లావు తగ్గితే లాభాలు

లావు తగ్గితే ఆరోగ్యరీత్యా చాలా లాభాలున్నాయంటారు. ఆరోగ్యం మెరుగయితే ఆర్థికంగా కూడా మెరుగవుతాం. ఇంత డొంకతిరుగుడు లేకుండా డైరక్టుగా 'మీ బరువును బట్టి మీ టిక్కెట్టు రేటు మారుతుంది' అని చెప్తే..? పసిఫిక్‌ సముద్రంలో…

లావు తగ్గితే ఆరోగ్యరీత్యా చాలా లాభాలున్నాయంటారు. ఆరోగ్యం మెరుగయితే ఆర్థికంగా కూడా మెరుగవుతాం. ఇంత డొంకతిరుగుడు లేకుండా డైరక్టుగా 'మీ బరువును బట్టి మీ టిక్కెట్టు రేటు మారుతుంది' అని చెప్తే..? పసిఫిక్‌ సముద్రంలో దీవుల్లా వుండే చిన్న దేశమైన సమోవాలో నడిచే సమోవా ఎయిర్‌లైన్సు సిఇఓకు ఏడాది క్రితం యీ ఐడియా వచ్చింది. విమానం ఎక్కే ముందు 'మీ బరువు తూచి కిలోకి ఏభై ఏడున్నర అమెరికన్‌ సెంట్లు (వాళ్ల కరెన్సీలో 1.34 తలా) తీసుకుంటాం' అని ప్రకటించారు. ఇక సన్నవాళ్లందరూ ఆ విమానాలు ఎక్కడానికి ఎగబడ్డారు. ఎయిర్‌లైన్స్‌ ఆదాయం విపరీతంగా పెరిగింది. సన్నవాళ్లు అనగానే ఏ 50 కిలోల వాళ్లో అనుకోకండి. 120 కిలోల కంటె తక్కువ వున్నవాళ్లందరికీ తక్కిన ఎయిర్‌లైన్సుతో పోలిస్తే దీనిలో వెళ్లడం చౌక పడుతుంది. 120 కిలోల వాళ్లు ఆ దేశంలో మామూలుగా వున్నట్టే లెక్క. ఎందుకంటే ఆ దేశంలో దాదాపు అందరూ స్థూలకాయులే. సుగర్‌, గుండెజబ్బులతో బాధపడేవారు అత్యధికం. 

లావుగా వున్నవాళ్లు విమానంలో ఎక్కువ స్థలం ఆక్రమించడం సహజం కాబట్టి తక్కినవాళ్ల కంటె ఎక్కువ చార్జీలు చెల్లించడం న్యాయబద్ధంగానే తోస్తోంది ఆ దేశస్తులకు. ఎవరూ అభ్యంతరపెట్టలేదు. ఆ మాటకొస్తే తక్కిన దేశాల్లో కూడా దీని గురించి సీరియస్‌గానే ఆలోచిస్తున్నారు. ఈ నవంబరు 19 న హీత్రూ ఎయిర్‌పోర్టులో ఓ 22 ఏళ్ల ఫ్రెంచి కుర్రాడు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కబోతూంటే అధికారులు కుదరదని చెప్పేశారు. 'నీ 230 కిలోల బరువు మోయడం మా విమానం తరం కాదు' అని యింటికి పంపించేశారు. ఈ సమోవా ఎయిర్‌లైన్సు అంత నిర్దయగా లేదు. 'మేం స్థూలకాయుల నుండి ఎక్కువ చార్జీలు పుచ్చుకుంటున్నాం కాబట్టి వాళ్లకు తగినంత చోటు కల్పించడం న్యాయం. అందువలన ప్రస్తుతం వున్న మూడు విమానాలకు తోడుగా మేం తెప్పించబోయే సెస్నా 208 విమానంలోని సీట్లను వాళ్ల కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నాం.' అన్నారు. అలాటి ఏర్పాట్లు అన్ని దేశాల్లో రైళ్లు, బస్సుల్లో కూడా వస్తే మంచిది. అప్పుడు పక్కసీటులోని లావువాళ్లని తిట్టుకోనక్కరలేదు, లావు వాళ్లు కూడా ముడుచుకుపోయి కూర్చుని, వీళ్ల విసుగులు, నిట్టూర్పులు పడనక్కరలేదు. డబ్బు పడేసి దర్జాగా, కాళ్లు చాపుకుని విశాలంగా కూర్చోవచ్చు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]