గత పదేళ్లుగా పవన్‌కల్యాణ్‌కు నీడలా వెన్నంటి వుంటూ వస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో జనసేనలో ఒక్కసారిగా కుదుపు. నేరుగా పవన్‌కల్యాణ్ పేరుతో పంపిన రాజీనామా లేఖలో ఏముందో తెలుసుకుందాం
“జనసేన పార్టీలో నాకున్న పదవీ బాధ్యతలకు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇప్పటి వరకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు, పెద్దలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు”
జనసేనకు వెన్నుదన్నుగా నిలిచిన పోతిన మహేశ్‌ను కూడా పవన్‌కల్యాణ్ కాపాడులేకపోయారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటును పోతిన ఆశించారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ప్రశంసనీయమైన ఓట్లు దక్కించుకున్నారు. ఓడిపోయినప్పటికీ విజయవాడ వెస్ట్‌లో నిబద్ధత కలిగిన జనసైనికుడిగా ఆయన పని చేసుకుంటూ వచ్చారు. బీజేపీతో పొత్తు వల్ల ఆయన సీటుకు ఎసరు పెట్టారు.
నిజానికి విజయవాడ వెస్ట్ సీటు ఏ రకంగా చూసినా బీజేపీకి అనుకూలం కాదు. కానీ పోతిన మహేశ్ రాజకీయ భవిష్యత్‌ను అంతమొందించాలనే కుట్రతో బీజేపీకి సీటు ఇచ్చేలా చేశారనే చర్చ జరుగుతోంది. టీడీపీలో తమకు సీటు దక్కకపోయినా ఫర్వాలేదు, పోతినకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని పంతం పట్టి, అనుకున్నది సాధించారు.
అయితే తనకు నీడలా మొదటి నుంచి మంచీచెడులో నిలిచిన పోతినను కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్‌కల్యాణ్‌పై వుంది. అయితే నమ్మినోళ్లను నట్టేట మంచడంలో పవన్ సిద్ధహస్తుడనేందుకు అనేక ఉదంతాలున్నాయి. చివరికి పోతిన విషయంలోనూ అదే జరిగింది. అయితే జనసేనలో తనకు రాజకీయ భవిష్యత్ లేదని, నమ్మినోళ్లను పవన్ కాపాడుకోలేరని గ్రహించిన పోతిన మహేశ్, ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలియాల్సి వుంది.