మన దగ్గర సెన్సార్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. లాస్ట్ మినిట్‌లో కిందామీద పడి సెన్సార్‌కు వెళ్తారు, ఎలాగోలా పని అయిందనిపిస్తారు. పెంచిన టికెట్ రేట్లతో బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. కానీ ఇకపై ఈ ప్రాసెస్ నడవదు.
ఇప్పటికే సెన్సార్ బోర్డు తన పవర్ చూపిస్తోంది. ఈమధ్య కొన్ని సినిమాలకు సెగ తగిలింది కూడా. ఆఖరి నిమిషంలో టైటిల్ కూడా మార్చిన సందర్భాలున్నాయి. ఇకపై ఈ రూల్స్ మరింత కఠినతరం కాబోతున్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) జారీ చేసిన కొత్త అడ్వైజరీ మరింత కఠినమైన నిబంధనలకు తెరపైకి తెచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై అసంపూర్తిగా ఉన్న సినిమాలను సెన్సార్‌కు తీసుకోరు. పూర్తిస్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సినిమా రెడీ అయిన తర్వాతే సెన్సార్ అధికారులు చూస్తారు.
ఇకపై సినిమాలకు టైటిల్స్ మార్చే అధికారం బోర్డుకు సంక్రమించింది. దీనిపై చర్చలకు తావులేదు. అంతేకాదు, నిర్మాతలు ప్రకటించిన విడుదల తేదీతో సెన్సార్ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ల షెడ్యూల్ ప్రకారం సినిమాలకు సెన్సార్ చేస్తారు, విడుదల తేదీ దగ్గరపడిందంటూ నిర్మాతలు ఒత్తిడి తీసుకురావడానికి వీల్లేదు.
ఇప్పటికే టాలీవుడ్‌లో విడుదల తేదీలపై ఎప్పుడూ గందరగోళం నడుస్తూనే ఉంటుంది. ఇష్టమొచ్చినట్టు రిలీజ్ డేట్స్ ప్రకటించడం, ఆఖరి నిమిషంలో వాయిదా వేయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని కూడా మేకర్స్ ఓ ప్రచారంగా వాడుకుంటున్న రోజులివి. సెన్సార్ దగ్గర ఇకపై ఈ ఆటలు సాగవు.
నిర్మాతలు ప్రకటించిన విడుదల తేదీని సెన్సార్ బోర్డు లెక్కలోకి తీసుకోదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లాంటివి ఎంత ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నారో, ఇకపై సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా అంతే ముందస్తుగా షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా పూర్తి కాపీతో.
ప్రస్తుతం సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సెన్సార్‌కు దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన మార్పులు ఉంటే చివరి నిమిషంలో పూర్తి చేయడం లాంటివి జరుగుతున్నాయి.
కొన్ని సందర్భాల్లో సినిమా ఫైనల్ కాపీ సిద్ధంగా లేకపోయినా, తాత్కాలిక గ్రాఫిక్స్, పూర్తికాని విజువల్ ఎఫెక్ట్స్, బీజీఎం లేకుండానే సెన్సార్ ప్రాసెస్ చేస్తున్నారు. కొత్త అడ్వైజరీ ప్రకారం ఇలాంటి విధానాలకు ఇకపై అవకాశం ఉండదు.
సినిమా ఫైనల్ కాపీని సెన్సార్‌కు సమర్పించాలి. ఫైనల్ గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, తప్పనిసరి హెచ్చరికల టెక్ట్స్ కూడా జోడించి సెన్సార్‌కు రావాలి. అసంపూర్తిగా ఉండే కాపీని ఆఖరి నిమిషంలో తిరస్కరించే అధికారం సెన్సార్ బోర్డుకు ఉంటుంది.
కొత్త రూల్స్ ప్రభావం పెద్ద సినిమాలపై గట్టిగా పడేలా ఉంది. అసలే ఆఖరి నిమిషంలో సినిమాను చెక్కే బ్యాచ్ మనది. కంటెంట్ పంపించడానికి గంట ముందు కూడా కరెక్షన్లు చేస్తుంటారు. కొన్ని సినిమాలకు విడుదలకు కొన్ని గంటల ముందు వరకు కూడా గ్రాఫిక్స్ పనులు జరుగుతుంటాయి.
ఇప్పుడు ప్రతి అంశాన్ని పూర్తి చేసి, ఫైనల్ కాపీని సిద్ధం చేసిన తర్వాతే సెన్సార్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో నిర్మాతలు మరింత ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సి వస్తుంది.
ఈ నిబంధనల ప్రభావం, చిన్న, మిడ్-రేంజ్ సినిమాలపై కూడా పడే అవకాశం ఉంది. పరిమిత బడ్జెట్‌తో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చివరి వరకు కొనసాగించడం సాధారణం.
ముఖ్యంగా కొత్త దర్శకులు, చిన్న నిర్మాతలు ఇలాంటి పనుల్లో ఉంటారు. పైగా వీళ్లకు లాస్ట్ మినిట్ వరకు ఓటీటీ డీల్స్ పూర్తికావు. ఇలాంటి వాళ్లకు కూడా సెన్సార్ ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ఈ కొత్త అడ్వైజరీలో అత్యంత ఆసక్తికరమైన అంశం సినిమా టైటిల్‌కు సంబంధించింది. ఇప్పటివరకు నిర్మాతలు సినిమా టైటిల్‌ను ప్రకటించి, దాని చుట్టూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు, పాటలు, సోషల్ మీడియా ప్రచారం అన్నీ ఆ టైటిల్ చుట్టూనే తిరుగుతాయి. టైటిల్‌తోనే హ్యాష్‌ట్యాగ్ మొదలవుతుంది.
అలాంటి టైటిల్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. నిర్మాతలు ప్రచారంలో ఉపయోగించినా, సెన్సార్ దరఖాస్తులో పేర్కొన్నా, ఆ టైటిల్‌ను అంతిమంగా లెక్కలోకి తీసుకోమని CBFC స్పష్టం చేసింది.
తమ రూల్స్‌కు విరుద్ధంగా టైటిల్ ఉంటే, ఆఖరి నిమిషంలో దాన్ని మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది. అవసరమైతే రివైజింగ్ కమిటీ దానిని సమీక్షించి, మార్చే అవకాశం ఉంటుంది. ఓ సినిమాకు పూర్తిగా టైటిల్ మార్చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.
మరో కీలకమైన మార్పు దరఖాస్తు స్వీకరణ తేదీ. సినిమాను సెన్సార్‌కు సమర్పించిన రోజును కాకుండా, ఆ దరఖాస్తు పూర్తిస్థాయిలో ఉందని CBFC ఆమోదించిన రోజును మాత్రమే దరఖాస్తు స్వీకరణ తేదీగా పరిగణిస్తారు. అంటే, కౌంట్ అక్కడ్నుంచి మొదలవుతుందన్నమాట.
నిర్మాత ఈక్వేషన్లన్నింటినీ మార్చేసే కీలక నిర్ణయం ఇది. ఎందుకంటే ఒక నిర్మాత విడుదలకు నెల రోజుల ముందే దరఖాస్తు చేసి ఉండొచ్చు. కానీ ఆ తేదీ లెక్కలోకి రాదు. ఆ అప్లికేషన్‌ను బోర్డు ఆమోదించే రోజు నుంచి అసలైన లెక్క.
సరిగ్గా విడుదలకు వారం ముందు బోర్డు, అప్లికేషన్‌ను ఆమోదించి, ఆ తర్వాత సెన్సార్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, విడుదల తేదీ ప్రమాదంలో పడినట్టే.
పెద్ద సినిమాలకు సంక్రాంతి, దసరా, వేసవి సెలవులు వంటి మెయిన్ సీజన్లను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. 2-3 సినిమాలు ఒకే స్లాట్ ప్రకటించిన సందర్భాలు చాలా కామన్. ఇలాంటి పరిస్థితుల్లో సెన్సార్ ఆలస్యమైతే వాటిలో ఏదో ఒక సినిమా అనివార్యంగా వాయిదా పడాల్సిందే.
అప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో అగ్రిమెంట్లు చేసుకున్న నిర్మాతలకు, థియేటర్లతో ఒప్పందాలు చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక నష్టం తప్పదు. అంతేకాదు, ఓవర్సీస్ మార్కెట్‌లో అప్పటికే ప్రీమియర్స్ కోసం టికెట్లు అమ్మితే, ఆ ప్రభావం కూడా సినిమాపై పడుతుంది.
తెలుగు నిర్మాతలు, దర్శకులు ఈ కొత్త రూల్స్‌ను ఎంత నిశితంగా గమనిస్తే అంత మంచిది. ముఖ్యంగా సినిమా విడుదలకు చాలా రోజుల ముందే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకోవడం అత్యుత్తమం.
అలా చేయాలంటే ఫైనల్ కాపీని సిద్ధం చేయాలి. అలా చేయాలంటే, గ్రాఫిక్స్ వర్క్ సకాలంలో పూర్తికావాలి, అనుకున్న టైమ్ కంటే ముందే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తికావాలి. ఇవన్నీ జరగాలంటే సకాలంలో షూటింగ్ పూర్తికావాలి.
చూస్తుంటే, సెన్సార్ రూల్స్ టోటల్ టాలీవుడ్ ప్రొసీజర్‌నే సమూలంగా మార్చేసేలా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు తెలుగు చిత్ర పరిశ్రమకు భారంగా మారతాయా? లేక మరింత క్రమబద్ధమైన పద్ధతిలోకి పరిశ్రమను తీసుకొస్తుందా అన్నది, ఈ రూల్స్ ఎంత పారదర్శకంగా, సమర్థంగా అమలవుతాయనే అంశంపై ఆధారపడి ఉంటుంది.

Thank you for the rules , mow can demand more vittam