ప్రజల కంటే వ్యవస్థల్నే చంద్రబాబునాయుడు నమ్ముకున్నారు. వ్యవస్థల సహకారం లేనిదే కూటమి విజయం సాధించలేదనేది ఆయన గట్టి విశ్వాసం. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి ప్రధాన ఎజెండా కూడా అదే. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తనకు అధికారం తెచ్చి పెడుతుందని ఆయన అనుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే, తన చేతిలోని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని చంద్రబాబు భయపడుతున్నారు.
దీంతో ఆయన వ్యవస్థల సహకారం కోసం పరితపిస్తున్నారు. కేవలం జనసేనతోనే పొత్తు పెట్టుకుంటే రాజకీయ ప్రయోజనం శూన్యమనేది ఆయన అభిప్రాయం. టీడీపీ, జనసేన పొత్తు ఎలాంటిదంటే… సన్యాసి , సన్యాసి రాసుకుంటే బూడిద రాలిన చందమవుతుందని చంద్రబాబు భయం. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ నాయకుల ఆవేదన.
ఇటీవల పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని ఈసీ మార్చింది. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చంద్రబాబు రాజగురువు పత్రిక తెగబాధపడుతూ కథనం రాసిన సంగతి తెలిసిందే. వ్యవస్థల సహకారం కోసం ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీలను మార్చాలంటూ చంద్రబాబు వదిన, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఏఏ అధికారుల్ని నియమించాలో కూడా మేడం గారే కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు మరి.
బీజేపీతో పొత్తు కుదుర్చకున్నాం కదా అని, ఈసీ తమ చెప్పు చేతల్లో నడవాలని కూటమి నేతలు కోరుకుంటున్నారు. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడం కూడా మరిచిపోయారు. కేవలం వ్యవస్థల్లో తమకు అనుకూలమైన నేతల్ని పెట్టుకుని, జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వారికి తగిన సహకారం మాత్రం లభించలేదని, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని జగన్‌ను ఇబ్బంది పెట్టే క్రమంలో, తామే రాజకీయంగా నష్టపోతున్నారు. ఇందుకు ఉదాహరణ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ద్వారా ఈసీకి వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని ఫిర్యాదు చేయించడం, అనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే. సంకల్పం మంచిది కాకపోతే, ఏమవుతుందో నిమ్మగడ్డ ఉదంతం పచ్చ బ్యాచ్‌కు పెద్ద గుణపాఠం.
ముందుగా ప్రజల ఆశీస్సులు వుంటే, తర్వాత వ్యవస్థల సహకారం కొంత వరకు దోహదపడుతుంది. అలా కాకుండా వ్యవస్థలే తమను గట్టెక్కించాలనే చంద్రబాబు అత్యాశే… కూటమి బలహీనతను తెలియజేస్తుంది. ఇలాగైతే కూటమి ఎన్నికల్లో విజయం సాధించడం సులువు కాదని వారి చర్యలే చెబుతున్నాయి.