చంద్రబాబుని మించిపోతున్న పవన్‌ కళ్యాణ్‌.!

టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీతో రెండు సార్లు కలిశారు.. రెండు సార్లూ రాజకీయంగా లాభపడ్డారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారు.. లాభపడదామనుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. నిజానికి చంద్రబాబు 'వాడుకోని' పార్టీ ఏదన్నా వుందంటే అది…

టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీతో రెండు సార్లు కలిశారు.. రెండు సార్లూ రాజకీయంగా లాభపడ్డారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారు.. లాభపడదామనుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. నిజానికి చంద్రబాబు 'వాడుకోని' పార్టీ ఏదన్నా వుందంటే అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమేనేమో. గతంలో టీఆర్‌ఎస్‌తో కూడా టీడీపీ జత కట్టిన విషయం విదితమే. అలా చాలా రాజకీయ పార్టీలతో చేతులు కలిపి, ఆ తర్వాత 'హ్యాండిచ్చిన' ఘనత చంద్రబాబు సొంతం.

ఇప్పుడు చంద్రబాబు ట్రాక్‌ రికార్డ్‌ని మించిపోవాలనే తపనతో వున్నట్లున్నారు జనసేన పార్టీ అధినేత. 'యూ టర్న్‌' అనగానే రాజకీయాల్లో చంద్రబాబు పేరు గుర్తుకొస్తుంది. ఇకపై ఆ గుర్తింపు పవన్‌ కళ్యాణ్‌ సొంతమయ్యేలా వుంది. ఇప్పటికే, చంద్రబాబుతో సావాసం కారణంగా పవన్‌ కళ్యాణ్‌కీ 'యూ టర్న్‌' అనే ట్యాగ్‌ అతుక్కుపోయిందనుకోండి.. అది వేరే విషయం. దాన్ని ఇంకాస్త బలోపేతం చేసుకోవడానికి పవన్‌ కళ్యాణ్‌ నానా పాట్లూ పడుతున్నారు.

బీజేపీతో పవన్‌ కళ్యాణ్‌ స్నేహం కొత్తదేమీ కాదు. పాత స్నేహాన్నే ఇంకోసారి కొత్తగా చేయబోతున్నారాయన. ఢిల్లీకి వెళ్ళారు.. ఢిల్లీ బీజేపీ పెద్దల్ని కలిశారు.. ఏపీ బీజేపీ పెద్దలతో మంతనాలు షురూ చేశారు. ఇంతకు ముందేమో బీజేపీని కాదని వామపక్షాలు, బహుజన్‌ సమాజ్‌ పార్టీతో నడిచారు. ఇప్పుడేమో బహుజన్‌ సమాజ్‌ పార్టీనీ, వామపక్షాల్నీ పక్కన పెట్టి మళ్ళీ బీజేపీ వైపుకు చూస్తున్నారు.

అన్నట్టు, టీఆర్‌ఎస్‌ మీద మొన్నామధ్య బోల్డంత ప్రేమ కురిపించి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో విభేదించి.. ఇలా ఏవేవో టర్‌నలు తీసుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. 'చంద్రబాబు కనుసన్నల్లో రాజకీయం నడుపుతున్న పవన్‌..' అని ఎవరన్నా విమర్శిస్తే, జనసైనికులకు కోపమొచ్చేస్తుందిగానీ.. పవన్‌ కళ్యాణ్‌ నడవడిక రాజకీయాల్లో ఎలా వుందో ఒక్కసారి విశ్లేషించుకుంటే, జనసైనికులకే ఆయన చేస్తున్న రాజకీయమేంటో అర్థమయిపోతుంది.

నాలుగేళ్ళపాటు బీజేపీతో కలిసి ప్రయాణం చేయడం గురించి ఇప్పుడే చర్చలు షురూ చేశారు. నాలుగేళ్ళ సంగతి తర్వాత.. కనీసం నాలుగు నెలలైనా బీజేపీతో కలిసి ముందుకు కొనసాగుతారా.? నిన్న తిట్టడం, నేడు పొగడటం, ఎల్లుండి మళ్ళీ కలవడం.. ఈ రాజకీయమేంటో పవన్‌ కళ్యాణ్‌కే తెలియాలి. అందుకే మరి, పవన్‌ కళ్యాణ్‌ని 'యూ టర్న్‌' చంద్రబాబుకి ఎంతో ఇష్టమైన శిష్యుడని అభివర్ణించేది.