అలిగే ఆడవాళ్ళంటే రాజాకు కోపం. అందుకే సావిత్రిమీద అంత కోపం వచ్చింది.
అసలు పెళ్ళినాడే తను చెప్పాడు – “నాతో ఏదైనా సరే ఫ్రాంక్‌గా మాట్లాడు, నాదేదైనా పొరబాటు ఉంటే స్పష్టంగా చెప్పేయ్! అంతేకానీ, చెప్పేది వినిపించుకోకుండా, సినిమాల్లోలా అపార్థాలు పెంచుకుని నీ జీవితం దుర్భరం చేసుకుని, నా జీవితాన్ని రంపపు కోత పెట్టకు. ఒకరి నొకరు అర్థం చేసుకుని మెలగడమే సంసారం. అలకలతో సాధిద్దామని ఎన్నడూ చూడకు. నాకు అస్సలు ఇష్టం ఉండదు!” అని.
అంత ఇదిగా చెప్పడానికి కారణం ఉంది. తన అన్నయ్య కృష్ణ సంసారం చూసి ఉన్నాడు కాబట్టి అలిగే ఆడవాళ్లు వేసే వేషాలు తనకి బాగా తెలుసు. కాలేజీ చదువుకి పట్నంలో అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూశాడు వదిన చేసే హడావిడి. ఒకటే గది. మధ్యలో దుప్పటి వేళ్లాడేసి ఓ పక్క తనూ, మరో పక్క వాళ్లూ పడుకునేవాళ్లు. ఎందుకో గానీ, “వంటింట్లో పడుకుంటే ఇంతోటి పసివాణ్ణి పందికొక్కులు ఎత్తుకుపోవు” అని తనని ఉద్దేశించి వదిన అస్తమానూ గొణుగుతూండేది. ఇక ఆదివారం మధ్యాహ్నం చూడాలి, ఏదో గొడవ పెట్టేది. అన్నయ్యకు బతిమాలడం సరిపోయేది. అది చూడలేక తను బయటికి పోయేవాడు. తమాషా ఏమిటంటే తను సాయంత్రం ఏ ఎనిమిది గంటలకో ఇల్లు చేరేటప్పటికి ఇద్దరూ కులాసాగా కూర్చుని కబుర్లు చెబుతూండేవారు. ‘సిగ్గు లేని మనుషులు!’ అని విసుక్కునే వాడు తను.
రాజా పెళ్లయి రెండు నెలలయింది. తను చాలా న్యాయంగా భార్య ముచ్చట్లన్నీ తీరుస్తున్నాడు. ఎవడిని జడ్జిమెంటుకి పిలిచినా ఆ విషయం ఒప్పుకుని తీరతాడు. కానీ అలిగే ముందు సావిత్రికి ఆ విషయం తోస్తేగా! తను సినిమాకి తీసుకెళతాను రెడీగా వుండమన్నాడు. తీసుకెళ్లే ఉద్దేశం లేకపోతే ఎందుకు ఉండమంటాడు? ఆపాటి ఆలోచన ఉండలా అక్కర్లేదా? ఆలస్యమైంది. నిజమే, బస్సు డ్రైవరు, సైక్లిస్టు కొట్టుకుంటారని తను కలగన్నాడా? ఈ విషయం చెప్పబోతే సావిత్రి వింటే కదా! ఇంటికొచ్చేసరికి మొహం మాడ్చేసుకుని బట్టలు మార్చేసుకుని కూర్చుంది. – “ఏముందీ జీవితంలో ఓ సరదానా, పాడా!” అంటూ, తను చెప్పబోతే అసలు వినిపించుకోదే! తనకి ఒళ్లు మండిందంటే మండదూ!?
అవాళ రాత్రి విడిగా వచ్చేసి హాలులో నేలమీద పడుకున్నప్పుడు తనదేమైనా పొరబాటు ఉందా అని కాగితం మీద అన్ని పాయింట్లూ రాసి చూసుకున్నాడు. ఎలా చూసినా తనే కరెక్టు. ఇక ఆమె అలగవలసిన అవసరం ఏముంది, తన గొప్పతనం చూపించుకోడానికి కాకపోతే. తన లోపమేమీ లేనప్పుడు తను బతిమాలవలసిన అవసరం ఏమీ లేదు. అందుకే రెండురోజులైనా తను మెత్తబడలేదు. సావిత్రి కూడా మెత్తబడలేదు. వంట వండడం, మాట్లాడకుండా వడ్డించడం, మిగతా టైములో పుస్తకం చదువుకుంటూ కూచోడం.. రాత్రి మాత్రం పెందరాళే మంచం ఎక్కి పవళించడం.
తనకి రెండురోజులుగా కింద పడుకోవడంతో ఒళ్లు నొప్పులు చేసినట్టుంది. అయినా ఆవిడ మంచం ఎక్కి పడుకున్నప్పుడు తను మాత్రం ఎందుకు కింద పడుకోవాలి? ఆ మంచం అత్తారు ఇచ్చినది తమ ఇద్దరి కోసం. తను వెర్రివాడిలా కింద పడుకోవడం ఏమిటి, ఆవిడ టింగురంగామని మంచంమీద దొర్లడమేమిటి? కోపం వచ్చిన మొదటి రోజే తను కింద పడుకోకుండా ఉండాల్సింది. ఇప్పుడు మంచం ఎక్కితే తన మీద మోహంతో పక్కకి చేరాడనుకుంటుందేమో! నాన్సెన్స్! తను అంత వీక్ ఫెలో కాడని ఈ పాటికే గ్రహించి ఉంటుంది. అయినా వేరే గదిలో పడుకుని కాదు, పక్కపక్కన పడుకుని నిగ్రహం చూపించినప్పుడే తన తడాఖా ఏమిటో తెలిసివస్తుంది.
రాజా మంచం ఎక్కడానికి రావడంతో సావిత్రి పక్కకు జరిగింది. చదువుతున్న పుస్తకం మూసేసి, లైటు ఆర్పేసి కళ్లు మూసుకుని, నుదుటి మీద చెయ్యి పెట్టుకుని వెల్లకిలా పడుకుంది. కష్టపడి ఆవలించి, తనకూ నిద్ర వస్తోందని సూచించాడు రాజా. అటు తిరిగి పక్కకు ఒత్తిగిల్లాడు. పెళ్లి కాని క్రితం ఏళ్ల తరబడి ఒంటరిగా పడుకున్నప్పుడు హాయిగా నిద్రపట్టేది. అదేమిటో రెండు నెలల సహచర్యంతోనే ఒంటికి మరో ఒళ్లు తగలకపోతే అదోలా, వెలితిగా ఉంది. కానీ అలా అని రాజీ పడితే అమె అహంకారాన్ని పెంచినట్టువుతుంది. జీవితమంతా సావిత్రి అలకలు తీర్చడంతోనే సరిపోతుంది. నిగ్రహం చూపించాల్సింది ఇప్పుడే. రేపు ఆఫీసులో చెయాల్సిన పని గురించి ఆలోచిస్తుంటే సరి, నిద్రపడుతుంది.
రాత్రి పన్నెండు దాటుతున్నా రాజాకు నిద్ర పట్టలేదు. పట్టదని అతనికి తెలిసి పోయింది. తిరిగి చూస్తే వెల్లకితలా పడుకుని సావిత్రి ఫాను కేసి చూస్తూ కనబడింది. ‘ఈవిడకేం, రాత్రంతా నిద్ర లేకపోయినా పరవాలేదు. మధ్యాహ్నం లాగించేస్తుంది. తనలా ఆఫీసు కెళ్లాల్సి ఉంటేగా? తనకే బాధ! శరీరానికి ఒకటి అలవాటు చేశాక నిద్ర రమ్మంటే ఎలా వస్తుంది? తప్పు గ్రహించి ఆమె తన దగ్గరకి వస్తే ఎంత బాగుండేది? అనవసరంగా అలిగి రెండు రోజులుగా మూడ్ ఖరాబు చేసినందుకు ఏమీ అనకుండా క్షమించే వాడు. కానీ, తన తప్పు గ్రహించిన లక్షణాలేమీ అమెలో కనబడటంలేదు. ఫాన్ కేసి చూస్తే ఏముంటుంది? తనలోకి తను చూసుకోవాలి కానీ! అంటే నైట్గౌన్లోంచి కనబరిచే ఒంపుసొంపుల్ని కాదు. వాటి వెనకనున్న అంతరంగాన్ని చూసుకోవాలి, సమీక్షించుకోవాలి.
తను కదిలాడు “అబ్బ! దోమలు!” అంటూ ఆమె మీదుగా చేయి వేసి మస్కిటో రిపెల్లర్ స్విచ్ వేయబోయాడు. అదే సమయానికి ఆమె దిండు సర్దుకోడానికి కాబోలు లేచింది. తన చేతికి ఆమె వక్షం తగిలింది. కరెంటు షాక్ కొట్టినట్టు వెనక్కి లాక్కున్నాడు. తను వ్యామోహం కొద్దీ చేయి వేశానని పొరబడలేదు కదా! అంతకన్నా అవమానం ఉందా? వెధవ రిపెల్లర్! ఈ హడావిడిలో స్విచ్ సరిగా పడనేలేదు. సరిగ్గా వేద్దామని చేయి మళ్ళీ సారిస్తే!? ‘అందుకనే’ అని రూఢిగా అనుకుంటుంది కూడాను. దోమలు కుడితే కుట్టనీ, చేయి ఛస్తే చాపకూడదు.
అయినా…. తన చేతికి తగిలింది ….. కవుల వర్ణనలో ‘శిలలవలె కఠినము’ అని వర్ణిస్తారేమో, కొంతమంది ‘పూలగుత్తి’ అని కూడా అంటారేమో, రెండు నెలలుగా సంసారం చేస్తూ తను సరిగ్గా తెలుసుకోలేక పోవడమేమిటి, ఈ సారేనా సరిగా గమనించాలి. పైనుంచి చూస్తే తెలియటం లేదు. మరీ శ్రద్ధగా చూస్తుంటే పసిగట్టేసిందేమో, అటు తిరిగి ఒత్తిగిలి పడుకుంది. జఘనం ఒంపులు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. వక్షం, జఘనం ఒకలాటివేనంటూ లంకె పెడతారు కదా! చేయి వేసి చూస్తే తెలిసిపోతుంది. అయినా చేయి వేసి చూసే హక్కు తనకి ఉంది, భర్త… అంతే తాళి కట్టినవాడు, తిండి పెట్టడానికి పనికి వస్తాడు కానీ మీద చెయ్యి వేయడానికి పనికి రాడా? పంతానికి పోవడం వల్ల మన హక్కు మనమే కోల్పోతున్నామన్నమాట! షియర్ పూలిష్నెస్!
అయినా సావిత్రి అలా అనుకోకపోవచ్చు. లొంగిపోయా డనుకోవచ్చు. అందుకని ఏదో కారణం చెప్పి… రాజా ఆలోచన సాగుతుండగానే అతని ప్రమేయం లేకుండానే అతని అరచేయి ఆమె పిరుదుల మీద పడింది. చరిచింది అనవచ్చు. “దోమ!” అన్నాడు రాజా. ‘దోమను చంపడానికి చెయ్యి వేశానే కానీ అదేం చిత్రమో, తన ప్రయత్నం లేకుండా చేయి అలా అతుక్కుపోయిందేమిటి? దానిపై సావిత్రి చేయి పడడం వల్లనా..?, అదేమిటి, అలా ముందుకు జారిపోతుందేమిటి? శాటిన్ నైట్ గౌన్ వల్లనా, ‘దోమో, ప్రేమో’ అంటూ సావిత్రి చేయి గుంజుకుకోవడం వల్లనా?’ రాజా ఆలోచనలు ముందుకు సాగడానికి అతని బుర్ర సహకరించలేదు. తల లోకి రక్తం పైకి ఎగజిమ్మి నట్టనిపించింది. మూతపడుతున్న కళ్లపై ఎవరో తెరలు దించినట్టయింది. గొంతు తడారింది. దాహం వేసింది.
మర్నాడు పొద్దున్న లేచి అద్దంలో మొహం చూసుకున్నప్పుడు రాజాకి ఆదివారం సాయంత్రం నాటి వాళ్ల అన్నయ్య మొఖం కనబడింది. (ఆంధ్రప్రభ వీక్లీ నవంబరు 1997)
– ఎమ్బీయస్ ప్రసాద్

బాగానే ఉంది కథ. నేను అప్పుడు స్కిప్ చేసింది కావచ్చు!
స్కిప్ కొట్టా అంటే మరో జ్ఞాపకం— లైబ్రరీ లో ఇలాంటి కథలకు బొమ్మలు కూడా ఉండేవి. చదువుతుంటే మధ్యలో ఉరుము ఉరిమినట్టు ఎవర్రా మిమ్మల్ని ఈ బుక్స్ తీసుకోమన్నది అని తెలుపు కుర్తా పైజామా లో ఒక ఆజానుబాహుడు అడ్డుకునే వాడు. లైబ్రేరియన్ గభాల్న వచ్చి ఆ బుక్ లాగుసుకొని బల్ల మీద ఉంటే తీసేసుకుంటున్నారండి ఈ పిల్లలు అని ఎక్సప్లనేషన్ ఇచ్చేవాడు. లాగులు పైకి లాక్కునే పిల్లవెధవలు వీళ్ళు తెలివిమీరిపోయారు అని తీర్మానించేవారు . కొన్నాళ్లు చిన్న చెక్క రాక్ లైబ్రేరియన్ పక్కన పెట్టి వార పత్రికలు అందులో ఉంచారు.
కథ చాలా బాగుంది, చంద్ర గారి బొమ్మ కూడా చాలా apt గా ఉంది!