మాస్ మహరాజా రవితేజ మళ్లీ దూకుడు పెంచుతున్నాడు. ఒక సినిమా విడుదల కాకమునుపే మరో చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదివరకు ఆయన కెరీర్ ఇలాగే సాగేది. యేడాదికి నాలుగు సినిమాల్లో నటించేవాడు. మూడు నెలలకో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేలా చూసుకొనేవాడు.
ప్రస్తుతం `పవర్`లో నటిస్తున్న రవితేజ… తదుపరి ఎవరితో చేయాలనే విషయంపై కసరత్తులు మొదలుపెట్టాడని తెలుస్తోంది. మాస్ సినిమాలకి పెట్టింది పేరైన బి.గోపాల్ కూడా రవితేజకి ఓ కథ వినిపించినట్టు సమాచారం. అందులో నటించేందుకు కూడా రవితేజ ఒప్పుకొన్నారని పరిశ్రమలో ప్రచారం సాగుతోంది.
మరి అందులో వాస్తవం ఎంతుంది? నిజంగా రవితేజ బి.గోపాల్ లాంటి వెటరన్ దర్శకుడితో సినిమా చేసేందుకు సాహసిస్తాడా? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. బి.గోపాల్ ప్రస్తుతం గోపీచంద్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా ఫలితాన్ని బట్టే రవితేజ సినిమా చేస్తాడని మరికొంతమంది చెబుతున్నారు.