మోహన మకరందం : ఎంత పని చేశావయ్యా?

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement ఎంత పని చేశావయ్యా? ఎంతటివారికైనా బాస్‌ను మెప్పించడం చాలా కష్టం. చాలా సిన్సియర్‌గా పనిచేసినంత మాత్రాన ఆయన ఆనందించేస్తాడని అనుకోకూడదు. మనం ఎంత న్యాయంగా,…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

ఎంత పని చేశావయ్యా?

ఎంతటివారికైనా బాస్‌ను మెప్పించడం చాలా కష్టం. చాలా సిన్సియర్‌గా పనిచేసినంత మాత్రాన ఆయన ఆనందించేస్తాడని అనుకోకూడదు. మనం ఎంత న్యాయంగా, సమయస్ఫూర్తితో ప్రవర్తించినా వాళ్లకు అసంతృప్తి కలుగుతుంది. మీ కంపెనీ మెషిన్లు తయారుచేస్తోందనుకోండి. మీ వద్దనుండి ఓ మెషిను కొన్న కంపెనీ ఫిర్యాదు చేసింది – అది సరిగ్గా పని చేయడం లేదని, మీరిచ్చిన గ్యారంటీ ప్రకారం దాన్ని మార్చి కొత్తది యివ్వాలనీ! మీ బాస్‌కు తెలుసు – ఆ డిమాండు న్యాయసమ్మతమైనదని. అయినా మిమ్మల్ని పంపిస్తూ గట్టిగా చెపుతాడు – ''ఏదో ఒకటి చెప్పి తప్పించుకుని వచ్చేసేయ్‌. సరేననకు.'' అని. మనం ఆ క్లయింటు వద్దకు వెళ్లి మాట్లాడేటప్పుడు పరిస్థితులు పూర్తిగా మన చేతిలో వుండవు. యంత్రాన్ని తీసేసుకుని కొత్తది యివ్వకపోయినా, కొన్ని భాగాలైనా మారుస్తామని ఒప్పుకోక తప్పదు. ఆ మాత్రం కమిట్‌మెంట్‌ కూడా లేకుండా వుండాలని మీ బాస్‌ ఆశిస్తాడు. ఒప్పేసుకుని వచ్చినందుకు మీపై చికాకు పడతాడు. తప్పదు!

పార్లమెంటులో క్వశ్చన్స్‌ విషయంలో జాయింటు సెక్రటరీగా నాకు యిలాటి అనుభవాలు ఎదురయ్యాయి. అసలు జాయింటు సెక్రటరీ ఉద్యోగమే ఒక తమాషా అయిన హోదా. 

ఐ.ఎ.ఎస్‌లో ఎన్నో రకాల ఉద్యోగాలుంటాయి. ఎన్నో స్థాయిలుంటాయి. ఎన్నో పదవులుంటాయి, ప్రతీ చోటా మంచీ చెడూ ఎన్నో రకరకాల అనుభవాలుంటాయి. కాని మూడు ఉద్యోగాలు మాత్రం 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నట్టు – జిల్లా కలెక్టర్‌, రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి, కేంద్రస్థాయిలో కార్యదర్శి – యివి ప్రత్యేకమైనవి. ఈ మూడూ చేయడం అనేది ఒక విశేషమైన అనుభవం, అదృష్టం. అదేదో 'పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టిచూడు' అన్నట్టు యివి చేస్తే గాని కష్టం సుఖం పూర్తిగా వంటబట్టినట్టు కాదు. ఇవి చేస్తే 'ఏదో యీ సర్వీస్‌లో జాయినందుకు ఒక  సర్వసమ్మతమైన ఉన్నతమైన స్థానాన్ని సాధించాం' అని అనుకునేందుకు వుంటుంది. 

xxxxxx

జనసామాన్యం దృష్టిలో ఐయేయస్‌ అనగానే జిల్లా కలక్టరే గుర్తుకు వస్తాడు. జిల్లాకు కింగ్‌ అనుకుంటారు. అది తప్పకుండా చెయ్యాల్సిన ఉద్యోగాలలో ఒకటి. ఎస్‌.ఆర్‌.శంకరన్‌ గారు చెప్పేవాడు – 'కలెక్టర్స్‌ ఇన్‌ ఆంధ్రా రిపోర్ట్‌ ఓన్లీ టూ ద చీఫ్‌ మినిస్టర్‌ అండ్‌ గాడ్‌' అని. (ఆంధ్రాలో కలక్టర్లు ముఖ్యమంత్రికి, భగవంతుడికి తప్ప వేరెవ్వరికీ జవాబు చెప్పుకోవలసిన పని లేదు) ఆ బంగారు రోజుల్లో కలక్టరు వేరే ఎవరికీ సంజాయిషీలు చెప్పుకునే అవసరం వుండేది కాదు. 

చీఫ్‌‌ సెక్రటరీ పదవి గురించి వేరే చెప్పేదేముంది? రాష్ట్రంలో అధికారులలో అత్యున్నత పదవి. ఆర్నెల్లు చేసినా అందరికీ గుర్తుండి పోతారు. ఎవరిని వేస్తారు? సీనియారిటీ ప్రకారం వేస్తారా? ముఖ్యమంత్రికి అనువైన వాళ్లని వేస్తారా? అని ఆ పోస్టింగు గురించి ప్రతి విషయం మీడియాలో చర్చల ద్వారా సామాన్యులకు కూడా తెలుస్తుంది. ఇక సెక్రటరీ టు ద ఆఫ్‌‌ గవర్నమెంట్‌ ఆఫ్‌‌ ఇండియా. దేశం మొత్తానికి పథకాలను రూపొందించడం, పర్యవేక్షించడం, నియమనిబంధనలు ఏర్పరచడం – యిలాటి బాధ్యతలు వుంటాయి. ఏ రాష్ట్రంలో పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఎక్కడ ఎడ్మినిస్ట్రేషన్‌ బాగుంది, ఎక్కడ బాగులేదు, అక్కడి వాతావరణం ఏమిటి యివన్నీ పూర్తి అవగాహనకు వస్తాయి. 

గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాలోనే జాయింట్‌ సెక్రటరీ అని స్థాయి వుంది. అది ఒక పిక్యులియర్‌ లెవెల్‌.  ఐ.ఎ.ఎస్‌.లో ఆ ఉద్యోగం ఒకసారి చేసి తీరాలి. పైన చెప్పిన మూడూ చేయడం ఒక వంతు, ఆ ఒక్క లెవెల్లో చేయడం మరో వంతు. 

జాయింట్‌ సెక్రటరీ కింద డైరెక్టర్‌ వుంటాడు, డిప్యూటీ సెక్రటరీ వుంటాడు, అండర్‌ సెక్రటరీలు వుంటారు. పైన ఎడిషనల్‌ సెక్రటరీ వుంటాడు. ఒక్కోసారి స్పెషల్‌ సెక్రటరీలు వుంటారు. కాని జాయింటు సెక్రటరీ స్థాయి కున్న విలువ దానిదే. మొత్తం వ్యవస్థకు అతనే యిరుసు. అంతా అతని చుట్టూ పరిభ్రమిస్తుంది. కరక్టుగా చెప్పాలంటే 'ద లెవెల్‌ ఈజ్‌ ద టాప్‌ ఆఫ్‌ద  బాటమ్‌, బాటమ్‌ ఆఫ్‌ ద టాప్‌' అన్నమాట. అంటే పెద్దవాళ్లలో చిన్నవాడు, చిన్నవాళ్లలో పెద్దవాడు. 

ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశానికి జాయింట్‌ సెక్రటరీ వెళితే, ఎవరూ ఏమి అనరు. 'ఓహో జాయింట్‌ సెక్రటరీ కదా ఫర్వాలేదు రావచ్చు' అనుకుంటారు.

ఇంకో పక్కన చూస్తే జాయింటు సెక్రటరీ స్వయంగా ఆఫీసులోకి వెళ్లిపోయి గుమాస్తా దగ్గరకి వెళ్లి ఫైల్‌ లాక్కుని కూడా చూడవచ్చన్నమాట. ఎందుకంటే ఆయన కింద పనిచేసే విభాగాలన్నిటికీ ఆయన హెడ్‌ కాబట్టి. అందువలన ఆయన హక్కులు, బాధ్యతలూ అన్నీ ఎలాస్టిక్‌. పై నుండి కింద దాకా ఎక్కడికైనా వెళ్లగలడు, పని సాధించుకుని రాగలడు. ఇంత సౌలభ్యం ఎక్కడా లేదు. అందుకనే కేంద్రప్రభుత్వంలో వ్యవస్థను ఆఫీసర్‌-డ్రివెన్‌ సిస్టమ్‌ అంటారు, రాష్ట్రాలలో వున్నది ఆఫీస్‌-డ్రివెన్‌ సిస్టమ్‌. 

xxxxxx

జాయింటు సెక్రటరీ విధుల్లో ఒక ముఖ్యమైన విధి పార్లమెంటులో ప్రశ్నలకు హాజరవడం. పేపర్లు చదివేవారు, టీవీలు చూసేవారు క్వశ్చన్‌ అవర్‌ అనే మాట తరచుగా వింటూ వుంటారు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు ఎంపీలకు ముడుపులు ముట్టిన ఉదంతాలు కూడా ఆ మధ్య పేపర్లలో వచ్చాయి కాబట్టి కొంత అవగాహన వుండి వుంటుంది. అయినా కాసిన్ని వివరాలు చెపుతాను.

పార్లమెంటుకి ప్రజాప్రతినిథులుగా వెళ్లినవారు ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తుతారు. ఫలానా పథకం ప్రవేశపెట్టి మూడేళ్లయింది కదా, దాని వలన ఎంతమంది లబ్ధి పొందారు? దాని అమలులో అవినీతి జరిగిన మాట వాస్తవమేనా? ఇలాటివి. ఇరుకున పెట్టే ప్రశ్నలు సాధారణంగా ప్రతిపక్షంవాళ్లే అడుగుతారు. సమాచారం కోసం అడిగే ప్రశ్నలు అధికారపక్షం వారూ వేస్తారు. ఎవరు ఏం అడిగినా సంబంధిత శాఖ చూసే మంత్రిగారు జవాబు చెప్పాలి. ఆ శాఖ కార్యాలయం ఆ ప్రశ్న గురించిన సమాచారం సేకరించి మంత్రిగారికి అందిస్తుంది. దాన్నిబట్టి మంత్రిగారు పార్లమెంటులో సమాధానం చెప్తారు. అది మౌఖికంగా వుండవచ్చు, లిఖితపూర్వకంగా వుండవచ్చు. సెషన్‌లో వున్నన్ని రోజులూ పార్లమెంటులో అనేక ప్రశ్నలు వస్తాయి. అయితే వాటన్నిటికీ మంత్రిగారు అప్పటికప్పుడే జవాబు చెప్పనక్కరలేదు. కనుక్కుని చెప్తాం అనవచ్చు.

ఈ వెసులుబాటు వుంది కాబట్టి, మంత్రులు సమాధానం చెప్తాం చెప్తాం అంటూ ఏళ్లూ, పూళ్లూ గడిపేస్తారన్న భయం చేత, సభ్యులు ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నలు వేసి కార్యకలాపాలకు అడ్డంకులు కలిగించకుండా క్వశ్చన్‌ అవర్‌ (ప్రశ్నోత్తరాల వేళ) అని ప్రత్యేకంగా ఏర్పరచారు మన రాజ్యాంగ నిర్మాతలు. నిర్ధారించిన ఒక గంట సేపు సమయంలో వేసిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం యిచ్చి తీరాలి. ఆ సమాధానంపై ప్రశ్న అడిగిన సభ్యుడు అనుబంధ ప్రశ్న కూడా వేయవచ్చు. దానికి కూడా మంత్రిగారు సమాధానంతో రెడీగా వుండాలి.

అందువలన రెండు రకాల ప్రశ్నలుంటాయన్నమాట. ఏ సమయంలోనైనా అడగగలిగేవి అన్‌స్టార్‌డ్‌ క్వశ్చన్స్‌. (తారరహిత ప్రశ్నలందామా?) వీటికి మౌఖికంగా సమాధానం యివ్వనక్కరలేదు. నిర్ణీత సమయపరిమితిలో లిఖితపూర్వకంగా సమాధానం యివ్వవచ్చు. ఇక ప్రశ్నోత్తరాల సమయం (క్వశ్చన్‌ అవర్‌)లో అడిగే ప్రశ్నలు – స్టార్‌డ్‌ క్వశ్చన్స్‌ (తార ప్రశ్నలు అనుకుందాం)

పార్లమెంటులో ఎవరైనా అన్‌స్టార్‌డ్‌ క్వశ్చన్‌ వేస్తే పార్లమెంటు ద్వారా మా శాఖకు వస్తుంది. దానికి జాయింటు సెక్రటరీ బాధ్యుడన్నమాట. ఆ ప్రశ్నకు జవాబు పంపుతాము. జవాబు కూడా ఆషామాషీగా పంపితే కుదరదు. అది ప్రశ్నవేసిన సభ్యుడి సందేహాలను నివృత్తి చేసినట్టు వుండాలి తప్ప, కొత్త సందేహాలను పుట్టించకూడదు. అందువలన అబ్బ, కాస్త జాగ్రత్తగా చేయాలి అనుకుని చేస్తాం. ఆ సమాధానం మంత్రిగారు చూసి ఆమోదించాక అప్పుడు పార్లమెంటులో చదువుతారు.

ఇక స్టార్‌డ్‌ క్వశ్చన్‌ వచ్చిందంటే మాకు దడే! ఎందుకంటే మేం సమాధానం తయారుచేసి మంత్రిగారికి యిచ్చి జవాబు చెప్పించడంతో పని అయిపోదు. ప్రశ్న అడిగినవాళ్లు మా సమాధానంతో తృప్తి పడకపోతే సప్లిమెంటరీ ప్రశ్న అడగవచ్చు. దానికి మంత్రి అక్కడికక్కడ జవాబు చెప్పాలి. అందువలన 'నోట్‌ ఫర్‌ పాజిబుల్‌ సప్లిమెంటరీస్‌' అని నోట్‌ తయారు చేసి మంత్రిగారికి ముందుగానే బ్రీఫ్‌ చేసి సిద్ధం చేస్తాం. ఒక్కొక్కప్పుడు మేము అనుకున్న దాని కంటె పార్లమెంటు సభ్యుడు మరీ ముందుకు వెళ్లి అనుబంధ ప్రశ్నలడిగితే…? అందుకని మేము పార్లమెంటు హాలుకి పక్కనే ఆఫీసర్స్‌ బాక్స్‌లో కూర్చుని వాటికి సమాధానం రాసి పంపాలి. ఆ సమాధానం రాసి పంపడానికి సమాచారం, సరంజామాతో మేం అక్కడకి వెళ్లాలి.

xxxxxx

ఓ కథ వుంది. ఓ రాజుగారికి తరచుగా కలలు వచ్చేవి. ఆ కలల అర్థం ఏమిటో, వాటి వలన తన భవిష్యత్తు ఎలా వుండబోతుందో విశ్లేషించడానికి తన ఆస్థానంలో పండితుల్ని పెట్టుకున్నాడు. రోజూ ఆస్థానానికి వచ్చి ముందురోజు రాత్రి వచ్చిన కలలు చెప్పడం, ఈ పండితులు వాటికి అర్థాలు చెప్పడం – యిలా సాగేది. ఓ సారి ఆ రాజుగారికి ఓ కల వచ్చింది కానీ మర్చిపోయాడు. మర్నాడు సభలో ప్రకటించాడు. కలలకు అర్థమే కాదు, అసలు కల ఏం వచ్చిందో కూడా చెప్పాలని. కల ఏమిటో చెప్పాలట, ఆ పై అది సూచించే భవిష్యత్తు ఏమిటో చెప్పాలట. పండితులు గుడ్లు తేలేశారు. అర్థం చెప్పమంటే ఏదో చెప్పగలరు కానీ ఎవరికి ఏ కల వస్తుందో ఎదుటివాళ్లు ఎలా చెప్పగలరు? 

కథలో ఎవరో గొఱ్ఱెల కాపరి వచ్చి సమస్య పరిష్కరిస్తాడనుకోండి కానీ పార్లమెంటులో గొఱ్ఱెల కాపర్లను రానివ్వరు కాబట్టి ఆస్థాన పండితులమైన మేమే కుస్తీ పట్టాలి. మా సమాధానం వినగానే ప్రశ్న వేసిన గౌరవనీయ సభ్యుడికి ఎటువంటి సందేహం వస్తుందో ఊహించి దానికి తగ్గ సమాధానం, సమాచారం రెడీగా పెట్టుకుని వుండాలి. సమాచారం వుండగానే సరికాదు, సరైన సమయానికి, చకచకా అందించగలగాలి. పైగా దాన్ని మన మంత్రిగారు చెప్పగలిగేట్లా మలచుకోవాలి. మంత్రులందరూ ఒక్క తీరుగా వుండరు. కొంతమందికి కొన్ని బుర్రలో పట్టవు. అనుబంధ ప్రశ్న అడిగితే సమాధానాలు బుర్రకు తట్టవు. ఈయన తడబడితే, విషయం అర్థం కాక అనుమానపడితే, సమయస్ఫూర్తి ప్రదర్శించి నెగ్గుకురాలేక బోర్లపడితే – చిక్కులు మనకి.

కొంతమంది మంత్రులు ఎదుటివాళ్లతో సమర్థవంతంగా వాదించలేక 'సరేలే మీరు చెప్పినట్టే చేసేద్దాం' అని ఒప్పేసుకుని హామీ యిచ్చేస్తే కొంప మునిగిందే. మంత్రిగారు హామీ యిచ్చారు ఏమైంది? ఎంతవరకు వచ్చింది? ఏ మేరకు అమలైంది? అంటూ 'కంప్లయన్స్‌ రిపోర్టు'లు అడుగుతారు. అది రెండేళ్లపాటు పని కల్పిస్తుంది. అందువలన మంత్రిగారు తొందరపడి (!) 'ఎస్యూరెన్సు' హామీలు యిచ్చేయకుండా చూడమని మా బాస్‌ల అదేశాలుంటాయి. మంత్రిగారు హామీ యిచ్చేస్తే అది వెంటవెళ్లిన జాయింట్‌ సెక్రటరీ 'అసమర్థత' (!) కిందే లెక్క వేస్తారు. సాధారణంగా చెప్తూ వుంటారు – పార్లమెంటులో క్వశ్చన్స్‌కు 'రిప్లయ్‌'లు వస్తాయి తప్ప 'ఆన్సర్స్‌' రావని. ఆన్సర్‌ యిచ్చేస్తే అసాధారణమైనది జరిగినట్టే కదా!

xxxxxx

ఈ కారణాల వలన మా తారాబలం బాగుండకపోతేనే తారప్రశ్నలు తగులుతాయని గట్టి నమ్మకం. ఎవరైనా  సభ్యుడు తారప్రశ్న వేయబోతున్నాం అని ముందుగానే తెలియపరచగానే సంబంధిత శాఖకు ఓ నోటీసు వస్తుంది. 'ఆమోదించవచ్చు' (మే బీ ఎడ్మిటెడ్‌) అన్న కేటగిరీలో. వాటికి కావలసిన సమాచార సేకరణలో పడతాం. ఇలా యిచ్చేవాళ్లు చాలామంది వుంటారు కాబట్టి, ఒకలాటి ప్రశ్నలే ఎక్కువమంది అడిగిన సందర్భాలలో ఫిల్టరింగ్‌ జరుగుతుందన్నమాట.

అందువలన మొదటి స్టేజి దాటాక 'ప్రొవిజినల్లీ ఎడ్మిటెడ్‌' (తాత్కాలిక ఆమోదం) స్థాయికి వస్తుంది. ఇక అప్పణ్నుంచి  బిక్కుబిక్కుమని చూస్తూ వుంటాం. ఇలా ఎంపిక చేసిన వాటినన్నిటినీ క్వశ్చన్‌ అవర్‌లో అడగలేరు కాబట్టి సమయాభావం వుంటుంది కాబట్టి ఇలా సెలక్టయినవాటిలో లాటరీ వేసి సుమారు పది ప్రశ్నలను ఎంపిక చేసి, వాటికి ప్రాధాన్యతాక్రమంలో ఒకటి రెండు మూడు అని నెంబర్లు వేసి 'ఎడ్మిటెడ్‌' క్యాటగిరీలో పెడతారు. ఇక వాటికి సర్వసన్నాహాలు చేసుకోవాలన్నమాట. అయితే పదిప్రశ్నలను ఎంపిక చేసినా అన్నీ అడిగేటంత టైము వుండదు. ఎక్కువలో ఎక్కువ అయిదారు అడగగలరు. మన ప్రశ్న నెంబరు 9 అనుకోండి, మనం వెళ్లి కూర్చోవాలి కానీ క్వశ్చన్‌ అవర్‌లో మన ప్రశ్న వంతు వచ్చే ఛాన్సు వుండదు. 

నేను వెళ్లిన కొత్తల్లో మా శాఖకు సంబంధించిన ప్రశ్న ఎడ్మిట్‌ అయినా రెండు మూడు సార్లు ప్రయారిటీ నెంబరు ఎనిమిది, తొమ్మిది వచ్చాయి. ఎలాగూ రాదని కాస్త తాపీగా కూర్చున్నాను. ఓ సారి నాలుగో, ఐదో వచ్చింది. ఉత్కంఠగా  కూర్చున్నాను. మా మంత్రి గారిచ్చిన సమాధానంతో ప్రతి'పక్షి' సంతృప్తి పడలేదు. అనుబంధ ప్రశ్న అడిగాడు. ఈయన సమాధానం చెప్పడానికి తడబడుతున్నాడు. 

ఇక లాభం లేదని చీటీ రాసి పంపించబోయాను. ఆ చీటీ పట్టుకెళ్లవలసినవాడు ఏ చాయ్‌ తాగడానికి పోయాడో ఏమో కనబడలేదు. కంగారు పడ్డాను. ఎలాగోలా ఎవణ్నో పట్టుకుని మంత్రిగారికి పంపించాను. ఆయన చూసుకున్నాడు, అర్థమైందో లేదో కానీ అస్యూరెన్సు యిచ్చేశాడు.

తిరిగి వచ్చాక సెక్రటరీగారు నన్ను ఝాడించాడు – 'ఏమయ్యా, మంత్రిగారు అలా హామీ యిచ్చేయడం ఏమిటి? మరి నువ్వు అక్కడుండి చేసిన నిర్వాకం ఏమిటి?' అని.

అయ్యా, అదీ బాస్‌ అంటే! ఇటువంటి సందర్భాలు మీకూ ఎదురై వుంటాయనే యిదంతా రాశాను.

కొసమెరుపు – ఎన్టీ రామారావుగారు ముఖ్యమంత్రి అయిన కొత్త రోజులు. శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యులు ఒక నిర్ణీత ప్రశ్న విషయంలో ఆయన్ని  అనుబంధ ప్రశ్నలతో వేధిద్దామని కాచుకుని వున్నారు. ఆ సంగతి తెలిసి మేము ఏ స్టేజి వరకు అనుబంధ ప్రశ్నలు వస్తాయో ముందే వూహించి 6, 7 స్టెప్స్‌ వరకు రాసి రామారావుగారి చేతికి యిచ్చాం. ఏ రెండో స్టేజి వరకో ప్రశ్నలు వస్తాయని ఆ తరువాతివి చదవనక్కరలేదని బ్రీఫ్‌ చేసి యిచ్చాం. అక్కడకు వెళ్లాక వాళ్లు అనుబంధ ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. ఒకటి, రెండు వాటికి విడిగా సమాధానాలిచ్చాక యీయనకు చిర్రెత్తింది. ''ఉండండి, మీరు అడగబోయేవాటికి కూడా ఒకేసారి చెప్పేస్తా' అంటూ వరుసగా చదువుకుని పోసాగారు. మేం ఆఫీసర్స్‌ బాక్స్‌లో వుండి అడలెత్తిపోయాం, వాళ్లు ప్రశ్న అడగనిదే అలా యెలా సమాధానం ఎలా చెప్తాం అని. అదృష్టవశాత్తూ శాసనమండలిలోని అనుభవజ్ఞులు 'రామారావుగారూ, అవన్నీ అక్కరలేదు లెండి, వదిలేయండి' అని వాళ్లే చెప్పి వూరుకోబెట్టారు.

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by
kinige.com
please click here for audio version