గాడ్సే వాదన – '1939లో యుద్ధం ప్రారంభమయ్యాక యుద్ధానికి సహకరించాలా, వ్యతిరేకించాలా, తటస్థంగా వుండాలా అనే విషయంలో కాంగ్రెసు తటపటాయిస్తూ వుండిపోయింది. 1942 వరకు ప్రభుత్వం తన యుద్ధప్రయత్నాలను చేసుకోగలిగింది. ధన, జన సమీకరణ చేయగలిగింది. ఆ సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం నుంచి రాయబారిగా వచ్చిన క్రిప్సు స్వాతంత్య్రానికి, విభజనకు ముడిపెట్టడంతో రాయబారం విఫలమైంది. కాంగ్రెసు క్రిప్సు సూచనలను తిరస్కరిస్తూనే తాను ప్రజాస్వామ్యానికి, జాతీయతకు కట్టుబడి వున్నట్లు ఒక ఆడంబరమైన తీర్మానం చేసిన తర్వాత విభజన సిద్ధాంతానికి లొంగిపోయింది. 1942 ఏప్రిల్‌లో అలహాబాదులో జరిగిన కాంగ్రెసు కార్యవర్గ సమావేశంలో విభజన సిద్ధాంతం తిరస్కరించబడింది. రాజాజీ, ఆయన అనుయాయులు ఆరుగురు దాన్ని వ్యతిరేకించారు. నిరాశానిస్పృహలలో మునిగిపోయిన గాంధీ ''క్విట్ ఇండియా'' అని బ్రిటిషువారికి, 'డూ ఆర్ డై' (సాధించుటో మరణించుటయో) అని దేశప్రజలకు పిలుపు నిచ్చాడు. అది ఆచరణలో విఫలమైంది. సంస్థానాధీశులందరూ యుద్ధప్రయత్నాలకై ప్రభుత్వానికి సహకరించారు. కార్మికులు కూడా! ధనికవర్గం కాంగ్రెసుకు సానుభూతి తెలుపుతూనే ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముకుంది. కాంగ్రెసువారు జైళ్లకు వెళ్లి కూర్చున్నారు. మూడు నెలలో ఉద్యమం కుప్పకూలిపోయింది. ఉద్యమాన్ని ఉపసంహరించుకోకుండానే జైళ్ల నుంచి తమ సహచరులను విడుదల చేయమని కాంగ్రెసు నాయకులు విజ్ఞాపనలు పంపుకున్నారు. జర్మన్లను తిరుగులేని దెబ్బ కొట్టి యుద్ధం ముగిసిన తర్వాతనే వారిని ప్రభుత్వం విడిచిపెట్టింది. ఇక జిన్నా – 'క్విట్ ఇండియా' ముస్లిములకు హానికరమైంది అంటూ బహిరంగంగా వ్యతిరేకించి 'డివైడ్ ఇండియా' అనే నినాదాన్ని యిచ్చాడు. గాంధీ హిందూ-ముస్లిం ఐక్యత అంతదాకా వచ్చింది.
(భారతీయులందరూ క్రిప్స్‌ను విలన్‌గా చూస్తారు. ఆదిభట్ల నారాయణదాసు గారు 'క్రిప్స్ రాయబారం- కృష్ణ రాయబారం' అంటూ హరికథ కూడా చెప్పేవారట. కానీ అతని పూర్వాపరాలు తెలిస్తే జాలివేస్తుంది. డిసెంబరు 1941లో జపాన్, జర్మనీ పక్షాన యుద్ధరంగంలోకి దూకడంతో ఇంగ్లండ్ రాజకీయాల్లో ఇండియా ప్రాముఖ్యత పెరిగింది. 'తూర్పు ఆసియాలో జపాన్ విజయాలు సాధిస్తూంటే వారిని నిలవరించడానికి భారతీయుల సహకారం ఎంతో అవసరం. ఇండియన్ పార్టీల ప్రాతినిథ్యంతో ఇండియాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, జపాన్ను ఎదుర్కోవాల'ని భారతదేశానికి స్నేహితుడైన అట్లీ, ఇతర లేబరు మంత్రులు ప్రతిపాదించారు. వ్యతిరేకులైన చర్చిల్, ఎమెరీ, లిన్ లిత్ గో లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకూడదన్నారు. కానీ సింగపూర్, మలయా, బర్మాలలో బ్రిటిషు ప్రభుత్వాలు పడిపోయి జపాన్ కైవసం కావడంతో చర్చిల్ విధానం పొరపాటని అందరూ అనుకోసాగారు. 'జాతిపరంగా, చరిత్రపరంగా, మతపరంగా ఇండియా మనకు పూర్తిగా విభిన్నమైనది కాబట్టి బలప్రయోగంతోనే ఇండియాను పాలించాలి' అన్న లిన్ లిత్ గో సలహాను వ్యతిరేకిస్తూ భారతదేశంలో అవలంభించిన విధానం గురించి 2/2/1942న అట్లీ ఒక నివేదిక సమర్పించారు. 19/2/42న దానిపై వార్ కాబినెట్లో చర్చ జరిగింది. ఇండియాకు మిత్రులైన అట్లీ, క్రిప్స్లకు ముఖ్యమైన పదవులు లభించాయి. అట్లీ ఉప ప్రధానమంత్రి ఐతే, క్రిప్స్ హౌస్ ఆఫ్ కామన్స్‌కు నాయకుడయ్యారు. 26/4/42న ఇండియా కమిటీ ఏర్పడింది. చైైర్మన్ అట్లీ, క్రిప్స్, ఎమెరీ, సైమన్, సర్ జాన్ ఏండర్సన్ సర్ జేమ్స్ గ్రిగ్ సభ్యులు. అంటే అట్లీకు టోరీలను కూడా ఒప్పించవలసిన భారం పడింది.
ఇండియన్ పార్టీలతో రాయబారానికి వెళతానన్నారు క్రిప్స్. 9/3/42న వార్ కాబినెట్ క్రిప్స్‌కు అనుమతినిచ్చింది. అది లేబరు పార్టీకి విజయమే. టోరీలు దానికి సమ్మతించడానికి కూడా కారణం ఉంది. అమెరికా ఆర్థిక సహాయంపై బ్రిటను అప్పుడు ఆధారపడుతోంది. దేశానికి యుద్ధం భారమైపోయింది. ఇండియాతో సహా ఇతర వలసలన్నిటినీ వదుల్చుకోవాలని అమెరికా ఇంగ్లండుకు సలహా ఇచ్చింది. ఋణదాత ఉపదేశాన్ని తోసిరాజనే స్థితిలో లేదు ఇంగ్లండు. క్రిప్స్ ప్రతిపాదనలలో ముఖ్యమైనవి – యుద్ధం కాగానే ఇండియాకు స్వయం నిర్ణయాధికారం ఇస్తారు. కొత్తగా ఎన్నికైన ప్రాంతీయ ప్రభుత్వాలు ఒక చట్టసభను ఎన్నుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు, సంస్థానాధీశులు వారి ప్రతినిథులను ఆ సభకు పంపవచ్చు. కామన్వెల్త్లో ఇండియా సమాన భాగస్వామిగా చేరవచ్చు, ఇష్టం లేకపోతే చేరకపోయినా ఫర్వాలేదు కానీ కొంతకాలం పాటైనా బ్రిటన్ ప్రయోజనాలు పరిరక్షించేటట్లు ఒక ఒప్పందం కుదుర్చుకోవలసి ఉంటుంది, మౌలికంగా పాకిస్తాన్ ప్రతిపాదనను అంగీకరిస్తారు. ఏ ప్రాంతమైనా సరే ఇండియన్ యూనియన్‌లో చేరనూవచ్చు, చేరకపోనూవచ్చు, వాళ్ల యిష్టం. ఈ లోపుల ఇండియాలో పార్టీలన్నీ వైస్రాయి కౌన్సిల్లో చేరాలి.
ఆ రోజుల్లో ఇండియాలో ముఖ్యమైన శక్తులు మూడు వున్నాయి – కాంగ్రెసు, ముస్లిం పార్టీలు, సంస్థానాధీశులు. ఈ ముగ్గురి అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉందని గుర్తించినా, మరీ ఉదారంగా ఉంటే టోరీలు ఒప్పుకోరని గుర్తించినా క్రిప్స్ రాయబారం సబబైనదే అని అనిపిస్తుంది. కానీ నాటి కాంగ్రెసు నాయకులు అలాగ అనుకోలేదు. యుద్ధ సమయంలో గట్టిగా పట్టుబడితే గతిలేక ఇంగ్లీషు వారు అడిగినవన్నీ ఇచ్చేస్తారని అనుకొన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టులు కూడా వారితో విభేదించారు. (అందుకే గోడ్సే చెప్పినట్లు కార్మికులు కాంగ్రెసుతో కలిసి రాలేదు) సామ్రాజ్యవాదం కంటే భయంకరమైన నాజీ, ఫాసిజాలను ముందు ఓడించి ఆ తరువాతనే సామ్రాజ్యవాదులతో తలపడాలని వారి వాదం. ఇప్పుడాలోచిస్తే – నిజానికి అప్పుడు స్వాతంత్య్రం దక్కినా, మత కలహాల మధ్య మునిగి తేలే మన దేశం జపాన్ వారి ధాటికి ఆగగలదా అని సందేహం వస్తుంది. కర్మం చాలక మనం జపాన్ వారి వలసగా మారి ఉంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదన్న విషయంలో అనుమానానికి తావులేదు. ఆ మాటకొస్తే ఇతర యూరోపియన్ దేశాలు కూడా వలసవాదంలో బ్రిటన్‌కు తీసిపోవు. ఫ్రెంచివారు వియత్నాంతో వ్యవహరించిన విధానం గుర్తుకు చేసుకుంటే మనమే అదృష్టవంతుల మనిపిస్తుంది.
కానీ ఆ నాటి కాంగ్రెస్ నాయకులకు అలా తోచలేదు. పూర్ణ స్వాతంత్య్రం సాధించడానికి ఇదే అదను అని అంచనా వేసేరు. 'చేయి, లేదా చావు' అన్న ఊపుతో క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టేరు. యుద్ధం సాగుతూండగా పాలకులెవరైనా కొత్త ప్రాంతాలు గెలుచుకోవాలని చూస్తారు కానీ ఉన్న ప్రాంతాలు వదులుకుంటారా? ఈ ప్రాంతాలను శత్రువులు తమకు అనువుగా మలచుకోవచ్చునని బ్రిటిష్ వారు అనుకోరా? అసలే బ్రిటన్‌లో ఉన్న సామ్రాజ్యవాదులు క్రిప్స్ ప్రయత్నాలకు ఎలా గండి కొడదామని చూస్తున్నారు. వీరందరి పుణ్యాన క్రిప్స్ రాయభారం విఫలమైంది. తన వైఫల్యాలకు గాంధీయే కారణం అన్నారు క్రిప్స్. 'ఆయన నాయకత్వంలో కాంగ్రెసు తనకు కావలసినవి అన్నీ కోరుతోంది కానీ బాధ్యతల నుండి పారిపోతోంది, వైస్రాయి కౌన్సిల్లో చేరడానికి ఏమిటి అభ్యంతరం?' అన్నారు. చర్చిల్ 'నేను ముందే చెప్పానుగా' అనేసారు. కాంగ్రెస్, లీగ్ తన్నులాడుకోవడం వలనే ఇంత చక్కని ప్రతిపాదన మంట కలిసిందని అట్లీ అనుకున్నారు. వైస్రాయి మీద, ముస్లిములమీద అధికారం చలాయించడానికే కాంగ్రెసు పట్టు, విడుపు లేకుండా వ్యవహరిస్తోందని లేబరు పార్టీ నాయకులు నమ్మారు. క్రిప్స్‌పై సానుభూతి పెరిగింది.
1942లో క్విట్ ఇండియా తప్పని కాంగ్రెసులోని మహానాయకులకు తోచలేదా? అని ఆలోచిస్తే వారికి గత్యంతరం లేకపోయిందని అర్థమవుతుంది. ప్రభుత్వాలలోంచి బయటకు వచ్చేసిన తర్వాత వారి రెలవెన్స్ (ప్రాసంగికత) తగ్గిపోయిందని అనుకోవాలి. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. ముస్లిం లీగు సాయంతో, గవర్నర్ల సాయంతో బండి నడిచిపోతోంది. వాళ్లకేం చేయాలో పాలుపోలేదు. అలాటి సమయంలో అట్లీ యుద్ధసమయంలో కాంగ్రెసు వారు కూడా కలిసివస్తే కానీ జపాన్ను ఎదుర్కోలేమని అనడంతో వారికి ప్రాధాన్యత వచ్చింది. ఇదే అదనని వారు స్వాతంత్య్రం డిమాండ్లు ముందుకు తెచ్చారు. అది బెడిసికొట్టింది. ఎందుకంటే సంస్థానాధీశులు, ముస్లిం లీగు బ్రిటను పక్షాన వున్నాయి. చదరంగపు ఆటలో ఒక్కోప్పుడు ఒక్కో ఎత్తు మననే చిత్తు చేస్తుంది. తన ఉనికిని చాటుకోవడాని క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభించిన కాంగ్రెసుపై బ్రిటన్‌లో సానుభూతి చూపించేవారు కరువైపోయారు. ఇలాటివాళ్లకు రాజ్యం అప్పగించడం కంటే మనమే పాలించడం మంచిది అనుకొన్నారు ఇంగ్లండులో అత్యధికులు. చర్చిల్ దేశంలో లేకపోవడం వల్ల వార్ కాబినెట్ అట్లీ అధ్యక్షతన సమావేశమయింది. భారతదేశానికి మిత్రుడే అయినా, సమయం కాని సమయంలో అలజడి చేస్తున్న కాంగ్రెసుపై నిర్ధాక్షిణ్యమైన చర్యలు తీసుకోమని ఆయన సూచించారు. నాయకులనందరినీ జైళ్లకు పంపమని ఆదేశాలిచ్చారు. ఏ క్షణాన్నైనా జపాన్ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి యుద్ధంలో బ్రిటన్ను ఓడించవచ్చు. కాబట్టి భద్రతా చర్య కింద విద్రోహకారులందరిపై కఠినమైన చర్యలు తీసుకోమని ఆయన ఆజ్ఞాపించారు.
ఆ సమయంలో కాంగ్రెసు తప్ప తక్కిన పార్టీలు – లీగ్ తదితర ముస్లిం పక్షాలు బ్రిటన్ ప్రభుత్వానికి అండగా నిలిచేయి. వాటి ప్రభుత్వాలు ఏర్పడిన ప్రాంతాల్లో పరిపాలన సాగించేయి. వైస్రాయి కౌన్సిల్లో ఇండియన్లే ఎక్కువమంది ఉండేవారు. మరి వీరందరినీ కలుపుకురాలేని కాంగ్రెసు బ్రిటిషు రాజ్యాన్ని యథాతథంగా తమకు అప్పగించమని ఎలా అడగగలదని అట్లీ ప్రశ్నించారు. తమకు యుద్ధ సమయంలో తోడు నిలిచిన ముస్లిములపై ఆయన అభినందనలు కురిపించారు. అది సహజమే కదా! కాంగ్రెసు అనాలోచిత చర్యల వల్ల అట్లీ ధోరణి ఇలా మారగా, చర్చిల్ ఇంకా కాస్త ముందుకు వెళ్లి కాంగ్రెసును వెనకేసుకు వచ్చినందుకు వార్ కాబినెట్ నుండి క్రిప్స్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. 1936 నుండి వైస్రాయిగా ఉన్న లిన్ లిత్ గోను మారిస్తే పరిస్థితి చక్కబడుతుందని ఎమెరీ అన్నారు. ఆయన బదులు అట్లీను వైస్రాయిగా పంపితే మంచిదన్నారు. కానీ ఉపప్రధానిగా ఉన్న అట్లీను వదులుకోలేమన్నారు చర్చిల్. చివరికి సర్ ఆర్చిబాల్డ్ వేవెల్ను పంపారు వైస్రాయిగా. వేవెల్ పండితుడు, మృదుభాషి. ఇండియా సమస్యను తన చేతుల మీదుగా పరిష్కరిద్దామని ఉత్సాహం కనబరిచారాయన. క్రిప్స్ ప్రతిపాదనను మళ్లీ తిరగదోడదామా అని ఉబలాటపడ్డారు. కానీ క్రితంసారి భంగపడ్డ అట్లీ ఉత్సాహం చూపలేదు. కాంగ్రెసుపై ఆయన ఆశలు పూర్తిగా నశించాయి. వాళ్లు ఏదీ పడనివ్వరని ఆయన అనుకోసాగారు. క్విట్ ఇండియా ఉద్యమం కాంగ్రెసు చేసిన ఘోరమైన తప్పు. దానిలో కలిసి రాలేదని యిప్పటికీ వారు కమ్యూనిస్టులను దేశద్రోహులుగా నిందిస్తారు. కమ్యూనిస్టులు చేసిన పొరపాటేమిటంటే వారు – కార్మికరాజ్యమైన రష్యాను కాపాడుకోవడానికి.. అంటూ వ్యతిరేకించారు తప్ప, యిది అనువైన సమయం కాదు అని వాదించలేదు.
క్రిప్స్ చేసిన 'మౌలికంగా పాకిస్తాన్ ప్రతిపాదన అంగీకరించడం' అనే పాయింటుపై కాంగ్రెసు మండిపడింది. తన జాతీయసభలో తిరస్కరించింది. తన వియ్యంకుడు రాజాజీ విభజనకు అంగీకరించినా గాంధీ అంగీకరించలేదు. అలాటప్పుడు 'కాంగ్రెసు విభజన సిద్ధాంతానికి లొంగిపోయింది' అనడం గోడ్సే పొరపాటు. క్రిప్స్ ప్రతిపాదనను వ్యతిరేకించిన గోడ్సే అతను తిట్టిపోసిన గాంధీని మెచ్చుకోవాలి కదా!- వ్యా.) (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)