Advertisement

Advertisement


Home > Politics - Analysis

భ‌య‌ప‌డే ద‌శ నుంచి...భ‌య‌పెట్టే స్థాయికి జ‌గ‌న్‌!

భ‌య‌ప‌డే ద‌శ నుంచి...భ‌య‌పెట్టే స్థాయికి జ‌గ‌న్‌!

మూడు రాజ‌ధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక ర‌క‌మైన గంద‌ర‌గోళ ప‌రిస్థితి. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, కోస్తా ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయ‌డం, భ‌విష్య‌త్‌లో వేర్పాటువాద ఉద్య‌మాల‌కు అవ‌కాశం క‌ల్పించ‌కూడ‌ద‌నే త‌లంపుతో మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయ‌త‌ల‌పెట్టిన‌ట్టు జ‌గ‌న్ ‌స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. అయితే వ్య‌వ‌హారం కోర్టుకు చేర‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్ అనుకున్న‌ది నెర‌వేర‌లేదు.

అయితే జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంతో ముఖ్యంగా అమ‌రావ‌తి ప్రాంతంలో వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇది నిజం కూడా. అయితే కాలం అనేక మార్పుల్ని తీసుకొస్తుంద‌నేందుకు అమ‌రావ‌తిలో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త కాస్త‌, సానుకూలంగా మార‌డాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. సీఆర్‌డీఏ ప‌రిధిలో దాదాపు 51 వేల పేద కుటుంబాల‌కు నివాస స్థ‌లాల ప‌ట్టాలను ఇవాళ సీఎం జ‌గ‌న్ పంపిణీ చేయ‌నున్నారు. ఇంత‌కాలం రాజ‌ధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి తిర‌గాలంటే ప‌ర‌దాల చాటును దాక్కుని వెళుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించాయి. ఇప్పుడు ప్ర‌తిప‌క్షాలే త‌మ‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్టు నోరు తెర‌వ‌డం లేదు.

పేద‌ల‌కు నివాస స్థ‌లాల పంపిణీపై విమ‌ర్శించేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ధైర్యం చాల‌డం లేదు. ఎందు కంటే ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లైంది. సెంటు చొప్పున ప్ర‌భుత్వం నివాస స్థ‌లం ఇస్తుంటే, ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకించాయ‌నే చెడ్డ‌పేరు మూట‌క‌ట్టుకుని రాజ‌కీయంగా న‌ష్ట‌పోవ‌డానికి ప్ర‌తిప‌క్షాలు సిద్ధం లేవు. ఇదే సీఎం వైఎస్ జ‌గ‌న్ మ్యాజిక్‌. ఒక‌ప్పుడు అమ‌రావ‌తి అంటే తాను భ‌య‌ప‌డే ద‌శ నుంచి భ‌య‌పెట్టే స్థాయికి జ‌గ‌న్ చేరుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నిరుపేద‌ల‌కు ఇంటి స్థలాల పంపిణీపై వ్య‌తిరేకించ‌డానికి కేవ‌లం అమ‌రావ‌తి బ‌హుజ‌న ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి, అలాగే అమ‌రావ‌తి ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి మాత్ర‌మే ముందుకొచ్చాయి. వీళ్ల‌కు మ‌ద్ద‌తుగా ఏ ఒక్క ప్ర‌తిప‌క్ష పార్టీ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌క‌పోవ‌డం వెనుక రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌నే భ‌యం వెంటాడ‌మే అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌రిద్ద‌రో, వంద మందికో కాదు, ఏకంగా 51 వేల మందికి ఇంటి ప‌ట్టాలు ఇవ్వ‌డం సామాన్య విష‌యం కాదు. వీరికి ఇంటి స్థలాలు ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకించ‌డం అంటే దాదాపు 1.50 ల‌క్ష‌ల ఓట్ల‌ను పోగొట్టుకోవ‌డమే. అది కూడా అమ‌రావ‌తిలో.

ఒక‌వైపు జ‌గ‌న్ ఇంటి ప‌ట్టాలు పంపిణీ చేస్తుంటే, మ‌రోవైపు వ్య‌తిరేకంగా న‌ల్ల జెండాలు, న‌ల్ల రిబ్బ‌న్లు ఎగుర వేయాల‌ని పిలుపు ఇచ్చిన ప‌రిస్థితి. మ‌హిళ‌లు న‌ల్ల చీర‌లు ధరించి నిర‌స‌న తెల‌పాల‌ని అమ‌రావ‌తి బ‌హుజ‌న‌ ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి, అమ‌రావ‌తి ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి పిలుపు ఇచ్చాయి. ఇంత‌కాలం అమ‌రావ‌తికే త‌మ మ‌ద్ద‌తు అని చొక్కాలు చించుకుని రంకెలేసిన రాజ‌కీయ నాయ‌కులు, క‌ష్ట‌కాలంలో మౌనం పాటించ‌డం వెనుక దురుద్దేశాల్ని అమ‌రావ‌తి ద‌ళిత నేత‌లు అర్థం చేసుకోవాలి. రాజ‌కీయంగా త‌మ‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని అనుకుంటే ఏ ఒక్క నాయ‌కుడు త‌మ‌కు అండ‌గా నిల‌వ‌ర‌ని ఇప్ప‌టికైనా అమ‌రావ‌తి ద‌ళిత నేత‌ల‌కు అర్థ‌మై వుంటుంది.

ఇంత వ‌ర‌కూ ర‌క‌ర‌కాల బెదిరింపుల‌తో జ‌గ‌న్‌ను బెదిరించారు. కానీ జ‌గ‌న్ ఎప్పుడూ అద‌ర‌లేదు, బెద‌ర‌లేదు. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. తాను చేయాల‌ని అనుకున్న‌ది చేత‌ల్లో చూపారు. జ‌గ‌న్ చ‌ర్య‌లే ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల్ని భ‌య‌పెడుతున్నాయి. తిట్టిపోసిన వాళ్లే నేడు జ‌గ‌న్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. అమ‌రావ‌తి న‌డిబొడ్డున జ‌గ‌న్ చిరున‌వ్వు చిందిస్తున్నారు. ద‌టీజ్‌ జ‌గ‌న్‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?