cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అక్షరాలు తిరగబడ్డాయి!

అక్షరాలు నిప్పులు కక్కుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కళ్లెదుట జరుగుతున్న కఠోరవాస్తవాల్ని జీర్ణించుకోలేక... మౌనమునుల్లా పుస్తకాల్లో ఉండిపోలేక...అక్షరాలు ఉద్యమిస్తున్నాయి. కొన్ని తరాలు, మరికొన్ని యుగాలు దాటి వచ్చిన సమాజానికి సభ్యత అలవర్చామని చెప్పుకుంటున్నప్పటికీ... మనిషిగుండెల్లో ఇప్పటికీ గూడుకట్టుకుని ఉన్న ఆటవికతను భరించలేక అక్షరాలు ఘొల్లుమంటున్నాయి. ఎదురైన చండాలుడిలోనూ తాను నమ్మిన దైవాన్ని దర్శించి దండంపెట్టే ఆదిశంకరాచార్యుల్ని ఆదర్శంగా తీసుకునేంతగా మనసు విశాలం లేకపోయినా...సాటిమనిషిని మనిషిగా గుర్తించలేని దౌర్భాగ్యాన్ని చూసి అక్షరాలు ఆవేశపడుతున్నాయి. 

సరిగ్గా ముప్పయ్ రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో మహ్మద్ అల్లాఖ్‌పై జరిగిన సామూహిక దాడి ఘటనను అక్షరాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఓ వృద్ధుడు గుళ్లోకి వెళ్తే భరించలేనంత అసహనం. గోమాంసం భక్షించాడేమోననే అనుమానంతో పూనకం వచ్చినట్లు ఊరుఊరంతా శివాలెత్తిపోవడం...రాళ్లతో కొట్టి చంపడం. సమాజం ఎటుపోతోందని ప్రశ్నిస్తోంది అక్షరలోకం. కర్ణాటకలోని హేతువాది ఎంఎం కల్బుర్గిని కూడా దారుణంగా చంపిన ఘటన దేశంలోని రచయితలు, కవుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది.  సమకాలీన సమాజస్ధితిగతుల్ని ఎప్పటికప్పుడు అక్షరబద్ధం చేస్తూ సాహితీ సృజన చేసే రచయితలు, కవులు ఇప్పుడు ఆగ్రెదగ్రులవుతున్నారు. 

అక్షరసృజనకుగాను తాము అందుకున్న పురస్కారాల్ని తిరస్కరిస్తూ సమాజంలో పాతుకుపోయిన విషసంస్కృతిపై రచయితలు అక్షరాయుధం సంధిస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహితీగౌరవాన్నిచ్చే సాహితీ అకాడమీ పురస్కారాన్ని ఒకప్పుడు అందుకున్న ప్రతిభావంతులైన అగ్రశ్రేణి రచయితలు ఆ అవార్డుల్ని ఇప్పుడు తిప్పికొడుతున్నారు. ప్రస్తుత తరానికి ఇలాంటి నిరసనకు మార్గదర్శి డెహ్రాడూన్‌లో ఉంటున్న నయనతార సెహగల్. దాద్రి, కల్బురి ఘటనలకు ఆగ్రహించిన ఆమె ఆ దౌర్జన్యాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాన్ని తిప్పికొట్టింది. 

అలాంటి అసంతృప్తుల అగ్నిని ఎంతమంది అక్షరశిల్పులు ఎన్నాళ్లుగా గుండెల్లో దాచుకున్నారో కానీ... నయనతార చూపించిన నిరసనమార్గంలోనే ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నారు. సారాజోసెఫ్, సుర్జీత్ పటార్, ఉదయ్ ప్రకాష్, అశోక్ వాజ్‌పేయి, అరవింద్ మాల్‌గుట్టి...ఇలా చాలామంది ప్రముఖ రచయితలు సాహిత్య అకాడమీ అవార్డుల్ని తిరస్కరించారు. రోజురోజుకీ ఈ జాబితా పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ ఏదో ఓ రాష్ర్టం నుంచి అవార్డుని తిరస్కరిస్తున్నామంటూ రచయితలు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ప్రసారమాధ్యమాల ద్వారా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖ రచయితలంతా ఒక్కొక్కరుగా అవార్డుల్ని తిరస్కరిస్తూ ‘వార్తల్లోవ్యక్తు’లవుతున్నారు.

తిరస్కృతులు పంజాబ్‌లోనే అధికం:

పంజాబ్ నుంచే అత్యధికంగా అవార్డులు తిరస్కరించి రచయితలుండడం గమనార్హం. వారిలో...మోహన్ భండారి, డాక్టర్ చమన్‌లాల్, డాక్టర్ ధర్మవీర గాంధీ, హర్జీందర్ కౌర్ తదితరులున్నారు. వారిబాటలోనే ప్రసిద్ధ హిందీ రచయిత్రి కృష్ణసోబ్ది కూడా ఉన్నారు. కాగా, డెబ్బయ్‌ఎనిమిది సంవత్సరాల మోహన్ భండారి దేశంలో పెచ్చరిల్లుతున్న మతతత్వ పోకడలకు నిరసనగా అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కథకుడిగా, అనువాదకుడిగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. 1937లో పుట్టిన ఆయన 1997లో కేంద్రప్రభుత్వ సాహితీఅకాడమీ అవార్డును ‘మూన్ ది అఖ్’ అనే కథల సంపుటికిగాను అందుకున్నారు.  తాజాగా అవార్డు తిరస్కృత రచయితలు పంజాబ్‌లో ధర్నా కూడా నిర్వహించి భావస్వేచ్ఛను అణచివేస్తోందంటూ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. అయితే, బెంగాలీ రచయిత సమరేశ్ మజుందార్ అవార్డు వెనక్కి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. బెంగాలీ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ అవార్డును వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు. 

అలాగే, బెంగాలీ కవియిత్రి మందక్రాంత్‌సేన్, ఉత్తరప్రదేశ్ రచయిత దారువాలా అవార్డుల్ని వెనక్కిచ్చేసారు.  కాగా, పాటియాలాకు చెందిన దిలీప్‌కౌర్ తివానా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించగానే...ఆయన సమవయస్కుడైన గురుదయాల్ సింగ్ (4) కూడా పద్మశ్రీ అవార్డు తిరస్కరించే అవకాశాలున్నాయన్న వార్తలు మీడియాలో ఒక్కసారి గుప్పుమన్నాయి. అయితే, ఆ వార్తల్ని ఖండిస్తూ గురుదయాల్ సింగ్ తాను పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేది లేదని స్పష్టం చేసారు. గోమాంసం తిన్నాడనే అభియోగంతో దాద్రిలో ఘటన, కర్నాటకలో కబ్బురి ఘటనతో తానూ ఎంతో కలత చెందానని చెప్పుకొచ్చారు. అయితే, అవార్డులు తిరస్కరణ...తక్షణావేశంతో కూడినదిగా అభిప్రాయపడ్డారు. కథలు, నవలలు రాసి విఖ్యాతి గాంచిన గురుదయాల్‌సింగ్ మేధోసృజనను గుర్తించిన కేంద్రప్రభుత్వం 1995లో ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ పురస్కారానికి ముందుద ఆయన మరికొన్ని అవార్డులు పొందారు. అయితే, ఏ ఒక్క అవార్డును తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన స్పష్టపరిచారు. పంజాబ్‌నుంచే రచయితలు అత్యధికంగా అవార్డులు తిరస్కరిస్తున్న నేపధ్యంలో గురుదయాల్ సింగ్ ప్రకటన ఆ ఒరవడికి కాస్త భిన్నంగా ఉందనే వాదనలూ లేకపోలేదు. 

భిన్నవాదనలు:

ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల్ని స్వీకరించి...ఇప్పుడేదో తమకు నచ్చని సంఘటన జరిగిందనే ఆరోపణలతో ఒక్కొక్కరుగా ఆ అవార్డుల్ని తిరిగిచ్చేయడం పట్ల భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రముఖులు రచయితల చర్యల్ని సమర్ధిస్తుంటే..మరికొంతమంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. అనేకానేక ఉద్యమాలనేపధ్యంలో సృజనశీలుర పాత్ర విస్మరించలేమని...దేశ స్వాతంత్య్రోద్యమంలో పత్రికలు, రచయితలు నిర్వహించిన బాధ్యత ముందుతరాలకు మార్గదర్శకంగా ఉందని చెప్తూ...దేశంలో అరాచకం ప్రబలినప్పుడు ప్రశ్నించే హక్కు రచయితలకు కూడా ఉందని కొంతమంది మద్దతు పలుకుతున్నారు. అలా ఈ దేశవ్యాప్తమవుతున్న రచయితల నిరసనోద్యమానికి తనదైనశైలిలో సల్మాన్ రష్ధీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మౌనాన్ని ఆశ్రయించడం సముచితం కాదని ఆయన అన్నారు. 

అప్పట్లో ఆ పురస్కారాలు ఆయా రచయితలు అంగీకరించిన సందర్భంలో...దేశంలో ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయని...ఇలాంటి నిరసన స్పృహ అప్పుడెందుకు కలగలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ కూడా ఇలా వ్యతిరేకించేవాళ్లలో ఉన్నారు. రచయితల తిరస్కరణోద్యమం వెనుక రాజకీయకోణమేదో దాగుందంటూ చేతన్ భగత్ ట్వీట్ చేసారు. అవార్డులు తీసుకోవడం, తిరస్కరించడం వ్యక్తిగత అంశాలంటూనే...తిరస్కరిస్తున్న ప్రస్తుత సందర్భమే అనుమానాలకు తావిస్తోందని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ అబివర్ణించారు.

రచయితల ఉద్యమంతో ఏకీభవించను: అనుపమ్‌ఖేర్

ప్రస్తుత రచయితల ఉద్యమవైఖరితో తాను ఏకీభవించడం లేదని బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ అన్నారు. అత్యున్నత కేంద్రసాహితీ అకాడమీ అవార్డు తిరస్కరణ వెనుక రాజకీయాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని అప్రతిష్టపరచేందుకే తెరవెనుక ఉన్న కొన్ని రాజకీయశక్తులు రచయితల్ని ఆడిస్తున్నాయని ఆయన విమర్శించారు. అనుపమ్‌ఖేర్ భార్య కిరణ్‌ఖేర్ బీజేపీకి చెందిన చండీఘడ్ ఎంపీ. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ...‘‘అయినప్పటికీ, నా అభిప్రాయాలు స్వతంత్రమైనవే’నంటూ ముక్తాయింపు ఇచ్చారు.  

ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్‌ఖేర్ వ్యాఖ్యానించారు. దాద్రీ, కల్బుర్గి హత్యేకసుల్లో ఇంతవరకూ ఏ ఒక్కర్నీ అరెస్ట్ చేయకపోవడంతోనే రచయితల్లో ఆగ్రహం పెల్లుబికిందని బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. అవార్డులు తిరస్కరించడం అహంకారంలా కనిపిస్తున్నా...రచయితల ఆగ్రహంలో అర్ధం ఉందని బాలీవుడ్ నటుడు నసీరుద్ధీన్‌షా అన్నారు. 

సాహిత్య అకాడమీ అవార్డుకు ఓ గౌరవం, విలువ, ప్రతిష్ట ఉందని...ఆ పురస్కారం తిరస్కరించడం ద్వారా అవార్డు విలువ తగ్గించొద్దని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ రచయితలకు హితవు పలికారు. 

ఆర్‌ఎస్‌ఎస్ కినుక:

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భావజాల మార్గదర్శిగా గుర్తింపు పొందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సీనియర్ నేతలు ప్రస్తుతం రచయితలు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. ప్రధాని నరేంద్రమోడీని అప్రతిష్టపాలు చేసేందుకే కొన్ని శక్తుల కుటిల యత్నాల్లో రచయితలు ఇరుక్కున్నారని...ఆర్‌ఎస్‌ఎస్ విశ్వసంవాద్ కేంద్ర బాధ్యులు సుధీర్‌పట్నాయక్ విరుచుకుపడ్డారు. బీహార్ ఎన్నికల ముందు...ఈ తరహా ఉద్యమాల్ని రగిల్చింది ఎవరో...ప్రజలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. దాద్రి ఘటనను ప్రత్యక్షంగా ప్రస్తావించకకుండానే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధానకార్యదర్శి భయ్యాజీ జోషీ...ఈ తరహా ఘటనలు గతంలోనూ జరిగాయని..అప్పుడెవరూ అవార్డులు తిరస్కరిస్తూ ఏ ఒక్క ప్రకటన చేయలేదంటూ మరోవాదనను తెరమీదకు తీసుకొచ్చారు. 

కమలం పార్టీకి కష్టాలు

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా మతోన్మాదం పెచ్చరిల్లుతుందా? లేక, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్ భావజాలాల్ని బుర్రెకక్కించుకున్న బీజేపీయే ఈ తరహా అమానుషాలకు తెరతీస్తుందా? ఇదే ప్రస్తుతం మేధావుల్ని, రాజకీయపరిశీలకుల్ని వేధిస్తున్న ప్రశ్నలు. ఎవరు కాదన్నా, ఔనన్నా...బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ భావజాల మార్గదర్శి. రాజకీయపార్టీగా బీజేపీ ఎదుగుతూ...అధికారంలోకి వచ్చి పాలన సాగిస్తుంటే గిట్టని వైరిపక్షాలు కమలం పార్టీపై వేసే తక్షణం వేసే ముద్రే‘మతం’ అని విమర్శలు వినిపిస్తుంటాయి. ఆ విమర్శలకు బలం చేకూరుస్తున్నట్లే దాద్రి, కల్బురి ఘటనలు సంభవిస్తుంటాయి. మతముద్ర పడకుండా బీజేపీ అన్ని వర్గాల ప్రజలకు చేరువవ్వాలంటే...విమర్శలకు తావులేని ఇంకాస్త మెరుగైన పాలన అందించాలన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. 

పివిడిఎస్ ప్రకాష్

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×