Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : ఉదారవాద విద్యాలయంపై హంగరీ కన్నెర్ర

రైటిస్టు భావాలున్న హంగరీ ప్రధాని విక్టర్‌ ఆర్బన్‌ ఉదారవాదానికి, స్వతంత్ర భావాలకు నిలయంగా బుడాపెస్టులో వున్న సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్శిటీపై, దాని వ్యవస్థాపకుడు, దాత అయిన జార్జి సోరోస్‌పై కత్తికట్టాడు. ఆ యూనివర్శిటీని మూతవేసే పరిస్థితి కల్పించడానికి 199 మంది సభ్యులున్న పార్లమెంటు ద్వారా ఒక చట్టం చేయించాడు. గతవారం హంగేరియన్‌ పార్లమెంటులో ఆ బిల్లుకు 123 ఓట్లు అనుకూలంగా, 38 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. దీనికి వెనుక  ట్రంప్‌తో ముడిపడిన రాజకీయ నేపథ్యం వుంది. ప్రధాన పాత్రధారులైన సోరోస్‌, అర్బన్‌ల గురించి కాస్త తెలుసుకుంటేనే కథ అర్థమవుతుంది. 

జార్జి సోరోస్‌ 1930లో హంగేరీలోని బుడాపెస్టులో పుట్టాడు. నాజీలు తమ దేశాన్ని ఆక్రమించినప్పుడు దేశం విడిచి పారిపోయాడు. 1947లో ఇంగ్లండు చేరి, లండన్‌ స్కూలు ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకుని, బ్యాంకుల్లో పనిచేసి, 1969లో హెడ్జ్‌ ఫండ్‌ బిజినెస్‌లోకి దిగాడు. అక్కణ్నుంచి ఫండ్‌ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లి విపరీతంగా సంపాదించాడు.  తన వ్యూహాత్మక పెట్టుబడులతో 1992లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండునే గడగడలాడించాడు. అమెరికాలో స్థిరపడి పౌరసత్వం తీసుకున్నాడు. అతని ఆస్తి 25 బిలియన్‌ డాలర్లు వుంటుందని అంచనా. ప్రపంచంలోని తొలి 30 మంది అత్యంత ధనికులలో అతను ఒకడు. అయితే అతను మహాదాత కూడా. కమ్యూనిస్టు వ్యతిరేక, ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలను సమర్థించడానికి ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్స్‌ అని పెట్టి 1979 నుంచి 2011 మధ్య 11 బిలియన్‌ డాలర్లు విరాళాలుగా యిచ్చాడు. 1980, 1990లలో రష్యా పతనం తర్వాత తూర్పు యూరోప్‌ దేశాలు కమ్యూనిజం నుంచి బయటకు వచ్చి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆర్థిక సాయం అందించాడు. 

1991లో తన సొంతవూరు బుడాపెస్టులో సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్శిటీ నెలకొల్పి తన లిబరల్‌ భావాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాడు. దాన్ని న్యూయార్క్‌లో రిజిస్టరు చేయించాడు. ప్రస్తుతం వున్న 1440 మంది మాస్టర్స్‌, రిసెర్చ్‌ విద్యార్థుల్లో 335 మంది హంగరీవారు, తక్కినవారు 107 దేశాల నుంచి వచ్చినవారు. అన్ని దేశాలలోను భావప్రకటనా స్వేచ్ఛ వుండాలని, ప్రజాస్వామ్యం నెలకొనాలని వారు భావించి, దాని సాధించడానికి చర్చలు జరుపుతూంటారు. ఇటీవల శరణార్థులుగా వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు కూడా. సోరోస్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పడదు. ట్రంప్‌ మైనారిటీ వ్యతిరేక, శరణార్థి వ్యతిరేక, విదేశీవలసల వ్యతిరేక భావాలను సోరోస్‌ అసహ్యించుకుంటాడు. ఈ మధ్యే ''వైట్‌ హౌస్‌ను ప్రస్తుతం ఆక్రమించిన వ్యక్తి ఒక ఇంపోస్టర్‌ (మారువేషగాడు), రాజకీయంగా టక్కరి, కాబోయే నియంత'' అన్నాడు. ట్రంప్‌ బదులు తీర్చుకోవాలనుకున్నాడు. తనలాటి భావాలే కలిగి వుండి, హంగరీలో ప్రధానిగా వున్న తన మిత్రుడు విక్టర్‌ అర్బన్‌ను గిల్లాడు. దాని ఫలితమే యీ కొత్త చట్టం!

అర్బన్‌ 1963లో పుట్టాడు. బుడాపెస్టు యూనివర్శిటీలో లా చదివాడు. ఫుట్‌బాల్‌ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 1989లో సోవియత్‌ సైన్యాలు దేశం విడిచి వెళ్లిపోవాలని, అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే భావాలున్న సోరోస్‌ అతన్ని యిష్టపడి స్కాలర్‌షిప్‌ యిస్తే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి వెళ్లి బ్రిటిష్‌ లిబరల్‌ పొలిటికల్‌ ఫిలాసఫీని అధ్యయనం చేశాడు. హంగరీ అనేక పార్టీలుండే ప్రజాస్వామ్య దేశంలా మారినప్పుడు ఎన్నికలలో నిలిచి 1990లో ఎంపీగా గెలిచాడు. 1993లో ఫెడరేషన్‌ ఆఫ్‌ యంగ్‌ డెమోక్రాట్స్‌ (ఫిడెస్‌జ్‌)కు నాయకత్వం వహించాడు. దాన్ని రైటిస్టు భావజాలంవైపు నడిపించి, అదే భావాలతో వుండే పార్టీలతో కలిసి 1998లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచి, ప్రధాని అయ్యాడు. అమెరికా నేతృత్వంలోని నాటోలోకి హంగరీని చేర్పించాడు. ఆర్థిక ప్రగతి సాధిస్తూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలిగాడు. కానీ అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం చేత నాలుగేళ్లలో పదవి పోగొట్టుకుని 8 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో వుండిపోవలసి వచ్చింది. 

ప్రతిపక్షంలో వుండగా అతను పాప్యులిస్టుగా, విభజనవాదిగా వున్నాడు. అధికారంలో వున్న వామపక్ష ప్రభుత్వనేతలు అంతఃకలహాల్లో మునగడంతో ఓడిపోయి అర్బన్‌, అతనితో పొత్తు పెట్టుకున్న క్రిస్టియన్‌ డెమోక్రాట్లు 2010లో గెలిచి అధికారంలోకి వచ్చారు. 2014లో మళ్లీ ఎన్నికయ్యారు. అర్బన్‌ ప్రధానిగా అనేక విధానపరమైన మార్పులు తెచ్చాడు. 2011లో తన పార్టీకి మేలు కలిగేట్లా పార్లమెంటు నియోజకవర్గాల రూపురేఖలు మార్చేసి, ఎంపీల సంఖ్యను సగానికి తగ్గించేశాడు. (2013లో హంగరీ కోర్టు దీన్ని కొట్టివేసింది) యూరోపియన్‌ యూనియన్‌, ఐఎంఎఫ్‌ వారిస్తున్నా తమ సెంట్రల్‌ బ్యాంకు చట్టాన్ని మార్చేశాడు. యూరోపియన్‌ కమిషన్‌ అతని ప్రభుత్వంపై న్యాయపరమైన చర్య తీసుకుంది. అన్నిటా నియంతృత్వపు, కన్సర్వేవిటిస్టు పోకడలు కనబడడంతో సోరోస్‌ అతనితో విభేదించసాగాడు. యూరోప్‌లో రాజకీయపరమైన అలజడి పెరిగి వలసలు పెరగడంతో అర్బన్‌ శరణార్థులకు వ్యతిరేకంగా ప్రకటనలు యిచ్చి యూరోపియన్‌ యూనియన్‌ విధానాలను ఎదిరించసాగాడు. ఇటీవల ఉపయెన్నికలలో రెండు సీట్లలో అతని పార్టీ ఓడిపోయింది. అతని కంటె అతివాద రైటిస్టు పార్టీ అయిన జోబిక్‌ ఒక సీటు గెలిచింది. 2018లో రాబోయే ఎన్నికలలో ఆ పార్టీ మధ్యేమార్గానికి చెందిన ఓటర్ల సాయంతో అధికారంలోకి వస్తుందేమోనన్న భయంతో అర్బన్‌ మరింత జాతీయవాదం ప్రదర్శించసాగాడు. ట్రంప్‌ ధోరణిలోనే సెర్బియా సరిహద్దులో 175 కి.మీ.ల కంచె కడతానంటున్నాడు. శరణార్థుల ఆక్రమణలో హంగరీ నలిగిపోతోందన్నాడు. పనిలో పనిగా సోరోస్‌పై విషం చిమ్ముతూ అతను హంగరీకి శరణార్థుల వలసను ప్రోత్సహిస్తున్నాడని, హంగరీ రాజకీయాల్లో వేలు పెడుతున్నాడని ఆరోపించాడు.

సోరోస్‌పై కసి తీర్చుకోవడానికి ట్రంప్‌కు ఇలాటి అర్బన్‌ అనువుగా తోచాడు. బహుశా ట్రంప్‌ ప్రోద్బలంతో అర్బన్‌ నేతృత్వంలోని హంగరీ ప్రభుత్వం హంగరీలో నడుస్తున్న 27 విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు విధిస్తూ చట్టం జారీ చేసింది. దాని ప్రకారం సెంట్రల్‌ యూరోపియన్‌లా విదేశంలో రిజిస్టరయిన యూనివర్శిటీలు తమ స్వదేశంలో 2018 ఫిబ్రవరిలోగా క్యాంపస్‌ నెలకొల్పాలి. ఆ దేశప్రభుత్వం హంగరీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి. సోరోస్‌కు ఎంత డబ్బున్నా కొన్ని నెలల్లో న్యూయార్క్‌లో క్యాంపస్‌ నిర్మించడం అసాధ్యం. ఇక సోరోస్‌ అంటే మండిపడే ట్రంప్‌, అర్బన్‌ అతని  యూనివర్శిటీ కోసం ఒప్పందం మీద సంతకాలు పెడతారా? ఛస్తే పెట్టరు. ఆ విధంగా యూనివర్శిటీ మూతపడేట్లా పన్నాగం పన్నారు. ఒకవేళ అది కొనసాగాలంటే తన పేరు మార్చుకుని, న్యూయార్కులో క్యాంపస్‌ పెట్టి అమెరికన్‌, హంగరీ ప్రభుత్వాలు చెప్పినట్లల్లా ఆడాలి. 

పాలకులందరికీ మేధావులన్నా, ఆలోచనాపరులన్నా చికాకు. ఓటర్లు విద్యావంతులైతే తమకు ముప్పు వస్తుందని భయపడతారు. చౌకగా ఆహారపదార్థాలు, మద్యపానీయాలు, పెళ్లి ఖర్చులు, పండగ కానుకలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతులు యివ్వడానికి డబ్బు వెచ్చిస్తారు కానీ నాణ్యమైన ఉచిత విద్య అందించి, వారిలో జ్ఞానం పెంపొందించుదామని కోరుకోరు. మితిమీరిన జాతీయవాదంతో, ప్రాంతీయవాదంతో వారిని జోకొట్టి, వారిని వర్గాలుగా విభజించి ఒకరిపై మరొకరిని ఉసిగొల్పి తమ పాలన నిరాటంకంగా సాగేట్లా చూస్తారు. వారిలో ఉదార భావాలను వ్యాప్తి చేద్దామని చూసే, స్వతంత్రంగా ఆలోచించేందుకు అనువుగా తయారుచేసే విద్యావంతులను, విద్యాలయాలను భూస్థాపితం చేద్దామని చూస్తారు. లోకమంతా యిదే పోకడ. హంగరీది తాజా ఉదాహరణ.

(ఫోటో బుడాపెస్టులోని సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్శిటీ (ఎడమవైపు సోరోస్‌, కుడివైపు అర్బన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com