కిరణ్ స్థానంలో వచ్చేవారి పేర్లలో మొదట్లో బొత్స, ఆ తర్వాత ఆనం పేరు వినబడింది. తర్వాత కోట్ల అన్నారు. ఇప్పుడు కన్నా అంటున్నారు. మూణ్నెళ్ల ముచ్చటకోసం ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని వాళ్లు అనుకుంటున్నారట. అలా అని ఇప్పుడు వదిలేస్తే యింకెప్పుడైనా వస్తుందన్న హామీ ఏమైనా వుందా? నెల చేసినా మాజీ ముఖ్యమంత్రి అనే పేరు శాశ్వతంగా వుండిపోతుంది కదా. ఏది ఏమైనా కిరణ్ అధిష్టానానికి ఎదురు తిరిగారన్నది నిశ్చయం. 'మీ ముఖ్యమంత్రి మాట వినటం లేదు' అని ఆజాద్ సిపిఐ నారాయణగారి వద్ద అన్నట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెసు ముఖ్యమంత్రి నెలన్నరపాటు ఢిల్లీ వెళ్లకపోవడం వింతల్లో వింత. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెసు పాలిత రాష్ట్రాల నుండి నిధులు పంపడం ఆనవాయితీ. కిరణ్ పంపలేదట. ఇదొకటి వాళ్లను పూర్తిగా మండించి వుంటుంది. కిరణ్‌కు బుద్ధి చెప్పి పంపించాలనే ఉద్దేశంలోనే వుండి వుంటారు. అందుకే కిరణ్ సమైక్యవేదికకు తూట్లు పొడవడానికి సకలయత్నాలు చేస్తున్నారు.
నిన్న పురంధరేశ్వరి గారు ఏం చెప్పారు? ఇంకా సమైక్యం పట్టుకుని వేళ్లాడాలా? విభజన అనివార్యం అయినపుడు మన హక్కుల కోసం పోరాడవద్దా? అని వాదించారు. అనివార్యం చేసినదెవరు? కాంగ్రెసు నిర్ణయించినంత మాత్రాన అనివార్యం అయిపోతుందా? విభజన జరిగే తీరును బిజెపి నిరసిస్తున్నపుడు తెలంగాణ బిల్లు సునాయాసంగా పాసయిపోతుందా? పోనీ పురంధరేశ్వరిగారి కంటికి విభజన తీరు ఎలా కనబడుతోందో చెప్పమనండి. అంతా సవ్యంగా టైమ్‌టేబుల్ ప్రకారం జరుగుతోందా? మొన్న సమావేశంలో మంత్రుల ముఠాలో ముగ్గురు మాత్రం కూర్చున్నారట. అరసభ్యుడు నారాయణస్వామి వస్తూ పోతూ వున్నారట. పంచపాండవులంటే మంచం కోళ్లలా.. అన్న సామెతలా, 10 మంది వుండాల్సిన జిఓఎమ్‌లో ఆరున్నర మందినే వేశారు. వారిలో సగానికి సగం మంది గైరుహాజరు. తెలుగువాళ్లని విడగొట్టడం ఎంత చులకనగా వుందో చూడండి. ఇవేమీ ఆవిడగారి కంటికి కనబడవా? ఇక హక్కులకోసం పోరాడవద్దా? అని అడుగుతున్నారు. వద్దని ఎవరన్నారు? 2009 నుండి ఏం పోరాడారు? వైజాగ్‌కి ఏం తెచ్చారు? ఇన్నాళ్లూ హక్కుల కోసం కాకుండా మరి దేనికోసం పోరాడారు? స్వప్రయోజనాల కోసమా?
ఇప్పుడు యింత లేటుగా లేచి మీరు పోరాడితే వాళ్లు యిచ్చేదేముంది – హామీలు తప్ప నిధులు కాదు కదా! వైజాగ్ రైల్వే డివిజన్ కూడా తెచ్చుకోలేని వ్యక్తి యీ రోజు పెద్ద పోరాటగత్తెగా బిల్డప్ ఒకటి. కిశోర్ చంద్రదేవ్ గారు కూడా వైజాగ్‌ను రాజధాని చేయాలని మొదలెట్టారు. ఎప్పుడో 60 ఏళ్ల కితం వాంఛూ కమిషన్ రిపోర్టు దుమ్ము దులుపుతున్నారు. ఇన్నాళ్లు మంత్రిగా వుండి వైజాగ్‌కు వీళ్లు చేసినదేమిటి? హైదరాబాదులో ఉమ్మడి రాజధాని పదేళ్లు ఎందుకు వుండాలి? ఏడాదిలో వైజాగ్ వచ్చి పడిపోవచ్చు అంటున్నారు. సహజంగానే తెరాసకు యీ వాదన నచ్చింది. సీమాంధ్ర మంత్రులంతా ఢిల్లీ నాయకత్వం చెప్పినట్టు ఆడడానికే నిశ్చయించుకున్నారు. రాజీనామా చేశామంటూ చెప్తారు, మళ్లీ ఢిల్లీ పాటే పాడతారు. విభజనకు అంగీకరించే పంథా కరక్టు, సమైక్యం అనడం పొరబాటు, సమైక్యం అని చెప్పి కిరణ్ మోసగిస్తున్నాడు అని అనిపించడానికే వీళ్ల తాపత్రయం.
కిరణ్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చేద్దామన్న ఉబలాటం చాలామందిలో వుంది. అటువంటి వారిలో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. నవంబరు 14న కిరణ్ ఎత్తుకు పై యెత్తు వేసి బాలలతో పాటు కన్నాకూ రాబోయే రోజుల గురించి సినిమా చూపించారు. బాలల చిత్రోత్సవం కారణంగా తను ఢిల్లీ వెళ్లకపోవడాన్ని వుపయోగించుకుంటూ కన్నాను నియమించబోతున్నారన్న పుకారు తయారుచేసి వదిలేసరికి గగ్గోలు పుట్టింది. అది చూసి 'నాకు ఆ ఆశ లేదు బాబోయ్' అని కన్నా అనవలసి వచ్చింది. ఇలా చేసి కిరణ్ సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు, ఢిల్లీ వెళ్లకపోవడానికి అసలు కారణం షిండే చెప్పడంతో భంగపడ్డారు అని సాక్షి రాసింది. దాని మాట ఎలా వున్నా ఆశావహుల్లోంచి కన్నా వెనక్కి తగ్గారని మాత్రం చెప్పక తప్పదు కదా. అసలు ఆయన స్థాయి వ్యక్తికి సోనియా ఎపాయింట్‌మెంట్ యివ్వడంతోనే తెలుస్తోంది – కన్నాను కాస్సేపైనా కన్సిడర్ చేశారని. ఆయన కూడా సీమాంధ్రకు ఫలానాఫలానా ప్యాకేజీ యిస్తే నేను మేనేజ్ చేస్తాను అని భరోసా యిచ్చాడట. దానికేం అని వాళ్లు అన్నా సీమాంధ్రులు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే యిప్పుడు యుపిఏ చరమాంకంలో వుంది. మళ్లీ వచ్చే ఛాన్సు కనుచూపుమేరలో లేదు. ఈ హామీలు ఎవడు నమ్ముతాడు?
ఇప్పటికే తెలంగాణ ప్రజలు సోనియా సర్కారును నమ్మడం మానేశారు. తెలంగాణ యిస్తున్నాం అంటూ – హైదరాబాదుపై యిన్ని ఆంక్షలా? హైదరాబాదు పరిధిపై తర్జనభర్జన జరిగి చివరకు జిఎచ్‌ఎంసికి ఒప్పుకునేట్టు వున్నారంటున్నారు. 28 రాష్ట్రాల విషయంలో లేని ఆంక్షలు, షరతులు తెలంగాణ విషయంలో పెట్టబోతున్నారని రూఢి అవుతోంది. పక్కరాష్ట్ర పౌరులకు కూడా మీతోపాటు సమానహక్కులుంటాయి, మీ రాష్ట్రపు గుండెకాయపై అధికారం కేంద్రం చేతిలో వుంటుంది అంటే ఎవరికి నచ్చుతుంది? ఇంగ్లీషువాళ్లు స్వాతంత్య్రం యిస్తూ యిస్తూ రెండుగా విడగొట్టినందుకే తిట్టుకున్నాం. పుణ్యాత్ములు వాళ్లు కొన్ని అధికారాలను వాళ్ల చేతిలో పెట్టుకోలేదు. ఒక దేశంలో మరో దేశపౌరులు సమానహక్కులు అనుభవిస్తారని చట్టం చేసి పోలేదు. వీళ్లు వాళ్ల కంటె దరిద్రంగా వున్నారు. హైదరాబాదు యుటీనో, ప్రత్యేకరాష్ట్రమో చేశాం. అక్కడ అందరికీ సమానహక్కులుంటాయి అంటే అదో దారి. హైదరాబాదు తెలంగాణదే, కానీ దానిపై తెలంగాణకు ముఖ్యమైన హక్కులు కొన్ని లేవు. పక్కరాష్ట్రం వారు స్థానికులుగా పరిగణించబడతారు అనడం ఎంత దుర్మార్గం! పదేళ్లే కదా అంటున్నారు. అది యిప్పటిమాట. రాష్ట్రాల విషయంలో, జలవివాదాల విషయంలో ఒప్పందాల వుల్లంఘన ఎలా జరుగుతోందో చూస్తున్నాం. చండీగఢ్ సంగతి చెప్పనే అక్కరలేదు. కేంద్రం చేతిలో సర్వాధికారాలు పెట్టి కూర్చున్నారు రాజ్యాంగనిర్మాతలు. సంకీర్ణయుగంలో ఏ చిన్నపార్టీ అయినా తమకు కావలసి వచ్చినట్టు ప్రభుత్వాన్ని ఆడించగలదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2013)