ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? – 6

మొత్తం మీద మన రెండు రాష్ట్రాలూ కేరళలా తయారయ్యాయి. ఎవరైనా ఎవరితోనైనా ఊరేగవచ్చు, మర్నాడు ఊరేగింపులోనుండి తప్పుకోవచ్చు. ఈ వ్యవస్థను ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్‌ పొత్తుల తిరగలిలో పడితే పిండిపిండి అయిపోతాడు. అతను ఏ…

మొత్తం మీద మన రెండు రాష్ట్రాలూ కేరళలా తయారయ్యాయి. ఎవరైనా ఎవరితోనైనా ఊరేగవచ్చు, మర్నాడు ఊరేగింపులోనుండి తప్పుకోవచ్చు. ఈ వ్యవస్థను ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్‌ పొత్తుల తిరగలిలో పడితే పిండిపిండి అయిపోతాడు. అతను ఏ పార్టీకి సంబంధించకుండా వున్నంతసేపే అందర్నీ తిట్టగలడు, తప్పుపట్టగలడు. ఏదో ఒక పార్టీని కౌగలించుకుంటే వారి తరఫున వకాల్తా పుచ్చుకోవలసి వస్తుంది. వాళ్ల తప్పుల్ని సమర్థించవలసి వస్తుంది. అవినీతి గురించి పవన్‌ ఆవేశంగా మాట్లాడుతూంటే ఆపి 'టిడిపి అవినీతి మాటేమిటి, బిజెపి అవినీతి మాటేమిటి' అంటే ఆయన యింకేం మాట్లాడగలడు? అవేళ అంటే అభిమానుల సభ. ఏం మాట్లాడినా, ఎలాటి హావభావాలు ప్రదర్శించినా చప్పట్లు పడ్డాయి. 'నాకు శక్తి లేదు, శక్తిహీనుణ్ని' అన్నా చప్పట్లు కొట్టారు. కానీ బహిరంగసభలకు వచ్చే జనం అలా వుండరు. లేచి నిలబడడానికి భయపడినా చీటీపై రాసి పంపుతారు. టీవీ చర్చల్లో ఏకేస్తారు. 

2009లో చిరంజీవి వ్యవస్థను మారుస్తానంటూ పార్టీ పెట్టి, మొహమాటానికో, పెద్దమనిషి తరహాగానో 'వైయస్‌ మంచివారు, చంద్రబాబు మంచివారు' అంటూ కితాబులు యిస్తే 'అయితే నువ్వెందుకు? వాళ్లనే వుండనీ' అన్నారు ప్రజలు. ఇప్పుడు పవన్‌ కితాబులు యివ్వడంతో సరిపెట్టలేరు. వాళ్ల అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేయవలసి వస్తుంది. వారిలో యివాళ్టిదాకా కాంగ్రెసులో వుండి వచ్చినవాళ్లు కూడా వుంటారు. హీరో అఫెన్సులో వుంటే చూడడానికి మజాగా వుంటుంది తప్ప డిఫెన్సులో పడితే క్లిక్‌ అవదు. పవన్‌కు యిది తెలియదా? మరి బిజెపివారితో, టిడిపి వారితో మంతనాలేమిటి? అసలు పవన్‌ను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చింది వాళ్లేనా? ఎందుకు? 

2009 ఎన్నికలలో చిరంజీవి నిలబడినపుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు ఓట్లు చీలుస్తుందని మహాకూటమి నాయకులు, వారి సానుభూతిపరులు ఆశపడ్డారు. కాపులు రెడ్లకు ఓటేస్తూ వచ్చారని, కాపులకంటూ ఓ పార్టీ ఏర్పడింది కాబట్టి వాళ్లు విడిగా వచ్చేసి ప్రజారాజ్యంకు ఓట్లేస్తారని, ఆ మేరకు రెడ్ల పార్టీ అయిన కాంగ్రెసుకు ఓట్లు చీలిపోయి మధ్యలో కమ్మ, బిసిల పార్టీ అయిన టిడిపి లాభపడుతుందనీ.. యిలా ఏవేవో లెక్కలు వేశారు. కులాల ప్రకారం ఓట్లు గణించడం నార్త్‌లో కుదిరినట్లు యిక్కడ కుదరదు. అనేక అంశాల్లో అది కూడా ఒకటి. చిరంజీవిని కాపు నాయకుడిగానే లెక్క వేసి యీ మేధావులు బోల్తా పడ్డారు. ఆయన కాంగ్రెసు ఓట్లూ చీల్చాడు, టిడిపి ఓట్లూ చీల్చాడు. ఓటమి తర్వాత మహాకూటమి సానుభూతిపరులు చిరంజీవి తమ ఓట్లు మాత్రమే చీల్చాడని వాదించసాగారు. ప్రజారాజ్యం, లోకసత్తా ఓట్లను తమ ఓట్ల శాతానికి కలిపి వాళ్లు రంగంలో లేకపోతే మాకు యిన్ని వచ్చేవి అని నమ్మించడానికి చూశారు. కాపు ఓట్లు పెద్దగా లేనిచోట్ల కూడా చిరంజీవి పార్టీ ఎలా గెలిచిందో వీళ్లు విశ్లేషించుకోలేదు.

ఇప్పుడు మళ్లీ అదే భ్రమల్లో వున్నారనిపిస్తోంది. చిరంజీవి కాంగ్రెసులో చేరిపోయాడు కాబట్టి కాపు ఓటర్లు ఆ కుటుంబంలో వేరెవరికి వేద్దామా అని చూస్తున్నట్లు, ఆ కుటుంబం నుండి మరో స్టార్‌ను తీసుకుని వస్తే అవన్నీ గంపగుత్తగా అతనికి పడిపోతాయన్నట్లు బిల్డప్‌ యిస్తున్నారు. వీళ్ల అంచనా ప్రకారం రెడ్లు, క్రిస్టియన్లు జగన్‌ వెంట నిలుస్తారు. కాబట్టి కమ్మ, కాపులను టిడిపి వెంట నిలపాలి. బిసిల సపోర్టు ఎటూ టిడిపికే! దీనితో బిజెపి కూడా కలిసి వచ్చిందంటే యిక ఆ కాంబినేషన్‌కు తిరుగు లేదు. కమ్మ నాయకులందరూ కాంగ్రెసును వీడి టిడిపిలోకో, బిజెపిలోకో వెళుతున్నారు. రెండిట్లో దేనిలో చేరినా ఒకటే అన్న భావం నడుస్తోంది. నిజానికి టిడిపి-బిజెపి పొత్తు యింకా కుదరలేదు. బేరాలు సాగక టిడిపి, బిజెపి ఒకరితో మరొకరు తలపడితే కమ్మ ఓటర్లు ఎవరికి వేస్తారని వీళ్లు లెక్కేస్తారు? అసలు కమ్మ ప్లస్‌ కాపు కూటమి సాధ్యమేనా? 

సంఖ్యాపరంగా ఎక్కువగానే వున్నా కాపుల్లోనే చాలా తెగలున్నాయి. ఎక్కువ, తక్కువ ఫీలింగులున్నాయి. రాజకీయంగా ఒకరితో మరొకరు కలిసి రారు. కలిసి వచ్చి వుంటే మనకు ఎప్పుడో కాపు ముఖ్యమంత్రి వచ్చేవాడు. కాపులను బిసీల్లో కలపాలన్న డిమాండు తెచ్చి గందరగోళ పరుస్తూ యీ మధ్య కాపులను, బిసిలను ఒకే గాటన కడుతున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో కాపులు తమను బిసిలుగా అనుకోరు. బిసిలతో కలవరు. కాపుల్లోనే యిన్నాళ్లూ ఐక్యత లేనపుడు వాళ్లంతా వీళ్ల కోసం అర్జంటుగా కలిసి పోతారా, అంతటితో ఆగక కమ్మలతో కూడా కలిసి నడుస్తారా? కొన్ని జిల్లాలలో కమ్మ-కాపు గొడవలున్నాయి. పరస్పర సందేహాలున్నాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా క ప్లస్‌ కా ప్లస్‌… అని క గుణింతం రాసుకుంటూ పోతున్నారని సందేహం కలుగుతోంది. ఆ ప్రణాళికలో భాగంగానే పవన్‌ను యీ కాంబినేషన్‌లోకి లాక్కువచ్చారని, అతన్ని చూసి కాపు ఓట్లు జలజల రాలతాయని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. పవన్‌ను కాపుగా చూడడం దురదృష్టకరం. చిరంజీవికి ఆ ముద్ర కొడుతూనే వచ్చి ప్రజారాజ్యం పార్టీకి హాని చేశారు. ఇప్పుడు పవన్‌ను కులానికి పరిమితం చేస్తే అతనికి కీడు తలపెట్టినట్లే. అది గ్రహించే పవన్‌ తన ఉపన్యాసంలో నాకు సర్టిఫికెట్లు యివ్వడానికి కాపులెవరు? అని అడిగాడు. నిజానికి పవన్‌ ఎలా వుంటే బాగుంటుంది? అని ఆలోచించి చూడండి. 

ప్రస్తుతం రాష్ట్రంలో వున్న పరిస్థితి ఏమిటి? ప్రజల మనోభావాలు ఎలా వున్నాయి? కాస్త అతిశయించి చెప్తే – మొదటి ప్రపంచయుద్ధానంతరం జర్మనీ ఎలా వుందో అలా వుంది. సీమాంధ్ర అవమానంతో, ఆందోళనతో కుతకుతలాడుతోంది. నాయకులందరినీ అసహ్యించుకుంటోంది. తమ పక్షాన నిలిచిన నాయకుడు ఒక్కడూ కనబడక అల్లాడుతోంది. ఢిల్లీపై పగ బట్టి వుంది. ఎన్టీయార్‌ వంటి ఒక నాయకుడు ఉద్భవించి ఢిల్లీకి చెంపదెబ్బ పెట్టి బుద్ధి చెప్పాలని తపిస్తోంది. ఇక తెలంగాణలో ఫీలింగ్స్‌ అంత దృఢంగా లేవు. ఎందుకంటే యీ విభజన వలన జరగబోయే నష్టాల గురించి, బిల్లులో తెలంగాణకు జరిగిన మోసాల గురించి వారికి ఎవరూ చెప్పడం లేదు. విభజన తర్వాత చెలరేగే సామాజిక సంక్షోభం చూశాక ఎంత మోసపోయామో అందరికీ తెలిసివస్తుంది. ఇప్పటికే తమ నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాలు చూసి సాధారణ తెలంగాణ పౌరుడు ఆందోళన చెందుతున్నాడు.  సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న ధీమా కనబడటం లేదు. అతుకులబొంత ప్రభుత్వం ఏర్పడి, హామీలు అమలు కాక, పరిశ్రమలు తరలిపోయి, ఉద్యోగాలు తరిగిపోయి, తీవ్రవాదం బలపడి, భవిష్యత్తు ఎలా వుంటుందో తెలియక భయపడుతున్నాడు. రాష్ట్రం వచ్చిందన్న సంబరంలో వున్న కొందరికి యివన్నీ అవగాహనలోకి వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. అప్పుడు యిరుప్రాంతాలూ ఢిల్లీపై మండిపడతాయి. ప్రస్తుతానికి తెలంగాణ ప్రజల్లో సరైన అవగాహన కల్పించగలిగితే, ఆ మంట యిప్పటినుండే ప్రారంభమవుతుంది.

ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి, వారి ఆందోళనను తనకు అనువుగా మలచుకునే శక్తి కొందరికే వుంటుంది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన సంధిలో విజేతలు జర్మనీని నష్టపరిచారు. నిస్సహాయ స్థితిలో జర్మనీ వాటికి తలవంచవలసి వచ్చింది. అవమానభారంతో, ఆర్థికసంక్షోభంలో మునిగిన జర్మనీ తనను ఉద్ధరించేవాడి కోసం వెతికింది. నేనున్నాను అంటూ హిట్లర్‌ ముందుకు వచ్చాడు. అప్పుడున్న నాయకులందరూ పరమచెత్త వారిని పక్కన పడేయండి, నాకు అవకాశం యివ్వండి అంటూ ప్రజలను ఊరించాడు. అసమాన వాగ్ధాటితో రోజుకి పది ఉపన్యాసాలు యిస్తూ, యువతను ఆకట్టుకున్నాడు. వాళ్లు అతని వెంట నడిచారు. అతను ఒక ముఖ్యమైన పదవిలోకి రావడానికి పదేళ్లు పట్టింది. ఆ తర్వాత అతి త్వరలోనే అతను ఏకైక నాయకుడిగా వెలిశాడు. ప్రజాస్వామ్యంలో అనేక పార్టీలు, అనేకానేక నాయకులు వుండి పరస్పరం కలహించుకోవడంతో నియంతృత్వానికి దారి తీసింది. నియంతగా మారిన హిట్లర్‌ ప్రజలను యుద్ధం వైపు నడిపించి సర్వనాశనానికి కారకుడు కావడం రెండో అధ్యాయం. మొదటి అధ్యాయం వరకు చూసుకుంటే అతను జర్మనీ పునర్నిర్మాణానికి ఎంతో దోహదపడ్డాడు. ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కలిగించాడు. మొదటి అధ్యాయం వరకు హిట్లర్‌ను అనుకరించగలిగిన నాయకుడు యీనాడు తెలుగువారికి ఎంతో అవసరం. తెలుగుజాతికి కష్టపడే స్వభావం వుంది, పౌరుషం వుంది. నాయకుల అసమర్థత వలన, స్వార్థం వలన యీనాడు ఢిల్లీ చేతిలో నాశనమైంది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click here For Part-5