జూన్ 2 ను సెలబ్రేట్ చేసుకోవడం గురించి నా వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పి ముందుకు వెళతాను. తెలంగాణ ఆవిర్భవించాలని కోరుకున్నవాళ్లకు అది నిశ్చయంగా ఉత్సవదినమే. కానీ సమైక్యత కోరుకున్నవారికి, విభజన సరిగ్గా జరగటం లేదని బాధపడేవారికి అది శోకదినమే. 1947 ఆగస్టు 15 అనగానే మనందరికీ ఒళ్లు పులకరిస్తుంది. పరపీడన నుండి విముక్తి చెందామని! కానీ దేశవిభజనలో సర్వం కోల్పోయిన పంజాబీలకు, సింధీలకు, బెంగాలీలకు ఆ రోజు గుర్తు చేయగానే ఒళ్లు జలదరిస్తుంది. ఎవరి దృక్కోణం వారిది. అన్యాయంగా తెలుగువాళ్లను విడగొట్టారు అని వాపోతున్న పవన్ కళ్యాణ్‌కు అది ఉత్సవదినంగా తోచడం విడ్డూరం అని నేను వ్యాఖ్యానించాను.
రాష్ట్రం విడిపోతున్నపుడు ఆస్తుల, అప్పుల, ఉద్యోగుల విభజనలో ఒకే పద్ధతి అనుసరించడం లేదు. ఆస్తులు, అప్పుల విషయంలో జనాభా నిష్పత్తి ప్రకారంట, విద్యుత్ ఎలాట్‌మెంట్‌లో గత ఐదేళ్లలో వినియోగం నిష్పత్తి తీసుకుంటారట. హైదరాబాదులో విద్యుత్ వినియోగం ఎక్కువగా వుంది కాబట్టి ఎన్‌టిపిసి నుండి తెలంగాణకు ఎక్కువ విద్యుత్ కేటాయిస్తారట. (రాబోయే రోజుల్లో సీమాంధ్రలో తెగ అభివృద్ధి జరిగిపోతుందని అన్ని పార్టీలు చెప్పేస్తున్నాయి. ఊరూరా పరిశ్రమలు వచ్చేస్తాయంటున్నారు. తగినంత విద్యుత్ ఎలాట్ చేయకపోతే యంత్రాలను చేత్తో తిప్పుతారా?) ఉద్యోగుల వద్దకు వచ్చేసరికి జిల్లాల సంఖ్య బట్టిట. అలా తేడాతేడాగా ఎలా చేస్తారు? జిల్లాల్లో పెద్దవున్నాయి, చిన్నవున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే రెండు జిల్లాల పెట్టు. అయినా ఉద్యోగులను విడగొట్టడంలో దాన్ని ఒకటిగానే లెక్క వేస్తారట. చిన్నపుడు కథ చదివాను. పంపకాల్లో అన్నగారు తెలివితక్కువ తమ్ముడితో 'అన్నీ సమానంగా పంచుకుందాం. ఆవు ముందు భాగం నీది, వెనకభాగం నాది. చెట్టు దగ్గరకి వచ్చేసరికి కింద భాగం నీది, పై భాగం నాది' అన్నాట్ట. అంటే పాలు, కాయలు అన్నవి. ఆవుకి మేత, చెట్టుకి నీళ్లు భారం తమ్ముడిది. అలా జరక్కుండా చూడాల్సిన కేంద్రం నుండి వచ్చిన టీము ఎవర్నీ సంప్రదించకుండా తమ యిష్టం వచ్చినట్లు చేస్తోంది. గవర్నరు అంటే కేంద్రం చెప్పినట్టు ఆడే మనిషే కదా. విభజనలో అన్ని అంశాలకూ అన్నిటికీ ఒకటే కొలబద్ద వుండాలని పోట్లాడడానికి ప్రజాప్రతినిథులు లేరు. ఇలాటి పరిస్థితి తెచ్చిపెట్టినందుకు కాంగ్రెసు, బిజెపి, దోహదపడిన టిడిపి, వైకాపా, తెరాస, సిపిఐ అందరూ దోషులే. పవన్ కళ్యాణ్ కంటికి యివన్నీ కనబడటం లేదా? అని నా ప్రశ్న.
ఇక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు గురించి కొందరికి సందేహాలు వచ్చాయి. ఆంధ్రులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవడాన్ని తొలి అడుగు కిందే చూశారు. అప్పటి లక్ష్యం – వట్టి ఆంధ్ర కాదు, విశాలాంధ్ర! ఆ ఉద్యమం పేరే – విశాలాంధ్ర ఉద్యమం. అదే సమయంలో సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం అవీ నడిచాయి. అలాటిదే యిదీనూ. హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణనే కాదు, ఒడిశాలోని గంజాం, కోరాపుట్ జిల్లాలు, కర్ణాటకలోని బళ్లారి జిల్లా అన్నీ కలుపుకోవాలనే గమ్యంతో సాగిన ఉద్యమం అది. కర్నూలును తాత్కాలిక రాజధానిగానే చూశారు కాబట్టి అక్కడ గుడారాల్లో కాలక్షేపం చేశారు. లేకపోతే మూడేళ్లలో భవంతులు కట్టలేకపోయారా? తెలుగువాళ్లందరమూ హైదరాబాదు రాజధానిగా కలిసి వుండబోతున్నాం అనే భావనతో ఆంధ్ర, తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూసిన సమయమది. వావిలాల గోపాలకృష్ణయ్యగారి పుస్తకం, ఆ సబ్జక్ట్‌పై యితరుల పుస్తకాలు, కమ్యూనిస్టుల రచనలు చదివితే ఆ విషయం స్పష్టమవుతుంది. మాకు రాజధాని లేదు కాబట్టి హైదరాబాదును కబ్జా చేద్దాం అని ఆంధ్రులు తెలంగాణతో కలవలేదు. పరస్పరావగాహనతోనే కలియడం జరిగింది. ఐక్యత కోసం బూర్గుల వంటి మహానుభావులు పదవీత్యాగం చేసి తప్పుకున్నారు. ఈనాటి తెలుగు నాయకులు పదవుల కోసం ఐక్యతను బలి చేశారు. ఒడిశా, కర్ణాటకలో తెలుగు ప్రాంతాల మాట దేవుడెరుగు, తెలుగునేలలోనే తెలుగువాడు పరాయివాడయ్యాడు. భద్రాచలం డివిజన్ వారి బతుకు మరీ ఘోరం. వాళ్లని కాస్సేపు ఆంధ్ర ప్రాంతీయులంటారు, కాస్సేపు తెలంగాణ ప్రాంతీయులంటారు. వాళ్లెవరో కేంద్రప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఢిల్లీ కాళ్లకు మనం మొక్కితే వచ్చిన ఫలితం యిది!
ఇక పవన్ వద్దకు వస్తే – 'బిజెపితో పవన్ చేతులు కలుపుతారనీ అంటున్నారు.' అని రాస్తే పవన్ నీకు చెప్పాడా? అని కొందరు పవన్ అభిమానులు ప్రశ్నించారు. ఈ పాటికి అందరి సందేహాలు నివృత్తి అయి వుంటాయి. పవన్ మోదీనికి కలవడం, ఆయనను ప్రశంసించడం జరిగింది. బిజెపి-టిడిపి-జనసేన-లోకసత్తా మహా కూటమి తయారవుతోందని, దానికి యిక తిరుగు లేదని మీడియాలో ఒక వర్గం అంటోంది. దీనిలో లోకసత్తా-టిడిపి కలవడంలో పెద్ద విశేషం లేదు. జెపిగారు చంద్రబాబు వ్యతిరేక ముసుగు తీసేశారు. బాబు ఏమంటే అదే యీయనా అంటారు. భావవ్యక్తీకరణలోనే తేడా! పవన్ తనతో కలిస్తే బాగుంటుందని బాబు బహిరంగ ఆహ్వానం పలికారు. దానికి స్పందనగా 'చంద్రబాబు మంచి లీడరు' అని పవన్ అన్నారంతే. మోదీని కలవడం మాత్రం జరిగింది. ఈ వరసలో అతి ముఖ్యమైనది బిజెపి-టిడిపి పొత్తు. అది వాళ్లిద్దరికీ ఎంతవరకు లాభిస్తుందో తెలియదు. ఈ పొత్తువలన తెలంగాణలో బిజెపికి నష్టం, సీమాంధ్రలో టిడిపికి నష్టం. అందుచేత బిజెపి తెలంగాణలో తెరాసతో, సీమాంధ్రలో టిడిపితో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్య పడనక్కరలేదు. పార్టీలకు ఓ విధానం అంటూ లేకుండా పోయింది. ఆంధ్రలో ఒకలా, తెలంగాణలో మరొకలా పొత్తులు పెట్టుకుంటామని సిపిఐ బాహాటంగా ప్రకటించింది. తెరాస, కాంగ్రెస్, టిడిపిలతో ఏకసమయంలో బేరసారాలు సాగించింది. చివరకు కాంగ్రెసుతో కుదిరింది. 12 ఎసెంబ్లీ నియోజకవర్గాలు అడగడంతో ఆ స్థానాలలోని కాంగ్రెసు సిటింగ్ ఎమ్మెల్యేలకు ఒళ్లు మండింది. చివరకు ఎలా తేలుతుందో తెలియదు.
సిపిఎం ఆంధ్రలో వైకాపాతో పెట్టుకుంటుందేమో అనుకుంటూ వుంటే తెరాసతో పొత్తుకి ఉవ్విళ్లూరింది. సమైక్యవాదం కోసం కడదాకా నిలబడి, విభజనకై పోరాడిన పార్టీతో పొత్తేమిటి అంటే అదంతే! పొత్తులకోసం తలుపులు తెరిచి వుంచాం అంటూ తెరాస అందర్నీ వూరిస్తూ, ఎవరూ వేరేవాళ్లతో పొత్తులు కుదుర్చుకోకుండా చూస్తోంది. తెరాసకు కాంగ్రెసుతో పొత్తంటే సిటింగ్ ఎమ్మెల్యేలే 60 మంది వున్నారు. వాళ్లకు టిక్కెట్లిస్తే తెరాస వారికి ఏం మిగలవు. అదే బిజెపితో అయితే ఆ బాధ లేదు. అందువలన తెరాస-బిజెపి పొత్తు ఆచరణసాధ్యం. ఎందువలననో కానీ అలా జరగటం లేదు. తెలంగాణ బిజెపి వాళ్లకు సొంతంగా చాలా బలం వుందన్న అపోహ! బిజెపి కేంద్రనాయకత్వానికి టిడిపితో వెళితే బాగుంటుందన్న అంచనా! అన్ని నిర్ణయాలు ఢిల్లీలోనే తీసుకుంటూంటే యిలాగే అఘోరిస్తుంది. ఆ పొత్తును క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఆమోదించకపోతే ఏం లాభం? స్థానిక బిజెపి జనసేనను ఆమోదిస్తోందో లేదో స్పష్టం కాలేదు. మోదీ చెపితే కాదనలేక సరేననవచ్చు. అలాటప్పుడు జనసేన సీమాంధ్రలో టిడిపితో, తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకుంటుందా? ఏమో! (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)