ఎన్నికల బాండ్ల గురించి నెలన్నరగా చాలా విషయాలే బయటకు వచ్చాయని అందరికీ తెలిసున్న విషయమే. ఇప్పటిదాకా వచ్చిన విశేషాలను క్రోడీకరించి ఒక వ్యాసంలో యిద్దామని యీ ప్రయత్నం. మొదటగా చెప్పవలసినది – అసలీ స్కీమే దుర్మార్గపు ఆలోచన అని పెట్టినప్పుడే అందరికీ తెలుసు. పారదర్శక ప్రభుత్వం అని ఒక పక్క చెప్పుకుంటూ బాండ్లు ఎవరు కొన్నారో, ఎవరికి యిచ్చారో చెప్పనక్కర లేదనడమేమిటి? ఎన్నికల బాండ్లన్న పేరే తప్ప, డబ్బు ముట్టిన పార్టీలు ఎన్నికలకే ఖర్చు పెట్టాయో, ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనడానికి ఖర్చు పెట్టాయో చెప్పనక్కర లేదనడమేమిటి?
సాధారణ పౌరుల విషయంలో ప్రతీది బట్టబయలే. వేల కోట్ల రూపాయల బాండ్ల విషయంలో మాత్రం ప్రతీదీ గోప్యతే. బాండ్ల వివరాలు చెప్పమంటే స్టేటు బ్యాంకు ఎన్ని వేషాలు వేసిందో చూశాం. నంబర్లివ్వనంది, పేర్లు చెప్పనంది, టైము కావాలంది, అరకొర సమాచారం యిచ్చింది, ప్రతీసారీ కోర్టు చేత చివాట్లు తింది. చివరకు దిక్కు లేక, బయట పెట్టింది. ఇంత చేసినా 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన బాండ్ల వివరాలు పూర్తిగా రాలేదు. ఇప్పటిదాకా బయటకు వచ్చిన వివరాలు చూస్తేనే అనేక కంపెనీల, రాజకీయ పార్టీల కంపంతా బయటకు వచ్చింది.
ఈ స్కీమును రద్దు చేస్తూ యిది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు చెప్పేదాకా యీ పార్టీలకు తెలియదా? ఇలాటి స్కీము ప్రవేశ పెట్టినప్పుడు కుదరదు, యిది తప్పు అని ఎన్ని పార్టీలు ఖండించాయి? ఖండించినవి కూడా మొక్కుబడిగా ఖండించాయి తప్ప మేం మాత్రం బాండ్ల రూపంలో తీసుకోము అని చెప్పాయా? అన్ని పార్టీలూ దీనిలో లాభపడ్డాయి కాబట్టి అన్నీ ఊరుకున్నాయి. ఇలాటి స్కీముల్లో రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ అధికారంలో ఉన్న పార్టీయే ఎక్కువగా లాభపడుతుందని అందరికీ తెలుసు. తాము అధికారంలోకి వచ్చినపుడు నిధులు దండుకోవడానికి యీ స్కీము ఉపయోగపడుతుంది కదాని అవి పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ పట్టుబట్టారు కాబట్టి యిన్నాళ్లకు యీ రొచ్చు బయట పడింది. దీన్ని అడ్డుకోవడానికి ఎంతమంది ప్రయత్నించారో చూడండి. వివరాలు బయట పెట్టకూడదంటూ పరిశ్రమల సంఘం వారు కోర్టుకి వెళ్లారు. వివరాలు చెప్పనంటూ ఎస్‌బిఐ మొండికేసింది. కోర్టు యిప్పుడు యీ పథకాన్ని ఆపించింది కాబట్టి, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మరో పేరుతో యిలాటి స్కీముని తీసుకువచ్చి దాన్ని కోర్టు సమీక్షకు అతీతంగా చేసినా ఆశ్చర్య పడవద్దు. దానికి తక్కిన రాజకీయ పార్టీలన్నీ మద్దతు పలికినా విస్తుపోవద్దు.
మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 2018 మార్చిలో యీ పథకం ప్రారంభించింది. అంతకు ముందు దాకా రాజకీయ పార్టీలకు రెండు రకాలుగా ఆదాయం ఉండేది. ఎక్కణ్నుంచి వచ్చిందో ఆ మూలస్థానం (సోర్స్) తెలిపేది, రెండోది సోర్స్ తెలపనిది. ఎవరైనా రూ. 20 వేల కంటె తక్కువ విరాళం యిస్తే వారి పేరు చెప్పనక్కరలేదు.20 వేల కంటె ఎక్కువ యిచ్చిన వ్యక్తి కానీ, సంస్థ కానీ ఉంటే వారి పేరు చెప్పాలి. ఇదీ రూలు. అందువలన పార్టీలు తమ దాతల్లో చాలామంది 20 వేల కంటె తక్కువగా యిచ్చినవారే అని క్లెయిమ్ చేసేవారు. 21-02-24 నాటి ‘‘హిందూ’’లో ప్రచురించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్‌స్ యిచ్చిన డేటా ప్రకారం 2015-17 మధ్య జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలు రూ. 3864 కోట్లయితే, (బిజెపికి 2477, కాంగ్రెసుకి 961, తక్కినది యితరులు) తెలిసిన సోర్సెస్ నుంచి వచ్చినది రూ. రూ.1314 కోట్లు, (బిజెపికి 1046, కాంగ్రెసుకి 204) కాగా తెలియని సోర్సెస్ నుంచి వచ్చినది (అంటే 20 వేల కంటె తక్కువ విరాళాలు) రూ.2550 కోట్లు, (బిజెపికి 1431, కాంగ్రెసుకి 757). దీని అర్థం బిజెపికి వచ్చిన మొత్తం ఆదాయంలో 58% ఎవరి నుంచి వచ్చిందో చెప్పలేదు. కాంగ్రెసు విషయంలో యిది 79%.
ఇలాటి పరిస్థితుల్లో బిజెపి యీ ఎలక్టొరల్ బాండ్స్ స్కీము పెట్టింది. ఇవి కరెన్సీ నోట్ల లాటివే. స్టేటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీటిని కొని, తమకు యిష్టమైన పార్టీకి యివ్వవచ్చు. బాండ్లపై యిచ్చిన వారి పేరు ఉండదు. అమ్మిన బ్యాంకు కొన్నవారి పేర్లు ఎవరికీ వెల్లడించ నక్కరలేదు. పుచ్చుకున్న పార్టీ కూడా తమకు ఎవరిచ్చారో, ఎన్నికల కమిషన్‌తో సహా ఎవ్వరికీ వెల్లడించ నక్కరలేదు. బాండు జారీ అయిన 15 రోజుల్లో వీటిని ఆ పార్టీ నగదుగా మార్చుకోవాలి. లేకపోతే అవి ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్‌కు వెళ్లిపోతుంది. పేరుకి ఎన్నికల బాండ్ అయినా, నగదుగా మార్చుకున్న పార్టీ దీన్ని ఎన్నికలకే ఖర్చు పెడుతున్నానని ఎవరికీ నిరూపించ వలసిన పని లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే, పార్లమెంటు ఎన్నికల సమయంలోనే యీ బాండ్లు ముట్టాయంటే ఓహో ఎన్నికల కోసం కాబోలు అనుకునే వీలుంది. కానీ ప్రతీ ఏడాదీ యీ బాండ్ల కొనుగోలు జరుగుతోందంటే వాటి లక్ష్యం అర్థం చేసుకోవచ్చు.
ఈ స్కీము పెట్టాక 2019-22 పీరియడ్‌కు సంబంధించిన అంకెల గురించి పైన చెప్పిన సంస్థ యిచ్చిన డేటా ఏమిటంటే జాతీయ పార్టీలకు వచ్చినది 11829 కోట్లు (బిజెపికి 8136, కాంగ్రెసుకి 2280, తక్కినది యితరులు) తెలిసిన సోర్సెస్ నుంచి వచ్చినది రూ. రూ.3340 కోట్లు, (బిజెపికి 2620, కాంగ్రెసుకి 458) కాగా తెలియని సోర్సెస్ నుంచి వచ్చినది (అంటే 20 వేల కంటె తక్కువ విరాళాలు ప్లస్ బాండ్స్) రూ.8489 కోట్లు, (బిజెపికి 5516, దీనిలో 92% బాండ్ల నుంచే వచ్చింది. కాంగ్రెసుకి 1823, దీనిలో 52% బాండ్ల నుంచి వచ్చింది).
తాజా అంకెలేమిటంటే 14-03-24న ఎస్‌బిఐ కోర్టుకి చెప్పిన ప్రకారం – 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు ఐదేళ్లలో 22, 217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశారు. (2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు జారీ ఆయిన బాండ్ల సమాచారం యింకా గోప్యంగానే ఉంది). వీటిని వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళం రూపంలో అందజేశారు. 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. నిబంధనల ప్రకారం జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నగదుగా మార్చుకోకపోవడం వలన మిగిలిపోయిన 187 బాండ్లకు సంబంధించిన డబ్బును పిఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.
2024 జనవరి వరకు రూ.16518 కోట్ల విలువైన బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టీ లన్నిటికీ కలిపి 12760 కోట్లు పైగా అందాయి. బాండ్లలో 47.5% (6061 కోట్లు) బిజెపికి, 12.6% (1610) తృణమూల్‌కు, 11.1% (1422) కాంగ్రెసుకు, 9.5% (1213) తెరాసకు, బిజెడికి 6.1% (776) , డిఎంకెకు 5% (639), 2.6% (337) వైసిపికి, 1.7% (219) టిడిపికి, 1.2% (159) శివసేనకు, 0.6% (73) ఆర్‌జెడికి ముట్టాయి. జనవరి తర్వాత కూడా బాండ్ల అమ్మకాలు, పార్టీలు వాటిని ఎన్‌క్యాష్ చేసుకోవడాలు జరిగాయి. అందుచేత పార్టీల వారీగా చెప్పేటప్పుడు వీటి కంటె ఎక్కువ అంకెలు కనబడినా తప్పు అనుకోవద్దు.
బిజెపి ప్రవేశ పెట్టిన బాండ్ల వలన లాభపడినది బిజెపియే అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే యీ బాండ్లు వాళ్ల పేర కొన్నవాళ్లెవరు? హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నారని మెచ్చుకునే హిందూ సంఘాల వారు, మఠాల వారూ కాదు. అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్ఠను యినుమడింప చేస్తున్నారని, స్వదేశీ ఉత్పత్తులను పెంచుతున్నారని విశ్వసించి ప్రచారం చేసే దేశభక్తుల సంఘాలూ కాదు. ఈడీ, ఐటీ వారి సోదాలు, కేసులు, దాడులు ఎదుర్కుంటున్న వ్యక్తులు, కంపెనీలు, వారితో పాటు ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు చేజిక్కించుకున్నవారు యిలా పలురకాల వ్యక్తులు కొంటున్నారు. కేంద్రంలో అధికారం ఉన్నవారికే కాదు, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు యిలా విరాళాలు దక్కాయి. అధికారంలో ఉన్నవారికే కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారికీ దక్కాయి. ఎవరెవరు ఎంతెంత యిచ్చారని ఎస్‌బిఐ వెల్లడించిందో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో పెట్టిందో మనం వరుసగా చూసుకుంటూ పోతే ఎవరెలాటి వారో వేరే చెప్పనక్కరలేదు. ఇవేమీ జర్నలిస్టులు కష్టపడి, పరిశోధించి కనిపెట్టిన విషయాలు కావు. ఇసి వెబ్‌సైట్ లోంచి పత్రికలు సేకరించి ప్రచురించినవే. తెలుగు రాష్ట్రాలతో మొదలు పెడదాం.
– ఎన్నికల బాండ్లు కొన్న వారిలో టాప్ 50 మందిని తీసుకుంటే వారిలో 16 మంది కలకత్తాకు చెందినవారు. 11 మంది హైదరాబాదుకి, 8 మంది ముంబయికి, నలుగురు దిల్లీకి, ముగ్గురు అహ్మదాబాద్‌కి, ఇద్దరేసి పుణె, చెన్నయ్, కాన్పూరులకు ఒక్కరేసి చొప్పున కటక్, కోయంబత్తూరులకు చెందినవారు. హైదరాబాదీయులది ద్వితీయ స్థానమన్నమాట. ఈ ఘనత కలిగేట్లా చేసినది మేఘా ఇంజనీరింగు అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లి. ఆంధ్రజ్యోతి 200324 ప్రకారం (స్టాట్స్ ఆఫ్ ఇండియా వివరాలిచ్చిందని వారు రాశారు) అది తెరాసకు 201 కోట్లు యిచ్చింది. బిజెపికి రూ. 669 కోట్లు, కాంగ్రెసుకు 158 కోట్లు, డిఎంకెకు 85, టిడిపికి 53 కోట్లు, వైసిపికి 37 కోట్లు, యితరులకు 29 కోట్లు యిచ్చింది. దాని సబ్సిడియరీ ఐన యుపి పవర్ ట్రాన్స్‌మిషన్ కం. కాంగ్రెసుకు 110 కోట్లు, బిజెపికి 80 కోట్లు యిచ్చింది.
– ఇతర తెలుగు కంపెనీల్లో రెడ్డీ లాబ్స్ 80 కోట్లు, నాట్కో ఫార్మా 69, ఎన్‌సిసి 60, దివి లాబ్స్ 55, నవయుగ 55, రామ్‌కో సిమెంట్స్ 54, అరబిందో ఫార్మా 52, రిత్విక్ ప్రాజెక్ట్ 45, అపర్ణ ఎస్టేట్స్ 30, సన్ ఫార్మా 31, హెటిరో డ్రగ్స్ 30, హెటిరో లాబ్స్ 25, హెటిరో బయో ఫార్మా 5, ఆనర్ లాబ్స్ 25, నూజివీడు సీడ్స్, ప్రభాకరరావు కలిపి 27, మై హోం 15, ఎంఎస్‌ఎన్ లాబ్స్ 10, సంధ్య కనస్ట్రక్షన్స్ 13, నర్రా కనస్ట్రక్షన్స్ 10, మైహోం ఇన్‌ఫ్రా 10, భారత్ బయోటెక్ 10, వంశీరాం బిల్డర్స్ 7, శ్రీ చైతన్య 5 కోట్లు ఎన్నికల బాండ్లు కొన్నాయి.
– నిధుల దాతల్లో మేఘాను మించిన ఆచంట మల్లన ఫ్యూచర్ గేమింగ్. 1368 కోట్లు యిచ్చిందా కంపెనీ. తృణమూల్‌కు 542, డిఎంకెకు 503, వైసిపికి 154, బిజెపికి 100, కాంగ్రెసుకు 50, సిక్కిం క్రాంతికారీ మోర్చాకు 11, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్‌కు 5 కోట్లు (సిక్కింలో యీ కంపెనీకి చాలా బిజినెస్ ఉంది) యిచ్చింది. దీని ఎండీ లాటరీ టిక్కెట్ల వ్యాపారి 63 ఏళ్ల శాంటియాగో మార్టిన్. పేరు చూసి కంగారు పడవద్దు. భారతీయుడే. అండమాన్‌లో పుట్టాడు. 18 ఏళ్ల వయసులో బర్మాలో రోజు కూలీగా పని చేసి తమిళనాడుకి వచ్చి టీ కొట్టులో పని చేశాడు. తమిళ పేదల్లో లాటరీ టిక్కెట్ల పట్ల వున్న క్రేజ్ చూసి, కోయంబత్తూరులో లాటరీ టిక్కెట్లమ్మే వ్యాపారం మొదలుపెట్టాడు. అప్పటికప్పుడు ఫలితం తెలిసిపోయే టూ-డిజిట్ లాటరీ టిక్కెట్లను కనిపెట్టి వ్యాపారాన్ని యిబ్బడిముబ్బడిగా పెంచాడు. అక్కణ్నుంచి కర్ణాటక, కేరళలకు విస్తరించి క్రమేపీ ఉత్తరాదికి, ఈశాన్య రాష్ట్రాలకు, చివరకు భూటాన్‌కు కూడా వ్యాపించేశాడు.
– కానీ ఐటీ వాళ్లు యితని వ్యాపారంలో మోసాలున్నాయన్నారు. భూమి కబ్జా కేసులో 2011లో జయలలిత యితన్ని జైల్లో పెట్టించింది. ఇతను డిఎంకెకు, కరుణానిధికి, స్టాలిన్‌కు ఆప్తుడు. కర్ణాటక ప్రభుత్వం 2023లో యితనిపై కేసులు పెట్టింది. సిక్కింలో లాటరీ ఫ్రాడ్ చేశాడని కూడా ఆరోపణలున్నాయి. ఇన్ని ఉన్నా, అతను యిప్పటిదాకా మళ్లీ అరెస్టు కాలేదు. 1368 కోట్ల బాండ్లు కొని యిచ్చాడంటే మరి ఊరికే యిస్తాడా?
– ఫ్యూచర్, మేఘా తర్వాత చెప్పుకోదగినది క్విక్ సప్లయ్ చెయిన్ లి. అనే లాజిస్టిక్స్ కంపెనీ. గోదాముల నిర్వహణతో పాటు ఎచ్ఆర్ నిర్వహణ కూడా చేస్తుంది. ఇది రిలయన్స్‌కు చెందినదని అంటారు. కాదని రిలయన్స్ వారన్నారు. కానీ దానిలో 50% వాటా మూడు రిలయన్స్ గ్రూపు కంపెనీలదే! అది 2021-22 నుంచి 2023-24 మధ్య రూ.410 కోట్ల బాండ్లు కొని 385 కోట్లు బిజెపి, 25 కోట్లు శివసేనలకు యిచ్చింది. 2000 సం.రంలో 130 కోట్ల మూలధనంతో ఏర్పడిన ఆ సంస్థ నికర లాభం 2021-22లో 21.7 కోట్లు మాత్రమే. అయినా అది కొన్న బాండ్ల విలువ 360 కోట్లు. ఎలా యివ్వగలిగింది? అంటే దాని పేర రిలయన్సో, మరోటో కొని ఆ యా పార్టీలకు యిచ్చింది అనుకోవాలి. రిలయన్స్‌దే అంటున్న హనీవెల్ ప్రాపర్టీస్ 08-04-21న 30 కోట్ల బాండ్లు కొని బిజెపికి యిచ్చింది.
– బాండ్లు కొనేవారిలో ఏ సెక్టార్‌కు చెందినవారు ఎంత యిచ్చారు అని తెలిస్తే ప్రభుత్వ విధానాల వలన బాగుపడుతున్న రంగమేదో గ్రహించవచ్చు. ప్రతి ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మంత్రం జపిస్తూ, రోడ్లు, పోర్టులు, ఫ్లయి ఓవర్లు, భవంతులు కట్టిస్తూ అదే అభివృద్ధి అని ప్రజల్ని నమ్మిస్తూ ఉంటుంది. ఈ పనులు పొందిన కాంట్రాక్టర్లు ఋణం ఉంచుకోరు కదా. ఈ బాండ్లు కొని తమ కృతజ్ఞత తెలుపుకుంటారు. 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు 1365 కోట్ల బాండ్లు కొన్నవారు ఇంజనియరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన వారు. 667 కోట్ల బాండ్లు మైనింగ్ రంగం నుంచి వచ్చాయి. 631 రియల్ ఎస్టేటు నుంచి రాగా 449 కోట్లు ఎనర్జీ రంగం నుంచి, 348 కోట్లు ఫార్మా నుంచి, 343 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి, 100 కోట్లు సెక్యూరిటీస్ నుంచి వచ్చాయి.
– 2023 జనవరిలో కాంగ్రెసు పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో 1098 కోట్ల ప్రాజెక్టు దక్కించుకున్న రిత్విక్ ప్రాజెక్ట్‌స్ అనే సిఎం రమేశ్ కంపెనీ 5 కోట్ల బాండ్లు కొంది. రెండు నెలలు పోయాక ఏప్రిల్‌లో కర్ణాటక ఎన్నికలకు ముందు మరో 40 కోట్ల బాండ్లు కొంది. రమేశ్ బిజెపి ఎంపీ అయినా, ఆ కంపెనీ కాంగ్రెసుకు 30 కోట్లు, 2023 జనవరిలో టిడిపికి 5 కోట్లు, జెడిఎస్‌కు 10 కోట్లు యిచ్చింది.
– ఆంధ్రజ్యోతి 20-03-24 ప్రకారం తెరాసకు మొత్తం వచ్చినది 1322 కోట్లయితే దానిలో 663 కోట్లు కేవలం 4 రోజుల్లో వచ్చాయి. ఒక రోజైతే (12-04-22న) 268 కోట్లు వచ్చాయి. అప్పుడు ఏ ఎన్నికలూ లేవు కదా, మరి ఎన్నికల నిధుల కోసం యిచ్చారని అనుకోగలమా? పార్టీపై అభిమానం కొద్దీ యిచ్చారన్నా, సరిగ్గా అవేళే పొంగి పొర్లదు కదా! తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టు వలన లబ్ధి పొందిన వారెవరో తమ కమిషన్ చెల్లించారని అనుకోవలసి వస్తుంది. కాదంటే పార్టీ క్లారిఫై చేయాలి. తెరాసకు విరాళాలిచ్చిన కంపెనీలు యశోదా ఆస్పత్రి, రహేజా, ఐటిసి, రాజపుష్ప ఎసెట్ మేనేజ్‌మెంట్ వగైరాలు.
– కాంట్రాక్టులు, సౌకర్యాలు పొందిన కంపెనీలే కాదు ఇడి, ఐటీ సోదాలకు, విచారణకు గురైన కంపెనీలు, క్వాలిటీ విషయంలో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ విచారణలో ఉన్న కంపెనీలు కూడా యీ బాండ్లు కొన్నాయని హిందూ తన మార్చి 20, 22 సంచికలలో రాసింది. దివి లాబ్స్, మైక్రో లాబ్స్, కల్పతరు ప్రాజెక్ట్‌స్ ఇంటర్నేషనల్ వగైరా కంపెనీలు 2019-23 మధ్య బాండ్లు కొన్నాయి. దివి లాబ్స్ 30 కోట్లు బిజెపికి, 20 కోట్లు తెరాసకు, 5 కోట్లు కాంగ్రెసుకు యిచ్చింది. మైక్రో లాబ్స్ 16 కోట్ల బాండ్లు కొని 6 కోట్లు బిజెపికి, 3 కోట్లు కాంగ్రెసుకు, 7 కోట్లు సిక్కిం క్రాంతికారీ మోర్చాకు యిచ్చింది. డోలో 650 తయారు చేసే యీ కంపెనీ కథేమిటంటే 06-07-2022న ఐటీ డిపార్టుమెంటు దీని 40 ఆఫీసులపై సోదా చేసింది. డోలో విషయంలో చాలా అక్రమాలు జరిగాయని వివిధ కేంద్ర సంస్థలు ప్రకటించాయి. నెల తిరిగేసరికి ఆ కంపెనీ 6 కోట్ల బాండ్లు కొంది. నవంబరు కల్లా 3 కోట్లవి కొంది. 2023 అక్టోబరులో మరో 7 కొంది. మొత్తం 16 ఎలా పంచిందో చెప్పానుగా!
– హెటిరో డ్రగ్స్, హెటిరో లాబ్స్, హెటిరో బయోఫార్మా 50 కోట్లు తెరాసకు, బిజెపికి 10 కోట్లు యిచ్చాయి. దీని సంగతేమిటంటే 2021 అక్టోబరులో 6 రాష్ట్రాలకు విస్తరించిన వారి ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరిగాయి. 550 కోట్ల లెక్క చెప్పని సొమ్ము, 142 కోట్ల క్యాష్ దొరికిందని ఐటీ శాఖ ప్రకటించింది. అదే ఏడాది డిసెంబరులో విశాఖలోని గ్రామస్తులు ఏ క్లియరెన్సులు లేకుండా ఆ కంపెనీ 4 కి.మీ.ల పైపు వేసిందని ఆరోపించారు. 2022 ఏప్రిల్ వచ్చేసరికి హెటిరో గ్రూపు 55 కోట్ల బాండ్లు కొన్నాయి. హెటిరో చైర్మన్ పార్థసారథి రెడ్డి పెట్టుబడి పెట్టిన హేజెలో, హిండ్యా కంపెనీలు రెండూ 06-07-22న చెరో 2.5 కోట్ల బాండ్లు, 12-08-23న చెరో 10 కోట్ల బాండ్లు 12-07-23న 5 కోట్ల బాండ్లు కొన్నాయి.
– ఎంఎస్ఎన్ ఫార్మా కెమ్, ఎంఎస్ఎన్ లాబ్స్ 20 కోట్లు తెరాసకు, 16 కోట్లు బిజెపికి యిచ్చాయి. ఇవి కూడా ఐటీ సోదాలు ఎదుర్కున్నవే. 2021 ఫిబ్రవరిలో సోదాలు చేసిన ఐటీ శాఖ వీరి వద్ద 400 కోట్ల లెక్క చూపని డబ్బు ఉంది అంది. 2022 ఫిబ్రవరి కల్లా అవి 20 కోట్ల బాండ్లు, 161123న మరో 6 కోట్ల బాండ్లు కొన్నాయి. 2023 మేలో పబ్లిక్ యిస్యూకి వెళ్లిన మేన్‌కైండ్ ఫార్మా ఆర్నెల్ల ముందుగానే 2022 నవంబరులో 24 కోట్ల బాండ్లు కొని బిజెపికి యిచ్చింది. అరబిందో ఫార్మా 34.5 కోట్లు బిజెపికి, 15 కోట్లు తెరాసకు, 2.5 కోట్లు టిడిపికి యిచ్చింది. తయారు చేసే మందుల నాణ్యత విషయంలో యుఎస్ ఎఫ్‌డిఏ ఫిర్యాదుల కారణంగా స్థానిక అధికారుల తనిఖీలను ఎదుర్కుంటున్న ఇంటాస్, లుపిన్, నాట్కో ఫార్మా కంపెనీలు బాండ్లు కొన్నాయి. ఇంటాస్ 20 కోట్ల బాండ్లు, లుపిన్ 18 కోట్లు, నాట్కో 69 కోట్లు పెట్టి బాండ్లు కొన్నాయి.
– ఇవన్నీ ఫార్మా కంపెనీలు కాగా షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్ టిడిపికి 40 కోట్లు యిచ్చింది. కల్పతరు ప్రాజెక్ట్‌స్ బిజెపికి 25.5 కోట్లు, మై హోమ్ ఇన్‌ఫ్రా 15 కోట్లు తెరాసకు, 5 కోట్లు బిజెపికి, 4.5 కోట్లు కాంగ్రెసుకు యిచ్చాయి.
– అరబిందో ఫార్మా తన సబ్సిడియరీస్‌తో కలిపి 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబరు వరకు కొన్న బాండ్ల విలువ 77 కోట్లు. దానిలో 59 కోట్లు బిజెపి, 15 కోట్లు తెరాసకు, 3 కోట్లు టిడిపికి యిచ్చింది. వీళ్లకి లిక్కర్ బిజినెస్ కూడా ఉంది. 2022 నవంబరులో కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరక్టరు శరత్ చంద్రా రెడ్డి దిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టయ్యాడు. 5 రోజుల తర్వాత కంపెనీ 5 కోట్ల బాండ్లు కొని బిజెపికి యిచ్చింది. 2023 జూన్‌లో అతను అప్రూవరుగా మారడానికి దిల్లీ హైకోర్టు అనుమతించింది. 2023 నవంబరులో కంపెనీ, తన సబ్సిడియరీతో కలిసి మరో 50 కోట్ల బాండ్లు కొని బిజెపికి యిచ్చింది. (ఫ్రంట్‌లైన్ ఏప్రిల్ 19, 2024)
– కర్ణాటకలో దేవెగౌడ జెడిఎస్‌కు 2018 మార్చి నుండి 2019 ఏప్రిల్ వరకు 49 కోట్ల బాండ్లు (ఇన్ఫోసిస్ నుంచి 1 కోటి, 2018 జనవరిలో బెంగుళూరులోని పాడ్ టాక్సీ ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన ఎంబసీ గ్రూపు నుంచి 22 కోట్లు. బయోకాన్ నుంచి 1.5 కోట్లు, హైదరాబాదుకి చెందిన మేఘా ఇంజనియరింగ్ నుంచి 10 కోట్లు) వచ్చాయి. ఆ తర్వాత 43 కోట్లు వచ్చాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్ 5 కోట్లు యిచ్చింది.
– మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్‌సిపి 2019 మే వరకు 38 కోట్ల బాండ్లు ఎన్‌క్యాష్ చేసుకుంది. ఆ తర్వాత 28 కోట్లు ఎన్‌క్యాష్ చేసుకుంది. దాతల విషయానికి వస్తే బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్ వాళ్లు 8 కోట్లు, ఇన్‌ఫినా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్లు 5 కోట్లు, కరోనా టైములో కోవిషీల్డు అమ్మకాల ద్వారా బాగా ఆర్జించిన సైరస్ పూనావాలా 4 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ వాళ్లు 2 కోట్లు యిచ్చారు. పూనావాలా కంపెనీ ఐన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ బాండ్ల రూపంలో కాకుండా టాక్స్ ఫ్రీ ఎలక్టొరల్ ట్రస్టు మార్గం ద్వారా బిజెపికి 50 కోట్ల రూ.లను ప్రూడెంట్ (సత్యా) ఎలక్టొరల్ ట్రస్టు ద్వారా పంపించింది. ఇలాటి ట్రస్టులు దేశంలో చాలా ఉన్నాయని, 2013 నుంచి 2176 కోట్లు వాటి ద్వారా మళ్లించారని, వాటి కార్యకలాపాలపై విచారణ జరిపిస్తే ఎస్సార్, డిసిఎం, యుపిఎల్, కాడిలా, ఆర్ గోయెంకా గ్రూపు వంటి చాలా కంపెనీల భాగోతాలు బయట పడతాయని రాయిటర్స్ అంది. (ఫ్రంట్‌లైన్ ఏప్రిల్ 19, 2024)
– బాండ్ల గురించి విచారణ జరుగుతూండగా మీకు ఎక్కడెక్కడి నుంచి విరాళాలు వచ్చాయో ఆ వివరాలు సీల్డ్ కవర్‌లో పెట్టి యివ్వండి అని సుప్రీం కోర్టు పార్టీలను అడిగింది. ఫిబ్రవరి 15న అలా యిచ్చిన పార్టీలు డిఎంకె, ఎడిఎంకె, ఎన్‌సిపి, ఆప్, సమాజవాదీ, జెడిఎస్, జెడియు, యితర పార్టీలు. విరాళాలు అందుకోవడంలో అగ్రస్థానంలో ఉన్న బిజెపి, కాంగ్రెసు, తృణమూల్, తెరాస మాత్రం దాతల పేర్లు చెప్పలేదు. బిజెపి వాళ్లయితే ‘పథకం నియమాల ప్రకారం దాతల రికార్డు మేన్‌టేన్ చేయాలన్న బాధ్యత లేదు కాబట్టి మేము రికార్డు చేయలేదు. కాబట్టి చెప్పలేము’ అంది. బయటకు వస్తున్న పేర్లు బ్యాంకు నుంచి, దాతల నుంచి సేకరించినవి అయి వుండాలి.
– మొత్తం మీద 100 కోట్లకు పైగా విరాళమిచ్చిన కంపెనీల సంఖ్య 22. వీటిలో కొన్ని ముఖ్యమైన పేర్లు – ఫ్యూచర్ గేమింగ్ (1368), మేఘా ఇంజనీరింగు (966 కోట్లు), ఆ గ్రూపుకే చెందిన వెస్టర్న్ యుపి పవర్ ట్రాన్స్‌మిషన్ (220), క్విక్ సప్లయి చైన్ (410), హల్దియా ఎనర్జీ (377), వేదాంత (376), ఎస్సెల్ మైనింగ్ (224), ఎయిర్‌టెల్ (198), కెన్వెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా (195), తక్కినవారిలో గ్రాసిమ్, పిరామల్, టొరెంట్ పవర్, డిఎల్‌ఎఫ్, అపోలో టయర్స్, లక్ష్మీ మిత్తల్, ఎడెల్‌వీస్, పివిఆర్, సూలా వైన్, వెల్‌స్పన్, సన్ ఫార్మా. వీళ్లిచ్చిన విరాళాలలో ప్రధాన వాటా బిజెపిదే! (మేఘా 584, క్విక్ 375, వేదాంత 227, ఎయిర్‌టెల్ 198, మదన్‌లాల్ 176, కెవెంటర్ 145, డిఎల్‌ఎఫ్ 130, బిర్లా కార్బన్ 105, ఫ్యూచర్ గేమింగ్ 100). వేదాంత, ఎస్సెల్ గనుల వ్యాపారంలో ఉన్నాయి, హల్డియా బెంగాల్‌లో థర్మల్ విద్యుత్ వ్యాపారంలో ఉంది, వెస్టర్న్ యుపి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉంది, కెన్వెంటర్ బెంగాల్‌లో ఆహారం, పాల ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారంలో ఉంది.
– బాండ్ల వివరాలు మార్చి 6 లోగా ఈసికి సమర్పించాలని కోర్టు ఫిబ్రవరి 15న ఆదేశిస్తే ఎస్‌బిఐ ‘అబ్బే, అది చాలా పెద్ద పని, జూన్ 30 దాకా గడువు పొడిగించండి’ (అప్పటికి ఎన్నికలు అయిపోతాయి) అంది. కానీ యిదే బ్యాంకు కేంద్రం కోరితే 48 గంటల్లో గతంలో యిచ్చింది. 2019లో, 2020లో గడువు ముగిసిన (జారీ చేసిన 15 రోజుల్లోగా బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకోకపోతే అవి పిఎం నిధికి వెళ్లిపోతాయి) బాండ్ల దాత, గ్రహీతల వివరాలను కేంద్రం అడగ్గానే ఎస్‌బిఐ వెంటనే యిచ్చిందని లోకేశ్ బాత్రా అనే సామాజిక కార్యకర్త ‘ద రిపోర్టర్స్ కలక్టివ్’ అనే బ్లాగులో వెల్లడించారని ఆంధ్రజ్యోతి (14 మార్చి) రాసింది. 10 కోట్ల విలువైన ఎన్‌క్యాష్ చేసుకోవడం ఆలస్యం చేసిన ఒక పార్టీ 2018 గడువు పెంచమని అడిగితే, బ్యాంకు కేంద్రాన్ని అడిగి, వారి అనుమతితో 24 గంటల్లో పెంచింది కూడా.
– 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 జనవరి 24 వరకు 1432 కోట్ల బాండ్లు కొన్ని 45 కంపెనీలకు వాటిని కొనడానికి డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందో చెప్పలేని స్థితిలో ఉన్నాయి. వీటిలో 33 కంపెనీలకు కనీస లాభాలు లేకపోగా నష్టాల్లో ఉన్నాయి. 6 కంపెనీలు తమ నెట్ ప్రాఫిట్ కంటె ఎక్కువ సొమ్ము పెట్టి బాండ్లు కొన్నాయి. 3టికి లాభాలున్నాయి కానీ పన్నుల అనంతరం నెగటివ్‌లోకి వెళ్లాయి. మరో 3 తమ వద్ద నెట్ ప్రాఫిట్ గురించి, చెల్లించిన పన్నుల గురించి డేటా లేదని చెప్పాయి. ఈ 1432 కోట్లలో బిజెపికి వెళ్లినది 1068 కోట్లు (74%)! (ఈ కంపెనీల వివరాలు వివరంగా తెలుసుకోవాలంటే 04-04-24 హిందూలో డేటా పాయింట్ శీర్షిక కింద చూడండి.
ఇలా చాలా విశేషాలున్నాయి యీ బాండ్ల కథలో. ఇప్పటికే వ్యాసం చాలా పెద్దదైంది కాబట్టి ప్రస్తుతానికి ఆపుతున్నాను. సారాంశమేమిటో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. ‘మా పార్టీకి విలువలున్నాయి, అవినీతికి దూరం’ అని చెప్పుకునే అర్హత ఏ పార్టీకీ లేదు. కేంద్ర ఆర్థిక మంత్రిణి నిర్మల గారు ఇడి దాడులకు, బాండ్ల కొనుగోలుకి సంబంధం లేదని చెప్పారు. బాండ్లు కొన్నాక కూడా ఇడి దాడులు జరిగాయని గుర్తించాలన్నారు. ఏ ఏడాది లెక్క ఆ ఏడాదిదే కదా! రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు అన్న బాండ్ల పథకం గతంలో కంటె మెరుగైన విధానమని తన అభిప్రాయాన్ని చెప్పారావిడ. మళ్లీ అధికారంలోకి వచ్చాక యిలాటి పథకం కోర్టు సమీక్షకు అతీతం అని రాజ్యాంగాన్ని మారుస్తారేమో చూడాలి. దానికి అన్ని పార్టీలూ వత్తాసు పలుకుతాయనేది నిశ్చయం.
ఇవన్నీ తెలిశాక కలిగే ఫీలింగు – అందరూ దొంగలే! కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న పార్టీకి దోపిడీలో సగం వాటా వస్తోంది. ప్రస్తుతం అధికార పార్టీ స్థానంలో మరొకటి వచ్చినా యీ పథకాన్ని ఏదో రూపంలో కొనసాగిస్తారనేది, వీరు చూపిన బాటలోనే నడుస్తారనీ కచ్చితంగా నమ్మవచ్చు. తెలుసుకున్న కొద్దీ మన ప్రజాస్వామ్యం యిలా ఏడ్చిందాన్న బాధ తన్నుకు వస్తోంది. కానీ యిదే ప్రజాస్వామ్యంలో ఉన్న సుప్రీం కోర్టు అప్పుడప్పుడు కొరడా ఝళిపిస్తోందన్న ఆనందమూ కలుగుతోంది. ఒక్క అంశంలో తడాఖా చూపిస్తేనే యింత బయట పడింది, న్యాయవ్యవస్థను పూర్తిగా స్వతంత్రంగా ఉంచితే యింకెన్ని అద్భుతాలు జరుగుతాయో అనిపిస్తోంది. న్యాయవ్యవస్థను మనం చాలా సార్లు తప్పు పడతాం. మంచి చేసినప్పుడు మెచ్చుకోవాలి కూడా. బాండ్ల విషయంలో జస్టిస్ చంద్రచూడ్ చూపిన తెగువకు జోహార్లు చెపుదాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2024)