మోతీలాల్ తండ్రి వ్యాసంపై విమర్శలకు నా జవాబులు – కాంగ్రెసుపై యీగ వాలనీయనంటూ నన్ను యీగలు తోలేవాడిగా అనుకునేవాళ్లు ఎమర్జన్సీ సీరీస్‌లో నేను కాంగ్రెసు చరిత్రను గ్రంథస్తం చేస్తున్న తీరు గమనించాలి. యుపిఏ ప్రభుత్వం నడిచినప్పుడు నేను రాసిన వ్యాసాలు గుర్తు చేసుకోవాలి. 'నేషనల్ హెరాల్డ్' కేసు గురించి నేను రాయలేదనేవాళ్లు ఆర్కయివ్స్ చూసి మాట్లాడాలి. సోనియా జైలుకి వెళ్లాల్సినంత కేసు అది. కేసు బాగా బిల్డప్ చేసి, సరిగ్గా హేండిల్ చేయకపోతే చరణ్ సింగ్ ఇందిరా గాంధీ విషయంలో తొందరపడి ఆమెకు సానుభూతి తెచ్చిపెట్టిన చరిత్ర పునరావృతమౌతుంది. నన్ను యీ ప్రశ్న వేసినాయన కేవలం సందేహనివృత్తి గురించే అయితే ఒక్క వాక్యంతో సరిపెట్టేవారు. సోనియా రాజకీయాల గురించి ఆయన విమర్శలు గుప్పించి చివర్లో రాసిన వాక్యం చూడండి – 'ఆ కుటుంబమూలాల గురించి నిగ్గదీస్తే తప్పేముంది?' రాజకీయనాయకులను విమర్శించాలంటే వారి రాజకీయాల గురించి మాట్లాడాలి. సోనియాను, కాంగ్రెసును ఎదుర్కోవడానికి, పోరాడడానికి కావలసినంత బాణసంచా వుంది. పదేళ్ల దుష్పరిపాలన ఒక్కటే చాలు. అది వదిలేసి సోనియా తాత గురించి మాట్లాడినా అప్రస్తుతం. అలాటిది ఆమె భర్త తాతగారి తాతగారి గతం గురించి తవ్వడం అసందర్భం. ఆయన 'ఇందిరా గాంధీ కోడల్నంటూ సోనియా..' అంటూ ఏమేమో రాశారు. ప్రధాని కావాలనే కాంక్షతో తగినంత ఎంపీలు లేకపోయినా రాష్ట్రపతికి తప్పుడు జాబితా యిచ్చి భంగపడినప్పుడు కూడా సోనియా ఇందిర కోడలే. తర్వాత డీ-ఫ్యాక్టో ప్రధాని అయిందంటే అది ప్రతిపక్షాల చలవే. సోనియా కుటుంబం తప్ప వేరెవర్నీ ఎన్నుకోలేకపోవడం కాంగ్రెసు దౌర్భాగ్యం. వాళ్లు సెల్ఫ్ గోల్ చేసుకుంటే మన కెందుకు గోల? ఆ కాంగ్రెసు మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చేట్లు చేస్తున్న ప్రతిపక్షాలది దౌర్బల్యం. వాళ్ల సంగతి కాస్త చూడండి. ప్రాంతీయ పార్టీలలో కూడా అధికారం ఒక కుటుంబం చుట్టూనే తిరుగుతూండడం చూస్తున్నాం. బిజెపి విషయంలో వృద్ధులే ముఖ్య పదవుల్లో వుంటూ వచ్చారు. ఆ యా పార్టీ సభ్యులు మిగతావారిని ఎందుకు ఎన్నుకోరు? అని మనం వర్రీ అయ్యి ప్రయోజనం లేదు.
గాంధీ పేరు చెప్పుకుని నెహ్రూ కాని, ఇందిర కాని అధికారంలోకి వచ్చాడనడం హాస్యాస్పదం. గాంధీ, నెహ్రూకు గల సిద్ధాంతవైరుధ్యం జగద్విదితం. నెహ్రూ పేరుకుండే గ్లామర్ దాని కుంది. ఇందిర పెళ్లయిన తర్వాత కూడా పుట్టించి పేరు నెహ్రూ వదులుకోలేదు. చాలాకాలం పాటు 'ఇందిరా నెహ్రూ గాంధీ' అనే రాసుకునేది. గాంధీ యింటి పేరున్నందుకే ఓట్లేస్తున్నారనుకోవడం అవివేకం. మహాత్మా గాంధీ వారసులు ఎన్నికలలో నిలబడితే గెలుస్తారా? గాంధీ యింటి పేరుకి అంత విలువుంటే వరుణ్ గాంధీ ఒక ఎంపీగానే మిగిలిపోయాడేం? గుజరాతీల్లో, పంజాబీల్లో కూడా గాంధీలున్నారు. వాళ్లందరికీ జనాలు మొక్కుతారా? గాంధీ ఒక్కడే స్వాతంత్య్రం తెచ్చాడని అనుకునేటంత మూర్ఖులుంటే దేవుడే వారిని రక్షించాలి. ప్రతి రాష్ట్రంలోను స్థానిక స్వతంత్రయోధుల విగ్రహాలున్నాయి, వాళ్ల పేర కాలనీలున్నాయి, రోడ్లున్నాయి. గాంధీ నాయకులకు నాయకుడు. అందుకే ఆయన పేర ఎక్కువున్నాయి. గాంధీ యింటి పేరున్నంత మాత్రాన ఇందిరకు ప్రధాని పదవి అప్పగించలేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆమెకు అది దక్కిందో, అది ఊడిపోయే పరిస్థితి ఎలా వచ్చిందో, ఎన్ని టక్కుటమార విద్యలు ప్రదర్శించి దాన్ని నిలుపుకుందో ఎమర్జన్సీ సీరీస్‌లో రాశాను. ఓపికుంటే చదవండి.
ఎన్నికల అఫిడవిట్‌లో మతం గురించి కూడా రాయాలి అని ఒకరు గుర్తు చేశారు. నిజమే, దానిలో మీ మతం రాస్తారా? లేక మీ తాతముత్తాతలు మతం మారితే దాని గురించి రాస్తారా? నెహ్రూ అనే యింటి పేరు కిట్టించినది అని ఒకరు రాశారు. ఇంటి పక్కన కాలువ 'నహర్' వుంది కాబట్టి యింటి పేరు యిలా మారిందని కూడా ముందు నుంచీ చెప్తూనే వున్నారు. ఇటువంటివి జరుగుతూనే వుంటాయి. జోస్యం బాగా చెప్పేవారి కుటుంబానికి మొదటినుంచి వున్న యింటిపేరు మారి జోస్యం యింటిపేరుగా మారిన సంగతి విన్నాను. వైయస్ యింటిపేరులో ఎస్ అంటే 'సందింటి'. సందులో వున్న యింటికి చెందిన కుటుంబం అనే అర్థంలో యింటిపేరు మధ్యలో మారి వుండవచ్చు. అందరికీ గోత్రాలు వుంటాయని లిస్టు యిచ్చినాయన చివర్లో నెహ్రూలకు గోత్రం వుందో లేదో, వుంటే ఏమిటో రాయలేదు. వాళ్ల మూలాల గురించి వీళ్లకున్న శంకలు యితర కశ్మీరీ పండిత కుటుంబాలకున్నట్లు కనబడటం లేదు. ఎందుకంటే 'కౌల్'లు వీళ్లకు పిల్లనిచ్చారు. (ఇప్పుడు కౌల్‌ల గురించి కథనాలు వస్తాయేమో!)
రాజకీయాలు చర్చించేటప్పుడు పాలనతో సంబంధం లేని వ్యక్తిగత విషయాల ప్రస్తావన అనవసరం అన్న నా వాదనను కౌంటర్ చేయడానికి ఒకాయన నేను ఎన్టీయార్ హీరోయిన్లను ఏదో (ఆ మాటలు ఆయనవి, నావి కావు) చేశాడని రాశానన్నారు. నేను రాసినది తెరపై కనబడిన వ్యవహారం గురించి, పడగ్గదుల్లో నడిచినవాటి గురించి కాదు. స్వాష్ బక్లింగ్ హీరో తెరపై చేసే మోటు సరసం గురించి, మెలోడ్రమటిక్ హీరో తెరపై లలితశృంగారం గురించి తేడాలు వివరించినప్పుడు రాసిన వాక్యాలను యిక్కడ ప్రస్తావించడం అసందర్భం. రాజకీయవేత్తగా ఎన్టీయార్‌ను చర్చించినపుడు ఆయన తెరవెనుక వ్యవహారాల గురించి రాయడం అనవసరం. ఆయన మొదటి భార్య ప్రస్తావనా అక్కలేదు. రెండో భార్య గురించి మాత్రం తప్పక వస్తుంది, ఎందుకంటే ఆమె పాలనలో జోక్యం చేసుకుంది. ఆమె కారణంగా ఎన్టీయార్ రాజకీయ సంక్షోభం ఎదుర్కున్నారు. ఎన్‌ఐసి వెబ్‌సైట్ నుంచి అప్‌లోడ్ అయిందనే వార్త 'టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాగానే కాంగ్రెసు యిదంతా మోదీ సర్కారు కావాలనే చేసిందని గొడవ చేసింది.' అని రాశాను తప్ప అది నా అభిప్రాయంగా రాయలేదు. అది గమనించకుండా కొందరు కామెంట్సు రాశారు. ఇంగ్లీషు పాలన వలన కలిగిన లాభాలలో ఇంగ్లీషు భాష ఒక అంశం మాత్రమే. దేశాన్ని ఐక్యం చేయడం వంటి అనేక అంశాలు రాశాను. వాటిని విస్మరించవద్దు. మెకాలే విద్యావిధానం వలన భారత్‌కు మేలు జరిగిందని రాశాను తప్ప మెకాలే అభిప్రాయాలను మెచ్చుకోలేదు.
ఈ వ్యాసం రెండు భాగాలకు లింకు లేదని కొందరనుకున్నారు. రెండు భాగాల్లో నేను ఎత్తి చూపినది – డిస్-ఇన్‌ఫర్మేషన్ ఒక పథకం ప్రకారం నడుస్తోంది గమనించండి అని. నా ప్రశ్నకు ఆన్సర్ రాలేదని వాపోయారు సదరు పాఠకుడు. ఇదేమీ బిట్ క్వశ్చన్ కాదు ఠక్కున చెప్పడానికి. టీచరు లెక్క ఎలా చేయాలో ఒక ఉదాహరణ చెప్తాడు తప్ప అన్ని లెక్కలూ చేసి చూపించడు. సులభమైన లెక్క ఆయన చేసేసి, కష్టమైనవి మనకు పడేస్తాడు. మెకాలే విషయంలో కొందరు వాస్తవాలు తవ్వితీసి, అదెంత బోగస్సో నిరూపించారు. దాని ఆన్సర్ యిప్పటికే తెలుసు కాబట్టి నేను టీచర్లా అది చెప్పి వూరుకున్నాను. మోతీలాల్ తండ్రి అసలు మతమేమిటో నేను చెప్పేస్తానని కొందరు ఎదురు చూసినట్లున్నారు. మా ముత్తాతల పేర్ల వరకే నాకు తెలుసు. ఆ పై వాళ్లెవరు, ఎక్కణ్నుంచి వచ్చారు అన్నది నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు. మోతీలాల్ తండ్రి గురించి తెలుసుకునే ఉబలాటం వున్నవాళ్లే రెండో లెక్క సాల్వ్ చేయాలి. అవతలివాళ్లు ఆరోపణకు ఆధారం చూపకుండానే ప్రచారం మొదలుపెట్టారు, అది యిప్పుడు ప్రశ్నల రూపం ధరించింది. నన్ను అడిగిన పాఠకుడు ప్రదర్శిస్తున్న పరిజ్ఞానం గమనిస్తే ఆయన ఏమీ తెలియనివాడు అడుగుతున్నట్లు లేదు. ఒక నిర్ధారణకు వచ్చేసి ఆ భావాన్ని వ్యాప్తి చేయడానికే యీ వేదిక ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. మెకాలేకు భారతదేశం పట్ల, దాని భాషల పట్ల ఎంత చిన్నచూపుందో నా కంటె విస్తారంగా రాశారు కదా. చివర్లో 'అందువలన మెకాలే పేరు మీద ప్రచారంలో వున్న పై ప్రకటన అబద్ధం – ఆడ్వాణీ ఉటంకించినా, ఆరెస్సెస్ వాళ్లు ఎంత ప్రచారం చేసినా ..!' అని చేర్చి వుంటే అప్పుడు ఆయన చిత్తశుద్ధిపై నాకు అనుమానం కలిగేది కాదు.
ఇక ఆయన ప్రశ్నించే విధానం గురించి ఒక మాట – లాజిక్‌లో 'డైలమా'కు ఉదాహరణ చెప్తారు – ''నువ్వు నీ భార్యను కొట్టడం మానేశావు కదా, అవునో కాదో ఒక్క మాటలో చెప్పు'' అని అడగడాన్ని డైలమా అంటారు. భార్యను ఎప్పుడూ కొట్టనివాడు అవుననీ చెప్పలేడు, కాదనీ చెప్పలేడు. అవునంటే గతంలో కొట్టాడన్న అర్థం వస్తుంది, కాదంటే యింకా కొడుతున్నాడన్న అర్థం వస్తుంది. ఇప్పుడీయన వేసిన ప్రశ్న యిలాటిదే. ముస్లిం కాదు అన్నాననుకోండి, ఏ ఆధారంతో అలా చెప్తున్నారని ఆయన నన్నడుగుతాడు. ఆరోపణ ఏ ఆధారంతో చేశారు స్వామీ అంటే ఎక్కడో విన్నాను అని తప్పించుకుంటాడు. ఇలాటి వాళ్లకు సమాధానం చెప్పడం మొదలుపెడితే రేపు ఎవడో వచ్చి 'మీ ముత్తవ్వ శీలం మంచిది కాదుట కదా' అని అడగవచ్చు. 'ఆవిడ పేరే నాకు తెలియదు. ఆవిడ గురించి నీకెలా తెలుసు? నువ్వన్నదానికి ఆధారాలున్నాయా?' అని అడిగితే 'ఎవరో అనగా విన్నాను, నిజమో కాదో తెలుసుకుందామని అడుగుతున్నాను' అని అవతలివాడు నా మెదడులో ఒక అనుమాన బీజం నాటడానికి చూస్తాడు. అప్పుడేం చేయాలి? నా పరిస్థితి మీకెదురైతే మీరేం చేస్తారు? పట్టించుకుంటారా? వదిలేస్తారా? అలాటి పరిస్థితి వస్తే ఎలా ఆలోచించాలో, ప్రశ్న లేవనెత్తిన వాడి ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని ఎలా ప్రశ్నించాలో, ఇదిగో సమాచారం అంటూ ఏదైనా యిస్తే దాన్ని విశ్లేషించడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూచించడమే యీ వ్యాసం ఉద్దేశం. చివర్లో ఎవరేం చెప్పినా దేేన్నీ గుడ్డిగా నమ్మకండి అని చెపితే 'గుడ్డిగా' అనే మాట వదిలేశారు కొందరు. అసలు నన్ను కోట్ చేయడమెందుకు, పెద్దలు చెప్పిన 'వినదగు నెవ్వరు చెప్పిన..' పద్యం గుర్తుపెట్టుకుని అమలు చేస్తే చాలు.
పుకారులో నిజానిజాల గురించి నేనే ఎందుకు చెప్పాలి? మీరూ ఆలోచించవచ్చు. ఆలోచించడం మొదలుపెడితే ప్రశ్నలు వాటంతట అవే వస్తాయి. మోతీలాల్ తండ్రి ఢిల్లీ సుల్తాన్ వద్ద ఢిల్లీ కొత్వాల్‌గా పనిచేశాడని చెప్తున్నారు కదా. అంతటివాడు మతం మారితే ఎక్కడో అక్కడ రికార్డ్ కాకుండా వుంటుందా? పాత పేరు మీద సంపాదించిన ఆస్తులు స్వాధీనం చేసుకోవాలన్నా గెజిట్‌లో పేరు మార్పు నమోదు చేయించుకోవాలి కదా. 1857 తర్వాత మారాడంటే రికార్డులు మరీ దొరక్కుండా వుండవు కదా. ఏ ఆర్యసమాజంలోనో మతం మారి వుంటే అక్కడ నమోదై వుంటుంది. పుకారు ప్రస్తావించిన వాళ్లను ఆ రికార్డు చూపించాలని మీరు అడగాలి. ఇలా అడక్కపోతే రేపు పాకిస్తాన్‌లో పుట్టిన కారణానికి ఆడ్వాణీ తాత గురించి మరొకడు కథ పుట్టించవచ్చు. అందుకే జిన్నాను ఒక విషయంలో సమర్థించాడని భాష్యం చెప్పవచ్చు. ఎల్లుండి మోదీ ముత్తాత గురించి యింకోడు పుట్టిస్తాడు. పుకారు వినగానే ప్రశ్నించడం నేర్చుకోవాలి. సరైన సమాధానం వచ్చేవరకు నమ్మకూడదు, దాన్ని యింకోళ్లకు చెప్పనూ కూడదు. ఆన్సర్ తెలుసుకునే ఉత్సాహం వుంటే దాని కోసం శ్రమించాలి. ఎవరో వచ్చి అరటిపండు వలిచి నోట్లో పెట్టేస్తాడని ఎదురుచూడకూడదు. నా మట్టుకు నాకు ఆయన మతం మారాడా లేదా అన్న దానిపై ఆసక్తి లేదు. రాజకీయాల్లోకి వచ్చిన నెహ్రూ కుటుంబసభ్యుల చర్యల వలన దేశానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా అన్నదే నాకు ఆసక్తికరమైన అంశం, వాళ్ల మూలాలు కాదు. నదీమూలం, ఋషిమూలం తరచి చూడవద్దంటారు పెద్దలు. వాల్మీకి రామాయణాన్ని నెత్తిన పెట్టుకుంటుకోమన్నారు. వాల్మీకి పూర్వాశ్రమంలో ఎంతమందిని దోచుకున్నాడు, ఏ కులంలో పుట్టాడు అనేది పట్టించుకో మనలేదు. ఇదీ మన సంస్కృతి. దాన్నే కాపాడుకుందాం.
నా నిష్పక్షపాతబుద్ధి గురించి జరుగుతున్న చర్చలో తరచుగా లేవనెత్తే అంశం – అంశాల ఎంపికలో నేను సెలక్టివ్‌గా వుంటానని! ఆ మాట నిజమని వెయ్యిసార్లు చెప్పాను. తెలుగు మీడియా వాయించి వాయించి వదిలిపెట్టిన విషయాలు రాయను. వాళ్లు వదిలేసిన అంశం కానీ, కోణం కానీ దొరికితేనే రాస్తాను. నేపథ్యం సరిగ్గా చెప్పకపోయినా, మరీ కాంప్లికేట్ చేసినా అప్పుడూ రాస్తాను. మోదీ వచ్చాక నా ధోరణిలో మార్పు రాలేదు. మీడియాలోనే మార్పు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో కూడా మీడియా భజనమేళంగా అయిపోయింది. అందువలన నేను వింతగా కనబడుతున్నాను. మోదీ అధికారంలోకి వచ్చేముందు నేను ఎవరి గురించి రాసి వుంటానా, ఏం రాసి వుంటానా అని ఒక్కసారి ఆలోచిస్తే, ఆర్కయివ్స్‌లోకి వెళ్లి తొంగి చూస్తే మీకే తెలుస్తుంది నేను కాంగ్రెసు మీద యీగలు వాలనిచ్చానో లేదో! పాఠకుల్లో ఒకరు నేను జగన్, వైయస్‌పి అభిమానినని, ఆ విషయం నాకు మెయిల్ రాస్తే 'అది నా వ్యక్తిగత అభిప్రాయమని జవాబి'చ్చానని రాశారు. ఇది చాలా మిస్‌లీడింగ్‌గా, స్లాండరస్‌గా వుంది. నేను జగన్ అభిమానిని కాను. సోనియాను ఎదిరించి వరంగల్ వెళ్లినపుడు మెచ్చుకున్నానంతే. ముఖ్యమంత్రి కావడానికి ఆత్రపడ్డప్పుడు, ఫిరాయింపుదారులతో పార్టీ ఏర్పరచి, కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడానికి విఫలయత్నాలు చేసినప్పుడు, తండ్రి నమ్మిన సమైక్యవాదాన్ని విడిచి పెట్టినపుడు, కెసియార్‌తో రాజీ పడ్డప్పుడు, యిలా అనేక సందర్భాల్లో ఘాటుగా విమర్శించాను. అలాటప్పుడు నేను జగన్ అభిమానినని యీ పాఠకుడికి రాస్తానా? నెవర్! ఆయన ఆ మెయిల్ పూర్తి పాఠాన్ని యితర పాఠకులతో పంచుకోవాలని కోరుతున్నాను. అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)