ఎంత పెద్ద సినిమాకైనా, ఎంత చిన్న సినిమాకైనా తొలి వీకెండ్ చాలా కీలకం. రిలీజైన మొదటి 3 రోజులు వచ్చిన వసూళ్లే సినిమా జాతకాన్ని, బ్రేక్ ఈవెన్ ను డిసైడ్ చేస్తాయి. ఈ కీలకమైన ఫస్ట్ వీకెండ్ టెస్ట్ లో ఫ్యామిలీ స్టార్ ఫెయిల్ అయింది.
కీలకమైన నిన్నటిరోజున ఈ సినిమాకు కేవలం 3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అలా ఫస్ట్ వీకెండ్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా 12 కోట్ల రూపాయలకు అటుఇటుగా రాబట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇవి ఏమాత్రం సరిపోవు.
ఆశ్చర్యంగా ఫ్యామిలీ స్టార్ సినిమాకు మొదటి రోజు నుంచే కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిందనుకున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ పేలవంగా జరిగాయి. అలా తొలిరోజే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ మూవీ, రెండో రోజుకు మరింత నీరసించిపోయింది. ఇక కీలకమైన ఆదివారం రోజున కూడా పుంజుకోలేకపోయింది.
ట్రేడ్ అంచనా ప్రకారం, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 30 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. ఈ టాక్ తో అంత మొత్తం రాబట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పెర్ఫార్మ్ చేయడం లేదు.
నిన్నటితో వీకెండ్ ముగిసింది. ఈరోజు వసూళ్లు మరింత పడిపోయాయి. ఉగాది హాలిడే ఈ సినిమాకు ఉన్నంతలో కలిసొచ్చే అవకాశం ఉంది. టిల్లూ స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ మినహా బాక్సాఫీస్ బరిలో మరో మూవీ లేకపోవడంతో, రంజాన్ వీకెండ్ కూడా కలిసొస్తోంది. ఇలా మంచి లైఫ్ లైన్స్ కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ, సినిమాలో కంటెంట్ పై నెగెటివ్ టాక్ రావడం ఫ్యామిలీ స్టార్ కు పెద్ద సమస్యగా మారింది.