ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 10

ఎన్టీయార్‌ డైరక్టు చేసిన ''శ్రీకృష్ణపాండవీయం'' (1966)లో రుక్మిణీకళ్యాణం బాలే సకలవిధాలా పరమాద్భుతంగా ఉంటుంది. ప్రఖ్యాత సంగీత, నృత్య విమర్శకుడు విఎకె రంగారావు గారు ఆ సినిమా చూశాక ఆయన దగ్గరకు వెళ్లి ''ఆ పార్టు…

ఎన్టీయార్‌ డైరక్టు చేసిన ''శ్రీకృష్ణపాండవీయం'' (1966)లో రుక్మిణీకళ్యాణం బాలే సకలవిధాలా పరమాద్భుతంగా ఉంటుంది. ప్రఖ్యాత సంగీత, నృత్య విమర్శకుడు విఎకె రంగారావు గారు ఆ సినిమా చూశాక ఆయన దగ్గరకు వెళ్లి ''ఆ పార్టు మీరు డైరక్టు చేసినట్లు లేదండి…'' అని ఆగారు. ఏ కమలాకర కామేశ్వరరావు పేరో చెప్తారేమోనని ఎన్టీయార్‌ కనుబొమ్మలెత్తి ''మరి..?'' అన్నారు. ''..సాక్షాత్తూ బమ్మెర పోతన డైరక్టు చేసినట్లుందండి'' అన్నారు రంగారావు. ఎన్టీయార్‌ పరమానంద భరితులై, గట్టిగా నవ్వుతూ అక్కడే వున్న పుండరీకాక్షయ్యగార్ని, త్రివిక్రమరావుగార్ని, సముద్రాల గార్ని పిలిచి చెప్పారట.

అంతటి రుక్మిణీకళ్యాణాన్ని ఓ డ్యూయట్‌గా బాలకృష్ణ రామకృష్ణ స్టూడియోస్‌ పేర తీసిన తన సొంత సినిమా ''పట్టాభిషేకం'' (1985) లో పెట్టదలచారు. కృష్ణుడిగా నటించేటప్పుడు తండ్రిలాగే పవిత్రంగా, నిష్ఠగా ఉన్నారు. 'అయినా యిది కత్తిమీద సామే, మీ నాన్నగారితో పోలిక వస్తుంది కాబట్టి..' అని నిర్మాత మురారి హెచ్చరించారు.  ఓ రోజు షూటింగుకి వెళ్లారు కూడా. దర్శకుడు రాఘవేంద్రరావు రుక్మిణిగా వేస్తున్న విజయశాంతిని రంభా, ఊర్వతి తరహాలో అలంకరించారు. అవేళ తీస్తున్న పాటలో ఆమె ఊర్వశి లాగ కాలు పైకెత్తి బాలకృష్ణ నడుము పైన వేసింది.

ఎన్టీయార్‌ సినిమాలో రుక్మిణిగా కెఆర్‌ విజయ ప్రదర్శించిన హుందాతనాన్ని మెచ్చుకునే మురారికి యీ చేష్ట నచ్చలేదు. ''లక్ష్మీదేవి అంశతో పుట్టిన రుక్మిణీదేవిని యిలా అసహ్యకరమైన నృత్యభంగిమలో చూపించడం బాగాలేదు'' అని రాఘవేంద్రరావుగారితో అన్నారు. అయినా ఆయన చలించలేదు ''ఈ రోజుల్లో యిలాగే ఉండాలి.'' అని బదులిచ్చి తన పని తను చూసుకోసాగారు. మురారి తగ్గకుండా ''పోతన వర్ణించిన రుక్మిణీదేవిలా లేదు, రాఘవేంద్రరావు చూపిస్తున్న విజయశాంతిలా వుంది.'' అనడంతో రాఘవేంద్రరావుగారికి కోపం వచ్చింది. మురారి బయటకు వచ్చేశారు. ఆ సినిమా పెద్ద ఫ్లాపయింది.

మురారి చక్కటి అభిరుచి గల నిర్మాత. తన సినిమా కథ, గీతరచన, సంగీతరచన అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. ఆ విషయం ఎన్టీయార్‌కు కూడా తెలుసు. మురారి ''త్రిశూలం'' (1982) సినిమా తీసే రోజుల్లో దాన్ని డైరక్టు చేస్తున్న రాఘవేంద్రరావుగారితో పనిబడి ఆయన డైరక్టు చేస్తున్న ''జస్టిస్‌ చౌదరి'' షూటింగుకి వెళ్లారు. అక్కడ రామారావు కలిశారు. ''కృష్ణంరాజు, రాధిక, జయసుధ, శ్రీదేవిలతో సినిమా తీస్తున్నారనీ, రాముడి మీద మంచి పాట రాయించారని విన్నాను. పల్లవి ఏమిటి?'' అని రామారావు అడిగారు.

మురారి వెంటనే సంతోషంగా 'రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను..' అని చెప్పి అలా ఎందుకు రాయించవలసి వచ్చిందో కథా, కమామీషు చెప్పారు. అంతా విని, రామారావు అభినందించడంతో మురారి కాస్త ధీమాగా ''రాఘవేంద్రరావు సినిమాల్లో యిలాంటి పాటలు వుండవు..'' అనడంతో రామారావు చిరునవ్వు నవ్వి ''ఈ రోజుల్లో యిలాంటి పాటలు రాయించడానికి నిర్మాతకి ధైర్యం, అభిరుచి రెండూ వుండాలి.'' అని సర్టిఫికెట్టు యిచ్చారు.

తర్వాత కొన్నాళ్లకి బాలకృష్ణతో ''సీతారామకళ్యాణం'' (1986) తీద్దామనుకుంటే ఎన్టీయార్‌ కథ ఎప్రూవ్‌ చేస్తే తప్ప అది సాధ్యం కాదని చెప్పారు. అప్పటికి ఎన్టీయార్‌ ముఖ్యమంత్రి. ప్రోటోకాల్‌ మర్యాదలన్నీ దాటుకుని ఆయన వద్దకు వెళ్లారు. ఆయన కుశలప్రశ్నలు వేస్తూ ఉంటే ''కథ ఎప్పుడు వింటారు సార్‌?'' అన్నారు మురారి. ''మంచి సినిమాలు తీస్తారు. మీరు కథ చెప్పటమేమిటి బ్రదర్‌! మంచి సినిమా తీయండి. మా వాడికి మంచి పేరు రావాలి.'' అన్నారు.

మురారి సంబరపడుతూ 'పాలగుమ్మి పద్మరాజు గారి చేత కథ రాయించుకుని యిప్పుడు జంధ్యాల, భమిడిపాటి గార్లతో మళ్లీ తయారుచేయిస్తున్నా. సంగీతం మహదేవన్‌. పాటలు ఆత్రేయ, వేటూరి రాస్తున్నారు.'' అన్నారు. ''విన్నాను – మీరు కథ గురించి, పాటల గురించి చాలా కష్టపడతారని. మా చక్కన్న (చక్రపాణి)గారి దగ్గర పనిచేశారట కదా'' అని మెచ్చుకోలుగా అన్నారు.

అలాటి మురారి అదే ఎన్టీయార్‌చేత చివాట్లు పడవలసి వచ్చింది. ''నారీనారీ నడుమ మురారి'' (1990) సినిమా పాట విషయంలో. ఆ సినిమాలోనూ బాలకృష్ణే హీరో. ఇద్దరు హీరోయిన్లగా వేసిన శోభన, నిరోషాల మధ్య నలిగి చివరకు ఎవరిని చేపట్టాడో తెలియని విధంగా కథ ముగిస్తారు. సందర్భానికి తగినట్లు టైటిల్‌ సాంగ్‌ రాయించారు.

'ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకునపడి నీవు నలిగితివా,

వలపుల వానల జల్లులలో స్వామి తలమునకలుగా తడిసితివా..' అని ఆత్రేయ పల్లవి రాయగా దానికి ముందు వచ్చే సాకీని సిరివెన్నెల రాశారు…

'ద్వాపరమంతా సవతులసంత, జ్ఞాపముందా గోపాలా

కలియుగమందూ యిద్దరి ముందూ శిలవయ్యావే శ్రీలోల

కాపురాన ఆపదలను ఈదిన శౌరీ, ఏదీ నాకు చూపవా ఒకదారి' అని అది సాగుతుంది.

ఇక చరణాల్లో వేటూరి శ్రీనాథుడి చాటువు 'గంగ విడుము పార్వతి చాలున్‌' స్ఫూర్తిగా 'యదునాథా భామవిడుము రుక్మిణి చాలున్‌, రఘునాథా సీతనుగొని విడు శూర్పణఖన్‌' అని రాశారు.

ఎన్టీయార్‌ సినిమా చూసి ఈ పాట ఎవరు రాశారని అడిగితే మురారి ఫలానాఫలానా అని చెప్పారు. వేటూరి రాసిన రెండు వాక్యాలు ఉటంకించి 'ఇవీ ఆయనే రాశారా?' అని అడిగారు ఎన్టీయార్‌. మురారి వెంటనే విషయం గ్రహించి ఎపాలజిటిక్‌గా 'అది రాసేటప్పుడే రాముడికి, శూర్పణఖకి ఏమి సంబంధం ఉందని వేటూరి గారిని అడిగితే, కథలో సందర్భానికి సరిపోతుందిలే అని సమర్థించుకున్నారు. నేను మాత్రం ఏమంటాను సార్‌.'' అని వివరించుకున్నారు.

కానీ ఎన్టీయార్‌ కన్విన్స్‌ కాలేదు. ''నిర్మాత మీరే కదా? మరి మీరెలా ఒప్పుకున్నారు?'' అని నిలదీశారు. మురారికి నోట మాట రాలేదు. ''డబ్బు కోసం పురాణాలను భ్రష్టు పట్టించేంత స్థితికి దిగజారారన్నమాట'' అన్నారు ఎన్టీయార్‌.

ఈ సంఘటనలన్నీ తన ఆత్మకథ ''నవ్విపోదురుగాక..'' రాసుకున్న మురారి యిది రాసి చివర్లో '..అలా అన్నారనుకున్నాను, ఏమన్నారో గుర్తు లేదు కానీ భావం అదే. ఆయన వేటూరి నన్నారా, నన్నన్నారా అన్నది నాకు అర్థం కాలేదు. ఏమైనా డబ్బులిచ్చి రాయించుకున్న నిర్మాతదే ఆ బాధ్యత. ఆయన ముందు మాట్లాడేటంత ధైర్యం నాకు లేదు. అందుకే నోరు విప్పలేదు.' అని ఒప్పుకున్నారు.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
[email protected]

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 03

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 04 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 05  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 06

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 07 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 08   ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 09