విద్యావంతులు ఎక్కువగా వున్న కేరళలో ఐసిస్ యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. హిందూ, క్రైస్తవ యువతీయువకులను స్నేహితుల ద్వారా ఇస్లాం ఘనత గురించి చెప్పించి, మతం మార్పించి, పైకి సాధారణ సంస్థల్లా కనబడే కొన్ని సంస్థల్లో చేర్పించి, మతతీవ్రవాదం బాగా నూరిపోయించి, తలిదండ్రుల నుంచి దూరం చేసి, పరిశుద్ధమైన ఇస్లాం అనుసరిస్తున్న దేశాలను చూసి తీరాలి అంటూ తన ప్రాబల్యం వున్న దేశాలకు రప్పించుకుంటోంది.
ఎంతమంది ఐసిస్‌లో చేరుతున్నారో కచ్చితంగా చెప్పలేకపోయినా ఇస్లాంలోకి మతాంతీకరణలు జోరుగానే సాగుతున్నాయి. పోలీసు లెక్కల ప్రకారం 2011-16 మధ్య 5793 మంది ఇస్లాంలోకి మారారు. మతం మారిన వారిని తిరిగి హిందువులుగా మార్చే పనిలో నిమగ్నమైన ఆర్ష విద్యా సమాజం నిర్వాహకులు ''ఇస్లాం, క్రైస్తవంలోకి మారిన వారిలో సందేహాలు మిగిలిపోతాయి. ఇతర మతాలను హిందూమతంతో పోల్చి వాదనలు చేస్తారు.
అందుకని మేము యితర మతాలను కూడా అధ్యయనం చేసి, వాటి కంటె హైందవం ఎందుకు మెరుగైనదో చెప్పాల్సి వస్తుంది. 2009 నుంచి యిప్పటివరకు కనీసం 3 వేల మందిని అలా మార్చాం. ఇప్పటికీ నెలకు కనీసం 100 మందైనా అలా వస్తూ వుంటారు.'' అంటున్నారు. ఇది మతాంతీకరణతో ఆగకుండా వివాహం, తదనంతరం యెమెన్ వంటి దేశాలకు పంపడం వరకు సాగుతోంది. ఇలాటి వ్యవహారంలో అఖిల అనే అమ్మాయి విషయంలో కేరళ హైకోర్టు కలగజేసుకుని మే 24న తీర్పు యివ్వవలసి వచ్చింది.
అఖిల ఒక హిందూ మలయాళీ అమ్మాయి. తమిళనాడులోని సేలంలో శివరాజ్ హోమియోపతి కాలేజీలో బిఎచ్‌ఎమ్‌ఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) చదువుతూ వుండేది. అక్కడ ముస్లిం స్నేహితురాళ్లు, వారి తండ్రి ఆబూబకర్ పరిచయమయ్యారు. వారంతా ఇస్లాం గొప్ప మతమని బోధించడంతో మతం మారదామని నిశ్చయించుకుంది.
గత ఏడాది జనవరి 7న హౌస్ సర్జన్సీ పూర్తి చేయకుండానే, తన తల్లిదండ్రులకు చెప్పకుండానే సేలం వదిలి కేరళలోని మళప్పురంలో సాయినాబా అనే ఆమెతో కలిసి వుంటూ ఆ వూళ్లోనే వున్న సత్య సారణి ట్రస్టు నిర్వహించే రెండు నెలల ఇస్లాం కోర్సులో చేరింది. 1994లో ప్రారంభించిన యీ ట్రస్టు ఇస్లాం గురించి తెలుసుకోదలచిన స్త్రీపురుషులకు 2 నెలల కోర్సు నిర్వహిస్తూ వుంటుంది. ఒక్కో బ్యాచ్‌లో 50 మంది వుంటారు.
వారిలో 30 మంది దాకా హిందువులు లేదా క్రైస్తవులే. ''మేం ఇస్లాం గురించి అవగాహన పెంచుతున్నాం తప్ప మతం మారమని ఎవరినీ ఒత్తిడి చేయం. మాకో సిలబస్ వుంది. ప్రతీ నెలా ప్రభుత్వాధికారులు వచ్చి విద్యార్థుల వివరాలు కనుక్కుని వెళుతూంటారు. మగవాళ్లకు, ఆడవాళ్లకు వేర్వేరు హాస్టళ్లున్నాయి. వారి మధ్య ప్రేమ వ్యవహారాలను మాకై మేము ప్రోత్సహించం.'' అని దాని నిర్వాహకులు చెప్పుకుంటారు. పాలక్కాడ్‌లో ప్రయివేటు సంస్థలో పనిచేసే 21 ఏళ్ల హిందూ అమ్మాయి ఒకామె సత్య సారణిలో చేరి, ఇస్లాం గురించి తెలుసుకోసాగింది.
అక్కడ నౌఫాల్ అనే అతను ఆమెకు చేరువై ''అచ్చమైన, స్వచ్ఛమైన ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే యెమెన్ వెళ్లాలి రా' అనసాగాడు. అక్కడ ఐసిస్ చేస్తున్న ఘోరాల గురించి ఆమె సారణిలో ప్రస్తావిస్తే అవన్నీ క్రైస్తవ పత్రికల దుష్ప్రచారం అని కొట్టి పారేశారు. ఆమె తలితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు ఫర్జానా అనే యువతి యింట్లో ఆమెను కనుగొన్నారు. ఆమె యింటికి తిరిగి వచ్చేసి ఆర్ష విద్యా సమాజంలో చేరింది. అలాటి అమ్మాయి కానీ నౌఫాల్ కానీ ఎవరూ తమకు తెలియదని సారణి నిర్వాహకులు అంటున్నారు.
కూతురు మళప్పురం చేరిన విషయం తెలుసుకున్న అఖిల తండ్రి అశోకన్ కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ (వ్యక్తి ఆచూకీ చెప్పాలని కోరే అర్జీ) దాఖలు చేశాడు. అప్పటికే ఆమెకు 23 ఏళ్ల వయసు కాబట్టి, మైనారిటీ తీరిపోయిన వ్యక్తి తన యిష్టానుసారంగా ఎక్కడైనా వుండవచ్చు, మేము కలగచేసుకోము అంటూ కోర్టు ఆ అర్జీని తిరస్కరించింది.
అయితే ఆమె దేశం విడిచి వెళ్లరాదని, సత్య సారణిలో కోర్సు చేస్తున్నట్లు రుజువు చూపాలని మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. 2016 ఆగస్టులో అశోకన్ మళ్లీ కోర్టు తలుపు తట్టాడు. ''మా అమ్మాయి సిరియా వెళ్లాలనుకుంటోంది. ఆ మేరకు తను పంపిన మెసేజి చూడండి.'' అంటూ. కోర్టు కేసు చేపట్టేసరికి అఖిల ఎక్కడికో వెళ్లిపోయిందంటూ సాయినాబా చెప్పింది. కోర్టు విస్మయం ప్రకటించింది.
విచారణ నడుస్తూండగానే అఖిల ప్రత్యక్షమైంది. ''నువ్వు సాయినాబాతో ఎందుకు వుంటున్నావ్? నీ వైద్యవిద్య పూర్తి చేయలేదు, తలిదండ్రుల వద్దకూ వెళ్లలేదు. ఏమిటి విషయం? పైగా నీకు గాని, సాయినాబాకు గాని పెద్దగా ఆర్జన లేదు కదా, ఇంత ఖరీదైన లాయర్లను ఎలా పెట్టుకోగలుగుతున్నారు? మీ వెనక ఎవరున్నారు?'' అని కోర్టు అడిగింది.
2016 డిసెంబరు 19 న అఖిల కోర్టుకి వచ్చి ''నేను సేలం వెళ్లి చదువు పూర్తి చేస్తాను.'' అని అఫిడవిట్ రాసి యిచ్చింది. అలా అన్నది రెండు రోజుల తర్వాత కోర్టులో హాజరై ''నాకు పెళ్లయిపోయింది.'' అంది. ఆమె భర్త పేరు షఫీన్ జహాన్. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ) పార్టీ సభ్యుడు. ఒక క్రిమినల్ కేసులో నిందితుడు కూడా.
అతని ఫేస్‌బుక్ పోస్టులు చూస్తే అతని యెమెన్ సరిహద్దులకు వెళ్లినట్లు తెలుస్తోంది. 2016 అక్టోబరులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన ఐసిస్ ఏజంటు మాన్సి బురాక్‌తో సంబంధ బాంధవ్యాలున్నట్లు ఆరోపణలున్నాయి. అతనితో పెళ్లి కోసం అఖిల ఇస్లాంలోకి మారిపోయి, తన పేరును హాడియాకు మార్చుకుంది. సాయినాబా యింట్లో పెళ్లి తంతు పూర్తయింది. ఇదంతా తెలిసి కోర్టు నివ్వెరపోయింది. తన వ్యవహారాలు తనే మేనేజ్ చేసుకునేవారి పక్షాన కోర్టే బాధ్యత తీసుకునే 'పేరెన్స్ పాట్రియేట్' అనే సూత్రం కింద మే 24న ఆ వివాహాన్ని రద్దు చేసింది.
ఈ తీర్పు విని ఎస్‌డిపిఐకు పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)లతో సంబంధమున్న ముస్లిం ఏకోపన సమితి జూన్ 5న వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఎర్నాకులంలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు హర్తాల్ నిర్వహించింది. మలయాళ రచయిత ఎమ్‌ఎన్ కరస్సెరీ ''ఈ తీర్పు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తోంది.'' అన్నారు.
పిఎఫ్‌ఐకు సన్నిహితంగా వుంటే ''తేజస్'' పత్రిక సంపాదకుడు పి. కోయా తీర్పు పక్షపాత బుద్ధితో వుందని, మహిళల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ''మాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా వాళ్లిద్దరూ ఒకరి నొకరు తెలుసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఈ దేశంలో సహజీవనం చేస్తే నేరం కాదు. పెళ్లి చేసుకుంటే నేరమై పోయింది. కోర్టు వాళ్లిద్దరినీ విడదీసింది. పోలీసులు ఆమెను తలిదండ్రుల వద్దకు పంపి గృహనిర్బంధంలో పెట్టారు. ఇంటినిండా సిసిటివి కెమెరాలు అమర్చారు.'' అని విరుచుకు పడ్డారు.
(ఫోటో – షఫీన్ జహాన్, అఖిల)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]