Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ‘సాక్షి’ (1967)కి స్ఫూర్తి

ఎమ్బీయస్: ‘సాక్షి’ (1967)కి స్ఫూర్తి

ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ఆయన బాపు, యితరులతో కలిసి తొలిసారిగా నిర్మించిన ''సాక్షి'' సినిమా గురించి రాస్తున్నాను. ‘‘హై నూన్’’ (1952) అనే సినిమా దానికి స్ఫూర్తి నిచ్చింది. ఆ సినిమా చూసిన రమణ, ముగింపు మార్చి ఆంధ్రపత్రిక వీక్లీలో ‘‘సాక్షి’’ పేరుతో కథ రాశారు. సినీరచయిత అయిన తర్వాత దాన్ని మరింత మార్చి సినిమా స్క్రిప్టు తయారు చేసుకున్నారు. బాపు దర్శకత్వంలో ‘‘సాక్షి’’ (1967) సినిమా తయారైంది.

వ్యక్తికి సమాజానికి మధ్య ఒక సమీకరణం వుంటుంది. సాధ్యమైనంతవరకు సమాజం స్వార్థపూరితంగానే వుంటుంది. తమ కడుపులో చల్ల కదలకుండా కూచుని, ఎవరో వచ్చి తమకు మేలు చేస్తారని చూస్తుంది. అయితే దాని అదృష్టం కొద్దీ అలాటి వ్యక్తి ఎవడో ఒకడు తగులుతాడు. అనుకునో, అనుకోకుండానో ఒక బాధ్యతగా స్వీకరించి, ఆ పని పూర్తి చేసి 'ఇప్పటికైనా మారండి' అని చెప్పో, చెప్పకనో వెళ్లిపోతాడు. తమాషా ఏమిటంటే ఆ వ్యక్తులు ఎక్కణ్నుంచో దిగిరారు. సమాజంలోనే వుంటారు. ఈ థీమ్‌ మీదనే ''హై నూన్‌'' అనే సినిమా తయారైంది. సమాజానికి చీడగా తయారైన ఒక రౌడీని తుదముట్టించడానికి ఆ ఊరి శాంతిభద్రతలు చూసే మార్షల్‌ ఆ ఊరివారి సహాయం కోరతాడు. అయితే ఎవ్వరూ ముందుకు రారు. తను ఒక్కడే నిలిచి ఆ రౌడీని మట్టుపెడతాడు.

''సాక్షి'' యింగ్లీషు సినిమాలా వెస్టర్న్‌ మూవీ కాదు. మన తెలుగు పల్లెటూరిలో సాగుతుంది.  దీనిలో హీరో ధీరోదాత్తుడు కాడు. ఒట్టి పిరికివాడు. రౌడీలను ఎదిరించడం అతని ఉద్యోగమూ కాదు. అనుకోకుండా ఓ కేసులో సాక్షిగా నిలబడి దీనిలో యిరుక్కున్నాడు. అతన్ని సాక్షిగా వుండమని ఎగదోసినవాళ్లు చివర్లో తప్పుకున్నారు. గత్యంతరం లేక, ఎటూ పారిపోలేక విలన్‌ను ఎదిరించాడు. రెండు సినిమాల్లోనూ చాలా తేడా కనబడుతుంది. అయినా ''సాక్షి'' సినిమాకు ''హై నూన్‌'' ఇన్‌స్పిరేషన్‌ అని రమణగారే చెప్పుకున్నారు. పోలిక ఏమిటంటే ఏదైనా క్రైసిస్‌ వచ్చినపుడు సమాజం ఎలా రియాక్ట్‌ అవుతుంది అన్న విషయమే! మొదటగా ఇంగ్లీషు సినిమా పూర్తిగా పరిశీలిద్దాం. తర్వాత తెలుగు సినిమా ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం.

‘‘హై నూన్’’ రియల్‌టైమ్‌లో నడుస్తుంది. ఓ రోజు ఉదయం 10.40 కు ఓ పెళ్లితో ప్రారంభమై మధ్యాహ్నం 12.05 ని.|లకు చావుతో అయిపోతుంది. సినిమా కూడా సరిగ్గా 85 ని.|లు నడుస్తుంది. పెళ్లికొడుకు కేన్‌యే హీరో. పాత్రధారి పేరు గ్యారీ కూపర్‌. అతను పెళ్లాడిన యువతి పాత్రధారిణి గ్రేస్‌ కెల్లీ. హీరో ఆ వూరికి మార్షల్‌గా పనిచేశాడు. 400 మంది జనాభా వున్న ఆ గ్రామానికి శాంతిభద్రతల కోసం వూరిప్రజలు డబ్బిచ్చి అతన్ని పెట్టుకున్నారు. అతనికి వయస్సు మీరుతోంది. తన కంటె వయసులో బాగా చిన్నదైన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఆమె క్రైస్తవులలో క్వాకర్‌ తెగకు చెందినది. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు దిగకూడదన్న సిద్ధాంతం వారిది. అందువలన ఉద్యోగం మానేసి, పెళ్లి చేసుకుని, వేరే వూరికి వెళ్లి ఓ స్టోర్స్‌ పెట్టుకుందామని అతని ప్లాను.

ఇంతలో విలన్‌ అవేళ మిట్టమధ్యాహ్నం ట్రెయిన్‌లో ఆ వూరికి వస్తున్నట్టు ఓ టెలిగ్రాం వచ్చింది. అతను ఓ పెద్ద రౌడీ. ఊరి ప్రజల జీవితాన్ని దుర్భరం చేశాడు. మన హీరోయే అతన్ని పట్టుకుని కోర్టులో నిలబెట్టాడు. జడ్జిగారు ఉరిశిక్ష కూడా వేశాడు. 'నిన్ను వదలను, కేన్‌' అని విలన్‌ బెదిరించి మరీ వెళ్లాడు. ఉత్తరప్రాంతాల కోర్టు వాళ్లు ఉరిశిక్షను ఐదేళ్ల శిక్షగా మార్చారు. ఇవాళ విడుదలై వస్తున్నాడు. తను వస్తున్నట్టు తన తమ్ముడికి, యింకో యిద్దరు అనుచరులకు ముందుగానే కబురు చేశాడు. వాళ్లు స్టేషన్‌ వద్ద పదిన్నర నుంచి కాపు వేశారు. విలన్‌తో కలిసి వాళ్లు నలుగురు. విలన్‌ వస్తూనే హీరోని చంపుతాడని అందరికీ తెలుసు. విలన్‌ వస్తున్న వార్త విని హీరో చలించలేదు. అతని ఉద్యోగం నిన్నటితో అయిపోయింది. కొత్తవాడు మర్నాడు వస్తాడు. చార్జి ఎవరికీ అప్పగించడానికి లేదు. అందువలన తన 'టిన్‌ స్టార్‌' తీసి అక్కడ పెట్టేశాడు. మార్షల్‌ అనేవాడు ఆ రేకు నక్షత్రం పెట్టుకోవాలి. దాన్నే టిన్‌ స్టార్‌ అంటారు. 'ది టిన్‌ స్టార్‌' అనే పేర జాన్‌ కన్నింగ్‌హామ్‌ రాసిన కథ ఆధారంగానే ఈ సినిమా తీశారు.

ఊరు వదిలి వెళ్లిపోతున్న హీరో హఠాత్తుగా బండి వెనక్కి తిప్పాడు. 'ఇది నా ఊరు. నా బాధ్యత మరచి వెళ్లిపోలేను' అన్నాడు. 'నీ ఉద్యోగం అయిపోయింది కదా, మన కెందుకు వచ్చిన గొడవ?' అంది భార్య. 'వాడు నన్ను వదలడు. మనం ఏ ప్రయరీకో వెళితే మనం ఒంటరిగా వుండగా ఎటాక్‌ చేస్తాడు. ఇక్కడైతే నాకు సహాయంగా చాలామంది నిలుస్తారు. వాడి సంగతి తేల్చేస్తే తప్ప మనకు శాంతి లేదు' అన్నాడు హీరో. 'నాకు హింస యిష్టం లేదని తెలిసి కూడా యిలా అంటున్నావంటే నేనంటే ఖాతరు లేనట్టేగా. ఏదో హీరో ననిపించుకోవాలని నువ్వు వెనక్కి తిరిగితే నేను నిన్ను విడిచి వెళ్లిపోతాను' అంది భార్య కోపంగా. 'కావాలంటే మా గొడవ తేలేవరకు హోటల్లో ఉండు. తర్వాత యిద్దరం కలిసి వెళ్లిపోదాం' అన్నాడితను. 'నీ హీరోయిజం పుణ్యమాని పెళ్లయిన గంటలోనే నాకు వైధవ్యం ప్రాప్తిస్తుందన్నమాట. అంతకంటె వితంతువు అనిపించుకోకుండా నేను యిక్కణ్నుంచి వెళ్లిపోవడం మంచిది. విలన్‌ వచ్చే అదే రైల్లో నేను ఊరు విడిచి వెళ్లిపోతా'నంది ఆమె.

తిరిగివచ్చి టిన్‌స్టార్‌ తగిలించుకుని సహాయకులను పోగేయబోయిన హీరోగారికి అన్నీ చేదు అనుభవాలే మిగిలాయి. విలన్‌కి శిక్ష విధించిన జడ్జిగారు ఉద్యోగానికి రిజైన్‌ చేసి ఊరు విడిచి పారిపోయాడు. హీరో బారు కెళ్లి నాకు వాలంటీర్లు కావాలంటే ఒక్కడూ రాలేదు. పైగా యితను ఎన్ని దెబ్బల్లో ఛస్తాడోనని పందాలు వేసుకుంటున్నారు. కొందరు ఇంట్లో వుండి లేరనిపించారు. రిటైరయిన మార్షల్‌ వద్దకు వెళితే అతనూ నిరాశగా మాట్లాడాడు. 'మనం కష్టపడి యీ వెధవల్ని పట్టుకుంటే కోర్టు వదిలేస్తుంది. వాడు వచ్చి మనమీద పగ తీర్చుకుంటాడు. నిర్జనమైన వీధిలో కుక్కచావు ఛస్తాం. ఎందుకురా అంటే ఓ టిన్‌ స్టార్‌ కోసం..' అని పెదవి విరిచాడు. చర్చికి వెళ్లి వాలంటీర్లకోసం అడిగితే అక్కడ పెద్ద డిస్కషన్‌. 'ఇన్నాళ్లూ మీకు జీతాలిచ్చి పోషించింది యిందుకేగా! ఇప్పుడు ఉపద్రవం రాగానే మమ్మల్ని సాయం అడుగుతావేం?' అని.

ఒక లేడీ గట్టిగా తగులుకుంది. 'విలన్‌ వీరవిహారం చేసే రోజుల్లో యీ ఊళ్లో ఏ ఆడదైనా భద్రంగా వుండగలిగిందా? ఇతను వచ్చి అతన్ని జైలుకి పంపాకనే కదా శాంతంగా బతుకుతున్నాం' అని. 'శాంతంగా వుంది కాబట్టే బయట ఊళ్లనుండి వచ్చి యిక్కడ పెట్టుబడులు పెడతానంటున్నారు. ఇప్పుడు యివాళ యితని కారణంగా రక్తపాతం జరిగితే మన ఊరికి చెడ్డపేరు వస్తుంది. అందుకని యితన్ని యింకా తాత్సారం చేయకుండా పొమ్మనండి. ఇతను లేకపోతే విలన్‌గాడు యిటు రానే రాడు' అని మరొకడు. 'అసలు ఆ ముగ్గురు అనుచరుల్నీ అరెస్టు చేసేస్తే పోయె కదా' అని ఇంకోడు. 'వాళ్లు యిప్పటిదాకా ఏ నేరం చేయకుండా ఎలా అరెస్టు చేయగలుగుతాను?' అన్నాడు హీరో. ఏతావాతా సాయంగా వుండడానికి ఒక్కడూ ముందుకు రాలేదు. నీ చావు నువ్వు చావమన్నారు.

ఇలాటి పాత్రలతో బాటు మరొక ముఖ్యమైన పాత్ర కూడా వుంది సినిమాలో. ఆమె పేరు హెలెన్‌. పాత్రధారిణి కేటీ జ్యురాడో. ఆమె ఒక మెక్సికన్‌ యువతి. ఈ న్యూమెక్సికోకు వచ్చి ఓ స్టోర్స్‌ పెట్టుకుంది. ఆ స్టోర్స్‌ రక్షణకోసం కాబోలు విలన్‌కి ప్రేయసిగా వుండేది. అతన్ని జైలుకి పంపాక హీరోకి సన్నిహితురాలైంది. వారి మధ్య ఏం వచ్చిందో ఏమో కానీ వాళ్లు విడిపోయారు. ఏడాదిగా  కలుసుకోవడం లేదు. ఆ తర్వాత హీరో  వద్ద డిప్యూటీగా పనిచేసే హార్వేకి దగ్గరైంది కానీ హీరో అంటే ఆమెకు చచ్చేటంత యిష్టం. ఈ డిప్యూటీకి హీరో అంటే అసూయ. తనను మార్షల్‌గా రికమెండ్‌ చేయలేదని కోపం. అందుకే విలన్‌ వచ్చే యీ వేళ అతను హఠాత్తుగా రిజైన్‌ చేశానని చెప్పి వచ్చేశాడు. హీరోకు అండగా నిలబడకుండా పారిపోయిన అతన్ని చూసి హెలెన్‌ యీసడించింది. నువ్వు ఎప్పటికీ హీరోవి కాలేవని తిట్టింది. మగాడంటే హీరోనే అంది. అతను గింజుకున్నాడు.

విలన్‌ వూళ్లోకి దిగుతున్నాడనగానే హీరో చావును కళ్లారా చూడవలసి వస్తుందని హెలెన్‌కి భయం వేసింది. అందుకని విలన్‌ వచ్చే మధ్యాహ్నం రైల్లోనే వేరే చోటుకి వెళ్లిపోదామనుకుంది. అప్పటికప్పుడు తన పార్ట్‌నర్‌కు తన వ్యాపారం అమ్మేసింది. టిక్కెట్టు కొనుక్కుని రైలు వచ్చేదాకా హోటల్లో వెయిట్‌ చేస్తోంది. అవతల స్టేషన్‌లో వున్న హీరోయిన్‌ను రైలు వచ్చేదాకా హోటల్‌ లాంజ్‌లో వెయిట్‌ చేయమన్నాడు స్టేషన్‌ మాస్టర్‌. ఈమె లాంజ్‌లో వుండగానే హీరో ఆమె ఎదురుగుండానే హెలెన్‌ గదికి వెళ్లాడు. విలన్‌ వస్తున్నాడు వెళ్లిపో అని హెచ్చరించాడు. ‘వాడు వెళ్లిపోయిన తర్వాత నాతో తిరిగావు కాబట్టి ప్రమాదం సుమా’ అని యితని భావం. నేను వెళ్లిపోతున్నానులే అందామె. నువ్వూ వెళ్లిపోతే మంచిది కదా అంది. నా వల్ల కాదు అన్నాడితను. నీ సంగతి నాకు తెలుసులే అంది నిట్టూరుస్తూ.

కింద లాబీలో వున్న హీరోయిన్‌ హోటల్‌వాణ్ని పై గదిలో ఉన్నావిడ ఎవరు? అని అడిగింది. ఆమె నీ భర్తకు, అంతకు ముందు విలన్‌కు ఫ్రెండు అన్నాడతను కసిగా. ఈమె ఉండబట్టలేకపోయింది. ఆమెకు, తన భర్తకు యింకా సంబంధం వుండబట్టే భర్త ఊరు విడిచి రానంటున్నాడనుకుంది. ఆ విషయం ఆమె మొహం మీదనే అడిగేసింది. హీరోయిన్‌ మెట్లెక్కి హెలెన్‌ గదికి వెళ్లింది. నీ కోసమేనా నా భర్త వుండిపోతానంటున్నాడు? అని అడిగింది. నువ్వు పొరబడ్డావ్‌, నేనూ నీతో బాటే వూరొదిలి వెళ్లిపోతున్నాను. అయినా ఏడాదిగా నీ భర్తకు, నాకూ సంబంధాలు లేవు అంది హెలెన్‌. ‘నా సంగతి అలా వుంచు. భర్తను మృత్యుముఖంలో పడేసి నువ్వలా వెళ్లిపోతున్నావే, నీకు తుపాకులంటే అంత భయమా?’ అని అడిగింది. ‘తుపాకులు నాకు కొత్తకాదు. నా తండ్రి, నా తమ్ముడు పోరాటంలోనే చనిపోయారు. అప్పుడే నేనీ క్వేకర్‌ పంథా స్వీకరించాను’ అంది హీరోయిన్‌. ‘ఏది ఏమైనా నేనే నీ స్థానంలో వుంటే భర్తను వీడి వెళ్లను. నేనూ ఓ తుపాకీ పట్టుకుని అతనికి సహాయంగా నిలబడేదాన్ని’ అంది హెలెన్. ‘ఆ పని యిప్పుడైనా చేయవచ్చుగా?’ అంది హీరోయిన్‌. ‘అతను నా భర్త కాదు, నీ భర్త’ అంది హెలెన్‌.

ఇవతల హెలెన్‌ ప్రస్తుత ప్రియుడు, డిప్యూటీ మార్షల్‌గా రిజైన్‌ చేసిన హార్వే అవమానంతో రగిలిపోతున్నాడు.  అతన్ని పిరికివాడిగా అందరూ వేలెత్తి చూపుతున్నారు. అతను హీరో దగ్గరకి వచ్చి ఊరొదిలి వెళ్లిపో అన్నాడు. హీరో వెళ్లనంటే అతనితో గిల్లికజ్జా పెట్టుకున్నాడు. హీరో అతన్ని చావగొట్టి పొమ్మన్నాడు. మధ్యలో ఒకతను వచ్చి డిప్యూటీగా వుంటానన్నాడు కానీ అతనూ జారుకున్నాడు. ఇక హీరోకి తన భవిష్యత్తేమిటో తెలిసిపోయింది. విల్లు రాసి కవర్లో పెట్టి విలన్‌ రాకకోసం కాచుకున్నాడు. ఎప్పుడెప్పుడా అని చూసిన మిట్టమధ్యాహ్నం రైలు రానే వచ్చింది. విలన్‌ దిగాడు. అనుచరులతో సహా హీరో ఆఫీసుమీద పడ్డాడు. హీరో విలన్‌ తమ్ముణ్ని కాల్చి చంపాడు. తుపాకీ శబ్దం వినగానే హీరోయిన్‌ ఉండబట్టలేక రైల్లోంచి దిగి వచ్చేసింది. హెలెన్‌ ముందుకు సాగిపోయింది.

హీరో దాగున్న గుఱ్ఱాలశాలకు విలన్‌ నిప్పుపెట్టాడు. హీరో తప్పించుకుని వెళుతూ యింకోణ్ని కాల్చేశాడు. విలన్ అనుచరుడొకడు హీరోని కాల్చబోతూ వుంటే హీరోయిన్‌ అతన్ని వెనుకనుండి కాల్చేసింది. భర్తమీద ఆమెకు పుట్టిన గౌరవం, ప్రేమ ఆమె మతవిశ్వాసాలను జయించింది. విలన్‌ హీరోయిన్‌ను పట్టుకున్నాడు, హీరోని బయటకు రమ్మన్నాడు. ఇంతలో హీరోయిన్‌ విలన్‌ మొహం రక్కింది. విలన్‌ దృష్టి మరలగానే హీరో అతన్ని కాల్చేశాడు. దుష్టసంహారం పూర్తయింది. ఊరంతా బయటకు వచ్చింది. కానీ హీరోకి ప్రాణం విసిగింది. మీ ఊరికీ, మీ ఉద్యోగానికీ ఓ దణ్ణం అన్నట్టు టిన్‌ స్టార్‌ కింద పడేసి భార్యతో సహా కొత్త ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఇదీ ఇంగ్లీషు సినిమా. 1880 ప్రాంతాల్లో వెస్ట్‌లో జరిగినట్టు చూపించారు.

''సాక్షి'' సినిమా దీనికి పూర్తిగా వ్యతిరేకంగా మన పల్లెపట్టున జరిగినట్టు చూపించారు. ఆ ఊరిలో  అధికారం దుర్వినియోగం చేసే మునసబు, మతలబులు చేసే కరణం, డబ్బుకోసం కక్కుర్తి పడే సుబ్బయ్యసెట్టి, ప్రసాదాల కాంట్రాక్టుకోసం కక్కుర్తి పడే పూజారి, యిలా అందరూ ఉన్నారు. అందరికీ మొగుడిలాటి రౌడీ పకీరు (పాత్రధారి జగ్గారావు) వున్నాడు. అతన్ని తన చేతికింద పెట్టుకోవాలనే వుద్దేశంతో మునసబు ఓ లారీ కొని దానికి డ్రైవరుగా పెట్టాడు. వాడు సరుకు అమ్మేసి జూదం ఆడేసేవాడు. మునసబు గొల్లుమనేవాడు కానీ ఏం చేయగలిగేవాడు కాడు. అప్పటికీ ఓ సారి కరణం మిత్రభేదం సూత్రం ప్రకారం పకీరుమీద అతని అసిస్టెంటును ఎగదోశాడు. కానీ అదీ చెల్లలేదు. ఈ పకీరు విలన్‌ అయితే హీరో ఎవరు? బల్లకట్టు నడిపే కిట్టిగాడు (పాత్రధారి కృష్ణ). మహా పిరికివాడు. అమాయకుడు. ఇలాటి అమాయకుణ్ని హీరోని చేసిన ప్రజ్ఞ ఆ ఊరి పెద్దలదే.

హీరో కృష్ణకు విజయలలిత మేనమామ కూతురు. పెద్దవాళ్లు చెపితే పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ ఆమెకు యిష్టం లేదు. ఆమెకు విలన్‌ జగ్గారావంటే మోజు. విలన్‌కి ఓ చెల్లెలుంది. ఆమె విజయనిర్మల. హీరోయిన్. చెల్లెలంటే విలన్‌కి పంచప్రాణాలు. ఆమె ఒక్కత్తే అతన్ని కంట్రోలు చేయగలదు. ఆమెకు హీరో కృష్ణంటే మోజు. ఈ ట్రయాంగిల్‌ ఎక్కువ సేపు నడవకుండానే ‘నాకు జగ్గారావంటేనే యిష్టం అతన్నే చేసుకుంటాను’ అని విజయలలిత కృష్ణకు చెప్పేసింది. కానీ అతనంటే ఆమె తండ్రి చలపతిరావుకి అస్సలు యిష్టం లేదు. అయినా అతన్ని బతిమాలుకోవలసి వచ్చింది - కూతుర్ని చెడగొట్టి, తర్వాత పెళ్లి చేసుకోనని చెప్పడంతో! కానీ విలన్‌ అతన్ని నానా మాటలూ అన్నాడు. దాంతో చలపతిరావు విలన్‌పై పగబట్టాడు. దాన్ని తనకు అనువుగా వుపయోగించుకున్నారు మునసబు, కరణం.

మునసబు విజయనిర్మలను బలాత్కారం చేయబోయాడు. సమయానికి విలన్‌ వచ్చి చావగొట్టాడు. మర్నాడు పొద్దున్నే వచ్చి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బడిగాడు. చేతిలో డబ్బు లేదని మునసబు అంటే ‘అయితే రాత్రి తోటలో కొబ్బరికాయలు కోసుకుంటాను లెండి’ అన్నాడు. కరణం సలహా మీద మునసబు రాత్రి తోట కాపలాకి చలపతిరావుని తోలాడు. దొంగతనం చేసేవాళ్లను కాపలావాడు చంపేసినా కేసు రాదని ధీమా. అయితే కథ అడ్డం తిరిగింది. విలనే చలపతిరావుని, అతనికి తోడుగా వచ్చినతన్ని చంపేశాడు. తన మేనమామతో బాటు తోడుగా వచ్చిన హీరో అది చూసి పారిపోయాడు. విలన్‌, అతని మనుషులు వెంటాడారు కానీ హీరో విలన్‌ యింట్లోనే దాక్కోవడంతో బతికిపోయాడు. కేసు వస్తుందని భయపడి విలన్‌ వూరు విడిచి వెళ్లిపోయాడు.

ఇప్పుడు మునసబు, కరణం, ఊళ్లోవాళ్లు అందరూ కలిసి కొత్త ఎత్తు ఎత్తారు. రెండు హత్యలు చేశాడు కాబట్టి విలన్‌కి ఉరి ఖాయం. అయితే సాక్ష్యం చెప్పవలసిన హీరో వణుకుతున్నాడు. వాణ్ని నువ్వు యింతటివాడివి, అంతటివాడికి అని ఊదరగొట్టి సాక్ష్యం చెప్పించారు. అయితే కోర్టులో వీళ్లు అనుకున్నట్టు జరగలేదు. ఆత్మరక్షణ కోసమే హత్యలు చేశాడంటూ ఏడేళ్ల జైలుశిక్ష మాత్రం వేశారు. జైలుకి వెళుతూ వెళుతూ విలన్‌ ప్రతిజ్ఞ చేశాడు, పున్నమినాటికి జైల్లోంచి పారిపోయి వచ్చి హీరో ప్రాణం తీస్తానని. దాంతో వూరివాళ్లంతా ప్లేటు ఫిరాయించారు. హీరో బల్లకట్టు ఉద్యోగం కూడా తీసేశాడు మునసబు. విలన్‌ జైలుకెళ్లడంతో ఊరివాళ్లంతా కలిసి అతని చెల్లెలు విజయనిర్మలను హింసించారు. హీరో అడ్డుకోబోయి దెబ్బలు తిన్నాడు. ఆమెకు యితనిపై ప్రేమ బలపడింది. అన్నం పెట్టి ఆదరించింది. ఊరు వదలి వెళ్లిపోతానంటే వద్దంది. ఎక్కడైనా యింతే అంది. మంచి, చెడూ కలిస్తేనే మడిసి అంది.

వీళ్లిలా చేరువ కావడం మునసబుకి రుచించలేదు. హీరోకి, అతని మేనమామ కూతురు విజయలలితకు పెళ్లి చేయించేస్తే హీరోయిన్‌ను చేరదీయవచ్చని అతని ఆలోచన. జబర్దస్తీగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. విజయలలిత నేను పకీరుతో తిరిగానని హీరోకి స్పష్టంగా చెప్పేసింది. కానీ పెద్దవాళ్లకు ఎదురు చెప్పలేక హీరో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పకీరు ఊళ్లోకి వస్తున్నాడన్న కబురు వచ్చింది. అందరూ కకావికలై పారిపోయారు. పెళ్లికూతురు విజయలలిత విలన్ను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. హీరోయిన్‌ ముందుకు వచ్చి తాళి కట్టమంది. కాస్సేపటిలో చచ్చిపోయేవాణ్ని యిప్పుడు పెళ్లాడడమెందుకు? అన్నాడు హీరో. ‘నేనంటే మా అన్నకి చాలా యిష్టం కదా, నా మొహం చూసి నిన్నేం చేయడు’ అంది హీరోయిన్‌. పెళ్లయాక ‘ఊళ్లోకి వెళ్లి సాయం అడుగుదాం’ అని ఆశాభావంతో మొగుణ్ని బయలుదేర తీసింది. కానీ ఇంగ్లీషు సినిమాలో లాగానే అందరూ మొహం చాటేశారు.

పోనీ ఊరొదిలి పారిపోదామంది. సరిహద్దుల్లో విలన్‌ అనుచరులు కాశారు. హీరో అనుకోకుండా ఫైట్‌ చేసి వాళ్లిద్దరినీ చంపేశాడు. అంతలో అతనికి హఠాత్తుగా తెగింపు వచ్చింది. ఎక్కడికి పోతాం? తాడో పేడో యిక్కడే తేల్చుకుందాం అన్నాడు. ఈ లోపున విజయలలిత విలన్‌ వద్దకు వెళ్లింది. అందర్నీ చంపి ఊరు తగలెట్టడం ఎందుకు? ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంది. అతను విదిలించేశాడు. లారీకి అడ్డుగా నిలబడితే మీదనుండి పోనిచ్చేశాడు. ఇక్కడ హీరో పదిమంది కోసం నిలబడి ప్రమాదం కొని తెచ్చుకున్నానని గ్రహించాడు. ఏమైతే అది అయిందని తెగింపు తెచ్చుకున్నాడు. విలన్ వచ్చాడు. ఇతని ధైర్యం చూసి తెల్లబోయాడు. విలన్‌ను దగ్గరకు రానిచ్చి హీరో అతని కళ్లల్లో యిసుక చల్లాడు. విలన్ కాస్త అవస్థపడి, తేరుకున్నాడు. ఇద్దరి మధ్య భీకరయుద్ధం జరిగింది. చివరకు విలన్ హీరో గుండెల మీద కూర్చుని కత్తి తీసి పొడవబోయాడు. ఇంతలో హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి కంగారుగా అన్నా అని పిలిచింది. విలన్ అటు చూశాడు. వెంటనే హీరో విలన్‌ చేతిని తన్నాడు, కత్తి విలన్ గుండెల్లో దిగబడి, చచ్చిపోయాడు.

ప్రమాదం తొలగిపోయిందని తెలియగానే ఊరి ప్రజలంతా ధైర్యంగా బయటకు వచ్చి, హీరోని అభినందించారు. కానీ హీరో, హీరోయిన్‌ను వెంటపెట్టుకుని ఊరు విడిచి వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ ‘ఊరి జనమంతా చెరువులో నీళ్లలాటి వాళ్లం. చెరువులో బెడ్డ పడితే చెరువు నీళ్లన్నీ కదులుతాయి. ఒక్క మనిషికి దెబ్బ తగిలితే, ఊరంతా తగులుతుంది. మీరు నా వెంట నిలబడి వుంటే, వాడు కూడా బతికి వుండేవాడు.’ అని తన భాషలోనే సుద్దులు చెప్పాడు. ఇలా చెప్పదలచుకున్న సందేశాన్ని స్పష్టంగా హీరో చేత చెప్పించారు రచయితా, దర్శకుడూ. చూశారుగా మామూలుగా చూస్తే ఇంగ్లీషు సినిమాకు, తెలుగు సినిమాకు పోలిక ఆట్టే కనబడదు. కానీ రెండిటి ఉద్దేశమూ  ఒక్కటే. సమాజస్వభావాన్ని చూపుతూనే మనిషికి మనిషి సాయపడాలనే సందేశాన్నిస్తాయి. విపత్తునుండి సమాజాన్ని రక్షించడం ఇంగ్లీషు హీరో తన ఉద్యోగధర్మంగా, బాధ్యతగా ఫీలవుతాడు. తెలుగు హీరో అనుకోకుండా వచ్చిపడిన బాధ్యతను నిర్వర్తిస్తాడు.

దానిలోనూ, దీనిలోనూ చివరిలో హీరోయిన్‌ యొక్క ఎమోషల్‌ బిహేవియరే హీరోకి అందివస్తుంది.  'హై నూన్‌'లో హెలెన్‌కి హీరోతోనూ, విలన్‌తోనూ లింక్‌ వున్నట్టే, 'సాక్షి'లో విజయలలిత హీరోకు, విలన్‌కు మధ్య ఊగుతుంది. ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లికి సిద్ధపడడం. అయితే విలన్‌ ప్రేయసికి - హీరోతోను, హీరో ప్రేయసికి - విలన్‌తోను బంధుత్వం కలపడం వలన తెలుగు సినిమా మరింత చిక్కబడింది. ఇంగ్లీషు సినిమాలో విలన్‌ మధ్యందిన భాస్కరుడిలా చండప్రచండంగా వస్తే, తెలుగులో పున్నమి చంద్రుణ్ని హరించడానికి వచ్చిన రాహువులా వచ్చాడు. మధ్యలో వచ్చిన రమణగారి కథలో ట్విస్టు ఉంది. హీరోకి అప్పటికే యిద్దరు భార్యలున్నారు. వాళ్లకూ, విలన్‌కూ బంధుత్వం లేదు. విలన్, హీరో తోడుదొంగలు. చివర్లో పోలీసులు వచ్చి హీరోని పట్టుకుపోతారు. సినిమాగా తీసేటప్పుడు పూర్తిగా పాజిటివ్‌గా తీశారు. పూర్తి ఔట్‌డోర్‌లో తీసిన యీ సినిమా తెలుగు సినిమాకు నవ్యత్వాన్ని తీసుకుని వచ్చిందనాలి. ‘‘హై నూన్‌’’ 4 ఆస్కార్లు గెలుచుకుంటే ''సాక్షి'' రష్యాలో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా