వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పోటోళ్ళు నారా చంద్రబాబునాయుడు, అరుణ్ జైట్లీ అనాలేమో. నాలుగైదు రోజుల క్రితం రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగానికీ, నేడు లోక్‌సభలో ఆయన చేసిన ప్రకటనకీ ఏమన్నా తేడా వుందా.? కానీ, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మాత్రం ఆ తేడా కన్పించింది.
అవును, కాస్త తేడా వుంది. 'మీ దిక్కున్న చోట చెప్పుకోండి.. ఆంధ్రప్రదేశ్‌ని దేశంలో అన్ని రాష్ట్రాలతో కలిసి చూస్తాం తప్ప, ప్రత్యేకంగా చూడలేం..' అని అప్పట్లో చెప్పారు, 'విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి వున్నాం.. ఆ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాను..' అని ఇప్పుడు చెప్పారు. అంతకు మించి అరుణ్ జైట్లీ నోట 'ప్రత్యేక హోదా' అన్న మాటే రాలేదు. ప్రత్యేక ప్యాకేజీ ఊసే లేదు. పోలవరం ప్రస్తావన తీసుకురాలేదు. రైల్వే జోన్ అన్న మాట కూడా విన్పించలేదు. రాజధాని సంగతీ సరే సరి.!
అరుణ్ జైట్లీ చెప్పారట, చంద్రబాబు ఓకే అన్నారట. నవ్విపోదురుగాక మనకేటి.. అన్నట్టుంది అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్న తీరు. పార్లమెంటులో టీడీపీ ఎంపీల ఆందోళనతో ప్రధాని నరేంద్రమోడీ అలర్ట్ అయ్యారట, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని పిలిచి, అరుణ్ జైట్లీతోనూ చంద్రబాబుతోనూ మాట్లాడి సమస్యకు పరిష్కారం వెతకాలని సూచించారట. ఇంతకన్నా పెద్ద కామెడీ ఇంకేమన్నా వుంటుందా.?
నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఏదన్నా చెయ్యాలనుకుంటే, ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన ఏమాత్రం మొహమాటపడరు. రాజ్యసభలోనో, లోక్‌సభలోనే విస్పష్టమైన ప్రకటన చేసేవారే. ఆ మాత్రం జ్ఞానం లేనివాళ్ళు ప్రభుత్వ పెద్దలుగా చెలామణీ అయిపోతోంటే, జనాన్ని మభ్యపెడుతోంటే జనానికి నవ్వు రావడం సంగతి అటుంచితే, రాజకీయాలంటేనే అసహ్యం పెట్టుకొస్తోంది.
రెండేళ్ళ నుంచీ ఓ ముప్ఫయ్ సార్లు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ప్రధానితో మాట్లాడారు, అరుణ్ జైట్లీతో సంప్రదింపులు జరిపారు, రాజ్‌నాథ్‌సింగ్‌తో ముచ్చటించారు.. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై నివేదిక ఇచ్చారు. ఏదీ ఎక్కడ.? ఒక్కటంటే ఒక్క విషయంలో చంద్రబాబు విజ్ఞప్తిని కేంద్రం పరిశీలించిందా.? లేదే.! 'చంద్రబాబుతో మాట్లాడాం.. ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేస్తాం..' ఇంతకు మించి కేంద్రం నుంచి ఇంకో మాట రాలేదు. ఆ మాట తప్ప, చేతల్లో సహాయం రాలేదు. అయినా, జనాన్ని చంద్రబాబు ఇంకా మభ్యపెడతారు.
రాజ్యసభలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమయ్యింది. ఈలోగా ఈ ప్రత్యేక హోదా లొల్లి మొదలయ్యింది. దాంతో, మేటర్ని సైడ్ ట్రాక్ చేయించడానికి 'అప్పనంగా దొరికారు కేంద్రానికి మన చంద్రబాబు'. అంతే, కేంద్రం ఏదో చెప్పింది, ఈయనకేదో అర్థమయ్యింది. మామూలుగానే చంద్రబాబు నేలమీద నిలబడరు, అరుణ్ జైట్లీ ఫోన్ చేస్తే.. ప్రపంచానికే తాను అధ్యక్షుడినైపోయానని గాల్లో తేలిపోతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే.
పార్లమెంటులో నేటి సమావేశాల్ని తిలకించినవారందరికీ అర్థమయ్యింది.. అరుణ్ జైట్లీ ఏమీ చెప్పలేదు. కానీ, చంద్రబాబు ఉత్సాహం చూస్తోంటే అన్నీ వచ్చేశాయనే అన్పించకమానదు. పిల్లికి ఎలక సాక్ష్యం అనాలా.? ఎద్దు ఈనింది అంటే, దూడని కట్టెయ్యండ్రా.. అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అనుకోవాలా.? 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా, మళ్ళీ ఇప్పుడు రెండేళ్ళు ముఖ్యమంత్రిగా.. ఇదీ నిప్పు నారా చంద్రబాబునాయుడిగారి అనుభవం. ఇంతకీ బాబుగారి తీరు చూస్తే నవ్వొస్తుందా.? అసహ్యమొస్తుందా.!