సీపీఐ అంటే భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీకో సిద్ధాంతం వుందనేది గతంలో మాట. కానీ ఇప్పుడా పార్టీ తన సిద్ధాంతాలను చంద్రబాబునాయుడు కాళ్ల దగ్గర పెట్టింది. బీజేపీ, మతతత్వ పార్టీ అయిన ఆ పార్టీతో అంటకాగే పార్టీలను తమ ప్రత్యర్థులుగానే, శత్రువులుగానే సీపీఐ చూడాలి. కానీ భారత “కమ్మ”నిస్టు పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత, సిద్ధాంతాలను తమ కులనాయకులకు సమర్పించుకుంది.
ఇండియా కూటమిలో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. సీపీఐ తమ అభ్యర్థిగా పి.మురళీని ప్రకటించింది. మురళీని గెలిపించాలని అభ్యర్థిస్తూ ఆ పార్టీ తిరుపతి నగర సమితి ఒక కరపత్రిక ముద్రించింది. ఇందులో ఈ వాక్యాలను చదివితే… ఛీఛీ చంద్రబాబు కోసం ఇంత దిగజారాలా? అని తిట్టకుండా వుండరు. ఆ వాక్యాలేంటో చూద్దాం.
“దేశ వ్యాప్తంగా మతతత్వ బీజేపీ, వైసీపీ లాంటి అవినీతి, అరాచక, అభివృద్ధి నిరోధక, అప్రజాస్వామిక పార్టీలను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని ఓటర్లు కంకణం కట్టుకున్నారు” అని కరపత్రంలో పేర్కొన్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేనపై సీపీఐకి ఎందుకంత ప్రేమో సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. “కమ్మ”నిస్టు పార్టీ కావడం వల్లే బీజేపీతో అంటకాగుతున్నా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లపై ఈగ వాలనివ్వలేదని అర్థం చేసుకోవాలా? చంద్రబాబునాయుడితో సీపీఐ అగ్ర నాయకులు కె.నారాయణ, కె.రామకృష్ణ చెట్టపట్టాలేసుకుని తిరిగే సంగతి తెలిసిందే. తిరుపతిలో టీడీపీ, బీజేపీ మద్దతుతో పోటీ చేసే జనసేనను ఓడించాలని కనీసం ఆ కరపత్రంలో లేకపోవడం విడ్డూరం. ఈ కరపత్రాన్ని చూస్తే, మిగిలిన ప్రాంతాల్లో టీడీపీ, జనసేనలకు కాకుండా ఇండియా కూటమికి ఓట్లు వేస్తారని ఎలా నమ్మాలి?
సీపీఐ తన ప్రాథమిక సిద్ధాంతాలకే తూట్లు పొడిచేలా, కనీస మర్యాద కోసమైనా టీడీపీ, జనసేన పార్టీల పేర్లను ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ, జనసేనలతో ఇండియా కూటమి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, నాటకాన్ని రక్తి కట్టిస్తోందనేందుకు ఆ పార్టీ తిరుపతి శాఖ ప్రచురించిన కరపత్రమే నిదర్శనం. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై వ్యక్తిగతంగా నారాయణ, రామకృష్ణలకు గుండెల నిండా ప్రేమాభిమానాలు ఉండొచ్చు. కానీ సీపీఐ మౌలిక సిద్ధాంతాలనే మరీ ముఖ్యంగా తాకట్టు పెట్టేంతగా దిగజారడమే జుగుప్స కలిగిస్తోంది. సీపీఐకి చట్టసభల్లో ఒక సీటు లేకపోయినా, అంతోఇంతో ఇప్పటికీ ప్రజలు గౌరవించేది, ఆ పార్టీ నేతలు విలువలతో రాజకీయం చేస్తారని.
అదేంటో గానీ, చంద్రబాబు తన సామాజిక వర్గం కావడంతో నారాయణ పార్టీని కుదవ పెట్టగా. ఆయన అండదండలు లేనిదే మనుగడ సాగించలేనని రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ జీ హుజూర్ అంటున్నారు. ఇక కింది స్థాయికి వస్తే… నారాయణ, రామకృష్ణ చల్లని చూపు లేకపోతే, తమ రాజకీయ ఉనికికి ఎసరు వస్తుందని, వారు కూడా అన్నింటినీ వదిలేశారు. ఇలా చంద్రబాబు కింద నారాయణ వంగితే, ఆయన కింద రామకృష్ణ, ఆయన కింద ఇంకొందరు…అంతిమంగా సీపీఐని బలి పెట్టారనేది వాస్తవం. చంద్రబాబుకు ప్రలోభ పెడితే పోయేదేమీ లేదు… ఆర్థికంగా లబ్ధి పొందడం తప్ప అని మార్క్స్ స్ఫూర్తిదాయక పిలుపును మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.