ఈనాటి కేసీఆర్ కంటే.. ఆనాటి ఎన్టీఆర్ బెటర్
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినవాడు. రాష్ట్రాన్ని సాధించాడని పేరు తెచ్చుకున్నవాడు. తెలంగాణాకు రెండుసార్లు సీఎం అయినవాడు. ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయినవాడు. ఇద్దరూ ప్రాంతీయ పార్టీలు పెట్టి సక్సెస్ అయినవారే.
ఇద్దరికీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆశ పుట్టింది. ప్రయత్నాలు చేశారు. ఫెయిల్ అయ్యారు. నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భారతదేశం పేరుతో పార్టీ పెట్టే ఆలోచన చేశారు. కానీ ముందుకు సాగలేదు. కేసీఆర్ కూడా దేశ రాజకీయాలను శాసించాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి కొంతకాలం హడావుడి చేశాడు. కానీ ఎలా చతికిలపడ్డాడో చూశాము.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ నుంచి వెళ్లిపోగా మిగిలిన నాయకులు జాతీయ రాజకీయాలు మనకు అచ్చిరావని, పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలని చేతులెత్తి దండం పెడుతున్నారు. పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు కానీ కొందరు నాయకులు మాత్రం పార్టీ పేరు మార్చే ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెబుతున్నారు.
అయితే ఎన్టీఆర్ కు, కేసీఆర్ కు ఉన్న తేడా ఏమిటి? ఈయన కంటే ఆయన ఏ విధంగా బెటర్? అంటారా. ఎన్టీఆర్ హయాంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. దాన్ని ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు సాధ్యం కావడంలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ ను ఎన్టీఆర్ బలంగా ఎదిరించడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులను ఎన్టీఆర్ ఆకర్షించాడు.
అప్పట్లో ప్రతిపక్షాలన్నీ కలిసి నేషనల్ లెవెల్లో యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. దానికి ఎన్టీఆర్ చైర్మన్ అయ్యారు. ఆ విధంగా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారనే చెప్పుకోవాలి. ఒక దశలో ఎన్టీఆర్ ప్రధాని అవుతాడనే ప్రచారం కూడా జరిగింది.
కానీ ఇప్పుడు కేసీఆర్ ఆనాటి ఎన్టీఆర్ లా నేషనల్ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ అంత నమ్మదగ్గ నాయకుడు కాదనే అభిప్రాయం జాతీయ రాజకీయాల్లో ఉంది. దేశ రాజకీయాల్లో అగ్గిపెడతానని. గాయిగాత్తర లేపుతానని చెలరేగిపోయాడు. దేశ రాజకీయాలను తాను శాసిస్తానని, ప్రధానిని అవుతానని సంకేతాలు ఇచ్చాడు.
దీంతో మమతాబెనర్జీ, స్టాలిన్, నితీశ్‌కుమార్, నవీన్ పట్నాయక్, కుమార స్వామి, కేజ్రీవాల్ మొదలైనవారంతా కేసీఆర్ ను దూరం పెట్టారు. వీళ్ళలో అవకాశం వస్తే ప్రధాని కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ మూడేళ్లపాటు అన్ని రాష్ట్రాలు చుట్టబెట్టి వారితో మంతనాలు సాగించాడు. కానీ ఎవరూ
స్పందించలేదు.
ఈయన కాంగ్రెస్ ను వదిలిపెట్టి మిగతా వారిని కలిసేసరికి కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. కారణాలు ఏవైనా కేసీఆర్ జాతీయ రాజకీయాల కల కల్లగా మిగిలిపోయింది. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ కంటే కేసీఆర్ హయాంలో బీజేపీ ఇంకా బలంగా ఉంది.
దాన్ని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. అందులోనూ ఎన్నో అంచనాలతో ఏర్పాటైన ఇండియా కూటమి కకావికలైంది. అంతకుముందు బీజీపీని వ్యతిరేకించిన కొన్ని ప్రాంతీయ పార్టీలు మళ్ళీ ఎన్డీయే కూటమిలో చేరాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ (ఎన్డీయే) అధికారంలోకి వచ్చి, మోడీ మూడోసారి ప్రధాని అయితే కేసీఆర్ ఇక ఎప్పటికీ జాతీయ రాజకీయాల ఆలోచన చేయకపోవచ్చు. ఆయనకు రాష్ట్రంలోనే మనుగడ కష్టంగా ఉంది.