Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 10

కాస్సేపటికి వసంతసేన వచ్చింది. పరిచారకులను వెంటపెట్టుకుని వచ్చింది. ఆకాశమంతా కారుమబ్బులతో నిండి వుంది. కుంభవృష్టి కురవబోతున్నట్టుంది. చినుకులు పడుతున్నా, ఉరుములకు, మెరుపులకు వెరవకుండా వచ్చిందయ్యా వసంతసేన అంటూ మైత్రేయుడు చారుదత్తుడితో చమత్కరించాడు. వసంతసేన  గుమ్మంలోకి వచ్చి ''మీ జూదరి ఎక్కడ?'' అని మైత్రేయుడితో సరసమాడింది. 'అబ్బో పెద్ద బిరుదే యిచ్చింది' అనుకుంటూ మైత్రేయుడు అదిగో ముంగిట్లో చెట్లతోపులో కూర్చున్నాడుగా అంటూ చూపించాడు. ఆమె వెళ్లి 'జూదరీ యీ సాయంత్రం నీకు హాయిగా వుందా?' అని పలకరించింది. ఆమెను చూస్తూనే పులకించిన చారుదత్తుడు 'నాకు రాత్రుళ్లు నిట్టూర్పులతో, సాయంత్రాలు విచారంతో గడిచిపోతున్నాయి. నీ రాకతో యీ సాయంత్రం ఆనందమయం అవుతుంది' అన్నాడు. అంతలో ఆమె బట్టలు తడిసిపోయిన సంగతి గ్రహించి యింట్లోకి వెళ్లి ధూతాదేవిని అడిగి పొడి బట్టలు తీసుకురమ్మనమని రదనికకు చెప్పాడు. 

ఆమె వెళ్లిన తర్వాత మైత్రేయుడు 'ఇంతకీ యీ వేళకాని వేళ తమ రాకకు కారణం ఏమిటో' అని వసంతసేనను అడిగేశాడు. 'నువ్వింత అమాయకుడివా?' అంది వసంతసేన చిరునవ్వుతో. 'చూశావా నే చెప్పలే, యింకా డబ్బు రాబట్టడానికి..' అన్నాడు మైత్రేయుడు చారుదత్తుడితో రహస్యంగా. వసంతసేన దాసి ప్రారంభించింది 'మీరిచ్చిన రత్నహారాన్ని వసంతసేన జూదంలో పోగొట్టుకుంది. అవతలివాడేమో రాజుగారి గూఢచారి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు..' అని. మైత్రేయుడు కంగు తిన్నాడు - 'నేను చెప్పినదే నువ్వు చెప్తున్నావే..' అన్నాడు. '... అందువలన ఆ జూదగాడు దొరికేవరకు మీరు దయచేసి యీ నగలపాత్రను స్వీకరించండి' అంటూ దాసి నగలపాత్రను ముందు పెట్టింది. దాన్ని చూస్తూనే మైత్రేయుడు ఆలోచనలో పడ్డాడు. 

''దీన్ని యింతకుముందు ఎక్కడైనా చూశారా?'' అని దాసి అడిగింది చిలిపిగా.

మైత్రేయుడు తడబడ్డాడు. ''పాత్ర అందంగా తయారుచేశారని చూస్తున్నా'' అని కప్పిపుచ్చుకుని పక్కకు వచ్చి చారుదత్తుడితో ''మిత్రమా, మన యింట్లోంచి దొంగిలించబడిన పాత్ర యిదేనయ్యా' అన్నాడు. చారుదత్తుడు 'మనం చెప్పిన కట్టుకథనే వసంతసేన చెప్తోంది. ఆ పాత్ర అదే నంటావా?' అన్నాడు మైత్రేయుడితో ఆంతరంగికంగా. ఆగు అడిగి చూస్తాను అని మైత్రేయుడు వసంతసేన దాసి నుంచి విషయమంతా గ్రహించి చారుదత్తుడికి చెప్పాడు. 

చారుదత్తుడు ఆనందపడుతూ దాసి కేసి చూసి ''ఇదంతా నిజమేనా?'' అని అడిగాడు. ఆమె ఔననగానే యిదిగో యీ వుంగరం కానుకగా తీసుకో అని యివ్వబోతూ, ఉంగరం లేని తన బోసి చేతిని చూసి సిగ్గుపడ్డాడు. తన లేమిని గుర్తు చేసుకుని వగచాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దానగుణం కనబరచిన అతన్ని చూసి వసంతసేన 'ఇందుకే వలచాను' అనుకుంది. 

చారుదత్తుడికేసి తిరిగి 'ఈ రత్నహారం యిచ్చి నన్ను చిన్నబుచ్చటం భావ్యంగా లేదు' అంది. అతను సంజాయిషీ చెపుతూ ''దయచేసి నన్ను అర్థం చేసుకో. మా యింటి నుంచి నగలపాత్ర అపహరించారంటే ఎవరు నమ్ముతారు? అందుకే అబద్ధమాడవలసింది'' అన్నాడు.

ఇక వెళ్లవలసిన సమయం ఆసన్నమైందని గుర్తు చేయడానికన్నట్లు మైత్రేయుడు ''కూర్చున్నవాళ్లను లేవగొట్టేటట్లు దిక్కుమాలిన వాన వచ్చి పడింది చూశావా'' అన్నాడు. చారుదత్తుడు ''మిత్రమా, వానను తిట్టకు. ఈ వాన వల్లనే కదా, వసంతసేన యీ రాత్రి యిక్కడే వుండిపోబోతోంది'' అన్నాడు. వసంతసేన అంగీకారంగా తల వూపింది. అప్పుడు ''వసంతసేనా యీ వసారా శిథిలావస్థలో వుంది, యిక్కడ వుండడం క్షేమం కాదు, రా లోపలికి వెళదాం.'' అంటూ లోపలకి నడిచాడు. వసంతసేన అతన్ని అనుసరించి గదిలోకి వెళ్లింది. వాళ్లిద్దరూ ఆ రాత్రి ఏకశయ్యాగతులయ్యారు. 

మర్నాడు పొద్దెక్కినా వసంతసేన నిద్ర లేవకపోవడంతో దాసి వచ్చి లేపింది. లేస్తూనే ''చారుదత్తుడు ఎక్కడ?'' అని అడిగింది వసంతసేన. ''ఆయన పొద్దున్నే పుష్పరండకమనే శిథిలఉద్యానవనానికి వెళ్లాడు. మీకోసం గూడు బండి పంపుతాను, అక్కడకు రమ్మన్నాడు'' అని చెప్పింది దాసి. సరే అంటూనే 'రాత్రి చీకటిలో యిల్లు సరిగ్గా చూడలేదు. వెళ్లి చూడవచ్చంటావా? నా కారణంగా చారుదత్తుని భార్య బాధపడుతోందేమో' అని సంకోచించింది. 'లేదు, లేదు చారుదత్తుడి ఆనందమే ఆమె ఆనందం. నువ్వు వెళ్లిపోతేనే ఆమె బాధపడుతుంది' అంది దాసి. 

'ఆమె మంచితనానికి నేనే ముందుగా బాధపడాలి. ఈ రత్నహారాన్ని తీసుకుని నువ్వు ఆవిడ వద్దకు వెళ్లి చారుదత్తుని గుణాలకు లొంగిపోయిన యీ దాసి ఆమెకు కానుకగా యిస్తోందని చెప్పి యిచ్చిరా' అంది వసంతసేన. కాస్సేపటికి ఆమె తిరిగి వచ్చి ''ధూతాదేవి తీసుకోలేదు. 'నా భర్త నీకు యిచ్చిన హారాన్ని నేను తీసుకోకూడదు. నా భర్తే నాకు వెలలేని ఆభరణం' అని చెప్పమంది.'' అని తెలిపింది. వసంతసేన తన సవతి ఔదార్యానికి సంతోషించింది.

అంతలో చారుదత్తుడి కొడుకు రోహసేనుడు ఏడుస్తూ వచ్చాడు. రదనిక అతన్ని ఓదారుస్తోంది. సంగతేమిటని వసంతసేన అడిగి తెలుసుకుంది. పొరుగుంటి వ్యాపారస్తుడి కొడుకు బంగారుబండి తెస్తే యీ అబ్బాయి దానితో ఆడుకున్నాడు. కాస్సేపటికి ఆ అబ్బాయి బండి తీసుకుని వెళ్లిపోయాడు. ఇతను బంగారు బండి కావాలని మారాం చేయసాగాడు. అతన్ని వూరుకోబెట్టడానికి రదనిక మట్టితో బండి తయారు చేసి ఆడుకోమంటోంది. ఈ మట్టిబండి ఎవడికి కావాలి అంటూ ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. 

అతన్ని వూరుకోబెట్టడానికి వసంతసేన ''మీ నాన్నగారి సంపద కరిగిపోవడం చేతనే నువ్వు యింకోళ్ల  బండి కోసం ఏడవాల్సి వస్తోంది. నువ్వు కూడా బంగారుబండితో ఆడుకుంటావులే'' అని ఓదార్చబోయింది. పిల్లాడు రదనిక కేసి తిరిగి ''ఎవరీవిడ?'' అని అడిగాడు. ''నీ తల్లి'' అంది రదనిక. ''మా అమ్మ వంటి మీద నగలుండవు. ఇన్ని నగలున్నావిడ మా అమ్మ ఎలా అవుతుంది?'' అన్నాడు పిల్లాడు అమాయకంగా. అది వినగానే వసంతసేన దుఃఖించింది.  ఈ పిల్లాడు పుట్ట్టేటప్పటికే చారుదత్తుడి ఐశ్వర్యమంతా పోయిందన్నమాట అనుకుంది. వెంటనే తన నగలన్నీ తీసి పడేసి ''చూశావా, యిప్పుడు నీ తల్లి నయ్యాను.'' అంది. ''నువ్వు యివన్నీ తీసుకుని బంగారు బండి కొనుక్కో.'' అంది.

పిల్లవాడు ''నేను తీసికోను. నువ్వు ఏడుస్తూ యిస్తున్నావు.'' అన్నాడు.

వసంతసేన వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుని ''ఏడవనులే, నువ్వు వెళ్లి ఆడుకో'' అంది. ఆ మట్టిబండిలోనే తన నగలన్నీ పోసి రదనికతో ''ఇవి పెట్టి పిల్లవాడికి బంగారు బండి కొనిపెట్టు'' అంది. రదనిక, పిల్లవాణ్ని తీసుకుని బయటకు వెళ్లిపోతూండగా అప్పుడే చారుదత్తుడి సేవకుడైన వర్ధమానకుడు ఎదురై రదనికతో ''వసంతసేనగారి కోసం గూడుబండి తెచ్చి పెరటిగుమ్మం దగ్గర పెట్టాను'' అని చెప్పాడు. ''కాస్సేపు ఆగు, వసంతసేన అలంకారం పూర్తి కాలేదు'' అని చెప్పింది రదనిక. ''అయితే బండిలో తివాచీ వేయించుకుని మళ్లీ వస్తాను. వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చాను. బండి యిక్కడే వదిలేస్తే యీ పొగరుబోతు గిత్తలు బండి లాక్కుపోతాయి. బండి తీసుకెళ్లి మళ్లీ వస్తా.'' అంటూ అతను వెళ్లిపోయాడు. అలంకరించుకోవడానికి వసంతసేన లోపలకి వెళ్లింది.(సశేషం)

మృచ్ఛకటికమ్‌ పాత్రల పరిచయం

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు  2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?