cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పగటి ‘చంద్రుల’ గాలి మేడలు

పగటి ‘చంద్రుల’ గాలి మేడలు

హామీయే కదా! ఏదయినా ఇచ్చెయ్యవచ్చు. హైదరాబాద్ కు సముద్రాన్ని తెస్తాననీ, బెజవాడలో చార్మినార్ చూపుతాననీ చెప్పెయ్యవచ్చు. అదృష్ట వశాత్తూ ఈ రెండూ తప్ప,  దాదాపు ఈ స్థాయి హామీలన్నింటినీ ఇచ్చేశారు రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ‘చంద్రు’లు. ఎన్నికల ముందు కదా! ఎంత పెద్దనేతయినా పిట్టల దొరలాగో, కొమ్మ దాసరిలాగో మాట్లాడటం తప్పదులే, అని సరిపెట్టుకుని రెండు చోట్లా ఇద్దరికీ వోటేసేశారు జనం. కానీ ఎన్నికయి పదవీ స్వీకారాలు చేసేసి, మూడు నెలలు దాటిపోయింది. ఇచ్చిన హామీలు  అమలు చెయ్యటం దేవుడెరుగు, ఇంకా పెద్ద పెద్ద హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు.  సింగపూర్ ను చేస్తానని చంద్రబాబు అంటే, సింగపూర్ చూస్తానని చంద్రశేఖర రావు అన్నారు. అనటమే కాదు చూసి వచ్చేశారు. చిప్పకూడు కూడా లేని వారి చేతిలో కంప్యూటర్ చిప్పులు పెడతానంటారు. ఊళ్ళకి ఊళ్ళని, నగరాలకు నగరాలను ‘వైఫై’ తో నింపేస్తానంటారు. కరీంనగర్‌ను న్యూయార్క్  చేస్తానని ఓ చంద్రుడంటే,  జిల్లా జిల్లాకో ఎయిర్ పోర్ట్ పెట్టేస్తానని ఇంకో చంద్రుడంటాడు. ఈ కోత లెంత నిజమో ఇప్పటికీ నడుస్తున్న కరెంటు ‘కోత’లే చెబుతున్నాయి. వీరిద్దరి వల్లా  గాలి వోడలు( విమానాలు) రెండు రాష్ట్రాల మీదా ఎగురుతాయో లేదో తెలీదు కానీ, గాలి మేడలు మాత్రం కనిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇలాగే పగటి కలల్ని అమ్ముకుంటూ పోతే, కడకు పగటి చంద్రుల్లాగా  వున్నా, లేనట్లయిపోతారు. 

పోటీ పడి ఎగిరే వాళ్ళని ‘ఇద్దరూ ఇద్దరే’ అనవచ్చు. మరి,  పోటీపడి చతికిలబడే వారిని  ఏమనాలి? ‘దొందూ, దొందే’ అనాలి. ఇటు చంద్రాబు నాయుడూ, అటు చంద్రశేఖరరావూ, ఇద్దరూ తమ తమ ప్రజలకు అరచేతుల్లోనే వెకుంఠాల్ని చూపించేస్తున్నారు. రోజుకో కొత్త స్వప్నాన్నిస్తూ ‘కలల బేహారులు’గా మారిపోయారు. కలలతో కడుపు నిండే సౌకర్యం వుంటే, జనం నిజంగానే సంతృప్తి పోడిపోయేవారు. కానీ కలలు కళ్ళ ముందే కరిగిపోతున్నాయి. ఒక్క పనీ నడవటం లేదు.

చంద్రబాబు పదవీ స్వీకారం రోజునే ెల్‌సేల్ అయిదు కలల్ని సంతకం పెట్టి మరీ జనానికి అమ్మేశారు. వాటిల్లో రైతుల రుణమాఫీ అన్నది తొట్ట తొలి కల. అది ఇప్పటికీ నిజం కాలేదు. ఈ లోగా ఏడు ‘తెల్ల కాగితాలు’ (శ్వేతపత్రాలు) వచ్చాయి. రెండు బడ్జెట్లు వచ్చాయి. అందులో ఒకటి వ్యవసాయ బడ్జెట్ లెండి. ఎక్కడా రుణమాఫీకి సరిపడా పైకాన్ని పక్కన పెట్టుకున్నట్లు ఆధారాలు  దొరకలేదు. రైతులో చేతుల్లో  రాగిపైసా కూడా పడలేదు. బరువంతా రిజర్వ్ బ్యాంకు మీద వేసేద్దామనుకున్నారు. ఆ ‘అప్పు’ లేమీ నా దగ్గర ఉడకవూ అని తెగేసి చెప్పేసింది. కడకు చంద్రబాబు సర్కారు ‘హెలెన్’ పేరు చెప్పినా, ‘ఫెలిన్’  పేరు చెప్పినా ( పంట నష్టం చేసిన తుపాన్లు పేర్లు లెండి!) జాలి పడలేదు. అది బ్యాంకర్లేక బ్యాంకాయె. ఉత్తినే బుట్టలో పడుతుందా! అధికారంలోకి వచ్చాక, ఈ కలల్ని మింగే కొత్త కలతో తిరుగుతున్నారు. అదే ‘రాజధాని’ కల. ‘మింగ మెతుకు లేదురా నాయనా, అంటే సింగపూర్ వస్తుంది కదా’ అంటున్నాడు. సీమాంధ్ర నడిబొడ్డున ఈయన కట్టబోయే, ‘తెలుగు సింగపూర్’కు ఎలా రావాలన్నది ఆలోచించుకోండి. సాదా సీదా బెజవాడకీ, గుంటూరుకీ, కాదూ అంటే... వినుకొండకో, దొనకొండకో వచ్చినట్టు రైళ్ళెక్కో, బస్సులెక్కో వస్తే,  ‘కాపిటల్ సిటీ’ పరువేంగానూ....!? వస్తే గిస్తే, విమానమెక్కి రావాలి. జిల్లా జిల్లాకో విమానాశ్రయం చొప్పున మొత్తం 13 జిల్లాలకీ విమానాశ్రాయాలు కట్టించేస్తాను. కేంద్రాన్ని ఒప్పించేస్తానన్నారు. అదెలా సాధ్యమంటే,  తన పార్టీ తరపున కేంద్రంలో వున్న అశోక్ గజపతి విమానాల మంత్రి కదా అని ఆయన్ని ముందు పెడుతున్నారు. మొత్తం వీటికయ్యే ఖర్చంతా లెక్కకడితే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి, నిజంగానే వీపు విమానం మోతెక్కి పోతుంది. ఈ ఖరుే్చక అలా దిగాలు పడిపోయారనుకోండి, రేపు బాబు బాటలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగ వచ్చు. ఇలా జిల్లాకో ‘ఎయిర్ పోర్ట్’ పెట్టుకుంటూ పోతే.. ఖజానా కూడా తేలికయిపోయి గాలిలో ఎగిరిపోతుంది. 

ధరల్లో సింగపూరే!

కొందరు చంద్రబాబు ‘దురభిమానుల’యితే, ఎప్పుడో సింగపూర్‌ను చేయటమేమిటి? ‘ఇప్పుడే చేసేశారు?’ అని సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. సింగపూర్‌లో స్థలం అన్నింటి కన్నా ఖరీదయ్యింది. ఇప్పుడు గుంటూరో, బెజవాడో, నూజివీడో, ఏలూరో వెళ్లి చూడండి. వ్యవసాయ భూముల ధరలు అయిదేసి రెట్లు పెరిగి కూర్చున్నాయి. ‘ఇదిగో ఇక్కడే క్యాపిటల్. అదుఓ అక్కడే క్యాపిటల్’ అని జనం అనేసుకునేటట్లు చెయ్యటం వల్ల ‘సింగపూర్’ అయిపోయినట్లే నని అంటున్నారు. అలాగే సింగపూర్‌లో నీళ్ళు కొనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కొనుక్కుందామన్నా నీళ్ళు లేవు. అసలు నీళ్ళు లేని చోటే (ప్రకాశం జిల్లాలో) రాజధాని పెడదామన్న ఒక యోచన చేశారు. ఇదంతా సింగపూర్ చెయ్యటం కాదా అని సదరు ‘దురభిమానులు’ బలంగా ప్రశ్నిస్తున్నారు. 

ఇంకో విషయం. కేపిటల్‌ను అభివృద్ధి చేయటంలో తన కున్న సామర్ధ్యాన్ని కూడా చంద్రబాబు కలగా అమ్మేస్తున్నారు. అందుకు ‘హైదరాబాద్’ ను నమూనాగా చూపిస్తున్నారు. అవును. హైదరాబాద్‌నే అభివృద్ధి చేశారు. ఆయన తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇతర పట్టణాలను వదలిపెట్టేశారు. గ్రామాలయితే అప్పటికి ప్రపంచ బ్యాంకు, బహుళ జాతి సంస్థల లెక్కల్లో లేవు కాబట్టి, ఆయన లెక్కల్లో కూడా లేవు. అందుకే కదా ‘ప్రత్యేక తెలంగాణ’ నినాదమొచ్చింది? చంద్రబాబు చెప్పుకోవటానికి ముఖమాట పడతారు కానీ, తనే లేకుండా వుంటే తెలంగాణ ఇంత త్వరిత గతిన వచ్చేది కాదు. ఒక్క హైదరాబాద్‌నే అభివృధ్ధి చేసి, తెలంగాణను సమస్యగా మార్చిందీ చంద్రబాబే, ఈ సమస్యను ఉద్యమంగా మార్చేందుకు నాయకుణ్ణి ఇచ్చింది  కూడా చంద్రబాబే. తెలుగుదేశంలో తన కేబినెట్‌లో కొనసాగాలని ముచ్చట పడ్డ కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవినిచ్చి భంగపరచి, చంద్రబాబే స్వయంగా బయిటకు పంపారు కదా!

రాజధాని అభివృధ్ది లో ఇంతటి అనుభవం వున్న తాను కోస్తా నడిబొడ్డున ‘సింగపూర్’ ను సృష్టిస్తున్నారు. అంటే రేపు ఏ ‘సీమ’నో సమస్యగా సృష్టించి, దాన్ని వాడుకోమని నాయకుణ్ణి కూడా తానే పంపించే ఏర్పాటు చేస్తారా అన్న అనుమానం కూడా కలుగుతోంది.

అందుకని, సీమాంధ్రప్రజల మీద ఏ మాత్రం ప్రేమ వున్నా, ఈ సింగపూర్ కలను పక్కన పెట్టి, కనీసం మద్రాసు, కోల్‌కొతా, ముంబయి లాంటి ఒక నగరాన్ని నిర్మిస్తే అదే పదివేలు. మద్రాసు నుంచి సీమాంధ్ర వేరు పడ్డాక ఈ తరహా నిర్మించుకోవాలని అప్పట్లో నేతలు కలలు కన్నారు. తెలంగాణతో ఆంధ్రరాష్ట్రాన్ని కలపకుండా వుంటే, ఈ కల నెరవేరేది. గ్రామీణ సీమాంధ్రులు సైతం అభివృద్ధి చెందగల రాజధానిని నిర్మించాలీ అంటే చంద్రబాబు ముందు ఈ ‘గాలి మేడలు’ కట్టటం మానుకోవాలి.

కేసీఆర్ కలల ‘సర్వే’!

ఇక తెలంగాణలో కేసీఆర్ మాత్రం తక్కువ తిన్నారా? హైదరాబాద్ ఇప్పటికే ‘సింగపూర్’ అయిపోయింది కాబట్టి, కరీంనగర్‌ను న్యూయార్క్ నగరంగా చేసేస్తానంటున్నారు. ఆయనకు కూడా గాలిలో మేడలు కట్టటం దినచర్యగా మారిపోయింది. చంద్రబాబు తో పాటు, ఆయనకూడా నగరాలను ‘వైఫై’ నగరాలుగా మార్చేస్తామంటున్నారు. ఈ ‘వైఫై’ ప్రయోగాలు అభివృధ్ది చెందిన నగరాల్లోనే  మహామహా నగరాల్లోనే బెడిసి కొట్టాయి. నగరం సంగతి తర్వాత. నగరంలో ఒక్క ప్రాంతాన్ని కూడా సంపూర్ణంగా ‘హైఫై’ నెట్‌వర్క్ కిందకు తీసుకురాలేక పోయారు. దానికి తోడు మన  విద్యుత్ కొరత ఒకటి వుంది.

చంద్రబాబు లాగే కేసీఆర్ కూడా  ‘రుణమాఫీ’లో బలంగా ఇరుక్కున్నారు. దానికి తోడు ఆయన దళితులకు మూడెకరాల భూమి, పేదవారికి  రెండు పడక గదులూ ఒక వంటగది వున్న ఇళ్లు కడతానన్నారు. విద్యార్థుల ఫీజులు సరేసరి. వీటికి సంబంధించి కేటాయింపులను వెంటనే ప్రజలు  బడ్జెట్‌లో వెతుక్కుంటారు.  అందుకే ఆయన బడ్జెట్‌ను వాయిదా వేస్తున్నారు. ఈ లోగా ఏదీ  ఇల్లూ అంటే రోజుకో ‘గాలి మేడ’ చూపుతున్నారు. కానీ ఆరు దశాబ్దాల ఆకాంక్షగా వున్న తెలంగాణ నిజమయ్యేసరికి, జనం ఇంకా ఉత్సవ వాతావరణంలో వున్నారు. కాబట్టే, ఆయన ఏం చెప్పినా, ఏం హామీ ఇచ్చినా, అంతే ఆసక్తితో, అంతే ఆశతో తెలంగాణ ప్రజలు వింటున్నారు. ఈ లోపుగా ఏది ఒకటి చేసినట్టుండాలి. అందుకే ఇక్కడ బాబు ‘శ్వేత పత్రాలు’ విడుదల చేస్తే, కేసీఆర్ ‘సర్వే’ చేయించారు. విద్యార్థుల ఫీజు చెల్లించమంటే  ‘ఫాస్ట్’  బిల్లు తెచ్యారు. అయితే ఈ ఓపిక ఎన్నాళ్ళో వుండదని రోడ్కెక్కిన విద్యార్థులూ, రైతులూ నిరూపించారు. 

తెలంగాణకున్న తీవ్రమైన సమస్య విద్యుత్తు. ఇది ఎలా పరిష్కరించాలో కేసీఆర్ ఇప్పటికీ చెప్పలేదు. చెప్పలేరు కూడా. అంతటి కొరత వుంది. రైతులు ఆత్మహత్యలవైపు వెళ్ళిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ లోగా సింగపూర్ చూసి వచ్చారు. అదృష్టం. ఆయన ఇంకో సింగపూర్ కడతానని అనలేదు. కానీ సింగపూర్ ను కట్టిన ప్రధాని, దానినెలా కట్టాడో రాసిన పుస్తకాన్ని తెలుగులోకి తెస్తానని హామీ ఇచ్చారు.చూశారా! నేతలు ‘గాలిమేడలు’ కడుతుంటే, ప్రజలకు కాలమే తెలీదు. ఇప్పుడు అదే సడుస్తోంది.

గ్రేట్ ఆంధ్ర ఎడిటోరియల్ డెస్క్

 


×