Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: స్కిల్ స్కామ్‌పై కాస్త వెలుగు

ఎమ్బీయస్‍: స్కిల్ స్కామ్‌పై కాస్త వెలుగు

గతంలో రాసినపుడు ‘‘స్కిల్లా? స్కామా?’’ అని సందేహం వ్యక్తం చేసిన నాకు యిప్పుడు ‘స్కామ్’ అనిపించడానికి కారణం, కోర్టు తీర్పులు! బాబు ప్రమేయం మాట తేలాల్సినా ప్రస్తుతానికి మాత్రం దాల్ మే కుఛ్ కాలా హై అని న్యాయమూర్తులకు తోచినట్టుంది. నా వరకు వస్తే - హత్య జరిగింది, హత్య చేసినవాడెవరో, చేయించినవాడెవరో తెలియదు అనుకునేలా, స్కాము జరగడం మాత్రం నిజమే అనిపిస్తోంది. బాబు యిన్వాల్వ్ కాలేదు అనుకుని చదివితే టిడిపి అభిమానులకు కూడా అలాగే తోచే విధంగా సంఘటనల క్రమం ఉంది. ఈ అంశంపై కొందరు పాఠకులు అందించిన సమాచారం, నేను చూసిన వీడియోలు, చదివిన వార్తలు అన్నీ కలిపి ఏర్పరచుకున్న అభిప్రాయాలను మీతో పంచుకుంటున్నాను. తప్పులుంటే చెప్పండి, సవరించుకుంటాను. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే రాయాలి అనకండి. గమ్యం కంటె ప్రయాణమే మోర్ ఎక్సయిటింగ్ అంటారు. హిల్ స్టేషన్లకు వెళ్లినపుడు యిది బాగా బోధపడుతుంది.

ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునేటప్పుడు అభేద్యంగా కనబడినది, ఒక్కో పొర విడివడుతూంటే, ఊహించనిది బయటపడుతూ ఉంటే, విస్తుపోతూ, రెట్టించిన ఉబలాటంతో ముందుకు సాగడంలో ఉండే థ్రిల్ వేరు. సర్వం తెలిసిపోయాక, పుస్తకరూపంలో చదువుకుంటే అది హిస్టరీ అవుతుంది. హంతకుడెవరో తెలిసిపోయిన తర్వాత డిటెక్టివ్ నవల చదివినట్లుంటుంది. మన కళ్లెదురుగా వర్తమానం ఒక్కోటీ క్రమేపీ ఆవిష్కరిస్తున్నదాన్ని చూడకుండా కళ్లు మూసుకుని, భవిష్యత్తులో తీరిగ్గా తర్వాత చూద్దాంలే అంటే విశ్వరూపం చూపించడానికి ఉపక్రమించిన కృష్ణుడితో అర్జునుడు ‘‘ఇప్పటికే చాలా చెప్పావుగా, యీ విశ్వరూపమేదో యుద్ధం తర్వాత చూపిద్దువు గాని’’ అన్నట్లుంటుంది. అందువలన బయటకు వస్తున్న సమాచారాన్ని అప్పుడప్పుడు అప్‌టుడేట్ చేసుకుంటూ బాగుంటుంది. కొన్ని అంశాలపై దీనిలో చర్చిస్తాను. మరి కొన్ని అంశాలపై రాబోయే రెండు వ్యాసాల్లో వివరిస్తాను.

*దీన్ని 371 కోట్ల స్కాముగా అభివర్ణిస్తున్నారంటే దాని అర్థం 371 కోట్లు స్వాహా అయిపోయాయి అని కాదు. బోఫోర్స్ స్కామ్ అంటే మొత్తం శతఘ్నులే మిథ్య, అస్సలు కొనలేదు అని కాదు. అది కొనడానికి ముడుపులు ముట్టాయి అని ఆరోపణ. అలాగే దీనిలో 241 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారని సిఐడి అంటోంది. కొందరు వ్యాఖ్యాతలు డిజైన్‌టెక్‌ను షెల్ (డొల్ల) కంపెనీగా వర్ణిస్తున్నారు. అది తప్పు. డిజైన్‌టెక్ మామూలు కంపెనీయే. చాలాకాలంగా ఆపరేషన్స్‌లో ఉంది. సీమెన్స్‌తో బంధం తెగిపోయాక దసోతో భాగస్వామ్యంలో ఉంది. స్కిల్ కార్పోరేషన్ నుంచి 371 కోట్లు తీసుకున్న డిజైన్‌టెక్ 58.8 కోట్లు సీమెన్స్‌కు యిచ్చి, యితరత్రా 70 కోట్ల వరకు సవ్యంగానే ఖర్చు పెట్టిందనుకోవాలి. ఆ 130 పోగా, తక్కిన 241 కోట్లు వెండార్స్‌కి చెల్లిస్తున్నానంటూ డబ్బులు పంపించినది పిఎస్‌విపి పేరుతో నడిచి, ఆంధ్రతో త్రైపాక్షిక ఒప్పందం జరిగిన నెల్లాళ్లకు స్కిల్లార్‌గా పేరు మార్చిన కంపెనీకి!  అక్కణ్నుంచి ఆ కంపెనీ కొన్ని షెల్ కంపెనీలకు డబ్బు పంపిందని ఈడీ అభియోగం.

*మనం యిక్కడ ఒకటి గుర్తించాలి. దీనిలో యిన్వాల్వ్ అయినవి కేంద్ర సంస్థలైన సెబి, జిఎస్టి ఇంటెలిజెన్స్, ఇడి, ఐటి, ప్లస్ ఆంధ్ర సిఐడి. ఈ సంస్థలు కానీ, నిందితులు కానీ ఎవరూ పూర్తి నిజం చెప్తారని అనుకోలేము. దేన్నయినా పించ్ ఆఫ్ సాల్ట్‌తో తీసుకోవాల్సిందే. మన బుద్ధీ, వివేకం ఉపయోగించి ఒక అభిప్రాయానికి రావల్సిందే. కోర్టులో తీర్పు వచ్చినా మనం దాన్ని సమర్థించాలని లేదు. ఎందుకంటే ప్రతీ తీర్పూ సమీక్షకు గురవుతుంది. సిబిఐ, సిఐడి, ప్రభుత్వ అధికారగణం యిత్యాది సంస్థల్లో కూడా ఒక్కోరూ ఒక్కోలా ఉంటారు. ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో ఒక డాక్టరు మంచివాడైతే ఆ ఆసుపత్రిలోని అన్ని శాఖలూ గొప్పవే అనడానికి లేదు. రేపు యీ డాక్టరు మరో ఆసుపత్రికి మారవచ్చు.

*ఇక ఇన్‌కమ్‌ టాక్స్ శాఖ కానీ, పోలీసులు కానీ నిజాల్ని కనుక్కునే పద్ధతి ఒక్కోలా ఉంటుంది. ఐటీ వాళ్లు నువ్వు ఫలానా ఆస్తిని ఫేంటాస్టిక్ రేటుకి కొన్నావని మాకు అనుమానం అంటాడు. అబ్బే అంతకాదండి, యింతే అంటూ నోటీసు అందుకున్నవాడు ఒప్పుకోవచ్చు. ముద్దాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్న ప్రత్యక్ష సాక్షితో ప్రాసిక్యూటరు ‘‘కత్తి నువ్వేగా కొని అతనికి యిచ్చావు’’ అని ఆరోపిస్తే అతను బెదిరిపోయి ‘‘అబ్బే నేనెక్కడ తెచ్చానండి, వాడే తెచ్చుకున్నాడండి.’’ అనవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో జైపాల్ రెడ్డి పోషించిన పాత్రను తేటతెల్లం చేయడానికి ఉండవల్లి యిలాటి టెక్నిక్కే వాడారు. అందువలన సిబిఐ కానీ, సిఐడీ కానీ మోపిన అభియోగాలన్నీ అక్షరసత్యాలని విచారణ దశలో నమ్మడానికి లేదు. సత్యాన్వేషణలో అది ఒక స్టేజిగానే అనుకోవాలి.

*ఇక ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబును ఎ37 గా పెట్టి ఎ1 చేసేశారు అని కొందరు చెప్తున్నది నిజం కాదు. హైకోర్టు ఆర్డరు చూస్తే ఆయన నెంబరు 37గానే ఉంది. కొత్తగా ఎవరైనా చేరితే నెంబరు చేరుస్తూ పోతారు. ఎ1 అంటే శిక్ష ఎక్కువ, 36 అంటే తక్కువ, 37 అంటే మరీ తక్కువ అనేది ఉండదని ఎఎజి సుధాకర రెడ్డి క్లారిఫై చేశారు. రుజువైన నేరం బట్టి మాత్రమే శిక్ష ఉంటుంది.

*సుధాకర రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ త్రైపాక్షికి ఒప్పందంపై తారీకు లేదని అనడంతో పాటు సంతకాలు కూడా లేవని చెప్పసాగారు. చివరకు పక్కన ఉన్న సిఐడి డిజిపి సంజయ్ సవరించాల్సి వచ్చింది. ఆ తర్వాత యిద్దరి సంతకాలున్నాయన్నారు. ఉన్నవి నలుగురివి. ఇంత ముఖ్యమైన విషయాన్ని కంగాళీ చేస్తే ఎలా? కార్పోరేషన్ తరఫున సైన్ చేసినది గంటా సుబ్బారావు, డిజైన్‌టెక్ తరఫున వికాస్, ఎస్ఐఎస్‌డబ్ల్యు తరఫున సుమన్ బోసు, యింకో ఆయన సైన్ చేశారు. సుమన్ బోస్ ఆంధ్ర ఒప్పందంలో సుమన్ అనీ, గుజరాత్‌లో సౌమ్యేంద్ర శేఖర్ బోస్ అని సంతకం పెట్టాడని కొందరు యాగీ చేస్తున్నారు. నేను గత వ్యాసంలో ప్రస్తావించిన రాజ్‌కోట్ ఇంజనీరింగు కాలేజీ ఒప్పందంలో సుమన్ బోస్ అనే సంతకం పెట్టాడతను. అయినా ఎక్కడ ఎలా పెడితే మాత్రం ఏం పోయింది? ఆ సంతకం నాది కాదని అతనేమీ చెప్పటం లేదు కదా! ఎలియాస్‌లు ఉండడం అసహజమేమీ కాదు. చిరంజీవి తను తీసిన సినిమాల క్రెడిట్స్‌లో ‘చిరంజీవి సమర్పించు..’ అని వేసుకోవచ్చు. ఆస్తుల కొనుగోలు విషయాల్లో తన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ పేరు వాడవచ్చు. రెండు పేర్ల విషయంలో అనవసరమైన రచ్చ ఎందుకు?

*త్రైపాక్షిక ఒప్పందంపై తేదీ లేదని మరో చర్చ. మామూలుగా అయితే ప్రతీ డాక్యుమెంటుపై వ్యక్తి సంతకంతో పాటు తేదీ ఉండాలి. మా బ్యాంకు డాక్యుమెంట్లలో కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లపై తేదీ వేయడం మర్చిపోతే మేం డేట్ స్టాంప్‌తో వేసి ఆడిటర్లను తృప్తి పరచేవాళ్లం. తేదీ లేనంత మాత్రాన ఫ్రాడ్ జరిగిందని అనలేరు కదా. సంతకాలు పెట్టిన మూడు పార్టీలలో ఎవరైనా ఆ తేదీన నేను అక్కడ లేను, నా సంతకం ఫోర్జరీ చేశారు అంటే తంటా వచ్చేది. ఎవరూ ఆ మాట అననప్పుడు అది ఒక పెద్ద అంశమే కాదని సుమన్ బోస్ అన్నాడు. నిజమే కానీ వ్యక్తుల సంతకాల దగ్గరే కాదు, మొత్తం డాక్యుమెంటులో ఎక్కడా తేదీ కానీ, డాక్యుమెంటు ఎగ్జిక్యూషన్ జరిగిన ఊరి పేరు కానీ లేదు. ఊరు పేరు గురించి డిజైన్‌టెక్, సీమెన్స్ తలో పేరూ చెపుతున్నాయట. డాక్యుమెంటు మొదట్లో కానీ, చివర్లో కానీ తేదీల దగ్గర అన్నీ ఖాళీలు విడిచిపెట్టారు. లెటర్ నెంబర్, డేటెడ్ అన్న దగ్గరా ఖాళీలే!

బాపు గారి కార్టూన్ ఉంది. సినిమా హాల్లోంచి బయటకు నడుస్తూ ఒకతను పక్కవాడితో అంటాడు ‘ఇంత అవకతవక కంగాళీ సినిమా ఎప్పుడూ చూడలేదు’ అని. తెర మీద ‘శుభం’కు బదులు ‘భశుం’ అని కనబడుతూ ఉంటుంది. ఈ డాక్యుమెంటు కూడా అంత అవకతవకగానూ ఉంది. బాబు గారి కేసు విషయంలో ఆయన తరఫు న్యాయవాదులు సాంకేతిక విషయాలపై తెగ వాదించేస్తున్నారు కదా! అలాటి స్క్రూటినీకి యిది నిలవదు. దీన్ని ఆధారం చేసుకుని 371 కోట్లు ప్రజాధనం విడుదల చేసే ముందు కనీసం ఆ ఖాళీలైనా పూరించాలన్న యింగితం అధికారులకు లోపించింది. ఎన్నో పదవులు నిర్వహించి సమర్థుడిగా పేరు తెచ్చుకున్న గంటా సుబ్బారావుగారు చూసుకోలేదా? ఆయనే కదా డబ్బు యివ్వాల్సింది, పుచ్చుకునేవాళ్ల కేముంది? ఇన్ని బ్లాంక్స్ ఉన్నాయేమిటి అని అడిగితే సుమన్ బోస్ అనవసరంగా ‘అప్పుడు కరంటు పోయింది, కొవ్వొత్తుల వెలుగులో సంతకాలు పెట్టాం’ అన్నాడు. అది ఒక జోక్ అయిపోయింది. జనరేటరు లేదా, సెల్‌ఫోన్‌లో టార్చ్ లేదా అంటూ ప్రశ్నించ సాగారు. ఇదో చీకటి ఒప్పందం అని చమత్కరించడానికి వీలు కల్పించాడు. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, మాట్లాడే తీరు తెలియని వాళ్లుంటారనే దానికి సుమన్ బోస్ ఒక ఉదాహరణ.

* గుజరాత్‌ ఒప్పందంలో రాజ్‌కోట్ ఇంజనీరింగు కాలేజీ ఒప్పందంలో రాజ్‌కోట్ ఇంజనీరింగు కాలేజీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడానికి గాను గుజరాత్ ప్రభుత్వం డిజైన్‌టెక్‌కు చెల్లించిన మొత్తం రూ.17.10 కోట్లు. ఎస్‌ఐఎస్‌డబ్ల్యుకి ఏమీ చెల్లించలేదు. ఆంధ్రకు వచ్చేసరికి ఒక క్లస్టరుకి 546.84 కోట్లు అన్నారు. ఒక క్లస్టరులో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఇ), 5 టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (టిఎస్‌డిఐ), ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎస్‌డిసి) ఉంటాయి. ఒక క్లస్టరుకి గాను 546.84 కోట్లు ఖర్చు అవుతుంది. దానిలో 491.84 కోట్లు సీమెన్స్, డిజైన్‌టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా యిస్తాయి. ప్రభుత్వం 55 కోట్లు యిస్తుంది. ఈ వివరాలు బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో సెప్టెంబరు 22న అసెంబ్లీలో యిచ్చిన గంటన్నర ప్రజంటేషన్‌లో చూపించిన 30.06.15 నాటి జీవో 4లో కనబడుతున్నాయి. గుజరాత్ ఒప్పందంలో యీ 90 శాతం గ్రాంట్ కహానీ ఏమీ లేదు.

* ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ (తెలుగులో ఆర్థికసాయం) అనే పదం ఒప్పందం (ఎమ్‌ఓయు)లో (అదీ చూపించారు బుగ్గన) ఎగిరిపోయింది. కానీ 90శాతం నిధులు సీమెన్స్ నుంచి వస్తాయన్నే భ్రమలోనే అధికారులందరూ ఉన్నారు. అందుకే ఎస్క్రో ఖాతా, ప్రభుత్వమూ- సీమెన్స్ దశలవారీగా దానిలో జమ చేయడం వంటి రిమార్కులు రాశారు. ‘వాళ్ల దగ్గర నుంచి నిధులు రాకుండానే మీరే మొత్తం ఎందుకు మీ వాటా యిచ్చేశారు?’ అని చంద్రబాబును సిఐడి అడిగినపుడు ‘జర్మనీ నుంచి నిధులు రావడం ఆలస్యం కావడంతో ప్రాజెక్టు ఆలస్యం కాకూడదని అధికారులు మన వాటా విడుదల చేశారు.’ అని జవాబిచ్చినట్లు పేపర్లలో వచ్చింది. అదే నిజమైతే బాబు కూడా జర్మనీ నుంచి నిధులు వస్తాయనే ఊహతో ఉన్నట్లు అనుకోవాలి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సీమెన్స్ వారు ఎందుకివ్వాలి? సిఎస్ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) క్రింద అని ఊహించారు కొందరు. ఇండియాలో తాము సిఎస్‌ఆర్ అమలు చేయటం లేదని సీమెన్స్ స్పష్టం చేసింది.

* ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సీమెన్స్, డిజైన్‌టెక్ యిస్తాయని జీఓలో 3వ పేరాలో ఉంది. ఇస్తానన్నది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాదు, గ్రాంట్ ఇన్ కైండ్ అని తర్వాత మాట మార్చడం జరిగింది. అంటే డబ్బు రూపేణా కాకుండా వస్తు రూపేణా అనుకోవాలి. డిజైన్‌టెక్ పేరు ఎందుకు చేర్చారో తెలియదు. అదీ సిఎస్‌ఆర్ కింద యిద్దామనుకుందా? ఈ ఎయిడ్‌లో దాని వాటా ఎంత? ఎవరూ చెప్పటం లేదు. అది తీసుకున్న 371 కోట్లలో సీమెన్స్ సాఫ్ట్‌వేర్‌కై ఖర్చు పెట్టినది 56 కోట్లు, పన్నులతో కలిసి 58.8 కోట్లు. తక్కినది సెంటర్ల మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బందికి శిక్షణ యివ్వడానికి, రెండేళ్ల పాటు మేన్‌టేన్ చేయడానికి, ఆ పైన ఒక ఏడాది హేండ్‌హోల్డింగ్‌కు.. అనుకోవాలి. వాటిలో అది గ్రాంట్ యిచ్చేదేమీ లేదు.

* గ్రాంట్ ఇన్ కైండ్ ప్రభుత్వం యిస్తే కనుక ఏ భూమో యిస్తుంది. సీమెన్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కాబట్టి మేము అతి విలువైన మా సాఫ్ట్‌వేర్‌ను మీ కోసం 10 శాతం రేటుకే యిచ్చాం. మిగతా 90 శాతం గ్రాంట్ ఇన్ కైండ్‌గా లెక్కేసుకోండి అంది అనుకుందాం. అలా చూసినా సీమెన్స్‌కు పన్నులు పోను దక్కినది 56 కోట్లు. 90శాతం డిస్కౌంట్‌లో యిచ్చారు కాబట్టి దాని అసలు విలువ 560 కోట్లు అనుకోవాలి. మరి యీ 3 వేల కోట్ల అంకె ఎక్కణ్నుంచి వచ్చింది? సెంటర్ల, సిబ్బంది శిక్షణ వగైరాలతో సీమెన్స్‌కు సంబంధం ఏముంది? డిజైన్ టెక్ పని అది. అదేమీ గ్రాంట్ ఇన్ కైండ్ మాట ఎత్తటం లేదు. సరే సీమెన్స్ సాఫ్ట్‌వేర్ విలువ 560 కోట్లు (లేదా 3 వేల కోట్లు) అని ఎవరు నిర్ధారించారు? గుజరాత్‌కి యిచ్చినదాని కంటె గొప్పది యిచ్చారా? అర్ణబ్ గోస్వామి వెక్కిరించినట్లు తనదే ప్రోడక్టు అయినప్పుడు 3 వేలేం ఖర్మ, 30 వేల విలువైనది అని చెప్పుకోవచ్చు. ఎవరైనా నన్ను ఓ సినిమాకు కథ రాయమన్నారనుకోండి. నా కథ వర్త్ 10 కోట్లు. మీక్కాబట్టి 10 లక్షలకు యిస్తాను అంటే వాళ్లు వెంటనే ‘మీకు 10 కోట్లిచ్చి కథ తీసుకున్న వాడెవడో చూపించండి’ అనరూ? సీమెన్స్ వాళ్ల సాఫ్ట్‌వేర్ ప్యాకేజీ మీద ఎమ్మార్పీ అని 3 వేల కోట్లుందా?

*ఇక్కడ ‘‘దొంగరాముడు’’ సినిమాలో ఓ ఘట్టం గుర్తుకు వస్తోంది. హీరో ఓ పూటకూళ్లమ్మ యింటికి వెళతాడు. ఆమె రూపాయికి ఫుల్‌మీల్స్ అని ఒప్పుకుని, మజ్జిగ నీళ్లతో అన్నం పెట్టి ‘‘ఇదే పప్పనుకో, యిదే పచ్చడనుకో, యిదే కూరనుకో, యిదే పెరుగనుకో..’’ అంటూ మోసం చేస్తుంది. హీరో జేబులోంచి పావలా తీసి ఆమెతో ‘‘ఇదే పావలా అనుకో, అర్ధరూపాయనుకో, రూపాయనుకో, వరహా అనుకో, నేనే నీ అల్లుణ్ననుకో.’’ అని వెక్కిరిస్తాడు. అలా సీమెన్స్ వాళ్లు అదే ప్యాకేజీని యిది 56 కోట్లనుకో, 560 కోట్లనుకో, 3 వేల కోట్లనుకో అన్నట్లుంది. ఇవన్నీ క్లియర్‌గా కాగితంపై రాసుకుని ఉంటే అడగడానికి ఉండేది. నోరెత్తకుండా డబ్బులిచ్చేయడానికి సిద్ధపడినపుడు ఎందుకు రాస్తారు?

*ఇక యీ డీల్‌లో సీమెన్స్, అదే ఎస్‌ఐఎస్‌డబ్ల్యు పాత్ర ఉందా, లేదా? ఈ ఒప్పందం మాకు తెలియకుండా జరిగింది. మాకూ దీనికీ ఏ సంబంధం లేదు అని సీమెన్స్ హెడాఫీసు ఈమెయిల్ పంపింది అని సిఐడి చెప్తోంది. ఆ ఈమెయిల్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చినట్లు లేదు. అది అలా రాసిందో లేదో తెలియదు కానీ రాస్తే మాత్రం అబద్ధం చెప్తోందని, మాట మారుస్తోందని నా ఉద్దేశం. అగ్రిమెంటు నాటికి సుమన్ బోస్ వాళ్ల ఉద్యోగి. అతను కంపెనీ తరఫున చేసిన సంతకాలు కంపెనీని బద్ధురాల్ని చేస్తాయి. ఆంధ్ర ప్రభుత్వం సీమెన్స్ పేర ప్రకటనలు చేసినపుడు, ఆంధ్రలో సెంటర్లు సీమెన్స్ పేరు ఉపయోగించినప్పుడు, తమకు సంబంధం లేకపోతే సీమెన్స్ అభ్యంతర పెట్టవలసినది. అదేమీ చేయకుండా యిప్పుడు మాకు సంబంధం లేదని అనడం దుర్మార్గం. జిఎస్‌టి నోటీసు వచ్చాక సీమెన్స్ సుమన్ బోస్‌ను, మరో ముగ్గుర్ని వదుల్చుకుంది. డిజైన్‌టెక్‌తో బంధం తెంపుకుంది. ఈ గొడవలు మనకెందుకు అనుకుంటూ తప్పించుకుందామని చూస్తోంది.

* స్కిల్ కార్పోరేషన్‌కు సీమెన్స్ నుంచి 3.2.2022న వచ్చిన ఉత్తరంలో మొదటి పేజీ ఒక పాఠకుడు నాకు పంపారు. మీరు రూ.3300 కోట్ల ప్రాజెక్టులో 90శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ యిస్తారని ఒప్పుకున్న మాట నిజమా? అని కార్పోరేషన్ 29.12.21న ఈ మెయిల్ పంపితే దానికి నెల దాటాక సీమెన్స్ జవాబు యిచ్చింది. ‘మేము గ్రాంట్ ఇన్ ఎయిడ్ యివ్వం. ఎకడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు డిస్కౌంట్ యిస్తాం. దాన్నే గ్రాంట్ ఇన్ కైండ్ అంటాం.’ అని దానిలో ఉంది. ఒప్పందంలో భాగస్వామ్యం గురించి ఆ పేజీలో ప్రస్తావన ఏమీ రాలేదు. అప్పటి ఉద్యోగి ప్రస్తుతం మాతో లేడు కాబట్టి రికార్డుల్లో ఉన్న సమాచారం తప్ప మరేమీ యివ్వలేము అంది. ఉద్యోగులలో కొంతమందిపై సీమెన్స్ చర్య తీసుకోకుండా కొనసాగిస్తోంది. వారిని అడిగితే పోయె.

*ఆంధ్రజ్యోతి 22.09.23 న రాసినది యిది - ‘2021లో కేసు లేదు. అందుకని 2021 ఏప్రిల్‌లో స్కిల్ కార్పోరేషన్ అడిగిన సమాచారాన్ని జూన్ 7న సీమెన్స్ స్వేచ్ఛగా పంచుకుంది. ‘మేం స్కిల్ కార్పోరేషన్, డిజైన్‌టెక్‌లతో కలిసి ఒప్పందం చేసుకున్నాం. ప్రోగ్రాం అడ్వయిజర్‌గా ఉన్నాం. ప్రభుత్వం 330 కోట్ల ఆర్థిక సాయం చేసింది. దీనిలో మాకు పన్నులతో కలిసి 56.94 కోట్లు ముట్టాయి... నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలను డిజైన్‌టెక్‌ను అడగాలి.’ అని రాసింది. కేసు పెట్టాక డిసెంబరులో కార్పోరేషన్ డిసెంబరులో పంపిన ఈమెయిలుకి జవాబుగా 03.02.22న యిచ్చిన జవాబులో ఒప్పందం గురించి ప్రస్తావించేందుకు సీమెన్స్ తడబడింది. సుమన్ బోస్ 2018 మార్చి 26లో రాజీనామా చేశారని, డిజైన్‌టెక్‌తో 2018 ఆగస్టు నుంచి వ్యాపారబంధాలు తెగిపోయాయని రాసింది. గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలకు ఏ రేటుకు సాఫ్ట్‌వేర్ సరఫరా చేశారన్న ప్రశ్నకు అవి వ్యాపార రహస్యాలని, బయటకు చెప్పలేమని తెలిపింది. ఈ తడబాటుకి కారణం బెదిరింపులే అని అనుమానాలు తలెత్తుతున్నాయి.’

*దీని ద్వారా చూస్తే ఒప్పందం సంగతి సీమెన్స్‌కు తెలిసే జరిగిందన్నది అర్థమౌతోంది. కానీ 90శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంగతి తన జూన్ 2021 లేఖలో కూడా చెప్పలేదు. 2022 ఫిబ్రవరి వచ్చేపాటికి ఎకడమిక్ సంస్థలకు డిస్కౌంట్‌లు యివ్వడం మాకు పరిపాటి అంది తప్ప ఆంధ్రకు అలా యిచ్చాం, అని చెప్పలేదు. ఒప్పందం సంగతి ఎత్తలేదని ఆంధ్రజ్యోతి రాసింది. మల్టీ నేషనల్స్‌కు యిలాటివి అలవాటే. భోపాల్ గ్యాస్ సంఘటన విషయంలో యూనియన్ కార్బయిడ్‌ని చూశాం కదా. స్థానికంగా ఉండే భారతీయ ఉద్యోగిపైకి నెట్టేసి తప్పించుకుంటారు. సీమెన్స్ తడబాటుకి కారణం జగన్ బెదిరింపులే అని ఆంధ్రజ్యోతి అంటోంది కానీ అంత పెద్ద సంస్థ బెదిరే ప్రశ్నే లేదు. వాళ్ల టాక్టిక్స్ యిలాగే ఉంటాయి. జగన్ ప్రభుత్వానికి కావలసినదీ అదే. సీమెన్స్ సంబంధం లేదని చెప్పింది అంటూ ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీమెన్స్ పాత్ర తథ్యం, గ్రాంట్ మాట మిథ్య. తక్కిన అంశాలపై ‘‘స్కిల్ స్కామ్‌పై యింకాస్త వెలుగు’’ అనే వ్యాసంలో రాస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?