Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: కమలహాసన్‌ కొత్త పార్టీ?

      కమలహాసన్‌ తన పుట్టిన రోజైన నవంబరు 7న కొత్త పార్టీ పెడతాడా లేదా అన్నది యింకా తేలలేదు. ఏదో ఒక ప్రకటన మాత్రం చేస్తాడని  అతని మేనేజరు చెప్తున్నాడు. పార్టీ అంటూ పెడితే దానికి ఏ మహానాయకుడి పుట్టినరోజో ఎంచుకోకుండా తన పుట్టినరోజునే ఎంచుకోవడమంటే అర్థం - పార్టీ తన చుట్టూనే తిరుగుతుందని చాటి చెప్పడం! మన పవన్‌ కళ్యాణ్‌ గారి పార్టీలాగానే అది కూడా ఏకనాయక పక్షంలా తయారవుతుంది కాబోలు. గతంలో అయితే అతనికి అభిమాన సంఘాలుండేవి. ఇప్పుడున్నాయని తోచదు. ఉన్నా వాటి సభ్యుల్లో ఎంత మంది యాక్టివ్‌గా ఉన్నారో తెలియదు. ఆర్టిస్టులలో, సాంకేతిక నిపుణుల్లో కమల్‌ వెంట నడిచే గ్రూపు కూడా ఏదీ ఉన్నట్టు లేదు. కొంతమంది వ్యక్తులున్నా వారికి రాజకీయపరమైన ఆలోచనలు ఉంటాయని చెప్పలేం. నీలం సంజీవరెడ్డి గారి కొటేషన్‌ ఉంది - 'ఇన్‌ ఇండియా, ఎవ్‌రీ యాంగ్రీమ్యాన్‌ స్టార్ట్‌స్‌ ఏ పార్టీ' అని. కమల్‌ పార్టీ కూడా ఆ కోవకే చెందుతుంది. కోపం పోనీ ఆవేదన ప్లస్‌ ఆలోచన ఉంటే చాలు పార్టీ పెట్టేయవచ్చు అనుకుంటే పొరపాటు. కమలహాసన్‌ విషయంలో గ్లామర్‌ కూడా ఉంది అనుకుంటే, అది కూడా గతవైభవమే. అతను ఒకప్పుడు యూత్‌కు ఐకాన్‌. ఇప్పుడు కాదు. రజనీకాంత్‌లా మాస్‌ హిస్టీరియా సృష్టించగల నటుడు కాదు. అయి వుంటే ఎస్టాబ్లిష్‌ అయిన పార్టీలు అతని వెంట యీపాటికే పడి వుండేవి. రజనీని రాజకీయాల్లోకి లాక్కు రావాలని గతంలో కాంగ్రెసు, తర్వాత బిజెపి చాలా ప్రయత్నాలు చేశాయి. కమల్‌ విషయంలో ప్రాంతీయ పార్టీలైనా అలా అడిగిన దాఖలాలు లేవు.

కమల్‌ గొప్ప నటుడు. సృజనాత్మకంగా ఆలోచించగల సినిమా వ్యక్తి. అంతే! అతని జీవనసరళి, ఆలోచనావిధానం ప్రజలను మెప్పించే తరహా కాదు. సాంఘిక కట్టుబాట్లను ఉల్లంఘించినట్లు బాహాటంగా అందరికీ తెలుసు. హీరోగా ప్రారంభమై, నెగటివ్‌ పాత్రలనేకం వేశాడు, వేస్తున్నాడు. రజనీ నెగటివ్‌ పాత్రలతో కెరియర్‌ ప్రారంభించినా ఒకసారి హీరో అయ్యాక, వాటి జోలికి పోలేదు. ప్రయోగాల జోలికి పోకుండా ఒక కమ్మర్షియల్‌ హీరోగా తన గ్రాఫ్‌ పెంచుకుంటూ పోయి, ఒక 'కల్ట్‌ ఫిగర్‌' అయిపోయాడు. తన అభిమానుల మెదళ్లను అతను శాసించగలడు, ఉత్తేజపరచగలడు. వైవిధ్యంతో కూడిన పాత్రలు వేసిన కమల్‌ తన అభిమానుల గౌరవాన్ని సంపాదించుకున్నాడు. కానీ వాళ్లు రజనీ అభిమానుల్లా కమల్‌ ఏం చెప్తే అది చేసేయడానికి ఉర్రూతలూగరు. సినిమా నటులు తమ కున్న గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చేయడం కేక్‌వాక్‌ అనుకుంటే తప్పు. ఎమ్జీయార్‌ ఎన్నో ఏళ్లు సినిమాలు, రాజకీయాలు ఏకకాలంలో నిర్వహిస్తూ, మహా దాతగా, ఉపకారస్తుడిగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుని అప్పుడు సొంతంగా పార్టీ పెట్టి విజయం సాధించాడు. కొన్నేళ్లకు ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి హఠాత్తుగా ప్రవేశించి 9 నెలలల్లోనే ముఖ్యమంత్రి అయిపోవడంతో యితర భాషల్లో హీరోలకు కూడా ఆశలు పుట్టాయి. కన్నడ రాజ్‌కుమార్‌, మలయాళ ప్రేమ్‌ నజీర్‌ కాస్త హడావుడి చేసి అంతలోనే వాస్తవాలు గమనించి చల్లబడ్డారు. వాళ్ల రాష్ట్రాల్లో వాళ్లు గొప్ప యాక్టర్లే కాదు, స్టార్లు కూడా. అయినా గ్లామర్‌ ఓట్లగా తర్జుమా కాదని గ్రహించారు. తమిళనాడు పరిస్థితి వేరు అనుకోవద్దు. శివాజీ గణేశన్‌ దశాబ్దాల తరబడి స్టార్‌ కావడంతో బాటు కాంగ్రెసు పార్టీ ద్వారా రాజకీయాల్లో చురుగ్గా తిరిగాడు. ఆయన పార్టీ పెడితే అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయింది. తనూ ఓడాడు. శివాజీ ఎమ్జీయార్‌ని మించిన గొప్ప నటుడని అందరూ ఒప్పుకుంటారు. కానీ శివాజీ నటుడు మాత్రమే, ఎమ్జీయార్‌ ప్రజల మనిషి. అదీ తేడా! రజనీకి, కమల్‌కి యిలాటి తేడాయే వుంది. రజనీ చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. రూపసి కాదు. సినిమా నటుల కుండే రంగుపొంగులు లేవు. బస్‌ కండక్టరుగా పనిచేశాడు. కష్టపడ్డాడు. చిన్నాచితకా పాత్రలు వేశాడు. కష్టపడి ఎదిగాడు. అందువలన సామాన్యుడు తనను అతనితో ఐడెంటిఫై చేసుకుంటాడు.

మరి కమల్‌ - ధనిక కుటుంబం నుంచి వచ్చాడు. బాలనటుడుగా, డాన్సు మేస్టరుగా రాణించి, సులభంగా హీరో అయిపోయాడు. చూడడానికి బాగుంటాడు. తెలివితేటలున్నాయి. కొత్త తరహా నటనతో యువతను ఆకట్టుకున్నాడు. అనేక విజయాలు. నిర్మాతగా ప్రయోగాలు చేసి, దెబ్బ తిన్న సందర్భాలు లేవా అంటే ఉన్నాయి. అయినా అతను పెట్టిపుట్టిన రకం కాబట్టి సామాన్యుడు తనను అతనితో పోల్చుకోడు. కమల్‌కు ఎప్పుడూ ఏ పాత్ర ఎలా వేద్దామా అన్న గోలే తప్ప ప్రజల కష్టనష్టాల గురించి ధ్యాస లేదు. తన సినిమా పంపిణీ చేసి నష్టపోయినవారికి రజనీ పరిహారం యిచ్చి ఆదుకున్నాడు తప్ప కమల్‌ అలాటి వాటి జోలికి వెళ్లలేదు. రజనీ యితర భాషల్లో వేసినా, తమిళనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని భార్య తమిళ వనిత. పిల్లలు తమిళులను చేసుకున్నారు. కమల్‌ తనను తాను అన్ని రాష్ట్రాలకు చెందిన భారతీయుడిగా, అంతర్జాతీయ మానవుడిగా చూపుకున్నాడు తప్ప తమిళ సంస్కృతికై వెంపర్లాడినవాడిగా ఎన్నడూ చిత్రీకరించుకోలేదు. ఎక్కువకాలం కాపురం చేసిన రెండో భార్య సరిత ఉత్తరభారతీయురాలు. కమల్‌కు ఫ్యామిలీ మ్యాన్‌గా, భక్తుడిగా, ఉపకారస్తుడిగా, దాతగా, పోరాటవీరుడిగా.. ఎలాటి యిమేజీ లేదు. జయలలిత హయాంలో, డిఎంకె హయాంలో ఏ స్థాయి అవినీతి జరిగినా నోరెత్తలేదు. తన సినిమాకు యిబ్బందులు కలిగినప్పుడే గొంతెత్తాడు. జయలలిత మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల మీద మాత్రమే మాట్లాడడం మొదలెట్టాడు. ఎన్టీయార్‌ సినిమాలు వదిలేసి, రాజకీయాల్లోకి వచ్చారు. కమలహాసన్‌కు అంత ఓపిక లేదు. ఎన్నికలకు మూణ్నెళ్ల ముందు మాత్రమే గోదాలోకి దిగుతాడట. ఓడిపోతే మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోతాడన్నమాట. ఈ మాత్రానికి జనాలు మురిసిపోయి, ఓట్లేసేయాలా? రాజకీయాలంటే సోషల్‌ మీడియాలో కామెంట్లు రాయడం కాదు, జనాల మధ్య తిరగాలి, వాళ్ల గోడు వినాలి. ఒక పొలిటికల్‌ ఫిలాసఫీ ప్రవచించాలి. ప్రస్తుతం తమిళనాడును బిజెపి పరోక్షంగా శాసిస్తోంది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఎదగదలచిన కమల్‌ బిజెపికి భిన్నంగా చూపుకోవడానికి పినరాయ్‌ విజయన్‌ను, అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిశాడు. విజయన్‌ వెనుక దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ ఉంది. అరవింద్‌ వెనుక ఏళ్ల తరబడి సాగిన ఉద్యమం ఉంది. తన వెనుక ఏముందని కమల్‌ యీ రాజకీయ విన్యాసానికి ఉపక్రమించాడో అతనికే తెలియాలి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2017)

mbsprasad@gmail.com