న్యాయవ్యవస్థ: అమెరికాలో అలా- ఇండియాలో ఇలా

ఈ దేశంలో ఒక సామాన్యుడు, అధికారంలో ఉన్నవారి పలుకుబడి గురించి భయపడకుండా, తనకు అన్యాయం జరిగితే న్యాయం జరుగుతుందనే పూర్తి నమ్మకంతో జీవించగలుగుతున్నాడా?

ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి ఎంత శక్తివంతుడైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత పలుకుబడి ఉన్నవాడైనా, ఒక రాజకీయ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నా… చివరికి రాజ్యాంగం ముందు అందరూ సమానమే.

అధికారంలో ఉన్న వ్యక్తి తీసుకున్న నిర్ణయం తప్పయితే, దాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది.

ఆ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే, దాన్ని నిలిపివేసే బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది.

అందుకే ప్రజాస్వామ్యంలో మూడు వ్యవస్థలు అత్యంత కీలకం.

శాసన వ్యవస్థ… కార్యనిర్వాహక వ్యవస్థ… న్యాయవ్యవస్థ.

ఇంగ్లీషులో వీటినే లెజిస్లేచర్.. ఎగ్జిక్యూటివ్.. జుడీషియరీ అంటాం!

ఈ మూడింటిలో ఏ ఒక్కటి బలహీనపడినా ప్రజాస్వామ్యానికి ప్రమాదమే.

కానీ ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి.

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలను అక్కడి న్యాయస్థానాలు ప్రశ్నించగలుగుతున్నప్పుడు, భారతదేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నించడంలో న్యాయవ్యవస్థ ఎందుకు ఆలస్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది? ఎందుకు మౌనం వహిస్తోంది? ఎందుకు చూసీ చూడనట్లుగా వదిలేస్తోంది?

అమెరికా ప్రజాస్వామ్యం పూర్తిగా ఆదర్శవంతమైనదని చెప్పడం లేదు.

అక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. న్యాయమూర్తుల నియామకాలపై రాజకీయ వివాదాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయాలు కూడా తీసుకుంది.

అయితే ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తోంది.

అమెరికాలో అధ్యక్షుడి నిర్ణయాన్ని సవాలు చేయడానికి న్యాయస్థానాలు వెనుకాడటం లేదు. దిగువ కోర్టుల నుంచి అప్పీళ్ల కోర్టుల వరకు, అవసరమైనప్పుడు సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వ నిర్ణయాలు న్యాయపరిశీలనకు వస్తున్నాయి.

మరి భారతదేశంలో పరిస్థితి ఏమిటి?

ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, 2025 నుంచి ఆయన ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

వాటిలో కొన్ని నిర్ణయాలను అమెరికా ఫెడరల్ కోర్టులు అడ్డుకున్నాయి. మరికొన్నింటిపై తాత్కాలిక నిషేధాలు విధించాయి. కొన్ని సందర్భాల్లో అప్పీళ్ల కోర్టులు, సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా కూడా తీర్పులిచ్చాయి.

అంటే అక్కడ కూడా న్యాయవ్యవస్థలో విభేదాలు, రాజకీయ చర్చలు ఉన్నాయి.

అయితే ప్రభుత్వ నిర్ణయాలు కోర్టుల పరిశీలనకు అతీతం కావు.

మొదటిది… అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం కల్పించే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అంశం.

ట్రంప్ అధ్యక్షుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కొన్ని వర్గాల అమెరికాలో జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కల్పించకూడదని ప్రయత్నించారు.

దీనిపై రాజ్యాంగపరమైన సవాళ్లు వచ్చాయి. ఫెడరల్ కోర్టులు ప్రభుత్వ చర్యలను అడ్డుకున్నాయి.

రెండోది… అక్రమ వలసదారుల బహిష్కరణ.

అమెరికా ప్రభుత్వం కొంతమంది వలసదారులను తమ దేశాలకు పంపే ప్రయత్నం చేసింది.

కానీ కోర్టులు ఒక ముఖ్యమైన ప్రశ్న వేశాయి.

ఒక వ్యక్తిని అతను భయపడుతున్న దేశానికి పంపితే, అక్కడ అతని ప్రాణాలకు ప్రమాదం ఉంటే, తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా ఎలా పంపిస్తారు?

ఇది కేవలం వలసల సమస్య కాదు. ఇది మానవ హక్కులు, న్యాయపరమైన ప్రక్రియ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని కోర్టు మొట్టికాయ వేసింది.

మూడోది… అమెరికాలో ప్రభుత్వ నిధుల నిలిపివేత.

ట్రంప్ ప్రభుత్వం అనేక ఫెడరల్ గ్రాంట్లు, పరిశోధన నిధులు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన నిధులపై ఆంక్షలు విధించింది.
దీనిపై విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించాయి.
కొన్ని కోర్టులు ప్రభుత్వ చర్యలను నిలిపివేశాయి.

నాలుగోది… మీడియా స్వేచ్ఛ.

వైట్‌హౌస్‌లో అసోసియేటెడ్ ప్రెస్ వంటి వార్తా సంస్థలకు యాక్సెస్ విషయంలో ఆంక్షలు విధించినప్పుడు, ఆ సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి.

ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలకు శిక్ష విధించే అధికారం అధ్యక్షుడికి ఉందా అనే ప్రశ్న వచ్చింది. ఈ విషయంలో ఇండియా సంగతి ఎలా ఉందో మనకు తెలుసు.

ఐదోది… న్యాయవాద సంస్థలపై చర్యలు.

ట్రంప్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే కొన్ని న్యాయవాద సంస్థలపై భద్రతా అనుమతులు, ప్రభుత్వ భవనాల్లో ప్రవేశం వంటి అంశాల్లో ఆంక్షలు విధించబడ్డాయి.

కోర్టులు వాటిలో కొన్ని చర్యలను రాజ్యాంగ విరుద్ధమైన ప్రతీకార చర్యలుగా గుర్తించాయి.

ఆరోది… టారిఫ్‌లు.

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం భారీ సుంకాలు విధించింది.

అయితే అధ్యక్షుడికి అత్యవసర ఆర్థిక అధికారాల పేరుతో ఇంత విస్తృతమైన టారిఫ్‌లు విధించే అధికారం ఉందా అనే ప్రశ్న కోర్టుకు వెళ్లింది.

అమెరికా సుప్రీంకోర్టు 2026లో ఈ టారిఫ్‌లకు ఉపయోగించిన చట్టం అధ్యక్షుడికి ఆ స్థాయిలో అధికారం ఇవ్వదని తీర్పు ఇచ్చింది.

ఇది చాలా కీలకమైన విషయం.

దేశాధ్యక్షుడు తీసుకున్న ఆర్థిక నిర్ణయం కూడా రాజ్యాంగం, చట్టాల పరిధిలోనే ఉండాలి.

ఏడోది… ఎన్నికల నిర్వహణలో అధ్యక్షుడి జోక్యం.

ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ ఎన్నికల విధానాల్లో మార్పులు చేయాలని ప్రయత్నించింది. ఓటరు నమోదు, పౌరసత్వ ధ్రువీకరణ వంటి అంశాల్లో అధ్యక్షుడి ఆదేశాల ద్వారా కొత్త నిబంధనలు తీసుకురావాలని చూసింది. ఇది ప్రస్తుతం ఇండియాలోని అస్.ఐ.ఆర్ ప్రక్రియని గుర్తుచేస్తుంది.

అయితే ఎన్నికల నిర్వహణపై అధికారాలు ఎవరికి ఉన్నాయి? అధ్యక్షుడికి ఉన్న అధికారాలకు హద్దులు ఏమిటి? కాంగ్రెస్ అధికారాలను కార్యనిర్వాహక వ్యవస్థ స్వాధీనం చేసుకోవచ్చా?

అనే ప్రశ్నలపై కోర్టుల్లో సవాళ్లు వచ్చాయి.

ఇవన్నీ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

అధ్యక్షుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డాడని, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం చట్టబద్ధమైపోదు.

ప్రజల మద్దతు ఒక రాజకీయ అధికారం. రాజ్యాంగం మరో హద్దు.

ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడటమే న్యాయవ్యవస్థ బాధ్యత.

ఇప్పుడు మన దేశం విషయానికి వద్దాం.

భారతదేశంలో సుప్రీంకోర్టు గొప్ప తీర్పులు ఇవ్వలేదా?

ఇచ్చింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వలేదా?

ఇచ్చింది.

అయితే ప్రశ్న వేరే.

అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన రాజ్యాంగ సమస్యలు వచ్చినప్పుడు, వాటిని పరిష్కరించడంలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది?

ఎందుకు కొన్ని కేసుల్లో ప్రజలకు వెంటనే న్యాయం అందడం లేదు?

ఎందుకు సామాన్యుడికి న్యాయవ్యవస్థ తన పక్షాన నిలబడుతుందనే నమ్మకం కొన్నిసార్లు తగ్గుతోంది?

దీనికి సంబంధించి ఐదు ముఖ్యమైన ఉదాహరణలు పరిశీలిద్దాం.

మొదటిగా.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం భారత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఉదాహరణ.

రాజకీయ పార్టీలకు ఎవరు ఎంత డబ్బు ఇస్తున్నారు? ఏ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇస్తోంది? అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఇచ్చిన కంపెనీలకు ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ఏమైనా ప్రయోజనాలు కలుగుతున్నాయా?

ఇవన్నీ తెలుసుకునే హక్కు ఓటరుకు లేదా?

2018లో ఎలక్టోరల్ బాండ్ల విధానం ప్రారంభమైంది.

దాతల వివరాలు ప్రజలకు తెలియకుండా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వగలిగే విధానం అమల్లోకి వచ్చింది.

ఈ విధానాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

2019లో కూడా ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కానీ తక్షణమే పూర్తి స్థాయి తుది తీర్పు రాలేదు.

ఈలోగా దేశంలో ఎన్నికలు జరిగాయి. రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించాయి.

చివరకు 2024 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.

రాజకీయ విరాళాల విషయంలో ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.

ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన చారిత్రాత్మక తీర్పు.

కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది.

ఇదే తీర్పు రెండేళ్లు, మూడేళ్లు ముందే వచ్చి ఉంటే ప్రజలకు మరింత ముందుగానే సమాచారం లభించేది కదా?

రాజకీయ విరాళాల పారదర్శకత ఎన్నికల ప్రజాస్వామ్యానికి ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి.

రెండోది.. మణిపుర్ అంశం..

2023 మే నెలలో మణిపూర్‌లో ప్రారంభమైన జాతి ఘర్షణలు దేశాన్ని కుదిపేశాయి.

హత్యలు, ఇళ్లు తగలబెట్టడం, మహిళలపై లైంగిక దాడులు, ప్రజల నిరాశ్రయత్వం…

సామాజిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

దేశమంతా దిగ్భ్రాంతికి గురిచేసిన మహిళలపై దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తరువాత పరిస్థితి మరింత తీవ్రంగా చర్చకు వచ్చింది.

అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది.

ఒక రాష్ట్రంలో ఇంతటి హింస జరుగుతుంటే, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఎక్కడ ఉంది?

చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ ఎక్కడ ఉంది?

వెంటనే స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఉంది?

న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు సుప్రీంకోర్టు నుంచి తక్షణ రక్షణ ఎందుకు అందడం లేదు?

సుప్రీంకోర్టు తరువాత జోక్యం చేసుకుంది. దర్యాప్తు వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయని గుర్తించింది. కేసుల దర్యాప్తు, బాధితుల పునరావాసం వంటి అంశాలను పర్యవేక్షించింది.

2026లో కూడా మణిపూర్ హింసకు సంబంధించిన కేసులపై సీ.బీ.ఐ నుంచి స్టేటస్ రిపోర్టు కోరింది.

అంటే న్యాయస్థానం అసలు జోక్యం చేసుకోలేదని చెప్పడం తప్పు.

కానీ ప్రజలు అడిగే ప్రశ్న వేరే.

ఇంతటి మానవ విషాదం ప్రారంభమైన వెంటనే, మరింత వేగంగా, మరింత ప్రభావవంతంగా న్యాయపరమైన జోక్యం జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదా?

ఒక సాధారణ పౌరుడికి తన ప్రాణం, తన కుటుంబం, తన ఆస్తి రక్షణకు రాజ్యాంగం ఉందనే నమ్మకం ఉండాలి.

మణిపూర్ సంఘటనలు ఆ నమ్మకాన్ని తీవ్రంగా వమ్ము చేసాయి.

ఇక మూడోది.. ఎన్నికల కమిషన్ నియామకాలు

భారతదేశంలో ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన రాజ్యాంగ సంస్థ.

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత దానిదే.

2023లో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది.

ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సిఫారసు చేయాలని, పార్లమెంట్ చట్టం చేసే వరకు ఈ విధానం కొనసాగాలని పేర్కొంది.

కానీ తరువాత పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

ఆ చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో ప్రధానమంత్రితో పాటు ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం తొలగించబడింది.

దీంతో ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తాయి.

ఎన్నికలను నిర్వహించే సంస్థ నియామకాల్లో ప్రభుత్వానికే అధిక ప్రభావం ఉంటే, దాని స్వతంత్రత ఎలా కాపాడబడుతుంది?

2026 మేలో సుప్రీంకోర్టు ఈ చట్టంపై జరుగుతున్న విచారణలో పార్లమెంట్ చట్టం చేయడంలో ఆలస్యాన్ని, ఎన్నికైన ప్రభుత్వాల ఆధిపత్యంపై ప్రశ్నలను లేవనెత్తింది.

కాబట్టి ఈ అంశంలో న్యాయవ్యవస్థ పూర్తిగా మౌనంగా ఉందని చెప్పలేం.

కానీ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత దాని రాజ్యాంగబద్ధతపై స్పష్టమైన తుది నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఈ విషయంపై కోర్ట్ స్పందన కూడా 2029 ఎన్నికల తర్వాతే వస్తుందేమో.

నాలుగోది .. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు

2024లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో అవినీతి ఆరోపణలు వచ్చాయి.

కేజ్రీవాల్ అరెస్టు రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది.

ప్రతిపక్షాలు కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించాయి.

ప్రభుత్వం మాత్రం అవినీతి ఆరోపణలపై చట్ట ప్రకారం దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది.

ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే…

ఒక రాజకీయ నాయకుడిపై అవినీతి ఆరోపణలు ఉంటే దర్యాప్తు జరగకూడదా?

తప్పకుండా జరగాలి.

కానీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు అరెస్టు కావడం, విచారణకు ముందే దీర్ఘకాలం జైలులో ఉండటం, దర్యాప్తు సంస్థల స్వతంత్రతపై ఆరోపణలు రావడం…

ఇవన్నీ ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతకు సంబంధించిన అంశాలు.

అవినీతిపై పోరాటం అవసరమే. కానీ ఆ పోరాటం రాజకీయ ప్రత్యర్థులపై మాత్రమే కేంద్రీకృతమైందనే అనుమానం కూడా రాకూడదు.

ఐదోది… విద్వేష ప్రసంగాలు ..హేట్ స్పీచ్.

ఇది చాలా సున్నితమైన విషయం.

భారతదేశంలో మతం, కులం, భాష ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు వచ్చినప్పుడు చట్టం కఠినంగా పనిచేయాలి.

అది ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు.

అధికార పార్టీ నాయకుడైనా కావచ్చు.

ప్రతిపక్ష నాయకుడైనా కావచ్చు.

సాధారణ పౌరుడైనా కావచ్చు.

కానీ ప్రజల్లో ఒక ఆందోళన ఉంది.

ఒక సామాన్యుడు ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తే వెంటనే కేసులు నమోదు అవుతున్నాయనే భావన ఉంది.

అదే రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు ఆలస్యమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే.

న్యాయం అంటే ఒక మతానికి అనుకూలంగా ఉండటం కాదు.

ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండటం కాదు.

ఎవరైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చట్టం ముందు నిలబడాల్సిందే.

కానీ అలా జరుగుతున్నట్టు అనిపించడంలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి…

ఒక్క సారి తెలంగాణా రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం.

ఒక సామాన్యుడి జీవితంలో అత్యంత విలువైన ఆస్తి ఏమిటి?

అతను కష్టపడి సంపాదించిన ఇల్లు.

అతని తండ్రి నుంచి వచ్చిన భూమి.

అతని తల్లి పేరుతో ఉన్న స్థలం.

అతని కుటుంబం తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన ఆస్తి.

అలాంటి భూమిని ఎవరైనా నకిలీ పత్రాలతో కబ్జా చేస్తే ఆ వ్యక్తి ఎవరిని ఆశ్రయించాలి?

పోలీసులను ఆశ్రయించాలి.

రెవెన్యూ అధికారులను ఆశ్రయించాలి.

రిజిస్ట్రేషన్ శాఖను ఆశ్రయించాలి.

చివరికి కోర్టును ఆశ్రయించాలి.

కానీ ఈ వ్యవస్థల్లో ఎక్కడైనా పలుకుబడి, రాజకీయ ఒత్తిడి పనిచేస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటి?

తెలంగాణలో ఇటీవల నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు వారసత్వ పత్రాలు, భూముల అక్రమ బదిలీలకు సంబంధించిన పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో మరో భూ ఆక్రమణ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులకు సంబంధం ఉందని, మీడియా పరిశీలనలో ఆ ఆరోపణలు బయటపడ్డాయని, ఇతరులను మాత్రమే అరెస్టు చేసి రాజకీయంగా పలుకుబడి ఉన్నవారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటివి జరుగుతున్నప్పుడు పోలీసులు, కోర్టులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాయా అనే అనుమానాలు సామాన్యులకి వస్తాయి. వాటిని అడ్రెస్ చేయాల్సిన బాధ్యత కోర్టులకి ఉండదా?

కాంగ్రెస్ నాయకుడైనా, బీజేపీ నాయకుడైనా, బీఆర్ఎస్ నాయకుడైనా, ఇతర పార్టీ నాయకుడైనా…

నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో భూమి కాజేసినట్లు ఆధారాలు ఉంటే విచారణ జరగాలి.

తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం శిక్ష పడాలి.

రాజకీయ పార్టీ పేరు చూసి కేసు పెట్టకూడదు.

రాజకీయ పార్టీ పేరు చూసి కేసు పెట్టకుండా కూడా ఉండకూడదు.

ఇదే చట్టబద్ధమైన పాలన.

సామాన్యుడికి కావాల్సింది పెద్ద పెద్ద ప్రకటనలు కాదు.

ఏ సమస్యతోనైనా కోర్టుకు వెళితే తన కేసు రాజకీయ పలుకుబడితో ప్రభావితం కాదనే విశ్వాసం.

ఈ నమ్మకమే ప్రజాస్వామ్యానికి పునాది.

ఇప్పుడు ఈ మొత్తం చర్చలోని అసలు అంశాన్ని అర్థం చేసుకుందాం.

అమెరికాలో అధ్యక్షుడి అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

అదే విధమైన రాజ్యాంగ స్ఫూర్తి మన దేశంలో కూడా ప్రతి స్థాయిలో కనిపించాలని కోరుకోవాలి.

భారతదేశానికి కావాల్సింది ఏ పార్టీకి అనుకూలమైన న్యాయవ్యవస్థ కాదు.

ప్రజలకు అనుకూలమైన న్యాయవ్యవస్థ.

ప్రభుత్వానికి అనుకూలమైన న్యాయం కాదు.

రాజ్యాంగానికి అనుకూలమైన న్యాయం.

ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు అతని వెనుక ఎమ్మెల్యే ఉన్నాడా అని అడగకూడదు.

కోర్టుకు వెళ్లినప్పుడు అతని వెనుక ఎంత డబ్బు ఉంది అని చూడకూడదు.

తన ఆస్తి కోసం పోరాడుతున్నప్పుడు అతని రాజకీయ పరిచయాలు ఏమిటో పరిశీలించకూడదు.

అతని దగ్గర న్యాయం కోరే హక్కు మాత్రమే ఉండాలి.

అదే ప్రజాస్వామ్యం.

అదే రాజ్యాంగం.

అదే నిజమైన స్వతంత్ర భారతదేశం.

చివరిగా ఒక్క ప్రశ్న…

ఈ దేశంలో ఒక సామాన్యుడు, అధికారంలో ఉన్నవారి పలుకుబడి గురించి భయపడకుండా, తనకు అన్యాయం జరిగితే న్యాయం జరుగుతుందనే పూర్తి నమ్మకంతో జీవించగలుగుతున్నాడా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది రాజకీయ నాయకులు కాదు.

న్యాయవ్యవస్థ చెప్పాలి…

అప్పుడే స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నందుకు ప్రతి పౌరుడు గర్వపడేది.

– శ్రీనివాసమూర్తి

One Reply to “న్యాయవ్యవస్థ: అమెరికాలో అలా- ఇండియాలో ఇలా”

Comments are closed.