ఎమ్బీయస్‍: అధికారుల సైకాలజీ

ప్రతి ఉద్యోగిని కులం కళ్లతో, ప్రాంతం కళ్లతో చూసి, లేనిపోని సందేహాలతో తస్మదీయుడిగా ముద్ర కొట్టి దూరం చేసుకుంటే వాళ్ల మొరేల్ దెబ్బ తీసినట్లే.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6గురు మరణించి, 40 మంది గాయపడ్డాక చంద్రబాబు అధికారులకు చివాట్లు వేస్తూ జనసమూహాల సైకాలజీ తెలియదా? దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి కదా అని అడిగారు. చాలా మంచి ప్రశ్న. ఉత్సవాలలో, ప్రమాదాలలో, రాజకీయ సమావేశాలలో యీ క్రౌడ్ మేనేజ్‌మెంట్ అనేది అతి ముఖ్యమైనది. దీనిలో పోలీసులకే కాదు, కార్యకర్తలకు, వాలంటీర్లకు కూడా శిక్షణ యివ్వాలి. 2011లో ‘‘ద ఎకనమిస్ట్’’ అనే వారపత్రిక ‘ద విజ్‌డమ్ ఆఫ్ క్రౌడ్స్’ అని ఒక మంచి ఆర్టికల్ వేసింది. వివిధ దేశాల పాదచారుల అలవాట్లపై, వేర్వేరు సందర్భాల్లో గుంపులు ప్రవర్తించే తీరుపై అధ్యయనం చేసిన వివరాలతో కూడిన వ్యాసమది. నాకు నచ్చి దాచుకున్నాను. క్రౌడ్ మేనేజ్‌మెంట్ గొప్ప సైన్స్‌ అనిపించింది.

ఆ ఆర్టికల్‌ని పాఠకులకు పరిచయం చేద్దామని అనుకుని కూడా బోరు కొడుతుందని జంకి ఆగాను. సంధ్య థియేటర్ సంఘటన, తిరుపతి సంఘటన తర్వాత యీ సబ్జక్టుపై అందరి దృష్టి పడింది కాబట్టి యిప్పుడు దానిపై రాస్తున్నాను. ఆ ఎకడమిక్ సబ్జక్టులోకి వెళ్లబోయే ముందు తిరుపతి సంఘటన గురించి నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. చంద్రబాబు ఆ ప్రశ్న వేరే ఎవరినైనా అడిగి ఉంటే ఓకే కానీ, తిరుపతి అధికారులను అడిగే అవసరం పడిందంటే నిజంగా విషాదమే. ఎందుకంటే తిరుపతి అంటేనే తండోపతండాలుగా జనం వచ్చి పడే క్షేత్రమది. నిత్యకళ్యాణం, పచ్చతోరణం అంటే వేంకటేశ్వరుణ్నే చెప్పాలి. ఏడాది పొడుగునా ఏవేవో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. గత కొన్ని దశాబ్దాలలో తెలుగువాళ్ల పూజామందిరాల్లో అయ్యప్ప, సాయిబాబా వచ్చి చేరినా తిరుపతికి రావడం మాత్రం మానలేదు.

నా చిన్నప్పుడు తిరుమలేశుణ్ని చూడడానికి తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, మార్వాడీ వాళ్లు మాత్రమే వచ్చేవారు. పోనుపోను ఉత్తరాది వాళ్లకు, యితరులకు కూడా ఆయనపై భక్తి కలిగింది. తండోపతండాలుగా రాసాగారు. జనరలైజ్ చేసి చెప్పాలంటే ఉత్తరాది వాళ్లకు, క్రమశిక్షణకు చుక్కెదురు. అయినా టిటిడి వారితో సహా అనేక ప్రాంతాల నుంచి విరగబడి వస్తూన్న జనాలను మేనేజ్ చేస్తూనే ఉన్నారు. వెంకన్న భక్తుల్లో బీదాబిక్కీ ఎక్కువ. పిల్లాపాపా, ముసలీముతకాలతో సహా తరలి వచ్చే పద్ధతి ఎక్కువ. అయినా అందరికీ దర్శనమయ్యేట్లా మేనేజ్ చేస్తున్నారంటే టిటిడి సిబ్బందికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆ సంస్థలో అవినీతి ఉంది, అక్రమాలు జరుగుతున్నాయి.. వంటివి పక్కన పెట్టండి. ఆ స్కేల్‌లో వచ్చిపడే జనాలను అదుపులో పెడుతున్నందుకే దణ్ణం పెట్టాలి.

తక్కిన గుళ్లలో లేని పూనకం తిరుమలలోనే చూస్తాం. కరక్టుగా చెప్పాలంటే క్రింది తిరుపతి నుంచే ఆ మూడ్ ప్రారంభమై పోతుంది. దేవుడి దర్శనం దగ్గరకు వచ్చేసరికి అది పీక్స్‌కి వెళ్లిపోయి, భక్తుల తాకిడి, తోపులాట భరించడం కష్టం. దర్శనం ముగించుకుని బయటకు వస్తూనే హమ్మయ్య అని నిట్టూరుస్తాం. కొద్దిసేపటికే మనం యింత అవస్థ పడితే, రోజంతా, ఏడాది పొడుగునా యీ భక్తులతో సిబ్బంది ఎలా వేగుతున్నార్రా బాబూ అనిపిస్తుంది నాకు. నేను చాలా చిన్నప్పణ్నుంచి తిరుపతికి వెళ్తూనే ఉన్నాను. వెళ్లిన ప్రతిసారీ, పోయిన సారి కంటె సౌకర్యాలు పెంచారే అనుకుంటూనే ఉన్నాను. అయినా అవి సరిపోనంతగా జనం వచ్చిపడుతున్నారు.

‘తిరుపతిలో కావాలని అన్యమత ప్రచారం చేసి ఎవరూ వెళ్లకుండా చేస్తున్నారు, గుడికి డిమాండు తగ్గేట్లు చేస్తున్నారు’ వంటి కబుర్లు చెత్త. ఆ దేవుడికి డిమాండు తగ్గించడం ఎవరి తరమూ కాదని నా అభిప్రాయం. దశాబ్దాల తరబడి ఎన్నో ఉత్సవాలు, రద్దీలు సమర్థవంతంగా నిభాయించుకుంటూ వచ్చిన టిటిడి సిబ్బంది ఆధ్వర్యంలోనే మొన్నటి దుర్ఘటన జరగడం నిజంగా ఆశ్చర్యకరం. టిటిడి చరిత్రలోనే యిలాటి మరణాలు మొదటిసారి జరిగాయి. టిటిడి అధికారులు హఠాత్తుగా అసమర్థులై పోవడానికి కారణాలేమిటి అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. జనసమూహాల సైకాలజీ అధికారులకు తెలియకపోవడమే కారణమని బాబు ఫీలయ్యారు కానీ అధికారుల సైకాలజీని బాబు అర్థం చేసుకోవడం మానేయడమే కారణమని నాకనిపిస్తోంది. అందువలన యీ వ్యాసాన్ని దానికి పరిమితం చేసి, ‘‘ ఎకనమిస్ట్’’ సమాచారాన్ని ‘‘జనసమూహాల సైకాలజీ’’ అనే మరో వ్యాసంలో యిస్తాను.

జనవరి 10 ముఖ్యమంత్రి సమక్షంలో కొట్లాడుకోవడంతో టిటిడి చైర్మన్‌కు, ఈఓకు పొసగటం లేదనేది లోకమంతా స్పష్టంగా తెలిసింది. ఈ ఘటన జరగడానికి ముందే అమరావతిలో ముఖ్యమంత్రి యిద్దర్నీ పిలిచి మాట్లాడారు. ఈ సమావేశానికి ముందు చైర్మన్‌తో విడిగా భేటీ అయ్యారు. అయినా వారు పదిమంది ఎదుటా నువ్వెంతంటే నువ్వెంత అని కాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రి మందలించిన మరుసటి రోజు కూడా బోర్డు సమావేశంలో తిట్టుకున్నారు. వాళ్లు చాలాకాలంగా కలిసి సమావేశాల్లో పాల్గొనటం లేదని వార్తల్లోకి వచ్చేసింది. అయినా వాళ్ల గొడవల కారణంగానే ప్రమాదం జరిగిందనడం హాస్యాస్పదంగా ఉంటుంది.

కానీ టాప్ మేనేజ్‌మెంట్‌లో చీలిక ఉంది అని బహిరంగంగా తెలిస్తే సంస్థ మొరేల్ దెబ్బ తింటుంది. చైర్మన్ వర్గం, ఈఓ వర్గం అంటూ రెండుగా విడిపోయి, ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకోవడాలు, తప్పు చేసినా తమ వాళ్లను రక్షించు కోవడాలూ జరుగుతాయి. గతంలో కూడా యిలాటి విభేదాలుండే ఉంటాయి కానీ యింతలా బయట పడలేదు. ఇప్పుడు బయటపడ్డాక, ఆ సెట్‌ లోంచి ఏదో ఒక ముక్క మార్చకతప్పదు. ఎవరిని తప్పించాలి అనేదే ప్రశ్న. క్రింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి, చేతులు దులుపుకుంటే సరిపోదు. ‘దేవరగట్టు బన్నీ ఉత్సవంలో కర్రల సమరం కారణంగా యిరవై మంది తలలు పగిలి, పది మంది పోయారు’ వంటి వార్త కాదిది. తిరుపతి అంటే దేశవ్యాప్తంగా ఫోకస్ ఉండే ప్రదేశం. అందుకే కేంద్ర హోం శాఖ కూడా స్పందించి, తమ సీనియర్ అధికారిని విచారణ నిమిత్తార్థం పంపబోయింది. ఆ విచారణలో ఏమేమి బయట పడతాయని భయపడ్డారో ఏమో బాబు ఆ పర్యటనను ఆపించేశారట. అది రద్దయింది.

బిఆర్ నాయుణ్ని చైర్మన్ చేసిన దగ్గర్నుంచి ఆయనకు వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఎందుకో నాకు తెలియటం లేదు. గతంలో మద్యం వ్యాపారుల దగ్గర్నుంచి, మాజీ నక్సలైట్ల దాకా అనేకమంది చైర్మన్లు అయ్యారు. ఈయనది మీడియా వ్యాపారం. నాకు తెలిసి కేసులేవీ ఉన్నట్లు లేవు. లోకేశ్ కాండిడేటు అంటున్నారు. అయితే ఏమిటి? ఎవరో ఒకరి కాండిడేటు కానిదే ఆ పోస్టు దక్కదు. చైర్మన్‌గా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని, టిటిడిని నాశనం చేసేశాడు అనడానికి యింకా సీట్లో సరిగ్గా కుదురుకోనే లేదు. ఆయన మీడియా బేరన్‌యే కానీ, కమ్యూనికేషన్ సరిగ్గా లేదన్న సంగతి తెలుస్తూనే ఉంది. క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? చెప్పను అనడం, ఆ తర్వాత ఒత్తిడికి లొంగడం.. యిదంతా అనవసరమైన రగడ. సంఘటన తర్వాత స్పందన ఎలా ఉంది అన్నది వేరే విషయం, జరగడానికి బాధ్యులెవరిది అనేది వేరే విషయం అని అల్లు అర్జున్ విషయంలోనే వాదించాను.

చైర్మన్ ఫిగరిటివ్ హెడ్ తప్ప ఎగ్జిక్యూటివ్ హెడ్ ఈఓయే. కార్యకలాపాల్లో మంచిచెడులకు ఆయనే బాధ్యుడు. పివిఆర్‌కె ప్రసాద్ ‘నాహం కర్తా..’ చదవండి. ఒక ఈఓగా ఆయన ఎన్ని గొప్ప పనులు చేయగలిగారో తెలుస్తుంది. (అప్పటి చైర్మన్ ఎవరు అనే విషయంపై మన ఆలోచన పోదు) అలాటి అవకాశం శ్యామలరావు గారికీ ఉంది. ఈ ప్రమాదం జరిగింది కాబట్టి, ఆయనను సస్పెండ్ చేయాలనో, మార్చివేయాలనో నేను అనను. ఏ స్థాయిలో తప్పు జరిగితే ఆ స్థాయి వారిపైనే చర్యలు తీసుకోవాలి. కానీ డిపార్టుమెంటు హెడ్‌గా యీయనకు వైకేరియస్ లయబిలిటీ ఉంటుంది. ‘బ్రహ్మోత్సవాలు దివ్యంగా జరిగాయి. లక్షలాది భక్తులు తరలి వచ్చినా ఎవరికీ యిబ్బంది కలగలేదు. ఈఓగారిని అభినందిస్తున్నాను.’ అని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు వినయంగా తల వంచినట్లే, యిప్పుడు ప్రజల చేత అక్షింతలు వేయించుకోవడానికీ తల వంచాలి.

తర్వాత అంతర్గతంగా డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ వేసి, తప్పెవరిది, యిలాటివి మళ్లీ జరగకుండా ఎలా నివారించాలి వంటి సమీక్షలు నిర్వహించాలి కానీ బహిరంగంగా అయితే ప్రజలకు కనబడే వ్యక్తి ఆయనే. విమర్శకుల దృష్టిలో, ప్రజల దృష్టిలో యీ వైకేరియస్ లయబిలిటీ ముఖ్యమంత్రి దాకా పాకుతుంది. ‘ఫలానావారి హయాంలో యిలా జరిగింది. ఆయనే బాధ్యుడు’ అనేస్తారు. ఎందుకంటే పుష్కరాల వాల్‌పోస్టర్లలో, ఫ్లెక్సీలలో సైతం ముఖ్యమంత్రి ఫోటోలు వేసేస్తున్నారు. ‘పుష్కరస్నానం చేయండి, పాపాలు కడిగేసుకోండి’ అని ఆయన కొటేషన్‌ను ప్రముఖంగా వేస్తున్నారు. ఫంక్షన్ దివ్యంగా జరిగితే నా ఘనత, అపసవ్యంగా జరిగితే అధికారుల చేతకానితనం’ అంటే జనం మెచ్చరు. ఎందుకంటే ఏ అధికారి ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ముఖ్యమంత్రే. ప్రతీ నెలా ఎవరెవరో ఐఏయస్‌లను, ఐపిస్‌లను బదిలీ చేసేది ఆయనే!

టిటిడి విషయానికి వస్తే చైర్మన్‌ను, బోర్డు సభ్యులనూ సెలక్టు చేసినదీ ఆయనే, ఇఓను ఉంచినదీ, జెఇఓను వేసినదీ ఆయనే. ఆ టీము అప్రతిష్ఠ పాలైంది కాబట్టి షఫిల్ చేయాలి. చైర్మన్‌ను మార్చడం రిస్కీ. ఆయన చేతిలో టీవీ5 ఉంది. భంగపాటుతో కోపగించుకుని, కూటమిపై వ్యతిరేకత ప్రచారం మొదలుపెడితే తట్టుకోవడం కష్టం. ఇక ఈఓ. సర్వీసెస్‌లో ఉన్న వ్యక్తి అలా తెగబడి అందరి ముందూ మాట్లాడడం ఎన్నడూ వినలేదు. మరెవరైనా అయితే బాబు సహించేవారు కారు. క్షణాల్లో మార్చేసేవారు. కానీ శ్యామలరావు విషయంలో తెగించలేక పోవడానికి కారణమేమిటి? లడ్డూ వివాదంలో బాబు కోరుకున్నట్లు వెజిటబుల్ ఫ్యాట్‌ను యానిమల్ ఫ్యాట్ చేసినందుకా?

లడ్డూ గొడవ వచ్చినపుడు ముందూవెనుకా చూసుకోకుండా బాబు చిత్తం వచ్చినట్లు మాట్లాడి కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు. ఆధారాల్లేకుండా మాట్లాడేసి, యిప్పుడు ఆధారాలను వెతికే పని కేంద్ర కమిటీకి అప్పగించారు. నాలుగు నెలలైంది. అది ఏమీ తేల్చలేదు. అంటే ఏమిటన్నమాట? ఇదేమీ ఓపెన్ అండ్ షట్ కేసు కాదు. మరి అలాటి కేసులో బాబు అంత తొందరపడి మాట్లాడడం పొరపాటు కదా! తెలుగు మీడియా ఉదారంగా ఉంది కాబట్టి బాబు బతికిపోతున్నారు కానీ లేకపోతే మరొకరినైతే యీ పాటికి శిలువ నెక్కించేవారు. అది బాబుకి తెలుసు. విచక్షణారహితంగా పబ్లిక్‌లో మాట్లాడే దూకుడు స్వభావముందని నిరూపించుకున్న శ్యామలరావుపై యిప్పుడేదైనా చర్య తీసుకుంటే, ఆయన బయటకు వచ్చి ఏదైనా బయటపెడితే ఆ ఎడ్వాంటేజి పోతుందనే భయం ఉందేమో!

బాబు లడ్డూ స్టేటుమెంటుకి, యీ నాటి ఘటనకు ముడి పెట్టి ‘దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష’ అని పాడుతున్నారు కొందరు. దేవుడేమీ ఫ్యాక్షనిస్టు కాదు. కక్షలూ, కార్పణ్యాలూ పెట్టుకోవడానికి! పైగా బాబు స్టేటుమెంటును భక్తులెవరూ పట్టించుకోలేదు. తిరుపతికి రావడమూ మానలేదు, లడ్డూ కొనడమూ మానలేదు. గత ఐదేళ్లలో లడ్డూ తిన్నదానికి నాలికపై వాతలూ పెట్టుకోలేదు. ప్రాయశ్చిత్తం చేసుకున్నదీ, మెట్లు కడిగినదీ పవన్ మాత్రమే. లడ్డూ కల్తీ ఊహ మాత్రమే. ఈ మరణాలు వాస్తవం. ఇప్పటిదాకా ఏ మెట్లూ కడగలేదు. మృతుల కుటుంబాలకు క్షమాపణలతో సరిపెట్టారు. టిటిడి నిర్వహణా సామర్థ్యంపై ప్రజల కున్న నమ్మకాన్ని దెబ్బ తీసినందుకు భక్తులందరికీ క్షమాపణ చెప్పాలి.

దుర్ఘటన కారణాలకు వస్తే, ప్రత్యక్షం, పరోక్షం రెండు రకాలూ ఉన్నాయి. అక్కడున్న క్షేత్రస్థాయి సిబ్బంది తప్పు ప్రత్యక్షంగా కనబడుతోంది. సాధారణంగా టిటిడి సిబ్బంది రష్ బట్టి అప్పటికప్పుడు డెసిషన్సు తీసుకుంటారు. ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూంటే ఇంజనియర్లు గేట్లు తెరిచి ప్రమాదాన్ని నివారించినట్లుగానే, భక్తుల సంఖ్య పెరుగుతూండగా ఏదో గేటు తెరిచి, ఒక చోట గుమిగూడకుండా చేస్తారు. చాలా డైనమిక్ డెసిషన్స్ త్వరగా తీసుకునే టిటిడి సిబ్బంది, అవేళ అలా ఎందుకు ప్రవర్తించారు అన్నదే వింత. అస్వస్థురాలైన ఒకామెను బయటకు తరలించడానికై గేటు తీస్తే, టోకెన్ల కోసం తీశారని పొరబడి భక్తులందరూ గేటుపై పడడమే అనర్థానికి కారణమంటూ తేల్చేయడం, క్షేత్రస్థాయి సిబ్బందిదే తప్పని తీర్మానించడం సరి కాదు. అది లాస్ట్ స్ట్రా ఆన్ ద కామెల్స్ బ్యాక్. దానికి లీడ్ చేసిన విధానపరమైన నిర్ణయాలలో జరిగిన పొరపాట్ల మాటేమిటి?

విధానం అనగానే జగన్ హయాంలో చేసిన మార్పే కారణం అనేశారు అధికారపక్షం వారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రతిదానికి జగన్‌పై తోసేయడం హాస్యాస్పదంగా మారిపోయింది. విద్యుత్ చార్జీలు పెంచం అని హామీ యిచ్చి, అధికారంలోకి వచ్చాక పెంచారేం? అంటే జగనే కారణం, అమ్మకు ఒడి ఎత్తేశారేం? రెండున్నర లక్షల మంది వాలంటీర్లను పీకేశారేం? పరిశ్రమలు రావటం లేదేం?.. యిలా ఏమడిగినా జగనే కారణం అంటూ త్రోబాల్‌లా బంతి అటు తోసేస్తున్నారు. బాబుకి యూజ్ అండ్ త్రో బాబు అనే పేరుండేది. ఇప్పుడు త్రోబాల్ బాబు అనే పేరు వచ్చేట్లుంది. శ్రీరంగం మోడల్లో వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు పెట్టడం జగన్ హయాంలో ప్రారంభమైంది. దానివలన రద్దీ స్ప్రెడ్ ఔట్ అయ్యి, మేనేజ్ చేయడం యీజీ అవుతుంది కాబట్టి అదే కొనసాగిద్దా మనుకున్నారు బోర్డు సభ్యులు.

అక్కడివరకు బాగానే ఉంది. కానీ వీళ్లు వచ్చాక చేసిన మార్పులున్నాయి కదా. స్థానికులకే కాక, బయటి ఊళ్ల వాళ్లకూ యిస్తామనడం, వాళ్లందరినీ తిరుపతికి వచ్చి టోకెన్లు తీసుకోమనడం, అదీ మూడు రోజులకు మాత్రమే అనడం, టోకెన్ లేకపోతే తిరుమల దర్శనానికి కూడా రానీయము అనడం… యీ నిర్ణయాలన్నీ ఎవరివి? పార్కు దగ్గర అజమాయిషీ చేసిన క్రింది స్థాయి అధికారులవి కాదుగా! పర్యవసానాలను పట్టించుకోకుండా యీ మార్పులు చేసిన మధ్య స్థాయి, పై స్థాయి వారందరూ దీనికి బాధ్యత వహించాల్సిందే! ‘‘అర్జున్ బాధ్యత ఏ మేరకు?’’ అనే వ్యాసంలో రాశాను – ‘గతంలో అనేక సార్లు ఆ థియేటరుకి నేను వెళ్లాను, అలాగే యీసారీ వెళ్లాను’ అని అర్జున్ వాదిస్తే కుదరదు. ‘‘పుష్ప’’ తర్వాత తన పాప్యులారిటీ ఎంత పెరిగిపోయిందో ఒక అంచనా వేసుకుని ఉండాల్సింది.’ అని.

అలాగే టిటిడి అధికారులు కూడా రెలిజియస్ ఫెర్వర్ పెరుగుతూ పోతున్న యీ రోజుల్లో వైకుంఠ ఏకాదశికి, యితర ప్రాంతాల వాళ్లకు కూడా అవకాశం యిస్తామని ప్రకటించినప్పుడు వచ్చే రెస్పాన్స్‌ను గెస్ చేయాల్సింది. సంధ్య థియేటరుకు అర్జున్ వస్తున్నాడొహొ అని పిఆర్ టీము వాళ్లు మెసెజిలు పంపినట్లే, బయటవాళ్లకూ టోకెన్లు అని టిటిడి వాళ్లు కూడా విస్తార ప్రచారం కల్పించారు. కానీ ఫలానా టైము నుంచే టోకెన్ల పంపిణీ అనే వివరాలు చెప్పలేదు. దాంతో టిటిడి ఊహించిన సమయం కంటె చాలా ముందుగానే యితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పడ్డారు. గంటలు గడిచే కొద్దీ గుంపు ఊరుతూ పోయింది. వాళ్లేమీ చాటుగా వచ్చి ఏ శివార్లలోనో దాక్కోలేదు కదా. టిటిడి ఆఫీసుల ముందే, కౌంటర్ల దగ్గరే తిష్ట వేశారు.

వాళ్లని చూడగానే అమ్మో, యిప్పటికే వచ్చాశారే, అనుకుని వెంటనే కౌంటర్లు ఓపెన్ చేయడమో ఏదో చేసి టోకెన్లు యిచ్చి పంపేయాల్సింది. ఆ డైనమిక్ డెసిషన్ మేకింగ్, పుష్కలమైన పూర్వానుభవం కల టిటిడి సిబ్బందికి ఆ వేళ ఎందుకు కొరవడింది? అనేదే ప్రధానమైన ప్రశ్న. రైల్వే స్టేషన్‌కు, బస్ స్టాండ్‌కు అతి దగ్గరలో ఉన్న బైరాగిపట్టెడ సెంటర్‌కు ఎక్కువ మంది వస్తారనేది కూడా ఊహించదగిన విషయమే. జనం అక్కడ గుమిగూడుతూ ఉంటే ‘ఇక్కడ సాచ్యురేట్ అయిపోయింది, వేరే సెంటర్లకు వెళ్లాల్సిందే’ అని మళ్లించినా సరిపోయేది. అన్నిటి కంటె ముఖ్యం, మీరంతా పార్కులో కూర్చోండి అని కూర్చోబెట్టి, గేటుకి తాళాలు వేసినవారెవరు? వారి బాధ్యత తీసుకోవడం దేనికి? తీసుకుని అన్నపానాదులు, మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించలేదనే నింద మూటగట్టుకోవడం దేనికి? పార్కులో అంతమందిని సమీకరించి ఉండకపోతే యీ ఘటన జరిగేది కాదు.

ఇక్కడ యింతమంది పోగుపడ్డారు కాబట్టి, టోకెన్లు యివ్వడం మొదలుపెడితే యీ విషయం వాట్సప్ మెసేజిల ద్వారా తక్కిన చోట్ల వెయిట్ చేస్తున్నవారికి కూడా తెలిసి, వారూ వచ్చి పడేవారనే భయం చేత ప్రారంభించ లేదనుకుంటే తక్కిన చోటా ప్రారంభించేస్తే పోయేది. టోకెన్ల పంపిణీ ప్రారంభానికి పర్టిక్యులర్ ముహూర్తం అంటూ ఏమీ లేదు కదా. పుష్కరాలకైతే ఫలానా టైములో పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని, పండగలకైతే ఫలానా టైముకి తిథి ప్రారంభమౌతుందని లెక్క ఉంటుంది. దీనికేముంది? రద్దీని బట్టి కౌంటరు తెరవడమూ, టిక్కెట్లు అయిపోతే కౌంటరు మూసివేయడమూ, అంతే! వీటికి యిన్‌చార్జిగా ఉన్నవారు పట్టించుకోక పోవడం వలన జనసమ్మర్దం పెరిగింది.

‘అక్కడ వేచి ఉన్నవారిలో ఒకరికి అస్వస్థత కలిగిందని పోలీసులు యాంబులెన్సు కోసం కౌంటరు వైపు గేటు తీశారు. దాంతో కౌంటరు ఓపెన్ చేశారనుకుని భక్తులు ఎగబడడం చేత కుమ్ములాట జరిగి ప్రాణాలు పోయాయి. వెనకవైపు గేటు తీయాల్సింది, యాంబులెన్స్ కోసం గేటు తీస్తున్నాం అని పోలీసులు ప్రకటించాల్సింది’ అని వ్యాఖ్యానాలు వచ్చాయి. భక్తసమూహం మెంటాలిటీ తెలిసినవారు అలా అనలేరు. గుంపుని చేరనీయకూడదే కానీ, తర్వాత ఏదీ మన చేతిలో ఉండదు. పోలీసులు యాంబులెన్స్ కోసం అని చెప్తూనే ఉన్నారట. కానీ భక్తులు గోవిందాగోవిందలతో హోరెత్తించడంతో ఎవరికీ ఏమీ వినబడ లేదట. మైకులో చెప్పాల్సింది అని వాదించవచ్చు. ఓ పక్క రోగి సంగతే చూస్తారా, మైకు కోసం వెతుకుతారా? ఈ కారణాలు చెప్పి క్రింది ఉద్యోగులను శిక్షించి, పైవారిని వదిలేస్తే మాత్రం అది అన్యాయం.

అసలైన పదవుల్లో ఉన్నవారు సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదు. అదీ ప్రధాన కారణం! ఎందుకలా జరిగింది అంటే టిటిడి సిబ్బంది మొరేల్ దెబ్బ తినడం! ఏం చెప్తే ఏ ముద్ర పడుతుందో, ఏం చేస్తే ఏం ముంచుకొస్తుందో, ఏ మాట పడాల్సి వస్తుందో అనే జంకుతో ఏమీ చేయకుండా కూర్చోవడమనేది రాష్ట్రప్రభుత్వోద్యోగులందరిలో కనబడుతోంది. దీనికి కారణం వారి పట్ల కొత్త ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి! ఎన్టీయార్ ఉద్యోగుల పట్ల వ్యతిరేక ధోరణి కనబరుస్తూ, వాళ్లని పందికొక్కులని మరోటని అంటూండేవారు. దానికి యాంటీడోట్‌గా బాబు ఎంప్లాయీ ఫ్రెండ్లీగా కనబడేవారు. తనను రాజకీయ నాయకుడిగా చూడవద్దని, ఓ కంపెనీ సిఇఓగా చూడమని అనేవారు. కొంతకాలం పోయేసరికి, చండశాసనుడని పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం పెరిగి ప్రజల ఎదుట ఉద్యోగులను తాట తీస్తానంటూ బెదిరించడం ప్రారంభించారు.

విభజన తర్వాత ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాదు నుంచి తరలి వెళ్లినప్పుడు వాళ్లను మరీ ముద్దు చేశారు. వాళ్లు అవినీతిలో కూరుకుపోయినా చర్యలు తీసుకోకుండా ఉదాసీనత వహించారు. (ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉవాచ). కానీ విపత్తు బాధితుల ఎదుట ఉద్యోగులను తిట్టడం హుదూద్ సమయంలో కూడా చూశాం. అదంతా గతం. ఈ సారి అధికారంలోకి వచ్చాక మాత్రం కొత్త పల్లవి ఎత్తుకున్నారు – ఉద్యోగుల్లో చాలామంది పాత ప్రభుత్వానికే యింకా విధేయులుగా ఉన్నారని, అందుకే అక్రమాలు, ప్రమాదాలు, నేరాలు, ఘోరాలూ జరుగుతున్నాయనీ! ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు అధికారులను హెచ్చరించారంటే సరేలే అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చాక పరాయివారనుకున్న అందరినీ కీలక పదవుల్లోంచి తప్పించారు, కేసులు పెట్టారు. విధేయులనుకున్న వారినే మిగిల్చి వారినీ శంకిస్తే ఎలా?

అసలు ఉద్యోగికి లాయల్టీ ఎందుకుంటుంది? 30, 35 ఏళ్ల సర్వీసులో ఐదారుగురు ముఖ్యమంత్రులను చూస్తాడు. అవసరం తీరాక పట్టించుకోక పోయే మానవలక్షణానికి ఉద్యోగీ అతీతుడు కాడు. ఒకప్పుడు తన పై అధికారిగా చేసినవాడు రిటైరయ్యాక ఆఫీసుకి వస్తే కుర్చీ చూపిస్తాడో లేదో కూడా డౌటు. పాత హయాంలో తన చేతుల మీదుగా తప్పు జరిగి ఉంటే కొత్తవారు రాగానే ఫైలు మాయం చేస్తాడు. కుదరకపోతే అప్రూవర్‌గా మారి, పాత సంగతులు కొత్తవారికి ఊదుతాడు. ఇలాటి వాడు చిత్తుగా ఓడిపోయిన జగన్ మళ్లీ అధికారం లోకి వచ్చి, తమను ఉద్ధరిస్తాడనే ఆశతో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తాడని అనుకోవడం అవివేకం.

టిడిపి ఏం చెప్తోంది? – పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూంటే వాళ్లు ‘మళ్లీ జగన్ వచ్చేస్తాడని మా అంచనా’ అంటున్నారు. ఇటు ఉద్యోగులను చూస్తే జగన్ పట్ల తమ విధేయత మార్చుకోవటం లేదు. (మళ్లీ వస్తాడనే ఆశ లేకపోతే అలా ఎందుకు చేస్తారు?) మేమేం చేయగలం? అంటోంది. మామూలుగా చూస్తే వైసిపి యిప్పట్లో కోలుకుంటుందని అనుకోవడానికి లేకుండా ఉంది. వైసిపి నాయకులు పార్టీ వీడి వెళుతున్నారు. పార్టీ ఉద్యమాలు చేయటం లేదు. మీడియా సపోర్టు లేదు. వైసిపి కేడర్ దిగాలుపడి ఉంది. ఇలా చెప్పడం వలన వాళ్లకు స్థయిర్యం కలుగుతుందనే ఆలోచన టిడిపి వారికి ఎందుకు రావటం లేదు?

రాజకీయ ప్రయోజనాల మాట అటుంచండి. ఉద్యోగుల స్పిరిట్ సంగతి ఆలోచించండి. వాళ్లు ప్రభుత్వానికి కరచరణాలు. మెదడు అధినేతది కావచ్చు కానీ కార్యాచరణ జరగవలసినది ఉద్యోగుల ద్వారానే. అలాటిది వారినే శంకిస్తూ పోతే, దాన్ని మాటిమాటికి వెలిబుచ్చితే, దండిస్తూ ఉంటే పనులెలా సాగుతాయి? భార్యాభర్తా ఒకరినొకరు అనుమానించుకుంటూ, అవమానించుకుంటూ ఉంటే పిల్లల గతి ఏమిటి? భార్య నిజాయితీపై నమ్మకం లేకపోతే విడాకులిచ్చే వీలుంది. కానీ ప్రభుత్వోద్యోగిని పీకేయలేవు. వేగాల్సిందే. తగిన మర్యాద యివ్వకపోతే, అతను మొక్కుబడిగా పని చేసి ఊరుకుంటాడు. మహా అయితే బదిలీ చేస్తారు, అంతేగా అనుకుంటాడు.

ఇది చంద్రబాబు గ్రహించాలి. ప్రతి ఉద్యోగిని కులం కళ్లతో, ప్రాంతం కళ్లతో చూసి, లేనిపోని సందేహాలతో తస్మదీయుడిగా ముద్ర కొట్టి దూరం చేసుకుంటే వాళ్ల మొరేల్ దెబ్బ తీసినట్లే. అభివృద్ధి పథంలో సాగాలంటే ఉద్యోగుల భాగస్వామ్యం అతి ముఖ్యం. సమయానికి జీతాలిస్తే చాలు అనుకుంటే కుదరదు. వారి సైకాలజీ కూడా గమనంలోకి తీసుకుని, తగిన మర్యాద యిచ్చి, అవసరమైన చోట క్రెడిట్ కట్టబెట్టి, మీ పై నాకు నమ్మకం ఉంది అని చాటుకోవాలి. లేకపోతే యిలాటి ఘటనలు యిక్కడే కాదు, ఎక్కడైనా జరగవచ్చు. దీని తర్వాత కూడా తిరుపతిలో కొన్ని ఘటనలు జరిగాయని గమనించాలి. దీని తర్వాతి వ్యాసం ‘‘జనసమూహాల సైకాలజీ’’!

– ఎమ్బీయస్ ప్రసాద్

11 Replies to “ఎమ్బీయస్‍: అధికారుల సైకాలజీ”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. మొత్తం వ్యాసం లో నచ్చిన ఒక వ్యాక్యం .. “”దేవుడి ఏమి ఫ్యాక్షనిస్ట్ కాదు కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవడానికి””

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  5. లడ్డు కల్తీ ఊహ అంట. పేరు ప్రఖ్యాతి కలిగిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఎన్నో దశాబ్దాల చరిత్ర గల, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మూడు సార్లు మూడు శాంపిల్స్ లో ఉందని చెపితే, ఆధారాలు లేవంట.

    1. వాటి గురించి విపులంగా వ్యాసాలు రాశాను. దయచేసి చూడగోర్తాను. ఏది ఏమైనా కమిటీ వేశారుగా, దాని రిపోర్టు వచ్చాక స్పష్టత వస్తుంది. వార్తల్లో వచ్చిన ప్రకారం కల్తీ అంత స్పష్టంగా ఉండి ఉంటే, వారంలోనే రిపోర్టు బయటకు వచ్చేసేది. నాలుగు నెలలైనా రాలేదంటేనే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.

  6. ఉపసంహారం లో తీసుకు వచ్చారే అదే కుల వివక్ష రెండు ప్రభుత్వాలను నడిపిస్తోంది. ఏది మంచో ఏది చెడో కూడా తెలియని స్థితిలో సమాజం కొట్టుమిట్టాడుతోంది. మీరు ఒక పార్టీ తప్పు చూపిస్తే అవతల పార్టీ మనిషి అని ముద్ర వేస్తారు

  7. 40 సంవత్సరాల అనుభవం ఉన్న బాబు గారికి ఉద్యోగుల పట్ల సరియైన అవగాహన లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన విజన్ ఇదేనా?

  8. వ్యాసం బాగోలేదు. ఏమి చెప్పదల్చుకున్నారో తెలియకుండా ఉంది.

    “ఆధారాల్లేకుండా మాట్లాడేసి, యిప్పుడు ఆధారాలను వెతికే పని కేంద్ర కమిటీకి అప్పగించారు.”

    -> బాబు అప్పగించలేదు. వైసీపీ వారు కేసు వేస్తే కోర్టు వారు కేంద్రానికి అప్పగించారు.

    “సంధ్య థియేటరుకు అర్జున్ వస్తున్నాడొహొ అని పిఆర్ టీము వాళ్లు మెసెజిలు పంపినట్లే”

    -> మొన్నటి వరకూ అర్జున్ తప్పు లేదు అని వాదించినట్లున్నారు?

  9. వ్యాసం బాగోలేదు. ఏమి చెప్పదల్చుకున్నారో తెలియకుండా ఉంది.

    “ఆధారాల్లేకుండా మాట్లాడేసి, యిప్పుడు ఆధారాలను వెతికే పని కేంద్ర కమిటీకి అప్పగించారు.”

    -> బాబు అప్పగించలేదు. వైసీపీ వారు కే..సు వేస్తే కో..ర్టు వారు కేంద్రానికి అప్పగించారు.

    “సంధ్య థియేటరుకు అర్జున్ వస్తున్నాడొహొ అని పిఆర్ టీము వాళ్లు మెసెజిలు పంపినట్లే”

    -> మొన్నటి వరకూ అర్జున్ తప్పు లేదు అని వాదించినట్లున్నారు?

Comments are closed.