ఈ ఎన్నికలలో గమనించవలసిన కొన్ని అంశాలు
పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ నిజామాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పూర్తి స్థాయి ఆధిక్యత ప్రదర్శించింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తెరాసతో సమానంగా వుంది. మునిసిపల్, ఎంపిటిసి ఎన్నికల్లోనూ దాదాపుగా యివే ఫలితాలు వచ్చాయి. కానీ జెడ్పిటిసి స్థానాల్లో తెరాస దూసుకుపోయింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెసును నెట్టివేసింది. ఇలాటి పరిస్థితుల్లో తెరాస అసెంబ్లీ ఎన్నికల్లో యీ స్థాయిలో గెలుపొందడానికి ఏదో ఒక బలమైన కారణం వుండాలి. పోలింగు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తెరాసకు బలం పెరిగిందని అందరూ గమనించారు. దానికి కారణం యిప్పుడు స్పష్టంగా తెలియవచ్చింది. అది తెలంగాణ తెచ్చిన కృతజ్ఞత కాదు, సెంటిమెంటు కాదు. ఋణమాఫీ పథకమే అని యిప్పుడు తెరాస కార్యకర్తలే చెపుతున్నారు. తెరాసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే నమ్మకం బలపడిన కొద్దీ ఋణమాఫీ జరుగుతుందన్న ఆశతోనే ఓట్లు వేశామని ఓటర్లు టీవీ ఛానెళ్లకు ఫోన్ చేసి చెపుతున్నారు. బంగారం కుదువ పెట్టి తీసుకున్న ఋణాలు కూడా ప్రభుత్వం కట్టేస్తుంది, దానితో బంగారం వెనక్కి వచ్చేస్తుంది అని మహిళా ఓటర్లు ఆశపడ్డారట. అధికారంలోకి వచ్చాక లక్ష లోపు ఋణాలు మాత్రమే, అదీ పంట ఋణాలే, అది కూడా ఏడాదిలోపువే అనడంతో ప్రజలు తిరగబడ్డారు. అప్పుడు ఇవన్నీ చెప్పుకొచ్చారు. భయపడిన కెసియార్ మరమ్మత్తు చర్యలు ప్రారంభించారు. చివరకు ఎలా తేలుతుందో చూడాలి.
లోకసత్తాకు ఉన్న ఒక్క అసెంబ్లీ సీటూ పోయింది. దాని అధ్యకక్షుడు జెపికి 9.83% ఓట్లు మాత్రమే వచ్చాయి. మోదీ హవా బలంగా వీచే యీ రోజుల్లో మోదీని బలపరుస్తానని చెప్పినా యిదీ పరిస్థితి. ఆయన ప్రాతినిథ్యం వహిస్తూన్న కూకట్‌పల్లి అసెంబ్లీ ఓటర్లే ఆయనను నిరాకరించారు. లోకసత్తా ఎన్‌జిఓగా వున్నపుడు అందరూ వాళ్లు చెప్పినది వినేవారు, ఆలోచించేవారు. పార్టీగా మారాక దాని ప్రభావం దిగజారుతూ వచ్చింది. 2009 ఎన్నికల ప్రచారంలో 'ఇవి సెమి ఫైనల్స్, 2014లో అధికారం మాదే' అని హోరెత్తించేశారు. ఇప్పుడు చూడండి – ఏం జరిగిందో! జెపి పూర్తిగా టిడిపి మనిషిగా తేలడంతో ప్రత్యేక అస్తిత్వం పోయింది. 2019 నాటికి కోలుకుంటుందని లోకసత్తా వీరాభిమానులు తప్ప వేరెవరూ ఆశించలేరు.
కాంగ్రెసు సిట్టింగ్ అభ్యర్థులకు టిక్కెట్లిచ్చి ఘోరంగా నష్టపోయింది. దేశం మొత్తం మీద గెలిచిన అభ్యర్థులలో కొత్తవారే ఎక్కువ. ఇక్కడ పాతవారి పైరవీలకు లొంగారు.
తెలంగాణ జాక్ ఉద్యమం నడిచినంతకాలం చాలా ప్రభావవంతంగా వుండింది. అయితే ఎన్నికల సమయంలో చతికిలపడింది. తెలంగాణ యిచ్చేముందు కాంగ్రెసు కోదండరాంతో ఒప్పందం చేసుకుందట – ఎన్నికలలో ఎవరి పక్షాన ప్రచారం చేయకూడదని! ఎన్నికల సమయంలో తెరాసకు అనుకూలంగా ప్రకటన చేయమని కెసియార్ కోరితే కోదండరాం నిరాకరించి ఆయన ఆగ్రహానికి గురయ్యారు. కెసియార్ జాక్‌లో కొందర్ని తమవైపు లాగారు. కాంగ్రెసు మరి కొందర్ని లాగింది. టిడిపి యింకా కొందర్ని లాగింది. ఈ పరిణామాల్లో జాక్ నిర్వీర్యం అయిపోయింది. 'తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సంఘటితంగా నిలబడి పునర్నిర్మాణానికి కృషి చేస్తాం, ప్రభుత్వం పొరబాట్లు చేస్తే నిలదీస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేట్లా చూస్తాం' వంటి ప్రకటనలు సాకారమయ్యే అవకాశం కనబడటం లేదు. ప్రజల పక్షాన మళ్లీ జాక్ ఏర్పడాలంటే కొందరు తెరాస అభిమానులు సాగనీయరు.
నిలబడిన జాక్ నాయకుల్లో కొందరు గెలిచారు, చాలామంది ఓడారు. విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ తెరాస తరఫున కాంగ్రెస్ నేత వివేక్‌ను ఓడించారు. కానీ ఇంకో ఓటు జాక్ నేత పిడమర్తి రవి ఓడిపోయారు. ఓయు జాక్ నేత గాదారి కిశోర్ తెరాస తరఫున నిలబడి కాంగ్రెస్ టిక్కెట్‌పై నిలబడిన మరో జాక్ నేత అద్దంకి దయాకర్‌పై గెలిచారు. జాక్‌లో డాక్టర్ల సంఘ నేత నర్సయ్య గౌడ్ తెరాస తరఫున భువనగిరి ఎంపీగా గెలిచారు. రసమయి బాలకిషన్ తెరాస తరఫున ఆరెపల్లి మోహన్‌పై గెలిచారు. అమరవీరుల గురించి అందరూ గొప్పగా మాట్లాడారు కానీ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిని ఓటర్లు ఓడించారు. కాంగ్రెస్ తరఫున నిలబడిన ప్రజా సంఘాల నేత గజ్జెల కాంతం కూడా ఓడిపోయారు. టిడిపి తరఫున నిలబడిన ఓయు జాక్ నేత మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్‌లు ఓడిపోయారు. టి జాక్ నేత కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ తరఫున నిలబడి ఓడిపోయారు. దీని అర్థం ఏమిటంటే – ఓటర్లు పార్టీని చూసి వేశారు తప్ప, జాక్‌లో వీరి కృషిని చూసి వేయలేదు. జాక్‌పై మీడియాకున్నంత వలపు ప్రజలకు లేదు.
బిసి నామజపం ఓట్లు రాల్చదని తేలిపోయింది.
బిసికి పిసిసి అధ్యక్షపదవి కట్టబెట్టినా కాంగ్రెసు ఘోరంగా ఓడిపోయింది. నెగ్గిన 21 మందిలో 12 మంది రెడ్లే. వారైనా వ్యక్తిగతబలంతో నెగ్గారు కానీ బిసిలే ఓట్లు వేశారని చెప్పడానికి లేదు. బిసి సిఎం నినాదం యిచ్చిన టిడిపికీ అదే జరిగింది. ఆంధ్రమూలాలున్న వారు టిడిపిని బలపరచడం వలననే ఎల్‌బి నగర్‌లో కృష్ణయ్య నెగ్గారు, కులం కార్డుతో కాదు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు పక్కకు పెడితే టిడిపి 5 స్థానాలు నెగ్గింది. వారిలో అగ్రకులస్తులే ఎక్కువ. (ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి). వ్యక్తిగతంగా పేరు తెచ్చుకున్న అభ్యర్థులు కాబట్టి గెలిచారు తప్ప కులం కారణంగా కాదు. ఖమ్మంలో టిక్కెట్ల పంపిణీలో కలహించుకున్న నామా, తుమ్మల ఓడిపోవడమే కాక, వారు టిక్కెట్టు యిప్పించినవారు కూడా ఓడిపోయారు. రేవూరి ప్రకాశరెడ్డి, దయాకరరెడ్డి దంపతులు, రావుల చంథ్రేఖరరెడ్డి, ఉమా మాధవరెడ్డి, టిటిడిపి అధ్యకక్షుడు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు వంటి టిడిపి ప్రముఖులెందరో ఓడిపోయారు.
తెరాస గాలి బలంగా వీచిన జిల్లాల్లో కూడా ఆ పార్టీ ప్రముఖులు కొందరు ఓడిపోయారు. హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి, మందా జగన్నాథం..యిలా. బిజెపి తరఫున అయితే మరీ ఘోరం. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో పోటీ చేయని బిజెపి ప్రముఖులందరూ – విద్యాసాగర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, నాగం.. అందరూ ఓడిపోయారు. ఏమిటి దీనర్థం? బిజెపి చేసిన ఉద్యమాన్ని ప్రజలు గుర్తించలేదా? నా ఉద్దేశం – ఇన్ని తక్కువ సీట్లలో పోటీ చేసిన బిజెపి అధికారంలోకి రాదని గ్రహించిన ఓటర్లు ప్రభుత్వం ఏర్పరచే పార్టీకే ఓటు వేద్దామని అనుకుంటారు. అధికారంలోకి కాంగ్రెసు వస్తుందా, తెరాస వస్తుందా అని వేచి చూశారు. పోలింగు రోజు దగ్గర పడుతున్నకొద్దీ కాంగ్రెసు నీరసించడం, నాయకులెవరూ తమ నియోజకవర్గాలు దాటి రాకపోవడం గమనించారు. తెరాసకే ఎక్కువ సీట్లు వస్తాయి. అదేదో ప్రభుత్వం ఏర్పరచేటన్ని సీట్లు యిస్తే ఋణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తుంది, చంద్రబాబుతో కొట్లాడి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది అని నమ్మారు. ఆ క్రమంలో బిజెపిని, కాంగ్రెసును పక్కన పడేశారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)