Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: దశావతారాల్లో ఏది ముందు? ఏది వెనుక?

ఎమ్బీయస్‍: దశావతారాల్లో ఏది ముందు? ఏది వెనుక?

విష్ణువు దశావతారాలు అనగానే మనం మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన.. అంటూ ఎత్తుకుంటాం. అవి ఆ వరసలోనే జరిగాయనుకుంటాం. కొందరు సైన్సు చెప్పే యివల్యూషన్‌ క్రమానికీ దీనికీ ముడిపెడతారు. అంటే మొదట జలచరాలు (చేప), తర్వాత ఉభయచరాలు (నీటిలోనూ, నేల మీద మసల గలిగే తాబేలు), తర్వాత భూమి మీద మాత్రమే తిరిగే జంతువు (వరాహం), ఆ తర్వాత జంతువు, మనిషి కలిసిన నరసింహుడు, ఆ తర్వాత పొట్టి మనిషి. ఆ తర్వాత అడవి మనిషిలా గొడ్డలేసుకుని తిరిగినవాడు, ఆ పై సోఫిస్టికేటెడ్ ఆయుధమైన ధనస్సు ధరించిన రాముడు.. అంటూ! నిజానికి మత్స్యావతారం నాటికే పరిపూర్ణ మానవుడైన రాజు సత్యవ్రతుడు ఉన్నాడు. వామనుడు చిన్నపిల్లవాడు కాబట్టి పొట్టిగా ఉన్నాడు తప్ప కుబ్జుడు కాదు. అతని తలిదండ్రులు కశ్యపుడు, అదితి మామూలు మనుష్యులే. పరశురాముడికి ధనుర్విద్యా వచ్చు. కానీ అవతరాలను యీ క్రమంలో చెపితే సైంటిఫిక్‌గా అన్వయించవచ్చని కొందరికి వెర్రి.

మనకు గుళ్లలో కూడా యీ ఆర్డరే కనబడుతుంది. ఈ అవతారాల కథలు కూడా మనకు తెలుసు కాబట్టి అంతా హ్యేపీయే. కానీ భాగవతం చదివితే మాత్రం యీ వరుస మీద అనుమానం వస్తుంది. అదెలా అంటే క్షీరసాగర మథనం కథలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలికారనే కథ మనందరికీ తెలుసు. ‘ఈ దుష్కరమైన కార్యంలో చేతులు కలపండి, అమృతం వచ్చాక పంచుకుందాం’ అని అని దేవతల రాజైన ఇంద్రుడు అడగ్గా సరేనన్న రాక్షసరాజు ఎవరో మనం పట్టించుకోము. పట్టించుకుంటే మాత్రం ఉలిక్కిపడతాం. ఎందుకంటే అతను వేరెవరో కాదు, బలి! ఎస్, వామనుడికి మూడడుగుల భూమి పేర సర్వస్వం ధారపోసి, పాతాళానికి వెళ్లిపోయిన మహాబలి!

అమృతం దక్కడానికి ముందు దేవాసుర యుద్ధాల్లో దేవతలు మరణిస్తూ ఉండేవారు. చనిపోయిన రాక్షసులను రాక్షసగురువైన శుక్రుడు మృతసంజీవనీ విద్యతో బతికిస్తూ ఉండేవాడు. ఆ విద్య నేర్చుకోమని దేవగురువైన బృహస్పతి తన కొడుకు కచుణ్ని శుక్రుడి వద్దకు పంపించాడు. శుక్రుడు అతన్ని తన శిష్యుడిగా ఆమోదించడం సహించలేని రాక్షసులు కచుణ్ని చంపేసేవారు. శుక్రుడు అతన్ని బతికిస్తూ వచ్చాడు. చివరకు కచుణ్ని కాల్చి బూడిద చేసి మద్యంలో కలిపి శుక్రుడి చేత తాగించేశారు రాక్షసులు. కచుడు పొట్టలోకి వెళ్లిపోయాడు. బతికిస్తే తను చచ్చిపోతాడు. శుక్రుడు ఊరుకునేవాడేమో కానీ కచుణ్ని ప్రేమించిన అతని కూతురు దేవయాని గగ్గోలు పెట్టేసింది. అప్పుడు విధి లేని పరిస్థితుల్లో శుక్రుడు పొట్టలో ఉన్న కచుడికి మృతసంజీవనీ విద్య నేర్పాడు. కచుడు బతికి గురువుగారి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి, మృతుడై పడి ఉన్న గురువును ఆ విద్యతో బతికించాడు. వచ్చిన పని అయిపోయింది కాబట్టి స్వర్గానికి ప్రయాణం కట్టాడు కచుడు. దేవయాని ‘నన్ను పెళ్లి చేసుకో’ అంది. ‘మీ నాన్న దేహంలోంచి పుట్టినవాణ్ని, సోదరసమానుణ్ని అన్నాడు’ అన్నాడు కచుడు. దేవయానికి ఒళ్లు మండి ‘ఈ విద్య నీకు పనికి రాదు ఫో’ అని శాపమిచ్చింది. ‘నాకు పని చేయకపోయినా, నా నుంచి నేర్చుకున్న తక్కినవాళ్లకు పనికి వస్తుందిగా’ అంటూ కచుడు వెళ్లిపోయాడు. అప్పణ్నుంచి యుద్ధానంతరం దేవతల్ని బతికించే పనిలో పడ్డాడు.

ఇలా ఉండగా దుర్వాస శాపం వలన ఇంద్రుడు తన యింద్రవైభవం కోల్పోయాడు. అతని ఐరావతం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం వగైరాలు సముద్రంలో మునిగాయి. అతను రాక్షసరాజైన బలి చేత ఓడించబడి రాజ్యభ్రష్టుడయ్యాడు. దేవతలు మాటిమాటికి యుద్ధంలో ఓడిపోతున్నారు. అప్పుడు దేవతలకు బలం, తేజస్సు, ఓజస్సు, మృత్యురాహిత్యం రావాలన్నా, అమృతం కావాలని, అమృతం తయారుకావడానికి ఓషధులున్న వృక్షాలు సముద్రంలో వేసి చిలకాలని విష్ణువు చెప్పాడు. బలితో చేతులు కలపమన్నాడు. ఇంద్రుడు బలి నడిగితే సరేనన్నాడు. క్షీరసాగర మథనం కథ అందరికీ తెలిసిందే. మంధర పర్వతం మునిగిపోతూ ఉంటే విష్ణువు కూర్మావతారంలో వచ్చి పైకెత్తాడు. అమృతం వెలువడ్డాక దేవదానవుల తగవు తీర్చడానికి జగన్మోహిని రూపంలో (అవతారం అనవచ్చో లేదో తెలియదు) వచ్చాడు.

పంపిణీలో జరిగిన మోసంతో మండిపడి బలి ఇంద్రుడితో తలపడ్డాడు. కానీ అమృతం తాగడం చేత ఇంద్రసేనలు గెలిచాయి. అప్పుడు శుక్రుడు బలి చేత విశ్వజిత్‍యాగం చేయించాడు. అది పూర్తయి, బలి బలోపేతుడై, ఇంద్రుణ్ని ఓడించి చక్కగా రాజ్యం చేస్తున్నాడు. ఇంద్రుడు మొరపెట్టుకుంటే విష్ణువు వామనుడిగా పుట్టి బలి వేరే యాగం చేస్తూండగా అక్కడికి వెళ్లి అతన్ని తొక్కేసి, పాతాళానికి పంపేసి, ఇంద్రుడికి మళ్లీ రాజ్యం యిచ్చాడు. అంటే కూర్మావతారం వెంటనే వామనావతారం వచ్చేసిందన్నమాట! మరి మధ్యలో అవతారాలేమైనట్లు? ఇక్కడే యింకో తిరకాసు కూడా ఉంది. ఇంతకీ యీ బలి ఎవరు? ప్రహ్లాదుడి మనుమడ! హిరణ్యకశిపుడి బారి నుంచి తనను రక్షించడానికి విష్ణువును నరసింహావతారంలో తెప్పించుకున్నవాడు! అంటే అర్థమేమిటి? నరసింహావతారం జరిగిన తర్వాతనే ప్రహ్లాదుడి మనుమడైన బలి కాలంలో కూర్మావతారం, వామనావతారం జరిగాయన్నమాట!  

ఇది నమ్మితే, మనం అనుకుంటూ వచ్చిన అవతారాల క్రమం మారిపోలేదూ!? ఎక్కడైనా పొరపాటుందా? ఆ రాక్షసరాజు బలి కాడా? వేరే బలి ఉన్నాడా? ఈ బలి ప్రహ్లాదుడి మనుమడు కాదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే బలిని కాపాడమని ప్రహ్లాదుడు వచ్చి విష్ణువుని వేడాడు. వేరే బలి ఎవరైనా ఉన్నారా అని చూడబోతే ఆ పేరుతో వేరేవాడు ఒకడే ఉన్నాడు. అతను సుదేవుని కుమారుడు. భార్య సుధేష్ణ. ఇతని కథకు బొత్తిగా పోలిక లేదు. క్షీరసాగర మథన సమయంలో ఉండే రాక్షసరాజు బలియే అని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. ఉషశ్రీ భాగవతం పేజీ 123లో వామనావతార కథ అనే హెడింగ్‍ కింద ‘..అమృతం ఆస్వాదించిన దేవతల చేతిలో పరాజయం పొందిన బలి, కాలం కలిసి వచ్చేవరకూ నిరీక్షిస్తున్నాడు...’ అని ఉంది. పోతన భాగవతం టిటిడి ప్రచురణ మూడవ సంపుటం 8 వ స్కంధంలో క్షీరసాగర మథనంలో కూర్మావతారం పేజీ 200లో వచ్చింది. జగన్మోహిని అవతారం 224వ పేజీలో వచ్చింది. పేజీ 225లో దేవాసుర యుద్ధం హెడింగ్‍ కింద బలి, ఇంద్రుడు పోరాడినట్లుంది. యుద్ధానికి వెళ్లబోయే ముందు బలి తాత ప్రహ్లాదుడు వచ్చి ఆశీర్వదించినట్లు ఉంది.

పేజీ 252లో వామన చరిత్ర ప్రారంభమైంది. 253లో బలి చేత శుక్రుడు విశ్వజిద్యాగం చేయించినట్లు, బలి అమరావతిపై యుద్ధానికి వెళ్లినట్లు ఉంది. పేజీ 292లో వామనుడు త్రివిక్రముడవడం ఉంది. ఇదే సంపుటంలో ప్రహ్లాద చరిత్ర ఏడవ స్కంధంలోనే పేజీ 33లోనే వచ్చేసింది. అనువాదంలో పోతన గారు ఏమైనా మార్చేశారా అని చూస్తే, మూల సంస్కృతభాగవతంలో కూడా అలాగే ఉంది. సంస్కృత భాగవతానికి గీతా సొసైటీ వారి ఇంగ్లీషు అనువాదంలో పేజీ 370 (కాంటో 8, చాప్టర్ 6) సాగర మంథనంలో బలి మహారాజు, అతని సహాయకులు శంబరుడు, అరిష్టనేమి పాల్గొన్నారని స్పష్టంగా ఉంది. వికీపీడియాలో సముద్ర మంథనం కింద యిచ్చిన దానిలో కూడా రాక్షసరాజు బలి అనే ఉంది.

భాగవతంలో ఉన్నదాన్ని బట్టి అందరూ యిలా రాశారు. దీన్ని బట్టి నరసింహావతారం తర్వాతనే కూర్మావతారం వచ్చినట్లు తేలుతుంది. దీనికి విరుద్ధంగా ఏమైనా ఉన్నాయా అని వెతికాను. విష్ణుపురాణంలో వరాహావతారం గురించి వర్ణిస్తూ తొలుత మత్స్య, కూర్మ అవతారాలు ఎత్తినట్లుగా.. అని ఉంది. వరాహపురాణంలో భూదేవి వరాహాన్ని కీర్తిస్తూ తొలుత మత్స్య, కూర్మ అవతారాలు ఎత్తావు.. అంది. కూర్మపురాణంలో కూర్మావతారం గురించి పెద్దగా ఏమీ లేదు. దేవదానవులు సముద్రాన్ని మథించారు అని ఉంది కానీ బలి అని పేరు రాయలేదు. వ్యాసమహాభారతానికి తిప్పాభట్ల రామకృష్ణమూర్తి, సూరం శ్రీనివాసులు గార్లు చేసిన అనువాదంలో ఆదిపర్వం-1 పేజీ నెం. 80లో సాగరమథనం రాశారు. దానిలో రాక్షసరాజు పేరు బలి అని రాయలేదు. విష్ణువు కూర్మావతారం ఎత్తినట్లు స్పష్టంగా రాయలేదు. మందర పర్వతం మోయమని కూర్మరాజును దేవతలు అడిగినట్లు రాశారు. పూర్వగాథా లహరిలో బలి గురించి రాసినప్పుడు ప్రహ్లాదుడి మనుమడిగా రాజ్యం చేయడం, ఇంద్రుణ్ని ఓడించడం, వామనుడికి దానం చేయడం రాశారు తప్ప సముద్రమథనంలో అతని పాత్ర గురించి రాయలేదు. ఈ పురాణాల్లో ఏది ముందు రాశారో, ఏది తర్వాత రాశారో నాకు తెలియదు.

విష్ణువువి మొత్తం 24 అవతారాలు. వాటి గురించి పోతన భాగవతం ఏం చెప్తోందో చూదాం. టిటిడి ప్రచురణ పేజీ 197 - రెండవ స్కంధంలో విష్ణువు  ఎత్తిన అవతారాల గురించి చెప్పిన క్రమం యిలా ఉంది - వరాహం, సుయజ్ఞుడు, కపిలుడు (యోగాచార్యుడు), దత్తాత్రేయుడు, సనకాదులు (నలుగురు), నరనారాయణులు, ధ్రువుడు, పృథు చక్రవర్తి, వృషభుడు, హయగ్రీవుడు, మత్స్యం (ఇది పేజీ 203లో వచ్చింది, మొదటే రాలేదు. పైగా మత్స్యావతారం గురించి వివరంగా యింకెక్కడా యివ్వలేదు), కూర్మం, నరసింహావతారం, (దీన్ని వరాహం తర్వాత కూర్మానికి ముందు రావాలి, యిప్పుడు చెప్పారు) ఆదిమూలం (గజేంద్రమోక్షం కథలో వచ్చినది కూడా అవతారమేట), వామనుడు, హంస, ధన్వంతరి, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, వ్యాసుడు, బుద్ధుడు (గౌతమబుద్ధుడని చెప్పలేదు), కల్కి! దీని తర్వాత మూడవ స్కంధంలో వరాహావతారంతో అవతారాల కథ ప్రారంభమైంది. మత్స్యం గురించి ప్రస్తావన తప్ప కథ లేదు. కూర్మం గురించి 8వ స్కంధంలో వచ్చింది.

అవతారాలిన్ని ఉండగా వాటిలో పదిటి గురించి ప్రముఖంగా ప్రస్తావించడం గరుడ పురాణంతో ప్రారంభమైందట. 12 వ శతాబ్దానికి చెందిన జయదేవుడి అష్టపది ‘ప్రళయపయోధి జలే...’ నుంచి దశావతారాలు, వాటి ప్రస్తుత వరుస ప్రాచుర్యంలోకి వచ్చిందని ఒకాయన రాశాడు. అష్టపదిలో కవి యతి కోసం కొన్ని అవతారాలను మాత్రమే తీసుకున్నాడు, సీక్వెన్స్ కూడా మార్చేశాడు అని ఆయన రాశారు. దానిలో బలరాముడున్నాడు, అహింస బోధించిన బుద్ధుడున్నాడు. కృష్ణుడు లేడు, ఎందుకంటే యీ అవతారాలన్నీ కృష్ణుడివే అని కవి భావం కావచ్చు. బుద్ధుడు గౌతమబుద్ధుడు కాడని, వేరే బుద్ధుడని కొందరు వాదిస్తారు. ‘‘పూర్వగాథాలహరి’’లో బుద్ధుడి గురించి రాస్తూ ‘భూలోకమున వేదవిహితములైన కర్మలాచరించబడుతూ ధర్మం చక్కగా నడిచేది. ప్రజలందరూ స్వర్గానికి వెళుతున్నారు తప్ప యమలోకానికి ఎవరూ రావటం లేదు. యుముడు మొఱ పెట్టుకుంటే, విష్ణువు భూలోకంలో అవతరించి ప్రజలకు వేదముల మీద గౌరవం పోగొట్టి, కర్మభ్రష్టులను చేసి, స్వర్గానికి అనర్హులుగా చేయడానికి శుద్ధోధనుడి కుమారుడిగా పుట్టాడు’ అని రాశారు. దీనికి సోర్స్ భాగవతం అని యిచ్చారు.

ఇది చాలా వింతగా ఉంది. ధర్మసంస్థాపనకై సంభవామి యుగేయుగే అని కృష్ణావతారంలో చెప్పుకున్న విష్ణువు, ధర్మం చెడగొట్టడానికి గౌతమ బుద్ధుడి అవతారం ఎత్తాడనడం ఎంత అసమంజసంగా ఉంది! సంస్కృత భాగవతంలో అలా ఉందేమో తెలియదు కానీ, 15వ శతాబ్దంలో భాగవతం రాసిన పోతన మాత్రం బుద్ధుడి గురించి వేరేలా రాశాడు. పైన చెప్పిన టిటిడి వారి పోతన భాగవతం మొదటి సంపుటంలో పేజీ 216లో బుద్ధావతారం గురించి రాస్తూ ‘చపల స్వభావులూ, అసత్యవాదులూ, భేదాచార పరాయణులూ, అధర్మనిరతులూ, శుద్ధ పాషండులూ అయిన దైత్యులు లోకాన్ని చంపుకుని తినేవారు. విష్ణువు బుద్ధుడిగా అవతరించి వారిని వారి దురాచారాలతో పాటు నిర్మూలించాడు’ అని రాశారు. గౌతమ బుద్ధుడనే పదం వాడలేదు, అహింస ప్రబోధించాడనలేదు.

ఏది ఏమైనా దశావతారాల్లో రాముడి తర్వాత, కల్కికి ముందు ఉన్న 8వ,9వ అవతారాల విషయంలో బలరాముడు, బుద్ధుడు, గౌతమ బుద్ధుడు, కృష్ణుడు విషయాలలో మాత్రం కన్‌ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు కొత్తగా కూర్మం ముందా, నరసింహం ముందా అనే అనుమానం వచ్చి చేరింది నాకు. ఈ రిడిల్‌ ఎవరైనా విప్పగలిగితే సంతోషిస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?