ఎమ్బీయస్‌: సెక్షన్‌ 8 పై రచ్చ – 4

ఆంధ్రకు ప్రత్యేక హోదా అక్కరలేదు అని బాబు కొత్తగా పల్లవి ఎత్తుకున్నాక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చరణాలు అందుకుని మే 10 న 'హోదా గోదాలో..' అని రాస్తూ 'హోదా వచ్చేస్తే స్వర్గం దిగి వచ్చేస్తుందనుకుని…

ఆంధ్రకు ప్రత్యేక హోదా అక్కరలేదు అని బాబు కొత్తగా పల్లవి ఎత్తుకున్నాక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చరణాలు అందుకుని మే 10 న 'హోదా గోదాలో..' అని రాస్తూ 'హోదా వచ్చేస్తే స్వర్గం దిగి వచ్చేస్తుందనుకుని కొందరు ఢిల్లీ వెళ్లి పదిమందినీ కలిశారు, అలాటి వారి వలన ఆంధ్ర రాష్ట్రానికి దుస్థితి లభించింది, యిది ప్రజలు చేసుకున్న దురదృష్టం' అంటూ విమర్శించారు. ఆంధ్ర మేధావుల వేదిక తరఫున ఆ డెలిగేషన్‌కు నేతృత్వం వహించిన చలసాని శ్రీనివాస్‌ మే 15 ఆంధ్రజ్యోతిలో 'కేంద్రం దిగిరాదా? అదీ చూద్దాం' పేర దానికి జవాబు యిచ్చారు. దానిలో ఆయన – 'ప్రత్యేక హోదా, కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పన్ను ప్రోత్సాహకాలు, చట్టంలో వున్న సంస్థల ఏర్పాటు.. వగైరా విషయాలలో విభజన సమయంలో యిచ్చిన హామీలు భిక్ష కాదు, మా హక్కు – అని గుర్తు చేయడానికి మేం వెళ్లాం. ఈ హామీల అమలుకోసం ఆంధ్ర రాష్ట్ర శాసనసభ, మండలి తీర్మానాలైనా చేయలేదు. ఢిల్లీలో సమావేశాలు మొదలై చాలాకాలం గడిచినా ప్రత్యేక హోదా కొరకు గట్టిగా అడగటం లేదు. పైగా తెలంగాణ సభ్యులు హైకోర్టు కోసం నిలదీస్తుండగా, మరి బిల్లులో 8 వ పాయింటు ప్రకారం గవర్నరు ప్రత్యేక హక్కుకోసం, హామీల కోసం ఎవరూ గొంతెత్తకపోవడం అందరిలాగా మాకు కూడా బాధ కలిగింది. అందుకే మేం వెళ్లి ప్రజల ఆవేదన వివరించాం.' అని వివరించారు. సెక్షన్‌ 8 అమలు గురించి ఆయన చేసిన పని కూడా టిడిపి, వైసిపిలు చేయలేదు. అది మే నెల మధ్యనాటి పరిస్థితి. జూన్‌ 1 వచ్చేసరికి టిడిపి సెక్షన్‌ 8 గురించి గుండెలు బాదుకోవడం మొదలుపెట్టింది. ఈ 15 రోజుల్లో జరిగినదేమిటో అందరికీ తెలుసు – రేవంత్‌ పట్టుబడడం!

రేవంత్‌ కేసును అడ్డం పెట్టుకుని, ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణ చేర్చి సెక్షన్‌ 8 కోసం బాబు పట్టుబడుతున్నారు. రేవంత్‌ చేసిన దానిపై ఆంధ్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఆ ప్రభుత్వంలోని న్యాయశాఖలో ఉపకార్యదర్శిగా పనిచేసే బాచిన రామాంజనేయులు అనే ఆయన ఆంధ్రజ్యోతిలో 'ఓటుకు నోటు – లీగల్‌ పాట్లు' పేర వ్యాసం రాస్తూ 'అవినీతి నిరోధక చట్టం 1988లో అవినీతి అనే పదాన్ని ఎక్కడా నిర్వచించలేదు… చట్టం అనుమతించే ప్రతిఫలం మినహా యితర ప్రతిఫలాన్ని అధికార విధులు నిర్వహించేందుకు అంగీకరిస్తేనే నేరమవుతుంది. చట్టం అనుమతించని ప్రతిఫలాన్ని 'యివ్వటాన్ని' ఎక్కడా నేరంగా నిర్ణయించలేదు. ..' అని రాశారు. ఈయన ప్రకారం లంచం యిచ్చిన రేవంత్‌ చేసినది నేరం కాదు. అనేక వేదికల నుంచి నైతికత గురించి మాట్లాడే త్రిపురనేని హనుమాన్‌ చౌదరిగారు ఆంధ్రభూమి జూన్‌ 26 – 'పివి-ఝార్‌ఖండ్‌ ముక్తి మోర్చా కేసులో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిథులు డబ్బు తీసుకోవడం యిచ్చుకోవడం చట్టవ్యతిరేకం కాదు, అది కేవలం నీతిపరంగా తప్పో, పాపమో అవ్వవచ్చు అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం తెలంగాణ ఎమ్మెల్యేని ఒక పార్టీ వారు కొనబోవడం సర్వసాధారణమైన, సర్వాంగీకారమైన ప్రక్రియే!' అని యిదేదో పెద్ద విషయం కాదని, మనమేమీ ఆందోళన చెందనక్కరలేదని తేల్చేశారు. ఇది సర్వాంగీకారమైన ప్రక్రియట! ఎవరు అంగీకరించారో ఆయనే చెప్పాలి. ఎవరైనా పార్టీలు మారితే, క్రాస్‌ ఓటింగు చేస్తే ఫలానా దాని కోసం చేశారని ఆరోపణలు వస్తాయి, అవి అబద్ధమని అవతలివాళ్లు కొట్టేస్తారు. ఓటు కొంటూ రెడ్‌హేండెడ్‌గా దొరికిన కేసులో కూడా సర్వసాధారణమైనదే అనుకుని వదిలేయాలా!? 

ఇంతకీ పివి కేసులో ఏం చెప్పారు? నల్సార్‌ యూనివర్శిటీలోన్యాయశాస్త్రాన్ని బోధించిన మాడభూషి శ్రీధర్‌ కేంద్ర సమాచార కమిషనర్‌ కూడా. ఆయన జూన్‌ 10 సాక్షిలో 'పివి నరసింహారావు వర్సెస్‌ స్టేట్‌ (సిబిఏ) కేసులో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ఒక రకంగా చాలా అన్యాయమైనదే. లంచాలు యిచ్చినవారికి శిక్షలు వుంటాయంటూనే లంచాలు తీసుకుని చట్టసభలో ఓట్లేసిన వారిని విచారించడానికి వీల్లేదని మినహాయింపు యివ్వడం దారుణం. కానీ ఆ దురన్యాయ తీర్పు కూడా లంచాలు యిచ్చిన ఎంఎల్‌ఏలకు, ఎంపీలకు మినహాయింపులు యివ్వలేదు. ఇచ్చినవారికి విముక్తి లేదు కనుకనే రేవంత్‌ గారు లంచం యివ్వజూపి కెమెరాల్లో చిక్కి ప్రస్తుతం జైల్లో వున్నారు..' అని రాశారు. చౌదరిగారు చట్టపరంగా ఎవరిదీ తప్పు కాదని తేల్చేస్తే శ్రీధర్‌ గారు రేవంత్‌ది తప్పన్నారు. రామాంజనేయులు గారు రేవంత్‌ను తప్పు కాదని చెపుతూనే తన వ్యాసంలో స్టీఫెన్‌సన్‌ను తప్పు పట్టారు '…డబ్బులకు ఓటు వేస్తానన్న వ్యక్తి ప్రథమ ముద్దాయిగా నిర్ణయించాలి. డబ్బులకు ఓటు వేస్తానని చెప్పి యితరులను ఆకర్షించి తర్వాత పోలీసులకు పట్టివ్వటాన్ని దురుద్దేశం (మాలఫైడ్‌ యింటెన్షన్‌)గా భావించాలి. దురుద్దేశంతో అవినీతి కేసులో యిరికించటాన్ని ఏ న్యాయస్థానం ఒప్పుకోదు.' అంటూ వాదించారు. రేవంత్‌ కేసు ప్రజా ప్రాతినిథ్య చట్ట పరిధిలోకి మాత్రమే వస్తుంది కానీ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదు అంటూ సెక్షన్లు వల్లించారు. ఇప్పుడు ఎసిబితో బాటు ఎన్నికల కమిషన్‌ కూడా రంగంలో వుంది కాబట్టి ఆ ముచ్చటా తీరుతుంది. 

నా బోటి సామాన్యులకు చట్టం తెలియదు, సంఘపరమైన న్యాయం మాత్రమే తెలుసు. దాని ప్రకారం ఓటు కొనబోవడం తప్పు. మామూలు ఎన్నికల సమయంలోనే టీవీ యాడ్స్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌ మనలాటి సాధారణ ఓటర్లను హెచ్చరిస్తూ వుంటుంది. అభ్యర్థులు వాహనయోగం కల్పించబోయినా తీసుకోవద్దంటుంది. మరి ఎమ్మెల్యేలకు మినహాయింపు వుందేమో నాకు తెలియదు. ఇక స్టింగ్‌ ఆపరేషన్‌ చేసి నేరస్తులను పట్టిద్దామనుకునేవాళ్లు స్టీఫెన్‌సన్‌లాగే ప్రవర్తిస్తారు. గతంలో ఎన్టీయార్‌ తన మంత్రిని కూడా యిదే రీతిలో పట్టించారు. ఆయనది దురుద్దేశం అనాలా? కిడ్నాపర్లు డబ్బు యిచ్చి పిల్లాణ్ని పట్టుకెళ్లమంటే, మీరు పోలీసుల వద్దకు వెళతారు. డబ్బు యిస్తా ఫలానా చోటకి రండి అని కిడ్నాపర్లకు చెప్పి మమ్మల్ని ఎలర్ట్‌ చేయండి, వచ్చి పట్టుకుంటాం అని వాళ్లంటారు. పట్టుబడిన కిడ్నాపర్లు 'నువ్వు మాకు ఆశ చూపి రప్పించి పట్టించావు, నీది దురుద్దేశం' అని మీపై కేసు పెడతారా? అంతా అయోమయంగా వుంది. వ్యాసం రాసినాయన ప్రభుత్వంలో న్యాయశాఖలో ఉపకార్యదర్శి. దీన్ని బట్టి ఆంధ్రప్రభుత్వం వైఖరి ఎలా వుందో బోధపడుతోంది. పట్టుబడ్డాక మొత్తం బుకాయింపులోకి దిగారు, దానిలో భాగంగానే సెక్షన్‌ 8 గురించి చర్చ మొదలుపెట్టారు తప్ప దాని గురించి గాని, పదో షెడ్యూల్‌లోని సంస్థల గురించి గాని యిన్నాళ్లూ చిత్తశుద్ధితో లేరని క్లియర్‌గా తెలుస్తోంది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3