Advertisement

Advertisement


Home > Movies - Movie News

అల్లు అర్జున్- తనని తాను చెక్కుకుంటున్న అద్భుతశిల్పం

అల్లు అర్జున్- తనని తాను చెక్కుకుంటున్న అద్భుతశిల్పం

అల్లు అర్జున్. ఈ పేరు ఒక సినిమా హీరోది మాత్రమే కాదు.  ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల, తెలివి, తెగువ, ప్రేరణ, నిత్య ఉత్సాహం వంటి ఎన్నో మంచి లక్షణాలన్నీ పోతగా పోసి దానికి మానవరూపాన్ని ఇస్తే ఆ రూపాన్ని అల్లు అర్జున్ అని పిలుస్తున్నాం. ఇది అతిశయోక్తి కాదు. నేను తనని కెరీర్ మొదటి రోజు నుంచీ చూస్తూనే ఉన్నాను, గమనిస్తూనే వస్తున్నాను.

2003 లో "గంగోత్రి" వచ్చే నాటికి అల్లు అర్జున్ కి 20 ఏళ్లు. తనదేమీ సాదా సీదా నేపథ్యం కాదు. తండ్రి మెగా నిర్మాత. తాతయ్య చరిత్ర మరువలేని గొప్ప హాస్యనటులు. అటు మామయ్యగా చిరంజీవి. 

ఈ నేపథ్యం ఉన్న 20-21 ఏళ్ల యువకుడు ఎవరైనా సరే మంచి స్టైలిష్ లవ్ స్టోరీ చెయ్యాలనో, హై ఓల్టేజ్ ఫైట్లు చేసే మాస్ హీరోగా పరిచయమైపోవాలనో తహతహలాడిపోతుంటారు. కానీ ఒక డీగ్లామరస్ పాత్రని, అది కూడా నిక్కరేసుకుని అటు బాలనటుడో ఇటు హీరోనో అర్ధం కాని ఒకానొక మాస్ అప్పీల్ లేని పాత్రని చేయమంటే సిగ్గుపడడమో, తక్కువగా అనుకోవడమో సహజం. 

కానీ అలాంటిదేం లేకుండా పాత్రకి తగ్గట్టు తనకి చేతనైన విధంగా నటించేసాడు. అది అతనిలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. నటుడికే కాదు, ఏ రంగంలో రాణించాలనుకునే వ్యక్తికైనా ముందుగా ఉండాల్సింది ఇదే. 

ఆ పాత్ర చేసేయగానే అయిపోలేదు. ప్రశంశలు అందుకోకపోగా విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మనిషి బాలేడని, చేసిన పాత్రలో మాస్ అప్పీల్ లేదని, హీరో లక్షణాలే లేవని నానా రకాలుగా విమర్శించారు. అలా విమర్శించినవారిలో అటు ప్రేక్షకులు, ఇటు ఇండస్ట్రీ వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్లలా అంటుంటే నేను కూడా మొదట్లో వాళ్లతో ఏకీభవించాల్సి వచ్చేది. 

కానీ చాలా త్వరగానే చాలామందిని ఆశ్చర్యానికి గురి చేయడం మొదలుపెట్టాడు. తన లోపాలేంటో తెలుసుకున్నాడు. అలా లోపాలు తెలుసుకోవడం తెలివైనవాడు చేసే పని. ఒక పక్క మరో పాత్ర కోసం, మరొక వైవిధ్యం కోసం పట్టుదలగా కృషి చేస్తూనే బాడీలోనూ, బాడీ లేంగ్వేజ్ లోనూ కావాల్సిన మార్పులు చేసుకోవడం వెనుక చాలా ఫోకస్ పెట్టాడు. ఆ దిశగా కష్టపడి తనని తాను మలచుకున్నాడు. తనలోంచి తన్నుకొచ్చే ఆత్మవిశ్వాసాన్ని కళ్లల్లోనూ, నవ్వులోనూ, ముఖంలోనూ ద్యోతకం కావడానికి ఏ విధమైన మేకోవర్ చేసుకోవాలో అది చేసుకున్నాడు. 

నటన పరంగా ప్రతి సినిమాకి ఎంతో కొంత పరిపక్వత చూపిస్తూ ముందుకెళ్లాడు. ఇప్పటికీ ఇంకా అలా వెళ్తున్నాడనే చెప్పాలి.

సినిమా కథ ఎలా ఉన్నా తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుడిని చివరిదాకా హాల్లో కూర్చోబెట్టగలిగే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. స్క్రిప్ట్ మీద, తన పాత్ర మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళే అలా చేయగలుగుతారు. అటువంటి నటుల్లో టాప్ లో ఉంటాడు అల్లు అర్జున్. 

తెలుగులోనే కాకుండా కేరళలో కూడా బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్. వాళ్లు తనను మల్లు అర్జున్ గా ఓన్ చేసుకున్నారు. వాళ్లు కనెక్ట్ అయింది అర్జున్ లోని బాడీ లేంగ్వేజ్ కి, ఎనర్జీకి అని వేరే చెప్పక్కర్లేదు. 

అన్నింటికీ మించి ఏ విభాగంలో అయితే ఇక ఇంతకంటే చేయడానికేమీ లేదు అనిపిస్తుందో అక్కడ కూడా అంచనాలు దాటి ప్రతిభ చూపించడం తెగువతో కూడిన లక్షణం. డ్యాన్సులంటే ఎప్పటికీ చెప్పుకునే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎవరు ఎంత డ్యాన్స్ చేసినా ఆయనతో కంపేర్ చేసేసి పెదవి విరిచేస్తారు ఆడియన్స్. కానీ అల్లు అర్జున్ డ్యాన్స్ ని మాత్రం చూస్తూ ఉండిపోతాం. కంపేర్ చేయడానికి ఉండదు. తన మార్క్ తనదే. తన స్టైల్ తనదే. తనకు తానే ద్యాన్స్ ఐకాన్. అందుకే స్టైలిష్ స్టార్ అన్నా, ఐకాన్ స్టార్ అన్నా కూడా ఆ టైటిల్స్ అల్లు అర్జున్ కి అందంగా అమరుతాయి. 

ఇక పుష్ప లో బన్నీ మేకోవర్ గురించి, బాడీ లేంగ్వేజ్ గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. అతను ఈ చిత్రం కోసం ఇష్టంగా పడ్డ కష్టం గురించి చెప్పమంటే దర్శకుడు సుకుమార్ ఒక్కరే వంద పేజీలు రాస్తారేమో. జాతీయ ఉత్తమనటుడు అవార్డ్ అనేది ఊరికే వచ్చేయదు. అది కూడా తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ఇది సాధించినందుకైనా రెండు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజానికి రాష్ట్ర స్థాయి అత్యున్నత పురస్కారాలతో సత్కరించాలి. 

తెలుగు చిత్రసీమ సగర్వంగా భావించే నటుడు అల్లు అర్జున్. ఇప్పటివరకు తాను చేసినవి కొన్ని మాత్రమే. తనలోని వ్యక్తిత్వాన్ని, కృషిని చూస్తుంటే కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి నటుడు కావడానికి అన్ని లక్షణాలు తనలో ఉన్నాయనే అనిపిస్తోంది. 

తన ఎదుగుదలకి ఏదైనా అడ్డమైతే దానిని త్వరగానే సరిదిద్దుకునే లక్షణం ఉన్నవాడని ఈ వ్యాసం మొదట్లోనే చెప్పుకున్నాం. కనుక తనకి ఎవరూ ఫలానా విషయం సరి చేసుకోమని చెప్పక్కర్లేదు. తనకే తెలుస్తుంటాయి. ఎందుకంటే ఇతరులకంటే తనని తాను ఎక్కువగా గమనించుకుంటాడనిపిస్తుంది నాకు. తాను తప్పుల్ని గమనిస్తే దిద్దుకుంటూ ముందు వెళ్తుంటాడు. అలా ఎప్పటికప్పుడు తనని తాను చెక్కుకుంటూ అన్నివిధాలా అద్భుతమనిపించే దిశగా ప్రయాణం చెస్తున్నాడు. నేటికి 41వ పుట్టిన రోజులోకి అడుగుపెట్టాడు అల్లు అర్జున్ అనబడే మన బన్నీ. రానున్న రోజుల్లో కచ్చితంగా మరింత గొప్ప స్థాయికి వెళ్తాడు. అలా జరగాలనే ఆశిద్దాం. 

- వెంకట్ ఆరికట్ల

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?