Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : రాజీవ్‌ హత్య - 67

ఆగస్టు 15 - ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిగ్నల్స్‌ ఆధారంగా శంతన్‌ యింటిపై దాడి చేశారు. అక్కడ శంతన్‌ దొరకలేదు కానీ వరదన్‌, అతనితోపాటు  సుమతి అనే పేరున్న శ్రీలంక నుంచి వచ్చిన ఒక ఎల్‌టిటిఇ మద్దతుదారు దొరికారు. వైర్‌లెస్‌ సెట్టుతో బాటు, యితర ముఖ్యమైన రికార్డులు కూడా పోలీసులకు లభించాయి. అక్కడ దొరికిన రిజిస్టరులో తమిళనాడులో ఎల్‌టిటిఇ లక్ష్యాల కోసం పనిచేస్తున్న రాజకీయవర్గంలోని సభ్యులందరి పేర్లు, కార్యకర్తలు, వాళ్ల తలితండ్రులు, పిల్లల పేర్లు, అడ్రసులతో సహా సమస్తం వున్నాయి. వాళ్లందరూ శంతన్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్నారు. సిట్‌కు యిది చాలా ఉపయోగపడింది.

ఆగస్టు 16 - కోననకుంటెలో యిల్లు రెడీగా వుందని నిర్ధారించుకున్నాక సురేశ్‌ మాస్టర్‌ ముత్తటి శిబిరం నుంచి శివరాజన్‌, శుభ, నెహ్రూలను గాయపడిన తీవ్రవాదులను అక్కడికి తరలించాడు. కొందర్ని ముత్తటిలోనే వుంచాడు. రంగనాథ్‌, అతని భార్య మృదులను వదిలేస్తే వాళ్లు డబ్బుకు ఆశపడి పోలీసులకి చెప్పేస్తారేమోనన్న భయంతో మీరూ మాతోనే వుండాలి అని పట్టుబట్టి తీసుకుపోయారు. రాజీవ్‌ హంతకుల ఆచూకీ చెపితే రూ.15 లక్షల బహుమతి యిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డబ్బు యిబ్బందుల్లో వున్న రంగనాథ్‌ ఆ పని చేయవచ్చు కదా, అతను వీళ్లతో తిరగడం దేనికి? తర్వాతి రోజుల్లో అతని స్నేహితులను, బంధువులను అడిగితే వాళ్లూ సమాధానం చెప్పలేకపోయారు. వాడి సంగతి మాకేమీ బోధపడటం లేదు అన్నారు. ఎల్‌టిటిఇ వాళ్లతో తిరిగి తిరిగి రంగనాథ్‌ తనూ ఒక సైనైడ్‌ కాప్స్యూల్‌ దగ్గర పెట్టుకుని తిరిగేవాడు. ఏదో సాహసం చేస్తున్నట్లు ఫీలయ్యాడా? లేక టైగర్ల బోధలు విని వాళ్లలో ఒకడిగా మారిపోయాడా? చెప్పడం కష్టం.

ఆగస్టు 17 - శివరాజన్‌ కదలికల గురించి సిట్‌కు సమాచారం అందడం మానేసింది. ఎక్కడో శివార్లలోకి శిబిరం మారిపోయింది. రంగనాథ్‌ గురించి పోలీసు రికార్డుల్లో ఏమీ లేదు. సిట్‌ అన్వేషణ డెడ్‌ ఎండ్‌కు చేరింది. ఇలాటి పరిస్థితుల్లో ప్రజా చైతన్యమే వారికి అక్కరకు వచ్చింది. ఎల్‌టిటిఇ గురించి తమిళనాడులో చాలాకాలంగా గొడవలు జరుగుతూండడంతో అది తమిళులకు సంబంధించిన గొడవగానే తక్కిన దక్షిణాది రాష్ట్రాల ప్రజలు భావించారు. కానీ బెంగుళూరులోని ఇందిరా నగర్‌లో రహస్యశిబిరంపై దాడి జరగడం, ఎల్‌టిటిఇ కార్యకర్తలైన అలసన్‌, కులతన్‌ సైనైడ్‌లతో పట్టుబడడం, శివరాజన్‌ తమ రాష్ట్రంలోనే తిరుగుతున్నాడన్న విషయం కర్ణాటక రాష్ట్రప్రజలను కలవర పరచింది. అప్పటిదాకా టైగర్లకు ఆశ్రయం యిచ్చిన తమిళనాడులోనే వారిపై వ్యతిరేకత పెరిగి, పోలీసులకు సమాచారం యిస్తున్నపుడు కర్ణాటక ప్రజలు పోలీసులకు సహకరించాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. తమ కాలనీలో, తమ వూళ్లో కొత్తగా కనబడిన ప్రతీవాడినీ, ముఖ్యంగా తమిళుడుని అనుమానంగా చూసి, పోలీసులకు సమాచారం యివ్వసాగారు. ముత్తటి గ్రామంలో సినిమా షూటింగుకై తీసుకున్న యింట్లో షూటింగు సంగతెలా వున్నా, ఎవరెవరో క్షతగాత్రులు వస్తూ పోతూ వుండడం చూసి ఆ గ్రామ సర్పంచ్‌ పోలీసులకు చెప్పాడు.

వెంటనే పోలీసులు ఆ యింటిపై దాడి చేశారు. అక్కడ వున్న టైగర్లను పట్టుకున్నారు. అక్కడివారు యిచ్చిన సమాచారంతో బిరూటి గ్రామంలోని శిబిరంపై కూడా దాడి చేశారు. ఈ రెండు శిబిరాలలో కలిపి మొత్తం 17 మంది తీవ్రవాదులు దొరికారు. వారిలో 12 మంది పోలీసులకు తెలియకుండా సైనైడ్‌ గొట్టాలు మింగారు. మిగతా ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రవాదులు దొరకగానే సరిపోదు, వారిని సజీవంగా పట్టుకోవడం ఎలా అనే విద్య యింకా పోలీసులకు పట్టుబడ లేదు. సజీవంగా దొరికితే తప్ప ఎల్‌టిటిఇ పాత్ర నిర్ద్వంద్వంగా నిరూపించడం కష్టం. ఈ విషయం తెలిసే ఎల్‌టిటిఇ అధినాయకత్వం సైనైడ్‌ మింగేయాలని కార్యకర్తలను ఒత్తిడి చేస్తోంది.

ఇలా సైనైడ్‌ మింగి చచ్చిపోయినవారిలో సురేశ్‌ మాస్టర్‌కు అసిస్టెంటుగా పని చేస్తూ శివరాజన్‌ బృందంగా అండగా నిలిచి వారితో పాటు పరుగులు పెడుతూ వున్న మూర్తి కూడా వున్నాడు! 

xxxxxxxxxxxx

అదే రోజున సిట్‌లో మరొక దళం మాండ్యా జిల్లాలో రంగనాథ్‌ పరిచయస్తుడిని పట్టుకుంది. ఇతనే రంగనాథ్‌ చెప్పినమీదట శివరాజన్‌ బృందానికి రెండు యిళ్లు ఏర్పాటు చేసి పెట్టాడు. అతన్ని పట్టుకుని రంగనాథ్‌ యింటికి తీసుకుని వెళ్లమన్నారు. ''నా దగ్గరకు అతను వస్తూండేవాడు. అతని అడ్రసు నాకు తెలియదు. ఒకసారి అడిగితే ఒక కాగితం మీద రాసి యిచ్చాడు. స్థానిక పోలీసులు దాన్ని నా దగ్గర్నుంచి తీసుకున్నారు.'' అన్నాడతను. సిట్‌ వాళ్లు వెళ్లి ఆ పోలీసులను అడిగారు. ''దాన్ని మా బెంగుళూరు పోలీసు కమిషనర్‌కు పంపాం. మా దగ్గర లేదు.'' అన్నారు వాళ్లు. అంటే సిట్‌కు, స్థానిక పోలీసులకు కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వుందన్నమాట. తమ అధికారుల ద్వారా బెంగుళూరు పోలీసు కమిషనర్‌ వద్దకు వెళ్లి రంగనాథ్‌ యింటి అడ్రసు ఎక్కడో తెలుసుకుంటే అతని ద్వారా శివరాజన్‌ ఆచూకీ తెలుస్తుంది అనుకున్నారు సిట్‌ అధికారులు.

ఆగస్టు 18 - పొద్దున్నే పాలు కొనుక్కుని తెమ్మనమని శివరాజన్‌ ముఠా రంగనాథ్‌ను బయటకు పంపింది. అతను పాలు తెస్తూతెస్తూ పేపరు కొనుక్కుని తెచ్చాడు. దానిలో ముత్తటి, బిరూటి గ్రామాల్లో పోలీసుల దాడులు, 12 మంది ఆత్మహత్య, 5 గురు సజీవంగా పట్టుబడడం అన్నీ వున్నాయి. అవి చదువుతూనే తీవ్రవాద బృందానికి మతి పోయింది. మూర్తి చావు వార్త వింటూనే శివరాజన్‌ కోపంతో శివాలు తొక్కాడు. ఈ సిబిఐ వాళ్లు మనల్ని కుక్కల్లాగ వెంటాడుతున్నారు. ఇక్కడికి కూడా వచ్చేస్తారో ఏమో'' అని నిప్పులు కక్కాడు. పోలీసులు వచ్చేస్తారని వినగానే మృదుల భయపడి పోయింది. ఆమెకు అసలే ఆస్తమా. ఈ టెన్షన్‌ తట్టుకోలేక ఆస్తమా పెరిగిపోయి ఆయాసపడసాగింది. ''మా ఆవిణ్ని వెంటనే డాక్టరుకు చూపించాలి.'' అన్నాడు రంగనాథ్‌. ''వెళ్లడానికి వీల్లేదు'' అన్నాడు శివరాజన్‌. డాక్టరుకి చూపించి సాయంత్రాని కల్లా వెనక్కి వచ్చేస్తాం కదా'' అని రంగనాథ్‌ బతిమాలాడు. ''వెళ్లనీయకపోతే ఊపిరాడక ఆమె చచ్చిపోతే మరో న్యూసెన్సు. వెళ్లనీయి. సాయంత్రానికి వచ్చేస్తానంటున్నాడు కదా'' అని సురేశ్‌ మాస్టర్‌ నచ్చచెప్పిన మీదట శివరాజన్‌ సరేనన్నాడు.

రంగనాథ్‌, భార్య బయటకు వచ్చారు. ఆస్తమా మాట ఎలా వున్నా పోలీసుల నుంచి తప్పించుకోవాలి అని రంగనాథ్‌కి అర్థమైంది. ముత్తటి, బిరూటి గ్రామ ప్రజలు ఆ యిల్లు కుదిర్చిన తన స్నేహితుణ్ని గుర్తుపడతారు. తద్వారా పుట్టనహళ్లిలో తన యింటిపైకి పోలీసులు వస్తారు. అక్కడ తన సామాను చూసి, తన గురించిన సమస్త వివరాలు తెలుసుకుంటారు. అలా జరగకుండా వుండాలంటే పోలీసుల కంటె ముందుగా తను తన యింటికి వెళ్లి అక్కడ సామాన్లు ఖాళీ చేసేయాలి - అనుకుని భార్యతో సహా పుట్టనహళ్లి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి గబగబా యింట్లోని సామానులన్నీ చుట్టచుట్టేసి ఒక మెటాడర్‌ వ్యాన్‌ అద్దెకు తీసుకుని దాన్లో పడేశారు. బెంగుళూరు పోనీయమన్నారు. మృదుల అన్నయ్య బెంగుళూరు దగ్గర శాంతి ఆలివర్‌ చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్లి దాక్కోమని మృదులకు చెప్పి దారిలోనే తను వ్యాన్‌ దిగి ఎక్కడికో వెళ్లిపోయాడు. మృదుల అన్నగారి యింట్లో తలదాచుకుంది.

అప్పటికే తన యింటి అడ్రసు పోలీసులు సంపాదించారని రంగనాథ్‌ వూహించలేదు. బెంగుళూరు పోలీసు కమిషనర్‌ తన వద్దకు వచ్చిన అడ్రసు కాగితాన్ని బెంగుళూరు పోలీసులకు యిచ్చి రంగనాథ్‌ యింటిపై దాడి చేయమన్నాడు. వాళ్లు పుట్టనహళ్లి వెళ్లేటప్పటికి రంగనాథ్‌ వచ్చి ఖాళీ చేయడం జరిగిపోయింది. అయితే వాళ్లు సామాన్లు తరలించిన మెటాడర్‌ వ్యాన్‌ డ్రైవర్ని పట్టుకున్నారు. అతను యిచ్చిన సమాచారంతో సాయంత్రానికి శాంతి ఆలివర్‌ చర్చి చేరుకుని మృదులను అదుపులోకి తీసుకున్నారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

mbsprasad@gmail.com

Click Here For Archives