆన్ రికార్డ్) లాయర్లను వెంట పెట్టుకుని రావల్సింది. కానీ యీవిడ పెట్టిన తొందరకు సిద్ధార్థ లూథరాకు కూడా మతి పోయి ఆ మాట మర్చిపోయాడు. ఇద్దరూ గబగబా వచ్చేశారు.

కోర్టులో లూథరా నోరు విప్పబోతే న్యాయమూర్తులు ఆ విషయం గుర్తు చేశారు. దాంతో సునీత గారు సీనియరూ, జూనియరూ ఎవరూ అక్కరలేదు. నేనే వాదించుకుంటా, నాకన్నీ తెలుసుగా అంటూ ముందుకు వచ్చింది. ఆవిడ తొందర చూసి, న్యాయమూర్తులు కంగారు పడి, ఆ పై జాలిపడ్డారు. ‘ఇంత దుస్సాహసం కూడదమ్మా. నీకు అనుభవం లేదు కదా, ఏదైనా పొరపాటు మాట్లాడి, కేసు చెడగొట్టుకున్నావంటే మేం పిటిషన్ కొట్టేస్తే, రేపుమర్నాడు మీ తరఫు సీనియర్ లాయరు కూడా ఆ తప్పు దిద్దలేడు. ప్రస్తుతానికి ఓపిక పట్టు. సెలవల తర్వాత విచారణ జాబితాలో వేస్తాం.’ అని హితవు చెప్పారు. (జూన్ 19న అదే చేశారు) అయినా ఆవిడ వినలేదు. సరే నీ కర్మం కానీ అనుకుని వాదించడానికి ఆవిడకు, సహకరించడానికి సిద్ధార్థకు అనుమతి యిచ్చారు న్యాయమూర్తులు.

ఏ ఎమర్జన్సీ లేకపోయినా వెకేషన్ కోర్టుకి పరిగెట్టుకుని వచ్చిన ఈవిడలో వాళ్లకు తండ్రిని పోగొట్టుకున్న కూతురి కంటె సెకండ్ కజిన్‌పై పగబట్టిన పడుచు కనబడింది. తను అనుకున్న విధంగా వ్యవహారాలు నడవనందుకు ఆవిడలో రగులుతున్న అసహనం కొట్టవచ్చినట్టు కనబడింది. వెకేషన్ బెంచ్‌కు రావలసిన అర్జన్సీ ఏముందని ఆవిణ్ని అడిగారు. సిబిఐ విచారణకు అవినాశ్ సహకరించకపోతే ఆ ముక్క చెప్పాల్సింది సిబిఐ కదా, కస్టడీలో విచారించాలో, విడిగా విచారించాలో సిబిఐకే తెలుసు కదా అన్నారు. మీ వరస చూడబోతే ఈగో క్లాష్‌ ఉన్నట్లుంది. మీ సెకండ్ కజిన్‌ను జైలుపాలు చేయడమే మీ లక్ష్యమా? అని సూటిగా అడిగేశారు.

ఆవిడకు ఆంధ్ర కోర్టు నచ్చలేదు, తెలంగాణకు వెళ్లారు. తను కోరిక మేరకు ఎల్లవేళలా ప్రవర్తించని తెలంగాణ కోర్టూ నచ్చక సుప్రీంకు వెళుతున్నారు. మొన్న తెలంగాణ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేశాక అది బొత్తిగా నచ్చలేదు. సుప్రీం కోర్టుకి వెళ్లారు. తను అనుకున్నట్లు నడుచుకున్నంత కాలం నచ్చిన సిబిఐ కూడా యిప్పుడు నచ్చడం మానేసింది. నాతో పాటు సిబిఐ కూడా రావాల్సింది కదా, రమ్మనమని చెప్పండి అంది సుప్రీం కోర్టుని. ‘రావాలో వద్దో తేల్చుకోవలసినది వాళ్లు. వాళ్ల విచారణావిధానంలో మేం కలగచేసుకోలేం.’ అని తెగేసి చెప్పింది సుప్రీం కోర్టు. ‘మీరు అర్థం చేసుకోవటం లేదండీ, జూన్ 30 లోగా వాళ్లు ఫైనల్ రిపోర్టు యివ్వాలి, యీలోగా అవినాశ్‌ను కస్టడీలో తీసుకుని సమాచారం పిండకపోతే ఎలా?’ అంటూ యీవిడ ఆవేదన వ్యక్తం చేసింది. కాస్త ఘాటు పెంచాలని యీ మరణవార్త జగన్‌కు ముందే తెలుసని సిబిఐ హైకోర్టులో వేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ఉందని కూడా జోడించింది. ముఖ్యమంత్రికి కూడా యిన్వాల్వ్ అయ్యాడు కాబట్టి, కేసుని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది అని సూచిద్దామని ఆవిడ ఉద్దేశం. దానికీ హత్యకూ లింకు లేదని తోచిందేమో, కోర్టు ఆ విషయం గురించి పట్టించుకోలేదు, వ్యాఖ్యానించలేదు.

‘జూన్ 30 గడువు విధించినది మరో బెంచ్. దానితో మాకు సంబంధం లేదు. సిబిఐ దాని పని అది చూసుకుంటుంది. అయినా మీరిప్పుడు చెప్పిన వాదనలన్నీ తెలంగాణ హైకోర్టులో వినిపించారు. కొత్తగా ఏమీ చెప్పటం లేదు. అవినాశ్ బయట ఉండడం చేత సాక్షులను ప్రభావితం చేశాడని మీరనడమే కానీ, దానికి ఆధారాలను మీరు కానీ, సిబిఐ కానీ చూపించలేదు. అవినాశ్ విచారణ నిరాటంకంగా సాగుతోంది. బెయిలు రద్దు చేసి, కస్టడీలోకి తీసుకోవలసిన అవసరం ఉంటే సిబిఐయే ఆ ముక్క చెప్పేది.’ అని సుప్రీం కోర్టు చెప్పింది. ప్రస్తుతం సునీత గారికి సుప్రీం కోర్టు కూడా నచ్చడం మానేసి ఉంటుంది. ఈ కేసులో ఎవరు ఏ పిటిషన్ వేసినా ఆవిడ ఇంప్లీడ్ అయిపోతోంది, ఒక్క దస్తగిరి బెయిలు విషయంలో తప్ప! సుప్రీం కోర్టు సరేనంటూ వచ్చింది. ఆ ధైర్యంతోనే యిప్పుడు వచ్చి తలుపు తడితే యీ బెంచ్ కరుణించలేదు. 19కి వాయిదా అంది.

19న అడ్వొకేట్ ఆన్ రికార్డ్‌ని వెంటపెట్టుకుని వచ్చిన సిద్ధార్థ లూథరా తన వాదనలో ‘‘హత్యాస్థలంలో సాక్ష్యాలను రూపుమాపి, వివేకా గుండెపోటుతో మరణించాడని ప్రచారం చేసి, ఎఫ్‌ఐఆర్ పెట్టవద్దని పోలీసులపై ఒత్తిడి తెచ్చిన వ్యక్తి అవినాశ్. అలాటివాడు చెప్పినదాన్ని తెలంగాణ హైకోర్టు చెవి ఒగ్గి విని, ఒప్పేసుకుంది. సిబిఐ చూపించిన ఆధారాలను నిరాకరించింది. ఒక చిన్నసైజు విచారణ జరిపేసింది. ఇది చాలా వింత కేసు, వెంటనే మీరు కలగచేసుకుని పొరపాటు సరిదిద్దాలి.’ అని అన్నా, సుప్రీం కోర్టు చలించలేదు. జూన్ 13న ‘అదనపు డాక్యుమెంట్లు ఉన్నాయంటున్నారు కదా, జూన్ 19న వచ్చేటప్పుడు పట్టుకురండి.’ అని చెప్పింది. అవి తెచ్చారో లేదో, వాటిలో పస లేదని కోర్టుకి తోచిందో ఏమో సింపుల్‌గా జులై 3 కి వాయిదా అంది.

హత్య జరిగి నాలుగేళ్ల తర్వాతైనా హతుడి కూతురు న్యాయం కోసం తొందర పడకపోతే ఎలా అనుకోవద్దు. సిబిఐ విచారణను దాని దారిన వెళ్లనిస్తే సుధా సింగ్ రిపోర్టు ప్రకారం యీ పాటికి అసలు దోషులు బయటపడేవారు. కానీ రాం సింగ్‌ను తెచ్చి కథను మార్చాలని చూడడంతో మొత్తం అస్తవ్యస్తమై, నానా డొంక తిరుగుళ్లు తిరిగి దారి తప్పి పోయింది. అందుకే యీ ఆలస్యం. తమ చిత్తం వచ్చినట్లు వండిన గుండ్రటి పదార్థాన్ని తాము ముందే చేసి పెట్టుకున్న నలుపలకల డబ్బాలో దూరుద్దామని చూస్తూంటే దూరటం లేదు. తమ కనుగుణంగా రూపు మార్చి కేసు పెడితే సమర్థించుకోవడానికి లాజిక్‌ అతకటం లేదు, ఆధారాలు దొరకటం లేదు. ఫైనల్‌గా కేసు ఎలాగూ నిలవదు, యీ లోపున అవినాశ్‌ను జైల్లో పడేయించి, చిప్పకూడు తినిపించేస్తే తన కక్ష తీరుతుంది కదాన్న ఆతృత ఆవిడది. అదే న్యాయమూర్తులనూ విస్మయ పరుస్తోంది.

చూడబోతే సునీత గారిది మొదట్నుంచి తొందరపాటే అనిపిస్తోంది. తండ్రి హత్య జరగగానే వివేకా కుటుంబీకులే హత్యకు కారకులు అన్న చంద్రబాబుపై విరుచుకు పడింది. ఆయనే చేయించి ఉంటాడంది. రాజకీయ లబ్ధి పొందుదామని జగన్ నారాసుర రక్తచరిత్ర అంటే తనూ వంత పాడింది. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. అప్పటి పొరపాటే యిప్పటిలా పరిణమించింది. తండ్రిని పోగొట్టుకున్న తరుణంలో ఆవిడకు బుర్ర పని చేయక అలా చేసింది పాపం అనుకోవడానికి లేదు. నిత్యం చావులు చూసే వైద్యవృత్తిలో ఉందావిడ. పైగా ఫ్యాక్షనిజానికి ఆలవాలమైన ప్రాంతం నుంచి వచ్చిందావిడ. కుటుంబమూ ఫ్యాక్షన్ కుటుంబమే. తాత దారుణంగా హత్య చేయబడ్డాడు. ఉన్నత విద్యావంతురాలు. విదేశాల్లో పనిచేసిన వ్యక్తి. తండ్రి మరణం కాస్సేపు కుదిపివేసినా త్వరలోనే స్థిమిత పడి ఉంటారు.

జగన్, అవినాశ్ యీవిణ్ని ప్రభావితం చేసి ఉంటారనుకోవడానికి లేదు. వైయస్ మరణం తర్వాత వైయస్ కుటుంబానికి, వివేకాకు చెడిందనేది, వివేకా స్థానంలో భాస్కరరెడ్డి కుటుంబం వచ్చి చేరిందనేది అందరికీ తెలుసు. తర్వాతి రోజుల్లో, కాంగ్రెసు నాశనం కావడంతో గతిలేక వివేకా జగన్ పంచన చేరారు. అంతమాత్రాన కూతురికి జగన్‌పై కోపం పోయిందని అనుకోలేము. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికలలో తండ్రి ఓటమికి భాస్కరరెడ్డి కారకుడనే అనుమానం అనేకమందికి ఉన్నపుడు సునీతకు ఉండదని చెప్పలేము. తన తండ్రికి ఎమ్మెల్యే టిక్కెట్టయినా యివ్వవచ్చు కదాన్న ఫీలింగు ఆమెలో ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఏ విధంగా చూసినా జగన్‌పై సునీతకు ప్రేమాభిమానాలు ఉన్నాయని అనుకునే ఆస్కారం లేదు. ఆ రోజు జగన్ తరహాలోనే యీవిడ మాట్లాడడానికి సొంత కారణాలేవైనా ఉండి ఉండవచ్చు.

హత్య జరగగానే వివేకా ఏకైక వారసురాలిగా యీవిడ తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి అనేది విచారణ సమయంలో చర్చకు తప్పకుండా వస్తుంది. వివేకావి రక్తపు వాంతులని గంగిరెడ్డి దబాయించి, రక్తం మరకలు కడిగించేస్తున్నాడని పిఏ కృష్ణారెడ్డి చెప్పినపుడు ఒక డాక్టరుగా, కూతురిగా దాన్ని ఆపించాల్సిన బాధ్యత లేదా? లేఖ, సెల్‌ఫోన్ పోలీసులకు యివ్వకుండా దాచు అని పిఏకు భర్త ఆదేశాలిస్తున్నపుడు అది తప్పు, చట్టవిరుద్ధం అని వారించాల్సిన బాధ్యత లేదా? అప్పుడేమీ చేయకుండా ఉండి యిప్పుడు తొందర పడితే ఏం లాభం? కేసును తననుకున్న మార్గంలో నడిపించాలని ఆవిడ తొందర పడిన కొద్దీ, తొందర పెట్టిన కొద్దీ కోర్టులకే కాదు, సాధారణ జనాలకు కూడా ఆవిడ అవినాశ్‌ను యిరికించి, వేరెవర్నో కాపాడడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు రావడం ఎక్కువౌతాయి. సిబిఐ ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెడితే విచారణ మరింత ఆలస్యమౌతుంది. (ఫోటో –డా. సునీత, అవినాశ్, సిద్ధార్థ లూథరా, క్రింద - జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమానుల్లా)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?