Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: శత్రంజ్‌ కే ఖిలాడీ

ఎమ్బీయస్‌: శత్రంజ్‌ కే ఖిలాడీ

''శత్రంజ్‌ కే ఖిలాడీ'' సినిమా రిలీజై 40 ఏళ్లయింది. ఆ సందర్భంగా దాని నిర్మాత సురేశ్‌ జిందాల్‌ ఆ సినిమా నిర్మాణంలో తన అనుభవాలను ఒక పుస్తకంగా రాసి, అక్టోబరులో వెలువరించబోతున్నాడు. ఆ సినిమా ప్రత్యేకత ఏమిటంటే అది సత్యజిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఏకైక హిందీ సినిమా, గట్టిగా చెప్పాలంటే ఏకైక బెంగాలీయేతర ఫీచర్‌ ఫిల్మ్‌. చరిత్ర ఆధారంగా తయారైన హిస్టారికల్‌ ఫిక్షన్‌. ఈ సందర్భంగా సినిమా గురించి, నిర్మాత గురించి, దర్శకుడి గురించి, కథ గురించి, నేపథ్యంగా అమరిన చరిత్ర గురించి కొన్ని ముచ్చట్లు. ఓపికున్నంతవరకు చదవండి.

నిర్మాత సురేశ్‌ జిందాల్‌ 1960లలో కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఇంజనియరింగ్‌ స్టూడెంట్‌. ఇండియాకు తిరిగి వచ్చి కొంతకాలం ఇంజనియర్‌గా ఉద్యోగం చేసి సినిమా నిర్మాణంలోకి దిగాడు. బాసు చటర్జీ దర్శకత్వంలో విద్యా సిన్హా, అమోల్‌ పాలేకర్‌, దినేశ్‌ ఠాకూర్‌ లతో ''రజనీగంధా'' (1974) అనే చిన్న బజెట్‌ సినిమా తీశాడు. తీయడమంటే తీశాడు కానీ విడుదల చేయడానికి రెండేళ్లు తంటాలు పడాల్సి వచ్చింది. హీరోయిన్‌ని మార్చి మళ్లీ తీయండి, కావాలంటే పెట్టుబడి పెడతా అని ఓ డిస్ట్రిబ్యూటర్‌ ఆఫర్‌ యిచ్చాడు. సురేశ్‌ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు సినిమా విడుదలైంది. సూపర్‌ హిట్టయింది. 

సురేశ్‌కు ధైర్యం వచ్చింది. ఈ సారి సత్యజిత్‌ రాయ్‌ చేత సినిమా తీయించాలని అనుకున్నాడు. అమెరికాలో వుండగానే అతని సినిమాలు చూసి అభిమానం పెంచుకున్నాడు. ఆయన చేత ఏదో ఒక సినిమా తీయించాలని కోరిక. కానీ ఒప్పించడం ఎలా? ఆయనకు హిందీ రంగం నుంచి అనేక ఆఫర్లు గతంలో వెళ్లాయని తెలుసు. సాక్షాత్తూ రాజ్‌ కపూరే 'మీరు హిందీలో తీస్తానంటే స్టూడియో సౌకర్యాలు, పెట్టుబడితో సహా సకలం సమకూరుస్తాను' అని చెప్పినా రాయ్‌ మొగ్గు చూపలేదు. వంగరంగం వదలి రాలేదు. ఇప్పుడు వెళ్లి అడిగితే వింటాడా? అసలు ఆయన్ని ఎలా ఎప్రోచ్‌ అవ్వాలి?

సురేశ్‌కు కుటుంబ స్నేహితుడైన దర్శకనిర్మాత టిన్నూ ఆనంద్‌ గుర్తుకు వచ్చాడు. మన తెలుగువారికి అతను పుష్పకవిమానం, అంజి సినిమాల్లో నటుడిగా పరిచయం. అతని తండ్రి ఇందర్‌ రాజ్‌ ఆనంద్‌ చాలా పెద్ద రచయిత. పిల్లల్ని సినిమాల్లోకి రానీయకూడదనుకున్నాడు. కానీ చదువు తర్వాత టిన్నూ డైరక్షన్‌లోకి వస్తానన్నాడు. కొంతకాలం  పెద్ద డైరక్టరు వద్ద అప్రెంటిస్‌గా పని చేయి. అప్పుడు దిగుదువుగాని అన్నాడు తండ్రి. మూడు ఛాయిస్‌లు యిచ్చాడు. నేను మూడు సినిమాలు రాసిన, మనకు అత్యంత ఆత్మీయుడైన రాజ్‌ కపూర్‌ మొదటి ఛాయిస్‌. ఇటాలియన్‌ డైరక్టరు ఫెల్లిని రెండో ఛాయిస్‌.

నాకు స్నేహితుడైన సత్యజిత్‌ రాయ్‌ మూడో ఛాయిస్‌ - అన్నాడు. ఫెల్లినికే నా ఓటు అన్నాడు కొడుకు. ఉత్తరం రాస్తే ఫెల్లిని 'తప్పకుండా పంపండి. అయితే ఇటాలియన్‌ భాష నేర్చుకుని రమ్మనమండి. నేర్చుకోవడానికి కనీసం ఆర్నెల్లు పడుతుంది' అని జవాబు రాశాడు. ఆర్నెల్లు వెయిట్‌ చేయడం యిష్టం లేని టిన్నూ సత్యజిత్‌ రాయ్‌ వద్ద ఐదేళ్లు అసిస్టెంటుగా పని చేసి బెంగాలీతో బాటు సినీనిర్మాణం కూడా నేర్చుకున్నాడు. అయితే బొంబాయి రంగంలో అదేమీ పనికి రాలేదు. ఇక్కడ నటీనటులు టైముకే రారు. డైలాగులు మార్చమంటారు. ముందు ప్లాను చేసిన ప్రకారం ఏదీ జరగదు. చివరకు రాయ్‌ వద్ద నేర్చుకున్నదంతా మెదడులోంచి తుడిచేసి, బొంబాయి రంగానికి అలవాటు పడి అమితాబ్‌తో ''కాలియా'' వంటి అనేక హిట్స్‌ తీశాడు. 

సురేశ్‌ అడగ్గానే టిన్నూ రాయ్‌కు ఫోన్‌ చేసి, ఓ రోజు కలకత్తా వెళ్లి కలిశారు. సురేశ్‌ నెర్వస్‌గా 'సార్‌, నేను హిందీ రంగానికి చెందినవాణ్ని కాబట్టి, హిందీలో తీయమని అడుగుతున్నాను, కాదంటే ఇంగ్లీషు, అదీ కుదరకపోతే బెంగాలీలో..' అని ఏకబిగిన చెప్పేశాడు. రాయ్‌ అతని కేసి చూసి ''హిందీలో ఓ సినిమా చేద్దామాని నేనూ అనుకుంటున్నాను...'' అనడంతో హమ్మయ్య అనుకున్నాడు సురేశ్‌. రాయ్‌ అనుకున్న థీమ్‌ మున్షీ ప్రేమ్‌చంద్‌ రాసిన ''శత్‌రంజ్‌ కే ఖిలాడీ'' ఆధారంగా తీయాలని. 

లఖనవ్‌లో 1856లో జరిగినట్లున్న ఆ కథను తెర కెక్కించాలంటే ఆ కాలం నాటి రాజ మహళ్ల సెట్టింగులు, కాస్ట్యూములు, జవహరీ.. యిలా అనేక హంగులు కావలసి వస్తాయి. చాలా ఖర్చు అవుతుంది. ఆ విషయం రాయ్‌ స్పష్టంగా చెప్పాడు - ''నాతో తీయబోయే మొదటి సినిమాకు అంత ఖర్చుపెట్టడం మీకు కుదరకపోవచ్చు. కావాలంటే తక్కువ ఖర్చులో అయిపోయే మరో కథ వెతుకుదాం.'' అని. ''మీరు అలాటి శంకలేమీ పెట్టుకోవద్దు. నేను యిదే తీస్తాను. మీరు ఔనంటే చాలు.'' అన్నాడు. ''మీరు యిప్పుడే ఏమీ చెప్పవద్దు. ఆలోచించి చెప్పండి. సినిమా తీయకపోయినా ఫర్వాలేదు కానీ బయట ఎవరికీ చెప్పవద్దు. చౌరంఘీలో ప్రేమ్‌చంద్‌ కథల పుస్తకం ఇంగ్లీషు అనువాదం దొరుకుతోంది. కొని చదవండి.'' అన్నాడు.

సురేశ్‌ పుస్తకం కొని చదివాడు. 1850లలో అవధ్‌ను పాలించిన వాజిద్‌ ఆలీ షా కాలంలో కూర్చిన కథ అది. వాజిద్‌ షా వద్ద జాగీర్దార్లగా వున్న యిద్దరు ధనికుల మధ్య కథ నడుస్తుంది. ఆప్తమిత్రులైన వాళ్లిద్దరికీ చదరంగం అంటే పిచ్చి. ఆ ఆటలో పడి వాళ్లు యిల్లు, జాగీరు, ప్రజల బాగోగులు ఏదీ పట్టించుకోరు. తెల్లవారి లేస్తే ఆట ఎలా ఆడదామా అన్న తాపత్రయమే. భార్యకు అనారోగ్యం అన్నా పట్టించుకోకపోవడంతో ఆమె యీ పిచ్చిపై అసహ్యం పెంచుకుని, వీళ్లిద్దరినీ యింటి దగ్గర ఆడడానికి వీల్లేదని గొడవ చేసింది. మరొకతని భార్య, భర్త ఆటపిచ్చితో విసిగిపోయి వేరే మార్గం చూసుకుంది. ఎవరేమన్నా వీళ్లు పట్టించుకోరు. ఇంట్లో గొడవగా వుందని  వేరే చోటకి వెళ్లి ఆడుకుంటూ వుంటారు.

నిజానికి వారి ప్రభువు ఐన నవాబు వాజిద్‌ షా రాజకీయపరమైన అనేక చిక్కుల్లో యిరుక్కుని వున్నాడు. ఈస్టిండియా కంపెనీ  అధికారులు ఆ సంస్థానాన్ని దిగమింగాలని సకలయత్నాలు చేస్తున్నారు.  అతను పరిపాలించడానికి అనర్హుడని ఈస్టిండియా ప్రతినిథి ఇంగ్లండుకు ఉత్తరాలు రాసి అనుమతి సంపాదించి, చివరకు అతన్ని పదవీభ్రష్టుణ్ని చేశాడు. ఇలాటి క్లిష్టసమయంలో కూడా యీ జాగీర్దార్లు తమ ప్రభువుకు అండగా నిలవకుండా నిర్లక్ష్యధోరణితో, బాధ్యతారాహిత్యంగా, బద్ధకంగా బతికేస్తారు. చివర్లో మాటామాటా వచ్చి ఒకరినొకరు పొడుచుకుంటారు. ఆ పొడిచేదేదో ఆంగ్లేయులనే పొడిస్తే అదో దారిగా వుండేది. రాజకీయ చైతన్యం ఏమీ లేకుండా, చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, తమ ధ్యాసలో తాము వుండే యీ ధోరణి వలననే భారతీయులు ఆంగ్లేయులకు బానిసలయ్యారని ప్రేమ్‌చంద్‌ తన కథ ద్వారా చెప్పాడు. అందుకే దీనికి అంత పేరు వచ్చింది.

కథ వాజిద్‌ షా అధికార చ్యుతి నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి అతని చరిత్ర తెలుసుకోవడం ఉపకరిస్తుంది. ఈనాటి యుపిలో చాలా ప్రాంతాలు అవధ్‌ రాజ్యంలో ఉండేవి. గంగా, యమునా నదుల మధ్యలో సుభిక్షమైన ప్రాంతమది. కాన్పూరు, లఖ్‌నవ్‌, ఇలాహాబాద్‌ అన్నీ దానిలోనే వున్నాయి. అవధ్‌ నవాబుల్లో వాజిద్‌ షా పదవ నవాబు, ఆఖరి నవాబు కూడా. తన 25వ ఏట 1847లో రాజ్యానికి వచ్చి 1856 వరకు 9 ఏళ్లు పాలించాడు. అతను సింహాసనం ఎక్కేనాటికే పెద్దగా అధికారాలు లేవు. 1801 నాటి ఒప్పందం ప్రకారం ఈస్టిండియా కంపెనీ చాలా అధికారాలు గుంజుకుంది. నవాబు రక్షణ కోసం అంటూ పెద్ద సంఖ్యలో బ్రిటిషు సైన్యాన్ని అక్కడ నిలిపి, దాని ఖర్చు కూడా సంస్థానం నెత్తినే వేసింది. పైగా మాటిమాటికి అప్పులడిగేది.

ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి నవాబుకి పెద్దగా మిగిలేది కాదు. కావాలంటే బ్రిటిషు వాళ్లు దాన్ని ఎప్పుడో కబళించేవారు కానీ బెంగాల్‌లో వున్న తమ రాజ్యానికి యితర ప్రాంతాలకు మధ్యలో ఒక 'బఫర్‌' వుండాలని దాన్ని అలా వుంచారు. ఇలాటి పరిస్థితిలో పాలకుడిగా వచ్చినవాడు యుక్తి ఉపయోగించి, తన స్థానాన్ని బలపరచుకోవాలి. కానీ వాజిద్‌ షాకు కళాభిమానం మెండు. రోజంతా సాహిత్యం, సంగీతం, నృత్యాలలో మునిగి తేలేవాడు. స్వయంగా కవి, నాటక కర్త, నర్తకుడు. కథక్‌ నృత్యం మళ్లీ ప్రాభవంలోకి రావడానికి అతనే కారణం.

పాలన గురించి పట్టించుకునే తీరిక లేదు. పైగా విపరీతమైన స్త్రీ వ్యామోహం. కనీసం 300 మంది భార్యలు. అనేకమంది ఉంపుడుగత్తెలు. ఇతను అసమర్థ పాలకుడని, ప్రజాసంక్షేమం పట్టదని బ్రిటిషు రెసిడెంటు రాణి గారికి ఉత్తరాలపై ఉత్తరాలు రాసి, అనుమతి తెచ్చుకుని చివరకు 1856 ఫిబ్రవరిలో రాజ్యాన్ని కైవసం చేసుకుని వాజిద్‌ షాను కలకత్తా శివారైన గార్డెన్‌ రీచ్‌లోని భవంతిలో గృహనిర్బంధంలో వుంచారు. 1887లో చనిపోయేవరకు అక్కడే వుండి భోగవిలాసాల్లో మునిగితేలాడు. అవధ్‌ రాజ్యం చేజారిన ఏడాదికి 1857లో సిపాయి తిరుగుబాటు వచ్చింది. వాజిద్‌ షా మొదటి భార్య బేగమ్‌ హజరత్‌ మహల్‌ దానిలో పాలుపంచుకుని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడింది.

ఇప్పుడీ సినిమా తీయాలంటే యీ జాగీర్దార్ల యిళ్ల సెట్టింగులపై పెద్ద ఖర్చు పెట్టనక్కరలేదు కానీ వాజిద్‌ షా ఆస్థానాన్ని డాన్సర్లతో సహా పునర్నిర్మించాలి.  చివర్లో సైనికులు మార్చింగ్‌ చేసుకుంటూ వచ్చే సీన్లు చిత్రీకరించాలి. రాయ్‌ పెర్‌ఫక్షనిస్టు కాబట్టి ఏవో జానపద కాస్ట్యూములు పెట్టేద్దామంటే ఒప్పుకోడు. 1850ల నాటి బట్టలు, నగలు తయారుచేయించాలంటాడు. ఫ్లోర్లలో జరిగే షూటింగంతా కలకత్తాలో, ఔట్‌డోర్‌లో జరిగేది లఖనవ్‌లో. బొంబాయి తారలను అక్కడకు తీసుకెళ్లాలి. ఈ భారీ సినిమాకు మార్కెట్‌ వున్న స్టార్లుండాలి. వాళ్ల పారితోషికాలు వేరే వుంటాయి. ఇదీ సమస్య.

అయినా సురేశ్‌ జిందాల్‌ సై అన్నాడు. చదరంగం ఆటగాళ్లుగా సంజీవ్‌ కుమార్‌, సయ్యద్‌ జాఫ్రీ, సంజీవ్‌ భార్యగా శబానా ఆజ్మీ, వాజిద్‌ షాగా అమ్జాద్‌ ఖాన్‌, బ్రిటిషు అధికారిగా బ్రిటిషు నటుడు రిచర్డ్‌ అటెన్‌బరో (''గాంధీ'' సినిమా దర్శనిర్మాత) వీళ్లందరినీ సంప్రదించాడు. రాయ్‌ సినిమా అనగానే అందరూ ఎగిరి గంతేశారు. పారితోషికాలు తగ్గించుకున్నారు. రాయ్‌ కూడా చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడు. సినిమా బజెట్‌ వేసుకుంటే రూ.30 లక్షలైంది. 'మీ పాత్ర చిన్నది కదా, ఫర్వాలేదా?' అని శబానాని అడిగితే 'రాయ్‌గారు నాకు చీపురు పట్టి తుడిచే సీను ఒక్కటీ యిచ్చినా చేస్తాను' అందామె.

సంజీవ్‌ అప్పటిదాకా రాయ్‌ సినిమా ఒక్కటీ చూడలేదు. పుణెకి వెళ్లి నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కయివ్స్‌ సంస్థకు దగ్గరలో ఓ గది అద్దెకు తీసుకుని వుంటూ, ఆర్కయివ్స్‌లో వున్న రాయ్‌ సినిమాలన్నీ చూశాడు. రాయ్‌ తీయబోయే అతి ఖరీదైన సినిమాగా ప్రకటన రాగానే అందరిలో ఉత్సుకత పెరిగింది. నటీనటులందరూ, సంజీవ్‌తో సహా, రాయ్‌పై గౌరవంతో టైముకి వచ్చారు. అక్షరాలా ఆయన చెప్పినట్లుగా చేశారు. రాయ్‌ హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. రాయ్‌ కూడా అందరికీ చాలా మర్యాద యిస్తూ షూట్‌ చేశారు. డైలాగులు ఆయన ఇంగ్లీషులో రాస్తే జావేద్‌ సిద్దిఖీ ఉర్దూలోకి తర్జుమా చేశాడు.  

సినిమాకు ప్రారంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. సంజీవ్‌కు గుండెపోటు వచ్చింది. అమ్జాద్‌కు రోడ్డు యాక్సిడెంటయి, చాలా నెలల పాటు మంచంలో వుండాల్సి వచ్చింది. ''షోలే'' స్టార్లయిన సంజీవ్‌, అమ్జాద్‌లను చూపించి సురేశ్‌ డిస్ట్రిబ్యూటర్ల నుంచి అడ్వాన్సులు తెచ్చి సినిమా ప్రారంభించాడు. ఆలస్యం కావడంతో వడ్డీలు పెరిగాయి. అంతిమంగా 5 లక్షలు బజెట్‌ పెరిగి రూ. 35 లక్షలైంది. 1976 అక్టోబరులో సినిమా రిలీజు చేసేందుకు ముందు డిస్ట్రిబ్యూటర్లు సినిమా చూస్తామన్నారు. రాయ్‌ సాధారణంగా ప్రివ్యూలు చూపడు. ఖచ్చితంగా తన సినిమాలు చూసే కొద్దిమంది జనాభా వున్నారని అతనికి తెలుసు.

దానికి తగ్గట్టుగానే రూ. 5 లక్షల లోపే సినిమాలు తీశాడు. గోపీ గైనే.., మహానగర్‌, చారులత, ప్రతిద్వంద్వి వంటి కొన్నిటికి లాభాలు కూడా వచ్చాయి. బెంగాల్‌ వంటి పరిమితమైన మార్కెట్‌లో అది చెల్లింది. కానీ దీని తరహా వేరు. అందుని మినహాయింపు యిచ్చి, కావాలంటే చూపించుకోమన్నాడు. చూశాక నాలుగు పెద్ద సర్కిళ్ల డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టుబడి తమకు యిచ్చేయమని పేచీ పెట్టారు. సినిమా బాగా సీరియస్‌గా, స్లోగా వుందన్నారు, సంభాషణలు మరీ పాతకాలం ఉర్దూలో వున్నాయన్నారు. శబానా చాలా తక్కువ సేపే కనబడిందన్నారు. ''పాకీజా'' వంటి సినిమాలు పాటల వలన ఆడాయి. దీనిలో ఆ తరహా పాటలేవీ? అని అడిగారు. ఏడేసి లక్షలకు తీసుకుంటామని ఒప్పుకుని సగం డబ్బు అడ్వాన్సు యిచ్చిన యీ నలుగురు పంపిణీదారులు మాట తప్పడంతో నిర్మాత చిక్కుల్లో పడ్డాడు. 'ముందు మీరు సినిమా రిలీజు చేసేయండి, ఆడకపోతే అడ్వాన్సు నేను క్రమేపీ వెనక్కి యిచ్చేస్తా, నా కష్టానికి 20% మార్జిన్‌ తీసుకుంటా' అన్నా వాళ్లు వినలేదు. దాంతో మహారాష్ట్ర, గుజరాత్‌, బిహార్‌, ఒడిశా, అసాం, పంజాబ్‌లలో సినిమా రిలీజు వాయిదా పడింది.

ఇది రాయ్‌ను చాలా నిరుత్సాహపరిచింది. చివరకు దర్శకనిర్మాత ప్రకాశ్‌ మెహ్రా దిల్లీ సర్క్యూట్‌ తీసుకుని అక్కడ విడుదల చేస్తానన్నాడు. వినోద్‌ ఖన్నా, అమ్జాద్‌ ఖాన్‌కు సంబంధించిన పంపిణీ సంస్థలు నైజాంలో చేస్తానన్నాయి. రాజస్థాన్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గలేదు. మొత్తానికి 1977 మార్చిలో సినిమా రిలీజైంది. కానీ ప్రజలకు నచ్చలేదు. సత్యజిత్‌ రాయ్‌ మరో హిందీ సినిమా తీయడానికి సాహసించలేదు. తనపై నమ్మకంతో పెట్టుబడి పెట్టి నష్టపోయిన సురేశ్‌పై వాత్సల్యం చూపుతూ యోగక్షేమాలు విచారిస్తూ వుండేవాడు. ఈ సినిమా వలన సురేశ్‌కు జరిగిన మేలేమిటంటే దీనిలో నటించిన రిచర్డ్‌ అటెన్‌బరోతో స్నేహం పెరిగి అతను దర్శకనిర్మాతగా తీసిన ''గాంధీ'' (1982)కి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం! దానిలో యిబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చాయి.

(ఫోటో - రిచర్డ్‌ అటెన్‌బరో, సత్యజిత్‌ రాయ్‌, సురేశ్‌ జిందాల్‌)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?