మోహన మకరందం : ఐఐటీయా? ఐయేయస్సా?

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement ఐఐటీయా? ఐయేయస్సా?  ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్‌.ఎస్‌సి. మ్యాథ్స్‌లో యూనివర్శిటీ ఫస్ట్‌ వచ్చాక మద్రాసులో ఐఐటికి ఇంటర్వ్యూకి వెళ్లాను. పిహెచ్‌.డి. చేయడానికి సీటు వచ్చింది. వెంటనే…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

ఐఐటీయా? ఐయేయస్సా? 

ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్‌.ఎస్‌సి. మ్యాథ్స్‌లో యూనివర్శిటీ ఫస్ట్‌ వచ్చాక మద్రాసులో ఐఐటికి ఇంటర్వ్యూకి వెళ్లాను.

పిహెచ్‌.డి. చేయడానికి సీటు వచ్చింది. వెంటనే ఫీజు కట్టమన్నారు. 

సీటు వస్తుందన్న నమ్మకం లేక కాబోలు తగినంత డబ్బు పట్టుకుని వెళ్లలేదు. 

నాన్నగారికి ఫోన్‌ చేశాను.

''కంగ్రాట్స్‌. కమ్‌ బ్యాక్‌. వెనక్కి వచ్చేయ్‌.'' అన్నారు.

కంగ్రాట్స్‌ అంటారు, వెనక్కి వచ్చేయ్‌ అంటారు. నా కర్థం కాలేదు. 

''వచ్చి ఐయేయస్‌కు కట్టు'' అన్నారు నాన్నగారు.

మరి లెక్కలో..!? రామలింగయ్యగారి తొడపాశాలతో వేగడం కన్నా లెక్కలతో వేగడం మంచిదన్చెప్పి రెక్కలుముక్కలు చేసుకున్నదంతా వేస్టేనా?

నా లెక్కలు నావి, ఆయన లెక్కలు ఆయనవి!

xxxxxx

సినిమాల్లో చూపిస్తూంటారు – ఓ పేదకుఱ్ఱవాడు. ఊళ్లో మోతుబరి దౌర్జన్యానికి బలవుతున్న సాటి బీదవారిని చూసి చలించిపోతాడు. ఐయేయస్‌ పాసయి, అదే వూరికి కలక్టరుగా వచ్చి మోతుబరి పీచమణచి, ప్రభుత్వ బంజరు భూములన్నీ బీదాబిక్కీకి పంచేస్తాడు. ఇలాటివి చూసి యిన్‌స్పయిరై ప్రజాసేవకై నేను సివిల్‌ సర్వీసుకి వచ్చేశానని  చెపితే అంతకంటె అబద్ధం మరోటి వుండదు. అసలు నా గమ్యం మాథమెటీషియన్‌ను కావడం. మాథ్స్‌ అనేది నాకు ఒక ఆబ్సెషన్‌. నా వ్యక్తిత్వంలో ఒక భాగం. ఇప్పటికి కూడా  మ్యాథమాటిక్స్‌ గురించి కాస్సేపయినా చదవని రోజంటూ వుండదు.

ఇలా అంటున్నాను కదాని నేను నోట్లో వృత్తలేఖిని పెట్టుకుని పుట్టాననుకునేరు. అబ్బే, అంత 'దృశ్యం' లేదు. లెక్కలు నాకు అబ్బడానికి కారణభూతులైన అయ్యవారు – రామలింగయ్య మాస్టారు. 1953లో మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక రాజధాని కర్నూలుకు, 1954లో హైకోర్టు గుంటూరుకు మారిపోయాయి. లాయరుగా వుండే మా నాన్నగారు మద్రాసునుండి గుంటూరుకు మారారు. గుంటూరుకు వచ్చాక మా నాన్నగారు హైకోర్టు  జడ్జి అయ్యారు. అప్పుడు పట్టాభిపురం యింటినుండి వేరే పెద్ద యింటికి మారాం. అక్కడ తగిలారు నాకు రామలింగయ్య మాష్టారనే ట్యూషన్‌ టీచరు! 

తిట్టడం, కొట్టడం అనేవి మా యింట్లో పెద్దగా అలవాటు లేదు. తలిదండ్రులకు ఆలస్యంగా పుట్టడం వలన, చిన్నప్పటినుంచి అపురూపంగా పెరగడంవల్ల   కాబోలు దెబ్బలు అనుభవించడమేకాదు, చూసిన జ్ఞాపకంకూడా పెద్దగా లేదు.  రామలింగయ్యగారు మాత్రం – నా 'హిస్టరీ'తో ముఖపరిచయమైనా లేని కారణంగా – నేను సరిగ్గా లెక్కలు చేయకపోతే – ఓ చేత్తో మా అమ్మ ఇచ్చిన మజ్జిగ తాగుతూనే – యిసుమంతైనా కృతజ్ఞత, కనికరం లేకుండా – నాకు తొడపాశం పెట్టేవాడు. సబ్జక్ట్‌ మాట ఎలా వున్నా తొడపాశం నొప్పి భరించలేక, ఎందుకైనా మంచిది యీయనతో వేగడం కన్నా లెక్కలతోనే వేగడం మంచిదన్చెప్పి ఆయన చెప్పిన లెక్కలన్నీ ఒళ్లు దగ్గరుంచుకుని చేస్తూండేవాడిని.

ఇక అభిమానపాశంతో నాకు లెక్కలు నేర్పించినావిడ వనజా అయ్యంగార్‌! తర్వాత పద్మావతీ మహిళా యూనివర్శిటీకి, ఉస్మానియా యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌ అయ్యారావిడ! ఉస్మానియా యానివర్శిటీలో ఎమ్మెస్సీ మాథ్స్‌ చదివేటప్పుడు ఆవిడ నాకు థిŠయరీ ఆఫ్‌ రిలెటివిటీి నేర్పించేది. నాకు లెక్కల్లో యీ లెవెల్లో అభినివేశం కలగడానికి కారణం – ఆ థిŠయరీ ఆఫ్‌ రిలెటివిటీ ఆండ్‌ క్వాంటమ్‌ థియరీ నేర్చుకోవడమే. సరిగ్గా చెప్పాలంటే 'ఇట్‌ హేజ్‌ బికమ్‌ ఏన్‌ యింపార్టెంట్‌ యాస్పెక్ట్‌ ఆఫ్‌ మై లైఫ్‌'! బికేమ్‌ పార్ట్‌ ఆఫ్‌ మై పర్సనాలిటీ, మై మైండ్‌, మై సోల్‌… ఎవ్విరీథింగ్‌…' (అది నా జీవితంలో ముఖ్యమైన అంశం, నా వ్యక్తిత్వంలో, నా మస్తిష్కంలో, నా అంతరాత్మలో, నా సర్వస్వంలో భాగం అయిపోయింది)

వనజా అయ్యంగార్‌ గారి ప్రేరణతో ఎమ్‌.ఎస్‌.సి. యూనివర్సిటి ఫస్ట్‌ రావడమే కాకుండా, అప్పటిదాకా యూనివర్సిటీలో ఎవ్వరికి రాని రికార్డు 86.7% మార్కులతో (అయినా మా నాన్నగారు పెదాలు చప్పరించేశారు. ఓ సారి 97% మార్కులు వస్తే, 'తక్కిన మూడూ ఏమయ్యాయిరా?' అని అడిగారు ! ఫాదర్స్‌ ఆర్‌ గ్రీడీ, వాడ్డూయూ సే?) పాసయ్యాను. అంతేకాదు ఆవిడ  గైడెన్స్‌లోనే చివరికి  నేను రెండు పేపర్లు పబ్లిష్‌ చేశాను. వాటివలన చదువు అయిపోయి వుద్యోగం వెతికే టైములో నాకు 'సోర్బోన్‌' అని ఫ్రాన్స్‌లో చాలా పేరున్న యూనివర్సిటీలో పిఎచ్‌.డి.కి ఆవిడ ప్రయత్నిద్దామన్నారు.

అదే టైములో మద్రాసు ఐ.ఐ.టిలో మ్యాథమాటిక్స్‌లో పిఎచ్‌.డి. అవకాశం వచ్చింది. ఇంటర్‌వ్యూలో డాక్టర్‌ నిగమ్‌ అని చాలా ప్రఖ్యాత మ్యాథమేటిషన్‌ వున్నారు. ఆయనే హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌. ఆయన టేబుల్‌మీద వున్న పేపర్‌ వెయిట్‌ తీసుకుని చేత్తో గిర్రున తిప్పి వదిలివేశాడు. అది గిరగిరా తిరుగుతూ బల్ల అంచుదాకా వెళ్ళి కిందపడిపోయి 'వాబుల్‌' ఐ చివరకు సెటిలై పోయింది. ఈ చర్య యొక్క 'ఈక్వేషన్‌ ఆఫ్‌ మోషన్‌' రాయమన్నాడు. లెక్కలు తెలిసిన వాళ్లకు తెలుస్తుంది – అది ఎంత క్లిష్టమైన సమస్యో! ఆయన చెప్పిన పని పూర్తిగా చేయడంకూడా ఎవరి తరం కాదు. 

నాకు తోచిన విధంగా చేయడానికి ఓ ముప్పావుగంట పట్టింది. నేను చేసినది చూశారు, సెలక్టెడ్‌ అన్నారు. ఎడ్మిషన్‌కి తొమ్మిదివందల రూపాయలు కట్టమన్నారు. సెలక్టవుతానన్న నమ్మకం లేకనో ఏమో అంత డబ్బు తీసుకొని రాలేదు. అప్పుడు అక్కడినుంచి మా నాన్నగారికి ఫోన్‌ చేసాను. 'ఇలా వచ్చింది, ఏమంటారు?' అని. 

'కంగ్రాట్స్‌. కమ్‌ బ్యాక్‌. వెనక్కి వచ్చేయ్‌' అన్నారాయన. 

అర్జునుడి దృష్టి పక్షికన్ను మీదే వున్నట్టు ఆయన దృష్టి నా ఐయేయస్‌ మీదనే. 'ఏ గ్రాజువేషన్‌, ఏ పోస్ట్‌ గ్రాజువేషన్‌ చేసినా ఫర్వాలేదు. ఐయేయస్‌కు ఓ సారి కూచో. అటో యిటో తేలాక అప్పుడు నీ యిష్టం వచ్చినట్టు చేద్దువు గాని. ఈ లోపున యింటర్వ్యూలకు వెళతావా వెళ్లు. కానీ వుద్యోగాల్లో చేరకు.' యిదీ ఆయన ఆదేశం.

ఐఐటివాళ్లు పట్టుబట్టలేదు కానీ వనజా అయ్యంగార్‌ గారు ఫ్రెంచ్‌ యూనివర్శిటీలో నా రిసెర్చి గురించి గట్టిగానే పట్టుబట్టారు.  ఆల్‌మోస్ట్‌ మా నాన్నగారూ, ఆవిడా కొట్టేసుకునేటంత లెవెల్‌కి వెళ్లిపోయారు. చివరకు మా నాన్నగారు నాతో 'ఈ రికమెండేషన్లతో నన్ను విసిగించకు. నేను చెప్పినది నువ్వు ఓ సారి చేసి చూడాల్సిందే' అని ఖచ్చితంగా చెప్పారు. ఆ రోజులు కాబట్టి నాన్నగారి మాటే చెల్లింది. దేశం ఓ మాథమాటిక్స్‌ సైంటిస్టును కోల్పోయింది! 

ఇంత యిదిగా చెప్పాను కదాని మాథమాటిక్స్‌ నా ఫస్ట్‌ లవ్‌ అనుకునేరు. అబ్బే కాదు.,, కెమెస్ట్రీ ! 

1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక హైకోర్టు గుంటూరునుండి హైదరాబాదుకి మారింది. దాంతో బాటు నాన్నగారూ.. నాన్నగారితో బాటు మేమూ..మారేడ్‌పల్లికి వచ్చిపడ్డాం! నా హైస్కూలు చదువు మెహబూబ్‌ కాలేజీ హైస్కూలు లో కొంతకాలం సాగాక నాన్నగారు దిల్‌సుఖ్‌నగర్‌ వైపు గడ్డిఅన్నారంలో – సరిగ్గా చెప్పాలంటే హైద్రాబాద్‌కంటే విజయవాడకి దగ్గరగా – పెద్ద విశాలమైన అరెకరాల తోటతో సహా ఇల్లు కొన్నారు. స్కూలు దూరమవుతుందని ఆల్‌ సెయింట్స్‌ హై స్కూలులో జాయిన్‌ చేశారు. 8,9, 10 తరగతులు అక్కడే చదివాను. అక్కడే నా చదువు మెరుగుపడింది. చాలా పికప్‌ అయ్యాను. నా అభిమాన సబ్జక్ట్‌ – కెమిస్ట్రీ. 

నిజాం కాలేజీలో పి.యు.సి. లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయేసరికి నాన్నగారు సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేయడానికి ఢిల్లీకి మకాం మారుద్దామనుకున్నారు.  అందువలన నన్ను ఢిల్లీలో బియస్సీ చేయమన్నారు.  మా నాన్నగారు కాలేజీలో ఆడ్మిషన్‌ కోసమని నన్ను ముందర పంపించేసారు. ఏ కాలేజీలో చదవాలో తేల్చి నన్ను ఎడ్మిట్‌ చేసే భారం పార్థుడు గారనే చుట్టానికి అప్పగించారు. నేను ఏ డిగ్రీ ఏ సబ్జక్ట్‌లో చేసినా నాన్నగారికి ఓకే. ఆయనకు కావలసినది ఏదో పట్టా చేతిలో పట్టుకుని ఐయేయస్‌కు ప్రిపేర్‌ కావడం!

ఈ పార్థుడుగారు నన్ను వెంటబెట్టుకుని ఓ శనివారం హిందూ కాలేజీకి తీసుకెళ్లారు. వాళ్లు నాకు మాథమ్యాటిక్స్‌ ఆనర్సులో సీటిస్తామన్నారు. కెమిస్ట్రీ కావాలన్నాను నేను, నా ఫస్ట్‌ లవ్‌ అదే కాబట్టి. అయితే ఎదురుగా వున్న కాలేజీలో కనుక్కో అన్నారు. అది స్టీఫెన్సు కాలేజీ. చాలా పెద్ద, పేరున్న కాలేజీ. వాళ్లు 'కెమిస్ట్రీ ఆనర్స్‌ యిస్తాం గానీ సోమవారం రావాలి' అన్నారు. 

మా పార్థుడుగారు ''మళ్లీ వాయిదాలెందుకు గానీ దీనిలోనే మాథ్స్‌ ఆనర్స్‌ తీసేసుకో' అన్నాడు. నేను తల వూపాను. తర్వాత చాలా సార్లు ఫీలయ్యాను – స్టీఫెన్సులో చదివుంటే బాగుండేదని. ఏం లాభం! ఆ రోజులలాగుండేవి. ఓ జడ్జి గారబ్బాయి కాలేజీ అడ్మిషన్‌ అంత కాజువల్‌గా జరిగిపోయింది. ఇప్పుడు ఎల్‌కేజీ ఎడ్మిషన్‌ నుండి పెద్ద అడావుడి..

మా బియస్సీలో మాథ్స్‌ మెయిన్‌. ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు సబ్సిడియరీ సబ్జక్ట్‌లు. వాటికి సెకండియర్‌లోనే స్వస్తి. ఫైనలియర్‌లో కేవలం మాథ్సే వుండేది. చదువు బాగానే చదివేవాణ్ని కానీ ఓ మూస చేసిన మోసం వలన నాకు డిగ్రీలో సెకండ్‌ క్లాసే వచ్చింది. 

ఆ కథాప్రకారం ఏమిటంటే – సెకండియర్‌ చివర జరుగుతున్న కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌లో క్వాంటిటేటివ్‌ ఎనాలిసిస్‌ చేస్తున్నాను. ఓ క్రూసిబుల్‌ (మూస)లో పొడిలాటి పదార్థాన్ని (దానిలోని మూలకాల పరిమాణం కనిపెట్టాలి) పోసి, ఓ కెమికల్‌ కలియబెట్టి బర్నర్‌మీద పెట్టాను. అది వేడెక్కుతోంది. 

బర్నర్‌ మంట చూస్తే సిగరెట్‌ లైటర్‌, తద్వారా సిగరెట్టు గుర్తుకు వచ్చాయి. (ఇది పియుసిలో 'అంటించుకున్న' అలవాటు) వరండాలోకి వెళ్లి ఓ సిగరెట్టు కాల్చుకుని వచ్చానో లేదో యీ మూసకు ఏం బుద్ధి పుట్టిందో ఓ పక్కకు ఒరిగింది, మూత జారింది, పొడి కింద వొలికింది. దాంతో ఆన్సరులో కాస్త తేడా వచ్చింది. కెమిస్ట్రీలో ఫెయిల్‌! చదువులో ఎన్నడూ ఎరుగని మాట! ఇక అప్పుడే ఒట్టేసుకున్నాను – సిగరెట్టు మానేయాలని కాదు, మూసలు ముట్టుకోకూడదని ! 

కానీ ముట్టుకోవలసి వచ్చింది – సెప్టెంబరు పరీక్షకు. ఈ సారి బర్నర్‌ మంట చూస్తే ఢిల్లీ యూనివర్శిటీ రూల్సు  తయారుచేసినవారిపై నా గుండెల్లోని మంట గుర్తుకు వచ్చింది. సెప్టెంబరులో ఎంత మంచి మార్కులతో పాసయినా వాటిని  లెక్కలోకి తీసుకోకుండా కేవలం పాస్‌ మార్కులగానే గణిస్తారు – ఫైనలియర్‌లో ర్యాంకు యిచ్చినపుడు! ఆ విధంగా నాకు 58.5% తో సెకండ్‌ క్లాస్‌ బియస్సీ డిగ్రీ చేతిలో పెట్టారు. నేనెంత నామోషీ పడిపోయానో చెప్పలేను. నాకు హఠాత్తుగా దేవుడూ వాళ్లూ కట్టకట్టుకుని గుర్తుకు రావడం మొదలెట్టారు. 

నాన్నగారికి ఢిల్లీ నచ్చలేదు. ఆ చలి, ఆ హాట్‌ హాట్‌ పాలిటిక్స్‌ ఆయన వంటికి పడలేదు. అంతలో ఆయనకు బాగా తెలిసున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్యగారు లేబర్‌ మినిస్టర్‌ అయ్యారు. ఆయన నాన్నగారిని 'చైర్మన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ వేజ్‌ బోర్డు ఫర్‌ కాటన్‌ ఇండస్ట్రీ' గా వుండమని అడిగారు. అది హైదరాబాద్‌లో అయితేనే తీసుకుంటాను అన్నారీయన. అది జాతీయ స్థాయి అర్గనైజేషన్‌ అయినా నాన్నగారి కోసం హెడ్‌క్వార్టర్స్‌ హైదరాబాదులో పెట్టించారు సంజీవయ్యగారు. 

'మేరీ హేడ్‌ ఎ లిటిల్‌ ల్యాంబ్‌' నర్సరీ రైమ్‌లో మేరీ వెనక్కాలే మేక తిరిగినట్టు నేనూ మా నాన్నగారి వెంట ఢిల్లీనుండి హైదరాబాదు వచ్చిపడ్డాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ సీటు అడిగాను. 'బియస్సీలో కెమిస్ట్రీ మెయిన్‌ కాదుగా, ఎమ్మెస్సీలో ఎలా యిస్తాం? అయినా నీది మొత్తం మీద సెకండ్‌ క్లాసు అయినా మాథ్స్‌లో మంచి మార్కులు వచ్చాయి కాబట్టి మాథ్స్‌లో ఎమ్మెస్సీ యిస్తాం. తీసుకో' అన్నారు వాళ్లు. ఏం చేస్తాం? తీసుకున్నాం. ఆ విధంగా తొలివలపు కెమిస్ట్రీకి బైబై చెప్పాల్సివచ్చింది, గణితం చేయి పట్టుకోవలసి వచ్చింది. అప్పటినుండి గణితమే నన్ను పట్టుకుని వదలటం లేదు.  

xxxxxx

అప్పట్లో గడ్డి అన్నారం అడవిలా వుండేది. మా యింటి పెరడే ఓ చిట్టడవిలా వుండేది. అక్కడ  నాకు స్వంత ల్యాబరేటరీ ఒకటి వుండేది. దాంట్లో నేనూ నా ఫ్రెండ్‌ ప్రయోగాలు కూడా చేసేవాళ్లం. ఒకరోజు మేం యిద్దరం ఓ ప్రయోగం చేస్తున్నాం. అదేదో కానీ ఠప్‌్‌మని పేలింది. 

అంతే! మేం జాయింటుగా వులిక్కిపడ్డాం, ఒకరినొకరు భయంభయంగా చూసుకున్నాం. నేటి సినీభాషలో చెప్పాలంటే – కట్‌ చేస్తే – నెక్స్‌ట్‌ ఫ్రేమ్‌లో ఇంటి అవతల భాగంలో వందగజాల దూరంలో యిద్దరం ఒకరినొకరు చూసుకుంటున్నాం!

 నీతి – రసాయనిక శాస్త్ర ప్రయోగములు అత్యంత ఆవశ్యకములు. అవి సైన్సు నేర్పుటయే కాదు రేసు గుఱ్ఱాల స్థాయిలో రన్నింగు కూడా నేర్పును. 

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by
kinige.com
please click here for audio version