మూవీ రివ్యూ: ఆకాశంలో ఒక తార

దుల్కర్ సల్మాన్ సినిమా అంటే కంటెంట్ కచ్చితంగా రిచ్ గా ఉంటుందనే అభిప్రాయం ఉండనే ఉంది.

సినిమా: ఆకాశంలో ఒక తార
రేటింగ్: 3/5
నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా
తారాగణం: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, మహేష్ ఆచంట, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు.
కథ: పవన్ సాధినేని, వసంత్ జుర్రు
స్క్రీన్‌ప్లే: గున్నం గంగరాజు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
ప్రొడక్షన్ డిజైనర్: శ్వేత సాబు సిరిల్
నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం
దర్శకత్వం: పవన్ సాధినేని
విడుదల తేదీ: నవంబర్ 20, 2026

దుల్కర్ సల్మాన్ సినిమా అంటే కంటెంట్ కచ్చితంగా రిచ్ గా ఉంటుందనే అభిప్రాయం ఉండనే ఉంది. దానికి తోడు టేస్ట్ ఉన్న పెద్ద నిర్మాతలు కూడా కలిసి రావడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఎలా ఉందో, ఏ అనుభూతినిచ్చిందో చూద్దాం.

కథలోకి వెళితే..కృష్ణ (దుల్కర్ సల్మాన్) కల్పన (సాత్విక వీరవల్లి)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లయిన మొదటి రాత్రే తన భార్యకు కేవలం 16 ఏళ్లేనని తెలుసుకుని షాక్ అవుతాడు.

మరోవైపు కల్పనకు బాగా చదువుకోవాలని, భవిష్యత్తులో ఆస్ట్రోనాట్ కావాలని పెద్ద కల ఉంటుంది. కానీ ఆమె తండ్రి మాత్రం ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసేస్తాడు.

కానీ తన భార్య ప్రతిభను తెలుసుకున్న కృష్ణ… ఆమె కలను నిజం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం తన ఆశయాలను పక్కనపెట్టి, డ్రైవర్‌గా ఎక్కువ గంటలు పనిచేస్తూ, కల్పన చదువుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎన్నో త్యాగాలు చేస్తాడు.

మరి కల్పన తన ఆస్ట్రోనాట్ కావాలనే కలను నిజం చేసుకుంటుందా? ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురయ్యే అడ్డంకులు ఏంటి? తన భార్య కలను నిజం చేయడానికి కృష్ణ ఎంతవరకు వెళ్తాడు? అనేదే మిగతా కథ.

ఈ కథ వింటుంటే సగటు స్పోర్ట్స్ డ్రామాకి స్పేస్ డ్రామా రంగు వేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి ప్రతి కథలోను..ఆశయం, అడ్డంకులు, ఆశాభావం, ఇబ్బందులు, సాధన, వెక్కిరింపులు, ఎదిగే క్రమంలో వెనక్కి లాగే శక్తులు, వైఫల్యాలు, చివరకి విజయం..అందరికీ ఆనందబాష్పాలు, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపాలు. “దంగల్” నుంచి ఎన్నో సినిమాల్లో ఈ గ్రాఫ్ చూసినదే. అయినప్పటికీ అనుభూతి కలిగించడానికి ఈ ఎలిమెంట్స్ నే ఎంత చక్కగా వాడారో అనిపిస్తుంది.

ప్రముఖంగా ఇది హ్యూమన్ ఎమోషన్స్ ని రక్తికట్టించిన చిత్రం

– ఒక భర్త-ఒక భార్య మధ్యన ఉండాల్సిన ఆదర్శమైన బంధం
– ఒక తమ్ముడు-ఒక అక్క మధ్యన ఉన్న చిన్ననాటి భావోద్వేగం
– ఒక కూతురు-ఒక తండ్రి మధ్యన ద్వేషంతో మొదలయ్యి పశ్చాత్తాపంతో ముగిసే ఘట్టం
– ఒక కూతురికి- ఒక తల్లికి మధ్యన ఉండే సహజమైన ప్రేమబంధం
– ఒక ధనికురాలైన బాస్ కి- ఒక సాధారణ డ్రైవర్ కి మధ్యన ఉండాల్సిన స్నేహభావం
– ఒక ఆశయాన్ని అందుకున్న వ్యక్తికి- ఆ ఆశయాన్ని రగిలించిన వ్యక్తికి మధ్యన వెలిగిన కృతజ్ఞత అనే దీపం

ఇలా ఈ చిత్రంలో ఎన్నో గుండెని తడతాయి. అవే కథనంలో ఆత్మను నింపాయి. ఎలాంటి కథనైనా ఇలాంటి మానవ సంబంధాల మధ్యన నడిపినప్పుడు రక్తికడుతుంది.

అన్నిటికంటే మించి, ఇలాంటి ఎమోషన్స్ పండించడానికి చక్కని ప్రతిభ ఉండే నటీనటులు కావాలి. అలాంటి వాళ్లని ఎంచుకోవడంతోనే దర్శకుడు పాసైపోయాడు. ఇక వాళ్లచేత కావాల్సిన నటన రాబట్టుకోవడంతో కృతకృత్యుడయ్యాడు.

దుల్కర్ సల్మాన్ ఎంతో సహజంగా నటించాడు. ఇలాంటి సాత్వికమైన పాత్రలకి అతను అద్భుతంగా న్యాయం చేస్తాడని ఊహించడం కష్టమేమీ కాదు.

కొత్తమ్మాయి సాత్విక వీరవెల్లి ఎంతో అనుభవమున్న నటిలా కనిపించింది, నటించింది. తొలి చిత్రమే దుల్కర్ లాంటి నటుడితో చేయడమంటే సాధారణమైన అవకాశం కాదు. దానిని పూర్తిగా సద్వినియోగపరచుకుంది.

శృతిహాసన్ సెకండాఫులో వచ్చి తన ఉనికి చాటింది.

శ్వాసికది రెండు షేడ్స్ ఉన్న సగటు అక్క పాత్ర. “ఇరుముడి”లో లేడీ విలన్ పాత్రతో పాపులర్ అయిన ఈమె, ఇందులో కేరెక్టర్ రోల్ ని చాలా బాగా చేసింది.

మురళిశర్మది సగం ఉడికిన పాత్రలా ఉంది. ఇలాంటి సినిమాల్లో ఇలాంటి పాత్ర ఒకటి ఉండాలని పెట్టినట్టు ఉన్న పాత్ర ఇది.

హీరోయిన్ తండ్రిగా నటించిన కోట జయరాం గుర్తుండిపోయే పాత్ర చేసాడు.

బిజిలీగా రుహానీ శర్మ కూడా నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్రలో చక్కగా సరిపోయింది. సినిమాలో ఆమె డైలాగ్ డెలివరీ కూడా బాగుంది.

జి.వి. ప్రకాష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్లలో ఒకటి. కథలోని పాజిటివ్ ఫీల్‌ను అర్థం చేసుకుని, సన్నివేశాలకు తగ్గట్టుగా మంచి మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆ సన్నివేశాల ప్రభావాన్ని మరింత పెంచారు. కథనం కూడా ఎక్కడా నెమ్మదించకుండా ముందుకు సాగడానికి ఆయన సంగీతం బాగా ఉపయోగపడింది.

సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

అంతరిక్షం, రాకెట్‌కు సంబంధించిన సన్నివేశాల కోసం నిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్‌పై కూడా బాగానే ఖర్చు పెట్టారు. దీంతో ఆ సన్నివేశాలకు కావాల్సిన గ్రాండియర్ తెరపై కనిపిస్తుంది.

ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా సింపుల్‌గా, కథకు అవసరమైన విధంగా సాగుతుంది. అనవసరమైన హంగులకు పోకుండా కథనానికి ఎడిటింగ్ చక్కగా సహకరించింది.

ఇలాంటి చిత్రాలు రావడం చాలా అరుదు. వచ్చినా ఆర్ట్ ఫిలంస్ లాగానో, బలవంతపు సందేశాత్మక చిత్రాలుగానో మిగిలిపోయి జనంలోకి వెళ్లవు. ఈ చిత్రం అలా కాకుండా కమర్షియల్ వేల్యూతో తెరకెక్కిన మంచి సందేశాత్మక చిత్రం. మహిళా సాధికారత, బాలికల విద్య ఇందులో ప్రధానమైన అంశం.

దర్శకుడు పవన్ సాధినేని చాలా సింపుల్ పాయింట్‌ను తీసుకుని, దాని చుట్టూ మంచి ఎమోషన్స్‌తో కూడిన కథను అల్లుకున్నారు.

అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాలు, రాకెట్ లాంచ్ ఎపిసోడ్స్‌ను పవన్ సాధినేని తెరకెక్కించిన విధానం ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. సైన్స్‌కు సంబంధించిన కష్టమైన పదాలను కూడా సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించారు.

అయితే కథ ఎటు వెళ్తుందనేది ముందుగానే ఊహించగలిగేలా ఉంది. కల్పన రాకెట్లు ప్రయోగించే ప్రయత్నంలో మొదట్లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటుందని, టీమ్‌కు కూడా కొన్ని ప్రొఫెషనల్ సమస్యలు వస్తాయని సులభంగానే అర్థమైపోతుంది. పైగా పై అధికారుల నుంచి కూడా అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించవచ్చు. ఆ ప్రెడిక్టిబిలిటీ ఒక్కటే ఇక్కడ చెప్పుకోదగ్గ మైనస్. దాంతో పాటు..ఒక ప్రయోగం ఫెయిలైందని విద్యార్థిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయడం అంత కన్విన్సింగ్ గా లేదు. ఇక్కడ వీక్ రైటింగ్ అనిపించుకుంది.

సినిమాలో హైలైట్ గా నిలిచే సీన్స్ లో ఒకటి..కల్పన కోసం శ్రుతి హాసన్ పాత్ర వెతికే సన్నివేశం. ఇలాంటి సింపుల్ సీన్స్ సెకండాఫ్‌లో బాగా వర్కౌట్ అయ్యాయి.

సంభాషణల్లో కొన్ని ఉన్నతంగా ఉన్నాయి:
– డ్రీంస్ డోంట్ ఆస్క్ యువర్ పిన్ కోడ్
– రాకెట్ ని పైకి పంపే సమయంలో ఒక సైలెంట్ ప్రొపెలర్ ఉంటుంది. అలాంటి వాడివి నువ్వు.
– ఆకాశమంత ఎత్తైన మనిషి భుజాల మీద ఎక్కి నేను అంతరిక్షాన్ని అందుకున్నాను
– నిన్ను నీ ప్లానెట్ మీదకి లాక్కురావడానికి ఇంత జి-ఫోర్స్ వాడాల్సి వచ్చింది.

ఇలాంటివి ఇకా ఉన్నాయి.

సినిమాలో పెద్ద పెద్ద ట్విస్టులు, ఊహించని మలుపులు ఏమీ ఉండవు. కానీ ఎమోషన్స్ పండాయి. అదే ప్లస్. చివర్లో “ఇంటర్ స్టెల్లార్” లో ఒక సన్నివేశాన్ని గుర్తు చేసే బిట్ కూడా ఉంది. సందర్భోచితంగా అది బాగా వర్కౌట్ అయింది.

మొత్తంగా చెప్పాలంటే “ఆకాశంలో ఒక తార” మంచి ఉద్దేశంతో తెరకెక్కిన సినిమా. అందమైన సందేశం, సింపుల్ కథ, పాజిటివ్ ఆలోచనలు, సహజమైన పాత్రలతో సినిమా ఆకట్టుకుంటుంది. కథనంలో కొన్ని లోపాలు, అక్కడక్కడా నెమ్మదించే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. ఇది ఎక్కడా అశ్లీలం లేకుండా సంపూర్ణ సకుటుంబ సపరివార చిత్రం… ఇంటిల్లిపాది చూడదగ్గ చిత్రం.

బాటం లైన్: భావోద్వేగభరితం

3 Replies to “మూవీ రివ్యూ: ఆకాశంలో ఒక తార”

  1. Thank you. ఇలాంటి సినిమా థియేటర్ లో చూడాలి. అప్పుడే మంచి సినిమా కి మనవంతు ప్రోత్సాహం అందించిన వాళ్ళం అవుతాం. ఇవాళే చూస్తాం 

Comments are closed.