టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని వార్షిక కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుంచి తొలగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తి దూరంగా ఉన్నాడు ధోనీ. ఇంగ్లండ్ వేదికగా జరిగిన క్రికెట్ ప్రపంచకప్ సెమీ ఫైనల్ ధోనీ ఆడిన చివరి మ్యాచ్. ఆ తర్వాత ధోనీ ఏ కారణాన్నీ చెప్పకుండానే అంతర్జాతీయ క్రికెట్ కు దూరదూరంగా ఉంటున్నాడు.
కొన్నాళ్లేమో సైన్యంలో పని చేయడానికి అని ప్రకటించారు. బీసీసీఐ పర్మిషన్ తోనే ధోనీ అలా వెళ్లాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వివిధ సీరిస్ ల సందర్భంగా ధోనీ పేరు ఎంపికైన ఆటగాళ్ల జాబితాలో ఉంటుందా.. ఉండదా.. అనేది చర్చనీయాంశంగా నిలుస్తూ వచ్చింది. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా సీరిస్ ల విషయంలో ధోనీ పేరు వినిపించింది. అయితే అతడి ఎంపిక మాత్రం జరగడం లేదు.
ధోనీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి ఎప్పుడో తప్పుకున్నాడు. కొన్నేళ్లుగా వన్డే, టీ20ల్లో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. ధోనీ లోటును జట్టు పెద్దగా ఫీలవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల మీద కూడా ధోనీ విషయంలో పెద్దగా ఒత్తిడి లేదు. ఈ పరిణామాల్లో ధోనీ అటు నుంచి అటే రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలూ ఉన్నాయి. అయితే ఇప్పుడు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితాలో ధోనీ పేరే లేకుండా పోయింది!
ఇన్నాళ్లూ ఏ గ్రేడ్ ఆటగాళ్లలో ధోనీ పేరుండేది. ఏడు కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ధోనీ బీసీసీఐ ఒప్పందంలో ఉండేవాడు. అయితే ఇప్పుడు ఏ గ్రేడ్ లోనూ ధోనీ పేరు లేదు. కొహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాలు మాత్రమే మొదటి గ్రేడ్ లో స్థానం సంపాదించారు. కొంతమంది యువ ఆటగాళ్లకు కోటి రూపాయల గ్రేడ్ లో చోటు దక్కింది.