స్వచ్ఛభారత్‌లో భాగంగా గత నవంబరులో మోదీ తన నియోజకవర్గమైన కాశీలో అస్సీ ఘాట్ వద్ద ఓ పార చేతపట్టి కాస్సేపు మట్టి ఎత్తారు. కాశీని 'క్యోటో'లా సుందరనగరంగా తీర్చిదిద్దడానికి జపాన్‌తో కలిసి ఎంఓయు పై సంతకాలు పెట్టారు. పరమ రొచ్చులా వుండే కాశీని బాగు చేయడం ఎవడి తరమైనా అవుతుందా అని అందరూ ఆశ్చర్యపడితే స్థానిక బిజెపి నాయకులు 'నిక్షేపంలా అవుతుంది. దానికి మా వద్ద ప్రణాళికలు వున్నాయి. ఊరి చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్పులు కట్టి వూళ్లో రద్దీ తగ్గిస్తాం, గంగానదిలోని పూడిక తీయించేసి పెద్ద పెద్ద పడవలు తిరిగేట్లా చేస్తాం, వాటి ద్వారా ఇంధనం తెప్పించి విద్యుత్ ఉత్పాదన చేయిస్తాం, రోడ్లు వెడల్పు చేయిస్తాం, ఔటర్ రింగు రోడ్డు కడతాం, మెట్రో వస్తుంది, మోనోరైల్ వస్తుంది, విపరీతమైన పారిశ్రామికీకరణ జరిగి నోయిడాలా తయారవుతుంది' – అంటున్నారు. ఇవి అమలవుతాయో లేదో తెలియదు కానీ, అవొస్తాయి, యివొస్తాయి అనగానే భూమిధరలు 60% పెరిగి కూర్చున్నాయి. అనేకమంది రైతులకు తమ భూమి లాక్కుంటారేమోనని బెంగ పట్టుకుంది. ఎందుకంటే అలహాబాద్ నుండి వారణాశి దాకా వున్న నదీతీరంలో లక్షలాది రైతులు కొన్నేళ్లగా పంటలు వేసుకుని పండించుకుంటూ వుంటారు. ఆ భూములు ఎవరి పేరా రిజిస్టరై వుండవు. ఇప్పుడు డెవలప్‌మెంట్ పేరుతో వాటిని ప్రభుత్వం తీసుకోవచ్చు, మొరాయిస్తే కొత్తగా వస్తున్న భూసేకరణ చట్టం ప్రయోగించవచ్చు. ఇక నదిలో పెద్ద బోట్లు తిరుగుతాయనగానే యిప్పటిదాకా నావలు, పడవలు తిప్పే 40 వేల మంది పడవవాళ్లు బెంగ పెట్టుకున్నారు. బోట్లు వస్తే మా గతేమిటి అని. రోడ్లు వెడల్పు చేయడం పేరుతో పాత భవంతులు కూలగొడితే కాశీలో మిగిలే యిళ్లెన్ని, మేం ఎక్కడుండాలి అని అడుగుతున్నారు పాతకాశీ వాసులు.
''దీన్ని ఆధునిక నగరంగా చేస్తాం, మెట్రో తెస్తాం, హైవేలు వేస్తాం లాటి కబుర్లన్నీ అనవసరం. కనీస పారిశుధ్యపరమైన పనులు చేయండి. ఉదాహరణకి రోజూ నగరంలో 400 ఎంఎల్‌డిల సీవేజ్ (రకరకాల వ్యర్థాలు) తయారవుతోంది. కేవలం 100 ఎంఎల్‌డి సీవేజి శుభ్రం చేసే ట్రీట్‌మెంట్ ప్లాంట్ మాత్రమే వుంది. దానిలో కూడా విషపదార్థాలను తీసేయలేకపోతున్నారు. అన్నీ గంగలోకి చేరుతున్నాయి. దాని కారణంగా వరుణా, గంగా నదుల సంగమం వద్ద కాలుష్యస్థాయి 1-1.5 మిలియన్ల మిల్లిగ్రాములు వుంటోంది. అనేక స్నానఘట్టాల్లో అది 50 వేల మిల్లిగ్రాములుంటోంది. మామూలు నీటిలో 500 మిల్లిగ్రాములు వుండాలి. ఈ నీటిని వ్యవసాయానికి, చేపల పెంపకానికి వుపయోగించాలన్నా 400 ఎంఎల్‌డి సామర్థ్యం వున్న ప్లాంట్లు పెట్టించి, వాటిలో ట్రీట్ అయిన సీవేజిని విషపదార్థాలను తీసివేయడానికి మళ్లీ యింకోసారి ట్రీట్ చేసి గంగలోకి వదలాలి.'' అంటున్నారు వారణాశిలోని సామాజిక కార్యకర్తలు.
కావలసిన చెత్తకుండీలు పెట్టకుండానే 'ఊరిని శుభ్రంగా వుంచండి, చెత్తను చెత్తకుండీల్లోనే వేయండి' అని గోడలపై నినాదాలు రాయించారు. చెత్తకుండీ పెట్టని దుకాణదారులపై జరిమానా వేస్తామన్నారు. కానీ యీ చెత్తకుండీలన్నీ ఎక్కడ ఖాళీ చేయాలో మాత్రం కాశీ అధికారులకు తెలియదు. అది అన్నిటికన్న పెద్ద సమస్య. ఆ వూరు 5 లక్షల జనాభా కోసం కట్టినది. ఇప్పటి జనాభా 15 లక్షలు. వచ్చే పోయే యాత్రికుల సంఖ్య కూడా కలిపితే యింకా పెరిగిపోతుంది. వీరందరూ కలిసి తయారుచేసే చెత్త తొలగించే సాధనం లేదు. అందువలన కాశీలో ఎక్కడ చూసినా – మోదీగారి స్థానిక కార్యాలయం తో సహా – పక్కన చెత్త కనబడుతుంది. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ఆధ్వర్యంలో ఒక కంపెనీ (దాని పేరు ఎ టు జెడ్) కితం సంవత్సరం వరకు యింటింటికీ తిరిగి చెత్త సేకరించేది. అయితే వాళ్లు సరిగ్గా పనిచేయడం లేదని ప్రభుత్వం వారు, ప్రభుత్వం తమకు యివ్వాల్సినది యివ్వటం లేదని వాళ్లూ పేచీ పడి ఏడాదిగా సేకరణ ఆపేశారు. నగర్ నిగమ్ (మునిసిపల్ కార్పోరేషన్) జనవరిలోనే ఆ బాధ్యత తీసుకుంది కానీ ఆ చెత్తను ఏం చేయాలో తెలియక తికమక పడుతోంది. కార్సాడా వద్ద కేంద్రనిధులతో తయారు కావలసిన ట్రీట్‌మెంట్ ప్లాంట్ యింకా సిద్ధం కాలేదు. అందువలన కాశీలో రోజూ తయారవుతున్న 650 మెట్రిక్ టన్నుల చెత్తను శివార్లలో వున్న గ్రామాల్లో కుప్పపోయడం జరుగుతోంది. దీనికి తోడు యిందాకా చెప్పిన 300 ఎంఎల్‌డి సీవేజ్.. యీ మొత్తం కలిసి వూళ్లోనే అటూ యిటూ వీధుల్లోనూ, సందుల్లోనూ దొర్లి చివరకు గంగలో తేలుతోంది. ప్రభుత్వ కాలనీల్లో కట్టిన టాయిలెట్స్ గత ఆరేడేళ్లగా పని చేయడం లేదు. నగరంలో పారిశుధ్య పనివారి కొరత వుంది. ప్రస్తుతం వున్నది 2700 మందే. వారణాశి ప్రజలకు శుభ్రత నేర్పడం చాలా కష్టం. వాళ్లు ఎక్కడ పడితే అక్కడ వుమ్ముతారు.
ఇలాటి పరిస్థితిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, ప్రజలు, యాత్రికులు అందరూ కలిసి వస్తే తప్ప కాశీ బాగుపడదు. కానీ వ్యవస్థలో లోపాలకు ఒకరి నొకరు నిందించుకుంటూంటారు, ఏ కొద్దయినా మంచి జరిగితే అది తమ ఘనతే అని చాటుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు. కాశీ మునిసిపాలిటీ బిజెపి చేతిలో వుంది. పారిశుధ్యం గురించి అడిగితే ''రాష్ట్రప్రభుత్వం అలసత్వం వల్లనే యిలా వుంది. 2017 కల్లా మేం అక్కడా అధికారంలోకి వచ్చి పరిస్థితులు చక్కదిద్దుతాం. ఓపిక పట్టండి.'' అంటున్నారు. ''ఊళ్లో నేత పనివారికి వుపయోగంగా వుంటుందని మోదీగారు ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ శాంక్షన్ చేయిస్తే అది వూరికి దూరంగా ఎక్కడో యిచ్చారు. అది వీవర్స్‌కు చాలా దూరంగా వుంది.'' అని ఆరోపించారు. ''కాశీ నగరసరిహద్దుల్లో వారు అడిగిన భూమి ఒక ప్రయివేటు ట్రస్టుకి చెందినది. అదెలా యివ్వగలం?'' అన్నాడు జిల్లా మేజిస్ట్రేటు. మోదీ అస్సీ ఘాట్‌లో శ్రమదానం చేయడానికి వచ్చినపుడు దీపక్ మధోక్ అనే వ్యాపారస్తుడు ముందుకు వచ్చాడు. అతనికి చాలా స్కూళ్లు, కాలేజీలు వున్నాయి. మోదీ అతని భుజం తట్టి అస్సీ ఘాట్ ప్రక్షాళనను ఒక నెలలో స్థానిక సంస్థలే పూర్తి చేస్తాయని ప్రకటించారు. మధోక్ వుత్సాహంగా తన స్కూళ్లలోని పిల్లలను దీనిలో భాగస్వాములను చేశాడు. వాళ్లు మట్టి తవ్వి పోయగా, అతను డజన్ల కొద్దీ ట్రక్కులు తెప్పించి ఆ మట్టిని తరలించాడు. ఉద్యమం ఎంత బాగా జరిగిందంటే అమితాబ్ బచ్చన్ మధోక్‌ను టీవీ ఛానెల్‌పై లైవ్‌గా యింటర్వ్యూ చేశాడు. ఇది చూసి స్థానిక బిజెపి నాయకులకు కన్ను కుట్టింది. డిసెంబరు 25 న మోదీ మళ్లీ వారణాశి వచ్చే లోపుగా ఆ పని తమకు సంబంధించిన యింకో సంస్థకు అప్పగించి మొత్తమంతా వాళ్లే చేశారని ఆ నాటి సభలో మోదీకి చెప్పారు. మధోక్, అతని భార్య సభకు వెళితే వెనక్కు పంపేశారు. దాంతో ఒళ్లు మండిన మధోక్ మీడియా ముందుకు వచ్చి బిజెపి వారు తననూ, విద్యార్థులను ఎలా మోసగించారో, తమకు రావలసిన ఘనతను వేరేవారికి ఎలా కట్టబెట్టారో వరసపెట్టి యింటర్వ్యూలు యిచ్చాడు! ఇలాటి రాజకీయాల వలన నెలలోపు పూర్తి కావలసిన అస్సీ ఘాట్ ప్రక్షాళన యింకా సాగుతూనే వుంది!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)